Menu

ఫూంఖ్-మరో సమీక్ష

ఒక కంట్రాక్టర్, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, పనిమనిషి, డ్రైవర్, స్నేహితుడు, మోసం చేసిన భార్యాభర్తలు, డాక్టరు, మాంత్రికుడు. అందరిని కలిపేది చేతబడి. ఇదీ ఈ సినిమా కథ..

మామూలుగా నాకు హార్రర్ సినిమాలు నచ్చవు. కాని మంచి సస్పెన్స్ సినిమాలు ఇస్టపడతాను. టివిలో ఈ సినిమాకు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. థియేటర్ మొత్తంలో ఒక్కరే కూర్చుని కళ్ళు మూసుకోకుండా చూస్తే ఐదు లక్షలు బహుమతి ఇస్తామని దర్శకులు చెప్తున్నారు. అంటే అంత భయం పుట్టిస్తుందంట. సరేలే అని ఊరుకున్నా. కాని నిన్న రాత్రి ఆ సినిమా చూసా.

రాజీవ్, ఒక సివిల్ కంట్రాక్టర్. పక్కా నాస్తికుడు. అతని ఫ్రెండ్ ఆయుష్మాన్, అతని భార్య మధు, (ఎప్పుడు చూసినా గట్టిగా నవ్వుతుంటుంది. యాక్ !!), భార్య పరమ భక్తురాలు, ఇద్దరు పిల్లలు, పిల్లలకు ఎక్కువగా దేవుడు,దయ్యము కథలు చెప్పే తల్లి, పనిమనిషి, ఒక డ్రైవర్. అతని స్నేహితుడు అతని భార్య కలిసి వ్యాపారంలో మోసం చేసారని అందరి ముందు తిట్టి గెంటేస్తాడు రాజీవ్. అధి మనసులో పెట్టుకుని , కోపంతో రాజీవ్ కూతురు రక్ష మీద చేతబడి చేస్తుంది మధు. చూడ్డానికి అల్ట్రా మాడర్న్ మంత్రగత్తెలా ఉంటుంది. పెద్ద పెద్ద బొట్టు, గట్టిగా అరుపులు ఆవిడ ప్రత్యేకత . ముందుగా ఇవన్నీ నమ్మని రాజీవ్ కూతురిని మానసిక వైద్యులకు చూపించి అన్ని టెస్టులు చేయించినా ఫలితం ఉండదు. చివరకు మరో స్నేహితుడి సలహా మేరకు ఒక మంత్రగాడి వద్దకు వెళతాడు. అతను చెప్పిన కొన్ని విషయాలు నమ్మి అతని పాటు వెళితే ఇదంతా మాయ చేస్తున్న చేతబడి అని చివరి అరగంటలో తెలుస్తుంది. ఆవిడకు రాజీవ్ డ్రైవర్ సాయం చేస్తాడు. అప్పుడో చచ్చు ఫైటింగ్ . మధు గొంతు చించుకుని అరవడం, రాజేవ్ ఎగిరి పడడం, నవ్వాలో , భయపడాలో అర్ధం కాదు. మాంత్రికుడు కష్టపడి (అలా నటించి) ఆ మంత్రగత్తెపై పైన తిరుగుతున్న ఫ్యాన్ పడేలా చేసి చంపేస్తాడు. మధు చేస్తున్న చేతబడి పూజలో పెట్టిన పుర్రెనుండి ఒక తేలు వచ్చి డ్రైవర్‌ని కాటేస్తుంది. వాడు టపా కట్టేస్తాడు. మధు మొగుడు కూడా డామ్మంటాడు. విద్రోహులు అందరూ పోయారు. అంతవరకు దయ్యం పట్టి(నట్టు) పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్న రాజీవ్ కూతురు రక్ష ఇప్పుడు లేచి కూర్చూని మాట్లాడుతూ ఉంటుంది. నాస్తికుడైన రాజీవ్ మాంత్రికుడి సాయంతో చేతబడి నివారణ చేయిస్తాడు. అస్తికురాలైన అతని భార్య మాత్రం అంతా డాక్టరుగారి మహిమ అంటుంది. ఇప్పుడేం చేద్దాం. ఆల్ హ్యాపీస్.

అసలు నేను ఈ సినిమాను కదలకుండా చూసింది, అది కూడా రాత్రి పూట ఎందుకు అంటే? దీని కథ ఏంటి, అంత భయపెట్టేది ఏముంటుంది? నిజంగా అంత భయంకరంగా తీసారా? చివరలొ దానికి ఎటువంటి ముగింపు ఇస్తారు? ఈ ఆధునిక కాలం లో జరిగిన కథకు దయ్యాలు, భూతాలు, చేతబడి అంటారా? లేక అది ఒక మానసిక సమస్య అని తేలుస్తారా? అనే చివరి వరకు చూసాను. కాని తుస్సు మనిపించారు. మధ్య మధ్యలో నిమ్మకాయలు, బొమ్మలు, అనవసరంగా అరవడం, హోరెత్తించే సంగీతం. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వింటే స్కూలు పిల్లలకు కూడా భయమేయదు. అదీ ఈ రోజుల్లో!! ఈ సినిమాను ఒక టివి సీరియల్ లా తీసి ఉంటే కాస్త బాగుండేదేమో. సాగదీసే చాన్స్ ఉండేది. చేతబడి అనేది ఉందంటారు. నేను మంచి అనే దేవుడు, చెడు అనే దయ్యం ఉంది అని మనసారా నమ్ముతాను. కాని మనుష్యుల బలహీనతలను వాడుకుని చేతబడి అదీ ఇదీ అనే మూడ నమ్మకాలను నిరసిస్తాను. అందుకే ఈ సినిమా చూసి చిరాకేసింది. నాతో పాటు సినిమా చూసిన మా అమ్మాయిని రెండు మూడు సార్లు అడిగా. ” నీకు భయమేసిందా అని..”.. “చా! అంత సీన్ లేదు ” అంది. నాకైతే వెంట్రుక మందం అంత భయం కూడ వేయలేదు. మరి ఈ సినిమా థియేటర్లో చూసి , భయపడకపోతే ఐదులక్షలు ఇస్తామని ప్రకటనలు చేసి ప్రజలను వెదవలను చేస్తున్నారు. ఏంటో ఒకవైపు రాజకీయనాయకులు, ఒక వైపు సినిమాలు, ఒక వైపు వాణిజ్య ప్రకటనలు, ఎటు చూసిన జనాలను వెదవలను చేసేవే. అది ఎంతమంది అర్ధం చేసుకుంటారో??

మొత్తానికి చారానా కోడికి బారానా మసాలా….ఈ ఫూంఖ్ సినిమా!

….జ్యోతి వలబోజు

ఫూంఖ్ సినిమా మరో సమీక్ష ఇక్కడ చదవండి.

18 Comments
 1. sasank August 29, 2008 / Reply
 2. vishnu August 29, 2008 / Reply
 3. జ్యోతి August 29, 2008 / Reply
 4. vishnu August 29, 2008 / Reply
 5. Falling Angel August 29, 2008 / Reply
 6. arvind September 1, 2008 / Reply
 7. Cine Valley September 2, 2008 / Reply
 8. శోభ September 3, 2008 / Reply
 9. PraveenB October 8, 2008 / Reply
 10. PraveenB October 10, 2008 / Reply
 11. shree October 18, 2008 / Reply
 12. shree October 18, 2008 / Reply
 13. SRINIVAS January 31, 2011 / Reply
 14. SRINIVAS January 31, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *