Menu

Velli Thirai (2008)

“mozhi” సినిమా చూశాక ప్రకాశ్ రాజ్ నిర్మించిన తక్కిన సినిమాల గురించి నాకు కుతూహలం పెరిగింది. దానికి తోడు ’వెళ్ళితిరై’ (Meaning: Silver screen) గురించి చాలా విని ఉండటంతో ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసాను. కానీ, సినిమా నన్ను కాస్తంత నిరాశపరిచింది. Problems of over-expectations!

ఇది సినీప్రపంచం కథ. శరవణన్ (పృథ్వీరాజ్) దర్శకుడు కావాలని కలలు కంటున్న యువకుడు. అసిస్టంట్ గా పనిచేస్తూ తను తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని, అవకాశం కోసం వెదుకుతూ ఉంటాడు. కన్నయ్య (ప్రకాశ్ రాజ్) ఇతని కంటే ముందు నుంచీ హీరో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మనిషి. వీళ్ళిద్దరూ రూమ్‍మేట్స్ అవుతారు. శరవణన్ లేని సమయంలో అతని కథని దొంగిలించి మంచి కథ ఇస్తే హీరో ఛాన్సిస్తా అన్న అగ్రిమెంటు మీదున్న ఓ నిర్మాత (శరత్‍బాబు) దగ్గరకి వెళ్ళి హీరో ఛాన్సు కొట్టేస్తాడు. ఈ విషయం తెలిసినా కూడా ఏమీ చేయలేని అసహాయత శరవణన్ ది. చూస్తూ ఉండగానే కన్నయ్య దిలీప్ కాంత్ అన్న స్టార్ గా ఎదిగిపోతాడు. శరవణన్ అవకాశాలకి వెదుక్కుంటూ ఉంటాడు. ఎట్టకేలకి శరవణన్ కి అవకాశం వస్తుంది-కానీ, హీరోగా దిలీప్ కాంత్ ని తప్ప వేరొకర్ని పెట్టలేని పరిస్థితి. అతనేమో వీలైనంత ఆధిక్యం చూపి, ఒకానొక రోజు సినిమా షూటింగ్ వదిలేసి, నేను చేయనని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాతేమైంది? శరవణన్ దర్శకుడయ్యాడా? కన్నయ్య లో మార్పొచ్చిందా? చివరికేమౌతుంది? అన్నది కథ.

కథాపరంగా సినిమా లో వైవిధ్యం ఉంది. కానీ, నాకు కొన్ని చోట్ల డైలాగులు అర్థం కాకపోవడం వల్లనో ఏమో – నాకీ సినిమా mozhi అంత నచ్చలేదు. పైగా, ఈ సినిమా చివరి అరగంటా ఓ ఆంగ్ల సినిమా ప్రభావంలో తీసింది అని తెలిసాక మరింత నిరాశ. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగానే బాగా చేసినా కూడా, ఆ మేకప్ లో అతన్ని భరించడం కష్టమైంది. ఇందులో అతనిది కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఈ పాత్ర స్వభావం ప్రేక్షకులకి అర్థమయ్యేలా చేయడం లో దర్శకులు విజయం సాధించారు. You can only hate this character for its nature. ప్రకాశ్ రాజ్ కొన్ని చోట్ల భలే చేసాడు. హీరో కాకముందు నటన నాకు నచ్చింది, హీరో అయ్యాక ప్రదర్శించిన నటన కంటే. ఇక పృథ్వీరాజ్ సాత్వికపు హీరో. అతని కళ్ళలో నీళ్ళు తిరిగితే మనం కదిలిపోతాం – అలాంటి కళ్ళు అతనివి. 🙂 గోపిక పాత్రకి పెద్ద పాత్ర లేదు కానీ, ఉన్నంతలో పర్వాలేదు. సినిమా వాళ్ళ జీవితాల్లోకి ఓ సారి తొంగిచూడొచ్చు ఈ సినిమా ద్వారా. జూనియర్ ఆర్టిస్టుల సమస్యల్ని “కాల్ ట్యాక్సీ” Mustafa పాత్ర ద్వారా చూపించడానికి ప్రయత్నించారు. గోపిక పాత్ర ద్వారా హీరోయిన్లపై వారి కుటుంబ సభ్యుల పెత్తనాన్ని చూపించారు. సినిమా జీవితాల్లో పైకి కనిపించే లగ్జరీ మాత్రమే కాదు ఉండేది, లోపల కథలు చాలా ఉంటాయి అని తెలియజెప్పే ప్రయత్నం లో సఫలీకృతులయ్యారు. సినిమాలో హాస్యం పాలు కాస్త తక్కువైనా కూడా, చూడడానికి బానే ఉంది.

ఎటొచ్చీ, mozhi ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టని సినిమా. “వెళ్ళి తిరై” కొంచెం సీరియస్ టైప్ సినిమా కనుక అన్ని సార్లు చూడలేకపోవచ్చు. ఈ సినిమా వల్ల ప్రకాశ్ రాజ్ నిర్మించిన సినిమాలపై కుతూహలం పెరిగిందే కానీ తగ్గలేదు నాకు. తమిళ టీవీ నటి విజి దర్శకత్వం వహించారు అని చదివాను. సంగీతం – జి.వి.ప్రకాశ్ కుమార్. ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు. ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు. కథానాయకుడు పాటలు విన్నాక ఇతని గురించి కుతూహలం పెరిగింది. ఈ సినిమా సంగీతం పర్వాలేదు. ఒక పాట మాత్రమే నాకు వినగానే నచ్చింది. మిగితావి మరి వినగా వినగా ఆకట్టుకుంటాయేమో, తెలీదు. మొత్తానికైతే “వెళ్ళి తిరై” is watchable.

3 Comments
  1. శోభ August 15, 2008 /
  2. sasank August 20, 2008 /