Menu

ఫూంఖ్

కథ: రెండు దశాబ్దాల క్రితం తెలుగు జనాల్ని భయపెట్టిన తులసీదళం నవలలోని కొన్ని అంశాలతో రూపొందిన ఈ ఫూంఖ్ సినిమా పెద్దగా ట్విస్ట్ లు లేకుండా straight forward గా నడుస్తుంది.

రాజీవ్ (సుదీప్) ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. అతని కంపెనిలో పనిచేసే అన్షుమన్ మరియు మధు తప్పుడు లెక్కలు చూపించి రాజీవ్ ని మోసం చేస్తారు. చాలా రోజులుగా వారి మీద నమ్మకంతో వున్న రాజీవ్ నిజం తెలుసుకుని వారిని ఒక పార్టీ నుంచి గెంటివేస్తాడు. తమకు జరిగిన అవమానానికి మధు రాజీవ్ కుటుంబం పై పగ బడుతుంది.రాజీవ్ కూతురు రక్షపై చేతబడి ప్రయోగిస్తుంది. దాంతో రక్ష విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. రాజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం అది తప్పకుండా చేతబడి అని నిర్థారించుకుని మాంత్రికుని సహాయం కోరుతారు. ఇలాంటి వాటన్నింటి మీద నమ్మకం లేని రాజీవ్ రక్షను మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్తాడు. రక్ష ప్రవర్తన ను గమనించిన రాజీవ్ స్నేహితుడు అతన్ని ఒప్పించి ఒక మాంత్రికుని దగ్గరకు తీసుకెళ్తాడు. అతని సహాయంతో మధు మరియు అన్షుమన్ లను కనుక్కొని వారి చేతబడి ప్రయత్నాలు అంతమొందించే ప్రయత్నంలో నాస్తికుడైన రాజీవ్ నుంచి ఆస్తికుడు గా మారగా, హాస్పిటల్ లో డాక్టర్ల సేవలచే రక్ష కోలుకోవడంతో రాజీవ్ భార్య చేతబడి లాంటివి మూఢనమ్మకాలని కొట్టిపారేయడంతో కథ ముగుస్తుంది.

విశ్లేషణ: ఈ సినిమా ఒంటరిగా చూసిన వాళ్ళకి ఐదు లక్షలిస్తామని బెదిరించి, గత ఏడెనిమిదేళ్ళలో తను రూపొందించిన ఉత్తమ చిత్రం ఫూంఖ్ అని ఇంటర్వ్యూల్లో చెప్పి బాగానే పబ్లిసిటీ ఇచ్చుకున్నా అదంతా సినిమాని అమ్ముకోడానికి చేసిన స్టంట్ మాత్రమే అని సినిమా చూసాక ఎవరికైనా అనిపిస్తుంది.

సినిమాలో కథ పరంగా పెద్దగా విశేషం ఏమీ లేదు. గతంలో ఇలాంటి హారర్ సినిమాలు చాలానే వచ్చాయి. తులసి దళం నవల ఆధారంగా కథ రూపొందించినప్పటికీ అందులో ఉన్న సస్పెన్స్ తో పాటు ఆ నవల చదువుతున్నప్పుడు థ్రిల్ కలిగించిన ఎన్నో అంశాలు ఈ సినిమాలో చోటు చేసుకోలేదు.

సినిమా మొదలయిన పది నిమిషాలకే మొత్తం కథంతా అర్థమైపోతుంది. ఒక దాని తర్వాత ఒకటిగా ప్రిడిక్టబుల్ సీన్స్ వస్తుండడం ఇంటెలిజెంట్ ప్రేక్షకులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది.

