Menu

నవ్య సినిమా

దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలు బాగా ఆవిష్కరించాయి. ఆ రీతిలోనే వర్తమాన కాలంలో ఆ బాధ్యతలు నిర్వహించగల ప్రతిభావంతమైన మాధ్యమంగా సినిమా వెలుగొందుతున్నది.

భావుకడయిన దర్శకుడి దృక్కోణంలోంచి చిత్రీకరించబడిన సినిమా ఆర్తిగా ప్రేక్షకుడి అంతరంగాన్ని, ఉద్వేగాన్ని తడుముతుంది. అంతటి ప్రభావ శక్తిగల సినిమా రంగం అనేక దశాబ్దాలుగా సుదీర్ఘమైన సంఘర్షనకు లోనయింది. రెండు పాయలుగా చీలి కళాత్మక, వ్యాపారాత్మక చిత్రాలుగా భిన్న కోణాల్లో కొసాగుతోంది.

కళాత్మక చిత్రాల వైతాళికులుగా లూయిస్ బ్రూనెల్, కురుసోవా, బెర్గెమెన్, బ్రెస్సెన్, టార్కోవస్కీ లాంటి పలువురు సినిమా పరంగా కొత్త కోణాల్ని ఆవిష్కరించగా మరో వైపు డబ్బే ఊపిరిగా వ్యాపార సినిమా విస్తరించింది.

మన దేశంలో 1913 లో తొలి కథా చిత్రం నిర్మితమయి 1931 లో మాటలు నేర్చుకున్న తర్వాత వివిధ భాషా చిత్రాల నిర్మాణం ప్రధానంగా మూడు నగరాల్లో కేంద్రీకృతమయ్యింది. బెంగాలీ, ఒరియా, అసామి తదితర ఈశాన్య రాష్ట్రాల చిత్రాలకు కలకత్తా; తమిళ, తెలుగు, మలయాళీ కన్నడ భాషా చిత్రాలకు మద్రాస్ (చెన్నై); హిందీ,మరాఠీ, గుజరాతీ, పంజాబీ తదితర భాషా చిత్రాల నిర్మాణానికి బాంబే(ముంబై) లు వేదికలయ్యాయి. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయింతర్వాత హైదరాబాద్, బెంగుళూరు, ట్రివేండ్రం లాంటి కొన్ని నగరాల్లో కూడా సినిమా నిర్మాణం పెరిగింది.

మొదట్లో భారతీయ సినిమాల నిర్మాణం పౌరాణిక అంశాల ప్రాతిపదికన మొదలయినప్పటికీ కాలక్రమేణా ఇఅతర అంశాల పరంగా కూడా చలనచిత్ర నిర్మాణం విస్తృతమైంది. దేశంలో హిందీ సినిమాలు అఖిల భారత వ్యాపారం కోసం విస్తృతం కాగా ప్రాంతీయ భాషా చిత్రాలు ప్రాంతీయ పరిస్థుల్ని వేదికగా చేసుకుని మొదలయ్యాయి.

జనరంజకమయిన విషయాల్ని తీసుకుని మంచి చెడ్డలని విశ్లేషించి సినిమా చివర్లో మంచి గెలిచినట్టుగా చూపించడం వాణిజ్య సినిమా లక్షణంగా మారింది. ఈ చిత్రాల్లో చెప్పదలుచుకున్న విషయానికంటే పాత్రలకు పాత్రధారులకు ఆరాధనా రూపం కల్పించడం ఆనవాయితీగా మారింది. ఈ తరహా చిత్రాల్లో అధిక శాతం ఇద్దరు మనుషుల మధ్య, రెండు కుటుంబాల మధ్య జరిగే ప్రేమ, వైరం, సంఘర్షణ లాంటి అంశాలే ఇతివృత్తాలుగా ఉంటాయి. ఈ రకమైన చిత్రాలు ఆధునిక సాంకేతిక అభివృద్ధిని కొత్తదనాన్ని సంతరించుకుని హాలీవుడ్ ప్రభావంతో ’ప్రధాన స్రవంతి’ సినిమాగా రూపుదిద్దుకున్నాయి.

