ప్రపంచ సినీ ఉద్యమాలు - ఒక పరిచయం
Aug 2nd, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: పరిచయం • వార్తలు-ప్రకటనలు • సినీ ఉద్యమాలు19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో కేవలం నిశ్చల చిత్రాలకు కదలిక కలిగించడం మాత్రమే సాధ్యమయిన సినిమా అనే ప్రక్రియ ఆ తర్వాత రోజుల్లో శబ్దాన్నీ సమకూర్చుకుంది. నలుపు తెలుపుల ఛాయా చిత్రాలు కొత్త రంగులద్దుకున్నాయి. దృశ్యాలను ఒక క్రమంలో కూర్చడం ద్వారా కొత్త భావాలను వ్యక్తపరచడం సాధ్యమయింది. స్లో మోషన్ ఫోటోగ్రఫీ తో ప్రత్యేక దృశ్యాలను ఉద్ఘాటించడం సాధ్యమైంది. ట్రిక్ ఫోటోగ్రఫీ,ఆప్టికల్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించడం ద్వారా కలలోనైనా ఊహించలేని కొత్త లోకాలని తెరపై సృషించడం సాధ్యమైంది. ఇలా సాంకేతికంగా చోటు చేసుకొన్న ఎన్నో మార్పులు సినిమా అనే ప్రక్రియను ఎన్నో మార్పులకు గురిచేస్తూనే ఆ ప్రక్రియ అభ్యున్నతికి కారణం అయ్యాయి.
సినిమా అనే ప్రక్రియ లో జరిగిన మార్పులకు కారణం సాంకేతికంగా జరిగిన అభివృద్ధి అయినప్పటికీ అవన్నీ సాంకేతికంగా చోటుచేసుకొన్న మార్పులే. ఇక సినిమా అనే ప్రక్రియ ఒక కళగా అభివధ్ధి చెందడానికీ, ప్రపంచ వ్యాప్తంగా సినిమా అనే ప్రక్రియ అత్యంత ప్రజాదరణ పొందడానికీ సినీ కళాకారుల కళాత్మక నవకల్పనలే కారణం అని చెప్పుకోవచ్చు. ఈ నవకల్పనలే సినిమా చరిత్ర గతిని ఎప్పటికప్పుడు మారుస్తూ రొటీన్ ఒరవడి లో కొట్టుకుపోకుండా కాపాడుతూ వచ్చిందని ఒప్పుకోకతప్పదు.
ప్రపంచ సినిమా చరిత్ర గతి మార్చి, సంచలనాన్ని రేకెత్తించిన నవకల్పనలు ఒక్కో సారి ఒక వ్యక్తి ద్వారా మొదలయినప్పటికీ చాలా దేశాల్లో ఇవి ఒక ఉద్యమంలా ఎగిసి ఆయా కాలపు చలనచిత్రాలను, చలన చిత్ర కళాకారులను ప్రభావితం చేస్తూ వచ్చాయి. సినిమా అనే ప్రక్రియ మొదట్లో అమెరికా, బ్రిటన్ దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందడంతో అప్పట్లో ఎక్కువ సినిమాలు ఈ దేశాలనుంచే నిర్మితమవుతూ వచ్చాయి. నేటికీ అమెరికా దేశం సినిమా ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగివుంది. మొదట్లో ఈ దేశాల నుంచి వచ్చిన సినిమాలనే ఇతర దేశాల చిత్ర నిర్మాతలూ దర్శకులూ ఆదర్శంగా తీసుకొని దాదాపు అదే రకం సినిమాలు నిర్మిస్తూ వచ్చినా ఆయా దేశంలోని కళాత్మక దర్శకులు తమ భావాలను వ్యక్తపరచడానికి ’అమెరికన్ వే ఆఫ్ సినిమా’ సరిపోదని గ్రహించారు. అలాగే ఆయా దేశాల్లో కళారంగంలో ఏర్పడ్డ పరిస్థుతుల కారణంగా మరియు ఆయా దేశపు సామాజిక, ఆర్థిక పరిస్థుతుల దృష్ట్యా సినిమా అనే ప్రక్రియ ఒక్కో దేశంలో ఒక్కోలా మారుతూ వచ్చింది. కొన్ని దేశాల్లో ఈ మార్పు ఒక కెరటంలా ఎగిసి అప్పటి సినిమాలన్నింటినీ ప్రభావితం చేసాయి.తద్వారా ప్రపంచ సినీ చరిత్ర దిశను మార్చివేశాయి.
సినీ ప్రపంచ చరిత్ర దిశను మార్చిన సినీ ఉద్యమాల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది జర్మనీ లో మొదలయిన భావ వ్యక్తీకరణ వాదం (Expressionism). అలాగే ఫ్రాన్స్ లో మొదలయిన Avanegarde సినిమా, బ్రిటిష్ వారి ఫ్రీ సినిమా, రష్యనా కినో ఐ, ఫ్రాన్స్ లో ఎగిసిన మరో ఉద్యమం నవతరంగం (New wave) ఉద్యమాలు చలనచిత్ర చరిత్రను ఎంతో ప్రభావితం చేశాయి.
వచ్చే నెల నుంచీ నవతరంగంలో ఈ ప్రపంచ సినీ ఉద్యమాల గురించి ఒక వ్యాస పరంపర మొదలవబోతుంది. ఈ వ్యాస పరంపరలో ఈ క్రింది సినీ ఉద్యమలతో పాటు ఆయా ఉద్యమ ఫలితాలైన కొన్ని ఉత్తమ సినిమాలనూ, దర్శకులనూ పరిచయం చేయడంతో పాటు వీలయిన చోట్ల ఆయా సినిమాలనూ నవతరంగం వెబ్ సైట్లో పొందుపరిచాలన్ని మా ఆలోచన.
ఈ వ్యాసపరంపరలో చోటు చేసుకోబోయే ఉద్యమాలు, సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి:
| ఉద్యమం | దేశం | సినిమా |
| Expressionism | జర్మనీ | The Cabinet of Dr Caligari |
| Prokino | జపాన్ | TBD |
| Avantgarde | ఫ్రాన్స్ | Un Chien Andalou |
| Free Cinema | బ్రిటన్ |
· Dreamland · Together · Nice Time |
| Montage | రష్యా | Battleship Potemkin |
| Neo-Realism | ఇటలీ | Bicycle Thieves |
| Personal Vision | జపాన్ | Rashomon |
| Radicalism | స్వీడెన్ | Seventh Seal |
| Pure Cinema | ఇండియా | Apu Trilogy |
| Cinema Verite | ఫ్రాన్స్ | Le Joli Mai |
| New Wave | ఫ్రాన్స్ | 400 Blows |
| Parallel Cinema | ఇండియా | Garam Hawa |
| Cinema of Moral Concern | పోలాండ్ | Camouflage |
| Dogma | డెన్మార్క్ | Italian for Beginners |
ఈ వ్యాసాలు ఎప్పుడు మొదలుపెడ్తున్నారు?
Same Qwestion ఇక్కడ కూడా !! ఎప్పుడు మొదలుపెడ్తున్నారు??
ఆల్రెడీ మొదలు పెట్టాం గా, Expressionism తో…