Menu

నాలుగు ముంబై సినిమాలు

ఈ మధ్యకాలం లో నేను ముంబాయి నగరం బ్యాక్‌డ్రాప్ లో తీసిన మూడు సినిమాలని వరుసగా చూసాను. వెంటనే ముంబాయి నగరం కథలతో రాయబడ్డ – “A fine Balance”, “Such a long journey” (Rohinton Mistry), Pervez (Meher Pestonji) వంటి పుస్తకాలు ఒకసారి మనసులో మెదిలాయి. ఇదే సందర్భం లో ముంబాయి పైనే రాసిన Maximum City (Suketu Mehta) పుస్తకం దొరికింది. ఓ ముంబాయి కి అంకితమైన వారం గడిచాక, ఆ సినిమాలను గురించి మరోసారి తలుకుంటున్నప్పుడు నాలుగో సినిమా కూడా గుర్తొచ్చింది. ఈ వ్యాసం ఈ సినిమాలు స్పృశించిన కోణాలుగా నేను భావిస్తున్న అంశాలపై. ఇంతకీ ఆ నాలుగు సినిమాలూ – Mumbai meri jaan (2008), A wednesday (2008), Salaam Bombay (1988) మరియు Black Friday (2004).

మొదటగా ముంబయ్ మెరీ జాన్: ఈ సినిమా 2006లో ముంబై ట్రైన్లలో జరిగిన పేలుళ్ళ నేపథ్యంలో సాగింది. ఈ పేలుళ్ళ వల్ల సామాన్యుడి జీవితం లో, ఆలోచనల్లో వచ్చిన మార్పు ఈ సినిమా ప్రధానాంశం. ఐదు వేర్వేరు కథలు. వేర్వేరు జీవితాలు. వేర్వేరు దృక్కోణాలు. కథాపరంగా నాకీ సినిమా చాలా నచ్చింది. కథనం కూడా మంచి పట్టుతో సాగినట్లు అనిపించింది. సోహా అలీ ఖాన్ కథలో టీవీ ఛానెళ్ళ వైఖరిని ఎండగట్టిన విధానం అన్నింటికంటే చాలా నచ్చింది నాకు. ఇర్ఫాన్ ఖాన్ ఒక్కో సినిమా చూసే కొద్దీ నటుడిగా నాకు నచ్చుతున్నాడు. ఈ సినిమాలో పరేష్ రావల్ పాత్ర నిజజీవితంలోని హాస్యానికి ఓ ఉదాహరణ. నేను గమనించినంత వరకూ ఇందులో పాత్రలన్నింటిలోనూ వాస్తవికత ఉంది. ఏ పాత్రని చూసినా కూడా ఇలాంటి ఓ పాత్రని మన నిజజీవితంలో చూస్తూనే ఉండొచ్చనే అనిపించింది. వాస్తవికంగా ఉంటూనే, డాక్యుమెంటరీ లా లేకపోవడమే నాకు ఈ సినిమాలో అన్నింటి కంటే నచ్చిన విషయం. చివరి దృశ్యంలో రెండు నిముషాలు మౌనం పాటించే దృశ్యం ఒక్కదానిలో ముంబై స్పిరిట్ అంటే ఏమిటో చెప్పారు. చివర్లో టైటిల్స్ వస్తున్నప్పుడు పాత “యె హై బాంబే మెరి జాన్” పాట వేయడం కూడా నాకు చాలా నచ్చింది. ముంబై వాసులైతే బాగా ఉద్వేగానికి కూడా గురై ఉంటారు.

తరువాత A Wednesday: ఇది కూడా సామాన్యుడి కాన్సెప్ట్ తోనే వచ్చింది. కోపం వస్తే సామాన్యుడు ఏమి చేయగలడూ? అన్న ఆలోచన. నాకీ సినిమా అంత వాస్తవికంగా అనిపించలేదు కానీ, ఇది చర్చించిన అంశం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. దానికి తోడు అనుపం ఖేర్, నసీరుద్దీన్ షా పోటీపడి నటించడం, కథనం ఆసక్తికరంగా సాగడం కూడా ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండటానికి కారణాలు కావొచ్చు. ఇంతకీ, ఈ పేలుళ్ళు, అభద్రతల నేపథ్యం లో సామాన్యుడు ఫ్రస్ట్రేట్ అయితే ఏమౌతుంది? అంటే, జవాబు ఇది కాకపోవచ్చు కానీ, ఇదో కోణం అని సరిపెట్టుకుంటున్నా నేను. కథని పోలీస్ ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ గా చెప్పడం కూడా ఈ కథాంశానికి బాగా అమరింది.

