Menu

అద్మీ అవుర్ ఔరత్

బెంగాల్ నుంచి ఎదిగివచ్చిన మొదటి తరం గొప్ప దర్శకుల్లో తపన్ సిన్హా ఒకరు. దర్శకుడిగా 1953 లో మొదలైన ఆయన కెరీర్ ఇప్పటికీ చలన చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగుతూ వుంది. ’సఫేద్ హాతీ (1978)’ లాంటి బాలల చిత్రాలతో పాటు అనే క వైవిధ్యమైన కథాంశాలతో తపన్ దా చిత్రాలు తీశారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇలా రెండూ పాత్రల్ని ప్రధాన పాత్రలుగా చేసుకొని వారిమధ్య అనుబంధాన్ని దగ్గరితనాన్ని ఆర్తిని చూపిస్తూనే చిత్రం చివరికి వచ్చే సరికి జాతీయ సమగ్రతని బోధించిన ఆయన చిత్రం ’అద్మీ అవుర్ ఔరత్’ చాలా సీదా సాదాగా సాగుతుంది. అడవిలో వర్షంలో సాగుతూ కొంత ఉద్వేగాన్ని కలిగిస్తూ మొదట్నించి చివరిదాకా ఒకే టోన్ లో సాగుతుంది.

చేతిలో ఓ సంచితో ఓ యువతి పట్నానికి పోయే బస్ కోసం పల్లె రోడ్డు మీద ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెతో పాటు మరికొంత మంది కూడా అదే బస్ కోసం చూస్తూ ఉంటారు. కొంత సేపటికి బస్ వస్తుంది. కాని ఆ బస్ టాప్ పైన కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. బస్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మగవాళ్ళు లాభం లేదనుకుని గుంపుగా అడ్డదారిన పడి నడిచి వెళ్ళేందుకు బయలుదేర్తారు. బిగ్గరగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అప్పటిదాకా కూర్చుని ఉన్న ఆ యువతి లేచి నిలబడి తాను కూడా వారి వెనకాలే మెల్లగా నడిచి వెళ్ళేందుకు బయలుదేరుతుంది.

వారితో పాటే బన్సీ అనే శికారి బయలుదేరుతాడు. చేతిలో సంచిని ఊపుకుంటూ ఉత్సాహంగా నడుస్తూ వుంటాడు బన్సీ. ముందు వెళ్తున్న మగవారి గుంపు చకచకా నడుస్తూ దూరమైపోతారు. బన్సీ వెనక్కి చూస్తాడు. వెనకాల ఆ యువతి మెల్లగా వస్తూ వుంటుంది. బన్సీ ముందు వాళ్ళను కేకేస్తాడు. వారికి వినపడదు. బన్సీ మెల్లగా నడిచి ఆమెతో కలిసి వెళ్దామని నడక వేగం తగ్గించినప్పుడల్లా ఆమె మరింత స్లో అయిపోతుంది. ఇంతలో వర్షం మొదలవుతుంది. ఆమె అంతకు ముందు కంటే మరింత మెల్లగా నడక సాగిస్తుంది.

తరచుగా కూచుంటూ, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఒక చోట ఆమె లేవలేనట్టుగా పడిపోతుంది. బన్సీ వెనక్కి వచ్చి ఆమెను సమీపిస్తాడు. అతను దగ్గరికిరావడంతో ఆమె బెంబేలెత్తుతుంది. బన్సీ దగ్గరికి వచ్చింతర్వాత తెలుస్తుంది. ఆమె గర్భవతి అని. ఆమె వకీల్ గంజ్ లోని ఆస్పత్రికి బయలుదేరిందని బన్సీ తెలుసుకుంటాడు. ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఇంతకీ ఆమె ఒంటరిగా ఎందుకు బయలుదేరిందని అడుగుతాడు. డబ్బులు లేక అప్పు చేసి తన భర్త తనను ఒంటరిగా పంపించాడని ఆ అప్పును తీర్చడానికి వడ్డీ వ్యాపారి వద్ద తన భర్త పనిచేస్తున్నాడని ఆమె చెబుతుంది.

