Menu

సింగ్ ఈజ్ కింన్గ్

మొన్న శనివారం మా ఫ్రెండ్ ఫోన్ చేసి భోజనానికి ఇంటికి రమ్మన్నాడు. అసలే దేశం కాని దేశం లో వుంటూ రుచీ పచీ లేని చప్పటి కూడు తింటున్నానేమో, భోజనం అనగానే ఆనందంగా వెళ్ళిపోయాను. వెళ్ళగానే మంచి మసాలా గుత్తొంకాయ కూర తో భోజనం పెట్టడంతో లొట్టలేస్తూ తిన్నాక మా వాడు అసలు విషయం చెప్పాడు- “నువ్వు తిన్నది పుచ్చు వంకాయల కూర” అని.నాకిష్టమని వంకాయ కూర చెయ్యమన్న పాపానికి ఇలా పుచ్చొంకాయల కర్రీ వడ్డించడం ఏ విధంగా న్యాయమని నేనడగకముందే, “మార్లెట్లో బొత్తిగా మంచి కూరగాయలు లేవు. ఏదో వున్నవాటిలో ఈ పుచ్చు వంకాయలే మేలుగా కనిపించాయి” అని చెప్పడంతో ఆగకుండా,”అయినా వంకాయలు పుచ్చువా మంచివా అన్నది కాదు అన్నయ్యా, కూర బావుందా లేదా అన్నది విషయం” అని ముగించాడు. అంత చెప్పాక నేనింకేమీ అనలేక కాసేపు సైలెంట్ గా వున్నా ఆ తర్వాత నాకో అనుమానం వచ్చి, “మొత్తమన్నీ పుచ్చులేనా? లేక కొన్నైనా మంచివేమైనా వున్నాయా?” అని అడిగాను. “దాదాపు అన్నీ పుచ్చులే రా” అని చెప్పి “నీకింకా అనుమానమైతే కూర చేసే ముందు ఈ వీడియో తీసిపెట్టాను” అని పుచ్చొంకాయల వీడియోని వాడి ల్యాప్ టాప్ లో ప్లే చేశాడు. అందులో నాకు తెలిసిన వంకాయలు చాలానే ఉన్నాయి. ఆ వంకాయల కథా కమామీసు ఇక చదవండి .

మొదటి పుచ్చొంకాయ

ఈ వంకాయ పుట్టడమే పుచ్చు కాదనుకుంటా. మొదట్లో  ఫ్రెంచ్ కిస్ చేసి ప్యార్ తో హోనా హీ థా, అంటే ఫర్వాలేదు వాడిపోయినా పుచ్చు కాదనుకున్నారు. కానీ దీవానగీ అంటూ పిచ్చి వేషాలు వెయ్యడంతో మొదటి పుచ్చు చేసింది. ఆ తర్వాత పెళ్ళాం వూరెళ్ళినప్పుడు తెలుగు పుచ్చొంకాయల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నో ఎంట్రీ అంటూనే వెల్కం వెల్కం అంటూ గోలచెయ్యడంతో పూర్తిగా పుచ్చుగా మారిపోయాడు. పుచ్చు వంకాయలు రాజ్యమేలుతున్న వంకాయ్ కింగ్ డమ్ ఈ వంకాయ ని కింగ్ ని చేసింది. కానీ స్పెల్లింగ్లు కూడా సరిగ్గా రావని చాలామంది తిడ్తున్నా ఎక్కువమంది ఈ పుచ్చు వంకాయ కూరనే ఇష్టపడుతుండడంతో ఈ పుచ్చొంకాయే కొన్నాళ్ళు కింగ్.

రెండో పుచ్చొంకాయ

పుచ్చు వంకాయలు పుట్టగానే పుచ్చులు కాదు అని ఈ వంకాయ చెప్పకనే చెప్తుంది.గుడ్డి వంకాయల్తో దోపిడీ చేయించవచ్చని ఈ  కొంచెం ఫ్రెష్ గా ఐడియా ఇచ్చినా, ఆ తర్వాత కాలంతో పరిగెత్తలేక మొదటి పుచ్చు గుణాలు తెచ్చిపెట్టుకుంది. అయినా కూడా ఈ వంకాయ కూరను విదేశాల్లో వున్న మన దేశస్థులు బాగానే తిన్నారు. విదేశస్థులు బాగా తిన్నారని అర్థం చేసుకుని మరింత పుచ్చిపోయి లండన్ కి నమస్తే చెప్పడంతో మన వాళ్ళు ఇంకా విరగబడి తిన్నారు. దాంతో పిచ్చపిచ్చగా పుచ్చిపోయి మొదటి పుచ్చు వంకాయతో కలిసి ఇదరూ తోడు దొంగల్లా మరింత పుచ్చిపోయారు. మరో విషయం ఏంటంటే ఇకనుంచి వంకాయని వంఖాయ అనాలని కొత్త రూల్ ప్రకటించింది ఈ వంకాయ.

మూడో పుచ్చొంకాయ

బాలీవుడ్లో అతి పెద్ద బిగ్గు పుచ్చొంకాను తప్పించి త్వరలో మరో బిగ్గు పుచ్చొంకాయ అవతరించబోతుందని ప్రజలు అంచనా వేస్తున్నారు. ఆ వంకాయ గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ఈ వంకాయ ఒక వేప చెట్టు కింద పెరిగిన వంగమొక్క నుంచి రావడంతో ఆ వేప చెట్టు నుంచి చాలానే నేర్చుకుంది. తినగ తినగ వేము తియ్యనుండు అనే పాఠం ఆ వేప చెట్టునుండే నేర్చుకుంది. చాలా రోజులుగా మార్కెట్టులో వుండడంతో ప్రజలు ఈ వంకాయ పుచ్చుదైనా అలవాటు పడిపోయారు.