కళగా సినిమా రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రమయిన సంఘర్షణకు లోనయింది. ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యం, చిత్రకళ తదితర కళారంగాల్లో వచ్చిన మార్పులు సినిమాల్లో కూడా వచ్చాయి. సంక్లిష్ట సామాజిక వాస్తవికతను విశ్లేషించి ప్రేక్షకుల కళ్లకు కట్టేలా వ్యక్తం చేయడమే వాస్తవవాద సినిమా లక్ష్యంగా అయింది. ఆ రకమయిన నవ్య సినిమా ఆ ధోరణి గల దర్శకుల భావ వ్యక్తీకరణకు  మాధ్యమంగా మారింది. ప్రేక్షకుడిలో కళాత్మకమయిన అనుభూతి కలిగించడానికి, సరికొత్త ఆలోచనలు రేకెత్తించడానికి చలనచిత్రం సరికొత్త వాస్తవిక రూపాన్ని సంతరించుకుంది.

ముఖ్యంగా ఇటలీలో డెసికా, రోసెల్లిని, విస్కాంటి లాంటి దర్శకులు స్టూడియో సరిహద్దుల్ని చెరిపివేసి కెమెరాను ప్రజల మధ్యకు తెచ్చారు. సామాన్య జనజీవితాల్ని కళాత్మకంగా దృశ్యీకరించడం ఆరంభించారు. తమ చిత్రాల్లోని పాత్రల వ్యక్తిగతమైన సమస్యల కోణంలోంచి విశ్వజనీనమైన అంశాల్ని ఆవిష్కరించారు. వారి సినిమాలలో నవ్య వాస్తవిక వాదాన్ని ప్రవేశపెట్టారు.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా జరిగుతున్న పరిణామాల ప్రభావమూ, స్వాతంత్ర్యానంతర దేశ విభజన సంక్షోభం, బెంగాల్ కరువు, తితర అంశాల ప్రభావంతో వాస్తవ వాదాన్ని ప్ాతిపదికగా చేసుకుని ’పథేర్ పాంచాలి’ చిత్రం 1965 లో నిర్మింపబడింది. ఆ చిత్రం భాతీయ వాస్తవిక సినిమాకి ప్రేరణగా నిలిచింది. దానికి ముందు చేతన్ ఆనంద్ ’నీచా నగర్’, బిమల్ రాయ్ ’దో భీగా జమీన్’, రిత్విక్ ఘటక్ ’నాగరిక్’, నిమాయ్ ఘోష్ ’చిన్నమ్మూల్’ లాంటి చిత్రాలు వచ్చినప్పటికీ సత్యజిత్ రే నిర్మించిన ’పథేర్ పాంచాలీ’ మాత్రమే ఒక ఉద్యమ స్ఫూర్తితో సరికొత్త పంథాకి నాంది పలికింది.

అయితే ’పథేర్ పాంచాలీ’ ఉన్న పళంగా ఆకాశంలోంచి ఏమీ ఊడిపడలేదు. అప్పటికే ఠాగోర్, శరత్, రాంపాద ముఖోపాధ్యాయ, బిభూతి బందోపాధ్యాయ, బిభూతి ముఖోపాధ్యాయ, ప్రేమేంద్ర మిత్ర, మానిక బందోపాధ్యాయ, ఆశాపూర్ణాదేవి, గజేంద్ర నాథ్ మిత్ర తదితరుల సాహిత్యంలో సామాజిక స్పృహ, వ్యక్తి పట్ల ప్రేమాభిమానాలు ప్రతిబింబిస్తూ వున్నాయి.

మరో పక్క రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 1940 లో యూత్ కల్చర్ సొసైటీ, బినయ్ రాయ్ ’సాంగ్ స్క్వాడ్’ లు ఉన్నాయి. 1943 లో వచ్చిన కరువు నేపథ్యంలో బిజన్ భట్టాచార్య ’నాబన్న’ నాటకాన్ని రచించారు. (అది తర్వాత ’ధర్తీకే లాల్’ పేరుతో సినిమాగా వచ్చింది). చిత్త ప్రసాద్ చిత్రాలు, జ్యోతీంద్రమైత్ర, బిష్ణుడే, సుభాష్ ముఖోపాధ్యాయిల కవితలు, ఆ తర్వాత ఏర్పాటయిన ఆంటీ ఫాసిస్ట్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అదే ఆ తర్వాత ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గా మారింది) లు సామాజిక స్పృహని పెంపొదింస్తూ వచ్చాయి. ముఖ్యంగా ’ఇప్టా’ సాంస్కృతిక రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. ఇలాంటి నేపథ్యంల్లోంచి సత్యజిత్ రే నిర్మించిన ’పథేర్ పాంచాలి’ భారతీయ సినిమాల్లోకి నవ్య వాస్తవిక వాదాన్ని తెచ్చింది.

