Menu

రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం

దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి.

1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి చేస్తూనే వున్నారు. ఆయన 21ఏళ్ళ వయసులో మార్క్సిస్ట్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయడం ప్రారంభించారు. గొప్ప కళాకారుడయిన రిత్విక్ తన మొదటి రోజుల్లో నాటక రంగంపైన కృషి చేయడం ఆరంభించారు. ఆ తర్వాత చాలా ఏళ్ళపాటు కథలు రాయడం, ఇండియన్ పీపుల్స్ థియేటర్ కోసం రచనలు చేయడం, నటించడమే జీవితంగా గడిపాడు. పీపుల్స్ థియేటర్ పక్షాన ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ప్రదర్శనలిచ్చి నాలుగయుదు వేలమంది పైన ప్రభావం చూపించడం కంటే సినిమా ద్వారా లక్షలాదిమంది ఆలోచనల పైన ప్రభావం చూపించవచ్చునని భావించిన ఘటక్ సినిమా వైపు దృష్టి మరల్చాడు. ఓ వ్యాసంలో ఆయన “రేపు సినిమాకంటే ప్రభావవంతమయిన మాధ్యమం వస్తే దాని వైపు వెళ్తానని” రాశాడు.

బెంగాల్ నుంచి ఉవ్వెత్తున ఎగిసిన గొప్ప సినీ దర్శకుల్లో మొదటి తరానికి చెందిన రే, సేన్ లతో ఘటక్ కూడా ప్రధానమయిన వాడు. ఆయన సినిమా తీయడానికి కేవలం నవలలపైన ఆధారపడడం సరికాదంటారు. అలాగే సాహిత్యం ఆధారంగా సినిమాను ప్రతిభావంతంగా సృష్టించిన సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ ని ఆయన గొప్ప చిత్రంగా విశ్లేషించాడు. ఘటక్ కూడా ’అజంత్రిక్’ , బారీ టేకే పాలియే’, ’తీతాస్ ఎకి నాదిర్ నామ్’ లాంటి చిత్రాల్ని బెంగాలీ రచనలనుండే ఎన్నుకున్నాడు. అయితే సాహిత్యం, సినిమాల నడుమ ఉండే విభజన రేఖను తుడిచేసి చలనచిత్ర విలువల్తో నిర్మించిన కళాఖండాలుగా అవి నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత ఆయన నవలలపై ఆధారపడలేదు. రిత్విక్ తన చలన చిత్ర జీవితాన్ని ’నాగరిక్’ సినిమాతో మొదలుపెట్టినప్పటికీ ఆ సినిమా ఆయన మరణానంతరమే విడుదల కావడం విచారకరం. ఘటక్ దర్శకత్వంలో విడుదలయిన మొదటి సినిమా ’అజాంత్రిక్’.

1958 లో ఘటక్ నిర్మించిన ’అజాంత్రిక్’ లో టాక్సీ డ్రైవర్ కీ, అతని చేవర్లెట్ కారుకీ మధ్య ఉన్న ప్రేని అధ్భుతంగా చిత్రీకరించాడు. సభోధ్ ఘోష్ రాసిన కథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో మనిషి జీవితంలోకి వచ్చిన తరువాత మెషీన్ కు మనిషికి నడుమ ఏర్పడ్డ అనుబంధాన్ని ఘటక్ గొప్ప భావుకతలో చిత్రించాడు.

సినిమాలో ప్రయోగ శీలత పైన కూడా రిత్విక్ ఘటక్ కి స్పష్టమైన అభిప్రాయాలుండేవి. సినిమా మాధ్యమంలో ప్రయోగాలు చేయడం, ఇతర ఫలితాల కోసం ప్రయోగాలు చేయడం అన్న విషయాల్ని ఆయన విభజించి చెప్పారు. వాటిని మెకానికల్ ప్రయోగాలని, కళాత్మక ప్రయోగాలని ఆయన విశ్లేషించారు. తన జీవితంలో కళాత్మక ప్రయోగ శీలత కోశమే ఘటక్ కృషి చేశారు.

రిత్విక్ ఘటక్ చిత్రాల్లో సంగీతం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా కేవలం దృశ్య రూపం మాత్రమే కాదని దృశ్యానికి ధ్వనిని అనుసంధానం చేసినప్పుడు దృశ్యరూపానికి మరింత గాఢత చేకూరుతుందని ఘటక్ భావన. సినిమాలో మాటలు, సంగీతం, సందర్భోచిత ధ్వని, ప్రభావిత ధ్వని (ఎఫెక్ట్ సౌండ్), నిశ్శబ్దం (సైలెన్స్) వినియోగించాలని రిత్విక్ సిద్ధాంతం.