నాలుగో పుచ్చొంకాయ

వంకాయల కింగ్ డమ్ లో లేలేత పుచ్చువంకాయలకు కరువేమీ లేదు. ఒక వేళ అలా జరిగే ప్రమాదం వుందని అప్పుడప్పుడూ విదేశాల్నుంచి నవనవలాడే లేత సెక్సీ వంకాయలను తెచ్చి వాటినీ పుచ్చొంకాయలుగా మార్చడం వంకాయ కింగ్ డమ్ లో ఎప్పుడూ జరుగుతూనే వుంది. ఈ నాలుగో వంకాయ ఆ రకానికే చెందింది. నిజానికి పుచ్చుదైనా మంచి రంగు రూపం కలిగి వుండడంతో తమ పుచ్చు వంకాయలకి మంచి మార్కెట్ కల్పించడాని కోసం ఇలాంటి పుచ్చు వంకాయల్ని ముందు వరసలో పెట్టి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది వంకాయ కింగ్ డమ్.

ఐదో పుచ్చొంకాయ

మొక్కలకి సంగీతం వినిపిస్తే బాగా పెరుగుతాయని జగదష్ చంద్ర బోస్ చెప్పగా విని వంకాయ కింగ్ డమ్ తమకీ మంచి సంగీతం వుంటే బావుంటుందని చాలా మంది వంకాయల్ని సంగీతం కంపోజ్ చేయడానికి ఏర్పాటు చేసినా ఈ మధ్య ఒక పుచ్చొంకాయ అన్ని దేశాల సంగీతాన్ని రీసైకిల్ చేసో రీ మిక్స్ చేసో సులభంగా సంగీతం అందివ్వడంతో ఈ పుచ్చొంకాయకు ఈ మధ్య మంచి డిమాండ్ ఏర్పడింది.

అవండీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని పుచ్చొంకాయలు.

మిగిలిన పుచ్చువంకాయలు:

అవి కాకుండా ఒకప్పుడు ఫ్రెష్ గా వుండే ఒక వంకాయ చేసేదేమీ లేక పుచ్చిపోయి దిగాలుగా కనిపించింది. ఇక ఎక్కడ వంకాయలు కనిపించినా అక్కడ ప్రత్యక్షమయ్యే ఈ పుచ్చొంకాయ కూడా వుంది. ఈ లేడీ పుచ్చొంకాయ వంకాయల్ను వంఖాయ కాకుండా వ‍ణ్ కాయ అనాలని ప్రచారం చేస్తోంది. అలాగే ఒకప్పుడు టెంకాయ కింగ్డమ్ నుంచి వచ్చి వంకాయ కింగ్ డమ్ కి రాణినవ్వాలని కలలు కని చివరకి తొక్క తీసేసిన మరో పుచ్చొంకాయ ఇలా చిన్నా చితకా పుచ్చొంకాయలు కూడా నాకు తారసపడ్డాయి.

ఈ వంకాయలన్నీ కాకుండా నాకు ఆశ్చర్యం కలిగించిన మరో వంకాయ అమెరికా నుంచి వచ్చింది. ఈ వంకాయ ముద్దు పేరు కుక్కపిల్ల. బాగా డబ్బులిచ్చి వంకాయ కింగ్ డమ్ కి రప్పించారు ఈ వంకాయని. అలాగే కుక్క(డాఘ్) పేరు పెట్టుకున్న మరో వంకాయ (వీళ్ళు వంకాయను వంకయ్య అని పిలవాలని ప్రచారం చేస్తున్నారు), అలాగే బొద్దైన కాడలు వున్న మరి కొన్ని వంకాయలు కూడా నాకు వడ్డించిన కూరలో వుండడం నా అదృష్టమో దురదృష్టమో తెలియదు.

మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే పుచ్చు వంకాయలని కూడా బాగా మసాలా దట్టించి కూర చేస్తే తినడానికి బాగానే వుంటుంది. కానీ మంచి వంకాయలు వున్నప్పుడు పుచ్చు వంకాయలు తినాల్సిన ఖర్మ మనకెందుకనుకుంటే ఈ పుచ్చొంకాయ కూరకు దూరంగా వుండండి. లేదు, చచ్చువో పుచ్చువో మాకనవసరం. మేము ప్రతిరోజూ వంకాయ కూర తినాల్సిందే, ఎంజాయ్ చెయ్యాల్సిందే అంటే వెళ్ళి ఆనందంగా సింగ్ ఈజ్ కింన్గ్ చూడండి.

16 Comments
 1. attli sattibabu August 11, 2008 /
 2. Ramu August 11, 2008 /
 3. puchu vanakaya August 11, 2008 /
 4. mohanrazz August 12, 2008 /
 5. అన్వేషి August 12, 2008 /
 6. Srividya August 12, 2008 /
 7. అన్వేషి August 12, 2008 /
 8. సుజాత August 12, 2008 /
 9. sasank August 13, 2008 /
 10. శోభ August 13, 2008 /
 11. శంకర్ August 31, 2008 /
 12. Dheeraj April 27, 2009 /