మొత్తం సినిమా మీద ఏమైనా చెప్పుకోగలిగే అంశాలు ఉన్నాయంటే అవి మూడు సీన్లు మాత్రమే:

  • రాజీవ్ డ్రీమ్ సీక్వెన్స్
  • పని మనిషి డ్రీమ్ సీక్వెన్స్
  • పని మనిషి చేతబడి చేసిన ఆధారాలు కనుక్కునే సీన్

పైన పేర్కొన్న దాంట్లో రెండు సీన్లు డ్రీమ్ సీక్వెన్స్ లు కావడం విచారం. హారర్ సినిమాల్లో వుండే రొటీన్ డ్రీమ్ సీన్లయినప్పటికీ కొంచెం భయం కలిగించాయి. కానీ పని మనిషి చేతబడి చేసిన నిమ్మకాయలు, ఎముకలు కనుక్కునే సీను ఒక్క దాంట్లో మాత్రం వర్మ మార్కు కనబడుతుంది. ఈ సీను ఒక్కటి మాత్రం నాకు సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది. ఆ సీన్ మొత్తం ఆల్రెడీ ప్రేక్షకులు ట్రైలర్స్ లో చూసే ఉంటారు. చూడని వాళ్లకోసం ఇక్కడ మరో సారి.

ఇక నచ్చని విషయాలు ఎన్నో వున్నాయి ఈ సినిమాలో. మధు పాత్ర పోషించిన ఆశ్విని ఉన్న ప్రతి ఫ్రేమూ చాలా చిరాకు తెప్పించింది. ఆమె నటన ఎంతో కృతిమంగానూ, ప్రేక్షకులకు హింసాత్మకంగానూ వుంది. ఈ సినిమాలో మధు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో పని చేసే ఉద్యోగి. ఆమె మంత్ర తంత్రాలు నేర్చుకొని రక్ష పై చేతబడి ప్రయోగించడం కంటే అలాంటివి చేసే మాంత్రికుడిని కలిసి అతనిచేత చేపించినట్టుగా చూపించి వుంటే కొంచెం కన్విన్సింగా వుండేది. అలాగే రాజీవ్ కి చివర్లో సహాయం చేసిన మాంత్రికుడు కూడా వింత వింత గా ప్రవర్తించడం విసుగు కలిగిస్తుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ మధ్య వర్మ నా టెక్నిక్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకుంటూ వచ్చారు. అది ఈ సినిమాలో విపరీతంగా కనిపిస్తుంది. కాకపోతే ఇంప్రూవ్ అవడం కాదు, టెక్నిక్ పై పూర్తిగా గ్రిప్ కోల్పోవడం. అంతకుముందు చాలా సినిమాల్లో వర్మ కొన్ని సీన్లు ఒక object మీద ఫోకస్ చేసి, బ్యాక్ గ్రౌండ్ లో ఆర్టిస్ట్ లను out of of focus లో వుంచి, సరైన సమయానికి ఆర్టిస్టులను ఫోకస్ లోకి తెచ్చి సీను ముగిసే సమయానికి తిరిగి ఆ object ని ఫోకస్ లోకి తేవడంతో సీను ముగుస్తుంది.

కానీ అవసరానికి మించి వాడితే అమృతం కూడా విషమయినట్టు, పైన్ చెప్పిన టెక్నిక్ ఈ సినిమాలో ఎంత విపరీతంగా వాడారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటనా పరంగా సుదీప్ బాగా నటించాడు. కన్నడం నుంచి వచ్చినా తొలి బాలీవుడ్ సినిమాలో బాగానే రాణించాడు. మిగిలిన నటుల్లో రక్ష పాత్ర చేసిన బాల నటి బాగానే వుంది. మిగిలిన వాళ్ళలో పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు.

చివరిగా…

వర్మ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త భరించదగ్గ సినిమా అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా ఒంటరిగా చూస్తే ఐదు లక్షలిస్తామని బెదిరించినంతగా బెదిరిపోయే సన్నివేశాలు పెద్దగా లేవనే చెప్పాలి. నా అభిప్రాయం ప్రకారం తులసీదళం నవలని ఉన్నదున్నట్టుగా తెరకెక్కించివుంటే ఇంకా బాగా వర్కవుట్ అయ్యుండేదేమో!

5 Comments
  1. సుగాత్రి August 29, 2008 /
  2. sobha August 29, 2008 /
  3. Srinivas August 29, 2008 /
  4. Falling Angel September 1, 2008 /