సలాం బాంబే (1988): ఈ సీరీస్ లో చూసిన సినిమాలన్నింటిలోనూ నన్ను బాగా డిస్టర్బ్ చేసిన సినిమా ఇది. మీరా నాయర్ సినిమా అని తెలుసు… ఆస్కార్ కి నామినేట్ అయినట్లు తెలుసు కానీ, అదే ఆవిడ మొదటి సినిమా అని తెలీదు ఇప్పటి దాకా. Hats off to her. సినిమా కథనం ఎంత పవర్ఫుల్ గా ఉంది అంటే, మాటల్లో చెప్పలేనంత. ప్రధానంగా ముంబాయి లోని వీథి బాలల జీవితాలపై తీసిన సినిమా ఇది. సినిమాలో నటించిన వీథిబాలలు నిజ జీవితంలో కూడా వీథి బాలలే నట. ఇర్ఫాన్ ఖాన్ ఓ రెండు నిముషాలు కనిపిస్తాడు ఇందులో. మొదటి సినిమా ఏమో. చాల చిన్నగా ఉన్నాడు. ఇంతకీ, ఇక్కడ ఇప్పుడు ప్రతి సినిమా గురించీ రాస్తూ పోతే పేజీలు పేజీలు ఔతుంది కనుక, ఈ సినిమా కథ రాయను. మొత్తానికి ఈ సినిమా మన సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండగలదు అని నిరూపించిన సినిమాల్లో ఒకటి అని చెప్పొచ్చు ఏమో. సినిమా చూసాక రెండ్రోజుల పాటు ఆ దృశ్యాలు నన్ను వెంటాడాయంటే ఇక అది ఎంత బలమైన కథో అర్థం చేసుకోండి.

Black Friday
: 1993 ముంబాయి పేలుళ్ళ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. వాస్తవాలనే సినిమాగా తీసారు కనుక పాత్రలన్నీ నిజజీవితంలోని పాత్రలే. Inspector పాత్రలో కేకేమీనన్ చాలా సహజంగా చేసాడనిపించింది. ఇక, సినిమా పరంగా చూస్తే, దీన్ని సినిమా అనాలో డక్యుమెంటరీ అనాలో అర్థం కావడం లేదు నాకు. ఇందాక ముంబయ్ మెరి జాన్ విషయం చెబుతూ – “వాస్తవికంగా ఉంటూనే, డాక్యుమెంటరీ లా లేకపోవడమే నాకు ఈ సినిమాలో అన్నింటి కంటే నచ్చిన విషయం.” అన్నది ఈ సినిమా అనుభవం గుర్తు వచ్చే! ఇది ఒక పుస్తకం ఆధారంగా తీసి, నానా కష్టాలూ పడి రిలీజైన సినిమా కనుక, ఆ కారణాల వల్ల కలిగిన కుతూహలం లో చూశాను కానీ, సినిమాకు కావాల్సిన విధంగా కథనరీతిని మార్చడంలో దర్శకుడు విజయం పొందలేదని నా అభిప్రాయం. డాక్యుమెంటరీగా చూస్తే మాత్రం ఇది మంచి …చాలా మంచి డాక్యుమెంటరీ. ఎన్నో విషయాలను చెప్పింది ముంబై పేలుళ్ళ గురించి.

– ఇలా ఈ నాలుగు సినిమాలూ చూశాక ముంబాయి నగరం అంటే ఏమిటో, కొన్ని కోణాల్లో అయినా తెలుస్తుంది. ముంబాయి జీవితం గురించిన అవగాహన కొన్ని విషయాలలో ఏర్పడుతుంది. కంపెనీ, అమీర్ – వంటి సినిమాల ద్వారా ఇంకో కోణం తెలుస్తుంది. ముంబై గురించి National Geographic వారి డాక్యుమెంటరీ వంటివి చూస్తే, అక్కడి జీవనశైలి కొంతవరకు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కొంత కోరిక కలిగింది మన హైదరాబాద్ గురించి కూడా ఇలా సినిమాలు రావొచ్చు కదా అని. అంటే, పేలుళ్ళూ… ఇవే నేపథ్యాలు ఉండాలి అని నేను అనట్లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా మనుష్యులు ఉంటున్న ఏ ఊరికైనా ఎంతో జీవిత చరిత్ర ఉంటుంది. దానికంటూ ఓ సంస్కృతి, ఓ ఉనికి తప్పనిసరిగా ఉంటాయి. వాటికి ట్రిబ్యూట్ గా సినిమా తీయలేరా? అని. “అంగ్రేజ్” ఒక విధంగా ఆలోచిస్తే అలాంటి సినిమానే. కాకుంటే, అది తీయడం వెనుక ఉన్న ఆలోచన వేరేమో. ప్రజా జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా… “నిజమైన మనుష్యులకు అసలు చరిత్రే లేదు వారికి గతమూ లేదు , అనాగతమూ లేదు” అని సిరివెన్నెల గారు అన్నారు కానీ, చరిత్ర లేకున్నా ఎన్నెన్ని కథలున్నాయో ఒక్కో సామాన్యుడి వెనుకా…. ఒక కథతో ఒక కథకి ఎన్నెన్ని సంబంధాలు పెనవేయబడ్డాయో… కనుక, సామాన్యుడు మాత్రమే హీరో అయినా కూడా, కథలకి ఢోకా లేదు. 🙂 హైదరాబాద్ పై కూడా ఇలా సినిమాలు రావాలని ఆశిస్తూ…..

7 Comments
  1. Venkat Balusupati September 27, 2008 /
  2. Sowmya September 29, 2008 /
  3. suresh varma October 5, 2008 /
  4. m vydyanath November 1, 2008 /