ఇద్దరూ కలిసి అక్కడనుంచి నడక సాగిస్తారు. ఆమె తన గత స్మృతుల్లోకి వెళ్తుంది. మొదటిసారి గర్భం పోవడం, ఇప్పుడూ అదే జరుగుతుందేమోనన్న భయంతో ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆమెను ఉత్తేజితురాల్ని చేస్తూ బన్సీ ఏదో ఒకటి మాట్లాడుతూ నడుస్తాడు.

అకస్మాత్తుగాఆమె కూలబడి పోవడంతో బన్సీ ఆమెను తన చేతులపైని తీసుకొని నడవడం ఆరంభిస్తాడు. ఆమె బరువును ఎక్కువసేపు భరించలేని బన్సీ బొంగుల్ని విరిచి తాడుతో స్ట్రెచర్ లాగా కట్టి ఆమెను అందులో పడుకోబెట్టి లాగుకుంటూ వెళ్తాడు. ఆమెను స్పృహలో ఉంచడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు బన్సీ. కొంతసేపటికి ఆమె స్పృహ కోల్పోతూ ఉండడం చూసి బన్సీ సహాయం కోసం చుట్టుపక్కల అరుస్తాడు. నిరుత్తరుడై ఉన్న స్థితిలో ఫారెస్టు గార్డు కనిపించి ఆమె స్ట్రెచర్ ను మోయడానికి సాయపడతాడు.

వారంతా చిన్న నది వద్దకు చేరింతర్ాత గార్డ్ ఇకముందుకు తాను రాలేనని చెప్పి వెళ్ళిపోతాడు. వర్షంతో పెద్దదైన వాగును ఎలాగైనా దాటేందుకు బన్సీ నిర్ణయించుకుంటాడు. ఆమెను మెలుకుగా ఉండి సహకరించమని కోరుతూ ఆమెను తీసుకొని అతి కష్తంపై నదిని దాటుతాడు. నది దాటింతర్వార ఓ బండిలో ఎక్కించుకొని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అక్కడ బెడ్లు ఖాళీ లేవు తీసుకోలేమని అంటే పెద్ద గొడవ చేయడంతో డాక్టర్ వచ్చి అడ్మిట్ చేసుకుంటాడు.

బన్సీ తన పని మీద వెళ్ళిపోతాడు. భూస్వామి వద్ద పని లేకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వస్తాడు. ఆ యువతికి ప్రసవం అయి మగబిడ్డ పుడతాడు. నీ పేరు చెప్పు రిజిస్టర్ లో రాయాలని బన్సీని అడుగుతాడు డాక్టర్, అమె తనకేమీ కాదని రోడ్డుపై కలిసామమని చెప్పి ఆమె వద్దకు వెళ్తాడు బన్సీ. పిల్లాడిని చూసి ఆమె భర్త పేరు అడుగుతాడు. అన్వర్ అని చెబుతుందామె.

ఇంతదాకా తాను సాయం చేసింది ఓ ముస్లిం అమ్మాయికా అని బన్సీ ఆశ్చర్యపోతాడు. తాను పక్కా హిందూ. అంతలోనే తేరుకొని ఆమె వైపు నవ్వుతూ చూస్తాడు. నేను వెళ్ళి మీ ఆయనకీ సంగతి చెబుతానని అంటూ బన్సీ బయలుదేరుతాడు. ఆమె అతని వైపు చేతులు జోడించి నీ కోసం ఆ దేవున్ని ప్రార్థిస్తాను అంటుంది.

ఈ సినిమాలో అడవి, వర్షం నేపథ్యంలో అపరిచితులైన ఓ స్త్రీ, ఓ పురుషుడు వారి స్పందనలు, కేవలం మనసున్న మనుషులుగా వారి అనుబంధాన్ని గొప్పగా చిత్రీకరించారు తపన్ సిన్హా.

2 Comments
  1. sujata October 3, 2008 /
  2. sujata October 3, 2008 /