’పథేర్ పాంచాలీ’ నిర్మించే సమయానికి సత్యజిత్ రే ఏ సినిమా స్టూడియోలోను అడుగుపెట్టలేదు. ఆయనకు సినిమా రంగంలో ఎలాంటి శిక్షణ లేదు. ఫోటోగ్రఫీ బాధ్యతను నిర్వహించిన సుబ్రతో మిత్ర మూవీ కెెరాని అప్పటికి ఉపయోగించనే లేదు. ఆ ఇద్దరూ మమేకతతో సెల్యులాయిడ్ పై గొప్ప హ్యూమన్ డాక్యుమెంట్ ని నిర్మించారు. “సినిమాలను మళ్ళి మళ్ళి చూడడం ద్వారానే సినిమాలు తీయడం నేర్చుకున్నా”నని సత్యజిత్ రే పదే పదే చెప్పారు.

1947లో రే, చిదానంద దాస్ గుప్త, నిమాయ్ ఘోష్ తదితరులు కలకత్తా ఫిలిం సొసైటి ప్రారంభించి ఐసెన్ స్టీన్, పోడెవెకిన్, డెసికా లాంటి వారి చిత్రాలు విరివిగా చూసేవారు. అదే సమయంలో ’ది రివర్’ సినిమా నిర్మించడానికి కలకత్తా వచ్చిన జీన్ రెనోవా సహచర్యం సత్యజిత్ రేకి గొప్ప ప్రేరణ అయింది. తర్వాత రే విదేశాలకు వెళ్ళి అక్కడున్న నాలుగున్నర నెలల్లో చూసిన 99 చిత్రాలు ఆయనపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఆ ప్రేరణతోనే రే ’పథేర్ పాంచాలి’ నిర్మించాడు. అది అప్పటి వరకూ భారతీయ సినిమా ప్రపంచానికి తెలిసిన అన్ని పధ్ధతులను పక్కకు నెట్టింది. తారలు, ఆహార్యం, ప్రేమ సన్నివేశాలు, పాటలు, నృత్యాలు లేకుండా రోజూ చూస్తున్న జీవితంలా సాగిన ఆ చిత్రం భారతీయ సినిమా రంగంలో కొత్త విలువలకి ఊపిరి పోసింది. ఈ సినిమా తర్వాత రే రూపొందించిన ’అపరాజిత’ ’అపూర్ సంసార్’ లు అపూ ట్రయాలజీగా పేరుపొందాయి. అప్పట్నుంచి ’అగంతక్’ వరకూ సత్యజిత్ రే వెనక్కి తిరిగి చూడలేదు.

దాదాపుగా సత్యజిత్ రేకు సమాంతరంగానూ, కొంచెం ముందు వెనుకలుగానూ బెంగాల్ నుంచి రిత్విక్ ఘటక్, మృణాస్ సేన్ లు తెరమీదికి వచ్చారు. రిత్విక్ ఘటక్ తన చిత్రాలతో భారతీయ చిత్రరంగాన్ని ప్రభావితం చేశాడు. మృణాల్ సేన్ పొలిటికల్ ఫిలిం మేకర్ గా పేరు గాంచాడు వీరి ప్రభావంతో బెంగాల్ లో గౌతమ్ ఘోష్, బుద్ధదేవ్ దాస్ గుప్త, అపర్న సేన్ లాంటి ఎంతో మంది నవ్య సినిమా నిర్మాణంలో నిలదొక్కుకున్నారు.

బెంగాల్ తర్వాత కన్నడంలో పఠాభిరామిరెడ్డి ’సంస్కార్’ నవ్య సినిమా ఉద్యమ ఒరవడి దిద్దింది. బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్, నాగాభరణ, ప్రేమా కారంత్, లంకేశ్ లాంటి వారు తమవంతు పాత్రను విర్వహించారు. గిరీష్ కాసరవెల్లి, గిరీశ్ కర్నాడ్ లాంటి వారు నేటికీ ఆ ఒరవడి కొనసాగిస్తున్నారు.

వాస్తవిక సినిమా, సమాంతర సినిమా, ప్రాంతీయ సినిమా ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటున్న నవ్య సినిమా బెంగాల్, కర్నాటక రాష్ట్రాల తర్వాత కేరళ రాష్ట్రంలో పరిమళించింది. ఎం.టి. వాసుదేవన్ నాయర్ ’నిర్మాల్యం’ తో ఆ ఒరవడి మొదలయింది అనంతరం పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి ఎదిగి వచ్చిన అనేక మంది మలయాళీ చిత్ర సీమకు రూపు రేఖలు దిద్దారు. అందులో అదూర్ గోపాల్ కృష్ణన్ ప్రధముడు. సెల్యులాయిడ్ పోయెట్ గా పేరొందిన అరవిందన్, రాజకీయ స్పృహతో సినిమాలు నిర్మించిన జాన్ అబ్రహంల తర్వాత షాజీ కరుణ్, కె.ఆర్.మోహనన్, టి.వి.చంద్రన్, జార్జి, లెనిన్ రాజేంద్రన్ తదితరులు కేరళలో నవ్య సినిమా ఉద్యమానిక పట్టుకొమ్మలై నిలిచారు.