ఆయన చిత్రం ’కోమల్ గాంధార్’ లో రెండుగా విభజింపబడిన బెంగాల్ పునరేకీకరణ ప్రధాన అంశం. అది చెప్పడానికి ఆయన విరివిగా సాంప్రదాయ పెళ్ళి పాటల్ని వాడతారు. చివరికి విభజన సమయంలో కూడా ఆ పాటల ధ్వని కొనసాగుతూనే ఉంటుంది. అదే రీతిలో ’సువర్ణ రేఖ’ చిత్రంలో బెంగాల్ మేధావుల పైన కామెంట్ చేయాల్సి వచ్చినప్పుడు కొరడా దెబ్బ ధ్వనిని అత్యంత ప్రతీకాత్మకంగా వాడాడు ఘటక్. అదే రీతిలో ఆయన నిర్మించిన ’మేఘేధాక తార’ చిత్రంలో పెద్ద కూతురు ప్రేమలో పడకూడదని తల్లి చెప్పాలనుకొన్నప్పుడు నేపథ్యంలో వంట చేస్తున్న ధ్వని కొనసాగుతుంది. అయితే సినిమాలో ’సైలెన్స్’ అన్నది అత్యంత ప్రతిభావంతమయి ప్రతీక అన్నది ఘటక్ చిత్రాల్లో మనకు కనిపిస్తుంది.

అజంత్రిక్ తర్వాత ’బారి తేకే పాలియే’, ’మేఘే ధాక తార’, ’కోమల్ గాంధార్’, ’సుబర్ణ రేఖ’ లు ఆయన నిర్మించిన ముఖ్య చిత్రాలు. ఆ తర్వాత 1974 లో ఘటక్ ’తితాస్ ఏక్తీ నాదిర్ నామ్’ ’జుక్తి తాకో ఆర్ గప్పో’ చిత్రాలు కూడా నిర్మించారు. వీటికి తోడు ఘటక్ ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు కూడా నిర్మించారు.

1959 లో ఆయన చిత్రించిన ’బారి తేకె పాలియే’ లో పల్లెటూరి పిల్లాడు కంచన్కి కలకత్తా నగరమంటే మధురమైన ఊహ. అయితే కలకత్తా చేరి ఆ మహానగరంలో కంచన్ ఎదుర్కొన్న కష్టాలు బాధలు అతన్ని తిరిగి స్వంత ఊరు చేరేలా చేస్తాయి. ఈ చిత్రంలో ఉపయోగించిన ప్రతీకలు సినిమా మాధ్యమం పైన ఘటక్ ఉన్న పట్టుని ప్రతిబింబిస్తాయి.

ఇక ’మేఘే ధాక తార’ బెంగాల్ విభజన తర్వాత స్థితిని ఆవిష్కరిస్తుంది. ఓ మధ్య తరగతి కుటుంబంలో బెంగాల్ విభజన ఫలితంగా ఏర్పడ్డ ప్భావాలు అత్యంత వాస్తవంగా నిజాయితీగా చిత్రించబడ్డాయి. ’కోమల్ గాంధార్’ చిత్రం నాటక రంగంలో నిబద్ధతతో పని చేస్తున్న వారి జీవితాలపైన చిత్రించబడింది. మనిషి వేర్వేరు ప్రభావాల రీత్యా పరాయీకరణం చెందిన వైనాన్ని ఈ చిత్రం అధ్యయన స్థాయిలో చూపిస్తుంది.

ఇక ’సుబర్ణ రేఖ’ చిత్రం భారత వభజన పైన , విభజన పర్యవసానంగా సామాజిక మానసిక స్థితుల్లో ఏర్పడ్డ మార్పుపైనా ఖరాఖండి వ్యాఖ్యగా నిలిచిపోయింది.

స్తేజి పైన విజయవంతమైన ప్రదర్శనగా పేరుగాంచిన ’తితాస్ ఏక్తీ నాదిర్ నామ్’ ఘటక్ చేతిలో చిత్ర రూపం సంతరించుకుంది. ఇది చేపలు పట్టే బెస్తవారి జీవితాలపైనా, విశ్వాసాలపైన నిర్మించిన చిత్రం.

ఘటక్ నిర్మించిన చివరి చిత్రం ’జుక్తీ, టక్కో ఔర్ గప్పొ’. దాదాపుగా అది ఆయన ఆత్మ చరిత్రాత్మక చిత్రం. 70 వ దశకంలో బెంగాల్ రాష్ట్రాన్ని ముంచెత్తిన అశాంతి, హింస, గ్రూపు తత్వాల చుట్టూ అల్లిన చిత్రమిది.

మౌళికంగా నవ్యవాస్తవిక వాది అయిన రిత్విక్ ఘటక్ సమకాలీన జీవితాన్ని వాస్తవికతని మానవ సంఘర్షణని తన చిత్రాల్లో ప్రతిబింబించారు.

ఆయన చిత్రాలన్నింటిలో ప్రధాన పాత్రలుగా చిన్న పిల్లలు, పిచ్చివాళ్ళు లేదా తాగుబోతులు వుంటారు. “సాధారణంగా ప్రజలు పట్టించుకోని లేదా తప్పించుకోజూసే అంశాలపై ఆ పాత్రలతో ఎంతైనా చెప్పించొచ్చు” అని ఘటక్ చెబుతాడు.

రిత్విక్ ఘటక్ గురించి సత్యజిత్ రే ఓ సారి ఇలా అన్నాడు “రిత్విక్ ఖచ్చితంగా బెంగాలీ దర్శకుడు, బెంగాలీ కళాకారుడు. నా కన్నా హెచ్చుగా బెంగాలీ వాడు.”

తను సినిమాలతోనే కాకుండా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అధ్యాపకునిగా మణి కౌల్, అదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహం లాంటి ఎంతో మంది యువదర్శకులుగా ఆదర్శంగా నిలిచి భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు రిత్విక్ ఘటక్.

3 Comments
  1. Jonathan September 23, 2008 /