Menu

The Dark Knight (2008)

“డార్క్ నైట్” సినిమా రిలీజైన మొదటిరోజు నుండే సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజవడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో నాకు తెలీదు కానీ, రిలీజవగానే imdb రేటింగుల్లో అమాంతం మొదటి స్థానానికి ఎగబాకడంతో కలిగిన కుతూహలం కొద్దీ ఇక్కడ రిలీజైన మొదటివారంలోనే ఆ సినిమా చూసిన వారిలో నేనొకదాన్ని. ముందు బ్యాట్‍మ్యాన్ సినిమాలు చూసిన అనుభవం లేకపోయినా కూడా, ఈ సినిమా చూశాక తక్కినవి కూడా చూడాలనిపించింది. ఇంత కలకలం సృష్టించిన సినిమాపై నవతరంగంలో వ్యాసం లేకపోవడం చూసి, మళ్ళీ నేనే…. 🙂 సినిమా తాలూకా హైప్, హీత్ లెడ్జర్ మరణం – అతని నటనకి కితాబులు, రిలీజ్ సమయంలోనే హీరో క్రిస్టియన్ బేల్ అరెస్టవడం – ఈ సంఘటనలన్నీ నన్ను సినిమా చూడ్డానికి ప్రేరేపించాయి.

కథ పరంగా అన్ని సూపర్ హీరో సినిమాల్లాగానే ఇది కూడా మంచికీ, చెడుకీ పోరాటం. కథ ఓ బ్యాంకు దోపిడీ తో మొదలౌతుంది. ముఠాలోని ఒక్క సభ్యుణ్ణీ తెలివిగా చంపించి, చివరి వాడిని తానే చంపి, సొత్తంతా తీసుకుపోవడానికి రంగంలోకి దిగినప్పుడు పరిచయమౌతాడు మన విలన్ జోకర్. తరువాత బ్యాట్‍మ్యాన్ రావడం, నగరంలో అన్యాయాలని అరికట్టడానికి పోలీసులు – హార్వే డెంట్, జేమ్స్ గోర్డాన్ నడుం కట్టడం, జోకర్ ఆగడాలు – బ్యాట్‍మ్యాన్ వీరత్వం, ఇలా అనేక సంఘటనల తరువాత, తన ప్రేయసి మరణం తాలూకా వేదనలో డెంట్ ఉన్మాదిగా మారి చివర్లో బ్యాట్‍మ్యాన్ చేతిలో హతమవడం, డెంట్ ఇమేజ్ నిలబెట్టడం కోసం అతని తప్పుల్ని తనపై వేసుకుని బ్యాట్‍మ్యాన్ వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది. శతకోటి సూపర్ హీరో కథల్లో ఇదో కథ. హీరో వీరత్వం, కరుణ, జాలి, కోపం – ఏది చూపిన హీరోయిక్ గా చూపిస్తాడు కథలో.

సూపర్ హీరో కథల్లో కథని తీసే విధానమే హైలైట్. ఈ సినిమాకి కూడా అంతే. సాంకేతికంగా చాలా బాగా తీసారు సినిమాని. బ్యాట్‍మేన్ ఆంతరంగిక సమావేశాలు, అతను బైకులో (అదే, bat pod) ఊరు తిరిగే దృశ్యాలు, జోకర్ తో అతని భేటీలు – ఏది చూసుకున్నా బాగా తీసారు. ముఖ్యంగా జోకర్ పాత్ర ఉన్న ప్రతి ఫ్రేమూ చాలా బాగుంది. జోకర్ (హీత్ లెడ్జర్) పాత్ర అంటే లెడ్జరే చేయగలడు అన్నంత బాగా చేసాడు అతను. అతనికి మరణానంతర ఆస్కార్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చదివాను. కౄరత్వంలో కూడా నవ్వుతున్నట్లు కనిపించే ఆ మొహాన్ని అలా డిజైన్ చేసే ఆలోచన ఎవరిదో కానీ, సినిమా చూసొచ్చాక ఆ పాత్రని ఈ క్షణందాకా ఎన్ని సార్లు తలుచుకున్నానో లెక్కలేదు. ఆ పాత్ర ఒక్కో డైలాగూ మళ్ళీ మళ్ళీ వినదగ్గది – చూడదగ్గది కూడా. హార్వే డెంట్ ని అతను మంచి నుండి చెడుకి మార్చేసిన సీను కూడా నాకు చాలా నచ్చింది. దొంగల ముఠా దగ్గర తన వాటా డబ్బు తీసుకుని తగలేసే సీన్ లో డైలాగులు కూడా చాలా బాగుంటాయి. బ్యాట్‍మ్యాన్ గా బేల్ నటన బాగున్నా కూడా, సినిమాకి ప్రధాన పాత్ర హీరోనా? విలనా? అన్న సందేహం కలగకమానదు. Joker stole the show. సినిమా చూసొచ్చినవారెవరైనా జోకర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు బ్యా‍ట్‍మ్యాన్ కన్నా.

క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వం నాకు నచ్చింది. ప్రెస్టీజ్, మెమెంటో తీసింది ఇతనే అని ఈ సినిమా చూసే సమయానికి తెలీదు నాకు. తెలిసాక ఇతని తక్కిన సినిమాలు కూడా చూడాలన్న కుతూహలం కలిగింది. డైలాగులు, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. ఈ సినిమా ఐమాక్స్ స్క్రీను పై చూసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. మొత్తానికైతే, ఇది చూడదగ్గ సినిమా. imdb మొదటి స్థానానికి తగినదో లేదో నేను చెప్పలేను కానీ, ఓ రెండు మూడు సార్లు చూసినా బోరు కొట్టదేమో ఈ సినిమా అని అనుకుంటున్నాను. All because of Joker and Joker alone. నోలాన్ దర్శకత్వాన్నీ, స్క్రీన్‍ప్లే నీ చిన్నబుచ్చడంలేదు. జోకర్ లేనిదే ఈ సినిమా ఇంత ఆకర్షణీయంగా అయ్యేదే కాదు అని మాత్రమే చెబుతున్నాను. జోకర్ ఈ సినిమాకి ఊపిరి. లాంగ్ లివ్ జోకర్! ఈ పాత్ర తో లెడ్జర్ అమరుడైపోయాడు. లెడ్జర్ ఆస్కార్ వాదానికి నేనూ మద్దతిస్తున్నా (నా మద్దతు సంగతి అందరికీ అనవసరమైనా కూడా).

26 Comments
 1. sasank August 13, 2008 /
 2. నాగమురళి August 13, 2008 /
 3. శోభ August 13, 2008 /
 4. chaithu August 13, 2008 /
 5. శోభ August 13, 2008 /
 6. ravi August 13, 2008 /
 7. ravi August 13, 2008 /
 8. శంకర్ August 13, 2008 /
 9. chaithu August 13, 2008 /
 10. chaithu August 14, 2008 /
 11. ravi August 14, 2008 /
 12. అబ్రకదబ్ర August 15, 2008 /
 13. అబ్రకదబ్ర August 15, 2008 /
 14. అబ్రకదబ్ర August 18, 2008 /
 15. ravi August 18, 2008 /
 16. mallela August 31, 2008 /