హిందీ లో శ్యాం బెనెగల్ గత 25 సంవత్సరాలుగా నవ్య సినిమా తెరపైన తన బలమైన ముద్రవేశారు. 1974 లో ’అంకుర్’ తో మొదలైన ఆయన చలనచిత్ర యాత్ర ’నిషాంత్’, ’మంథన్’, ’భూమిక’ ల నుండి ’నేతాజీ’ వరకూ కొనసాగుతూనే వుంది. ఆయన స్కూల్ నుంచి అనే మంది నటీనటులు, దర్శకులు వచ్చారు. బెనెగల్ కి ఛాయాగ్రహకుడిగా పనిచేసిన గోవింద్ నిహలానీ దర్శకుడిగా ఎదిగాడు. కుమార్ సహానీ సిధ్ధాంతకర్తగా పేరు గడించాడు.మణికౌల్ ప్రయోగ కర్తగా పేరు పొందాడు. ఇంకా కేతన్ మెహతా, సయీద్ మీర్జా, సాయి పరాంజపే, ఎం.ఎస్.సత్యూ, ముజఫర్ ఆలీ, రవీంద్ర ధర్మరాజ్, అవతార్ కౌల్, కల్పనాాజ్మీ తదితరుల చిత్రాలు హిందీలో నవ్య సినిమా రంగాన్ని పరిపుష్టం చేశాయి.

తమిళ వాస్తవిక సినిమా రంగంలో బాలుమహేంద్ర, ప్రతాప్ పోతన్, రుద్రయ్య, కె.ఆర్.మోహనన్ తదితరుల కృషి ప్రశంసనీయమైంది. ఒరియాలో నీరద్ మహాపాత్ర, మన్ మోహన్ మహాపాత్ర, ఎ.కె.బీర్, బిప్లబ్ రాయ్ చౌదరి, షాఘీర్ అహ్మద్ మొదలగు వారి చిత్రాలు వాస్తవిక సినిమాలుగా పేరు గడించాయి. గుజరాతీ భాషలో కాంతిలాల్ రాథోడ్, కేతన్ ెహా, పర్వేజ్ మెర్ వాంజీ, మరాఠీలో జబ్బర్ పటేల్, విజయామెహెతా, నచికేత్, జయూ పట్వర్థన్ లు, అస్సామీలో బబేంద్రనాథ్ సైకియా, జానూ బారువా, గౌతమ్ బోరాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. మణిపూర్ నుండి అభిరాం శ్యాం శర్మ వాస్తవవాద చిత్రాలను నిర్మించారు.

తెలుగులో మృణాల్ సేన్, శ్యాం బెనగల్, గౌతమ్ ఘోష్ లు తెలుగులో వాస్తవవాద చిత్రాలు నిర్మించినప్పటికీ బి.ఎస్.నారాయణ కృషి కూడా ప్రశంసనీయమయింది. ఆ దారిలో బి.నరసింగరావు కొన్నాళ్ళు ఒంటరి పోరాటం చేసారు.

దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లోనూ ఏదో మేరకు నవ్య సినిమా నిర్మాణోద్యమం కొనసాగింది. కానీ అన్ని ఉద్యమాల లాగానే కాలక్రమంలో ఈ ఉద్యమం దాదాపు ముగిసిపోయింది.

అయితే జీవన సంక్షోభంలోంచి, అంతరంగ మధనంలోంచి ఎగిసిపడే అన్ని కళల్లాగే చలనచిత్ర కళ కూడా కళాత్మక సామాజిక వాస్తవికత నుంచి దూరం కాలేదు. ఎన్నో ఆటుపోట్లకు గురౌతూనే అది ఎప్పటికప్పుడు తన సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇవాళ నాణ్యత లేని సినిమాలే రాజ్యమేలుతున్నా మరో కొత్త ఉద్యమం అలలా ఎగిసి మరో భారతీయ నవ్య సినిమా ఒరవడికి నాంది పలికే రోజు కోసం ఎదురుచూద్దాం.

One Response
  1. సుధారాణి పి. August 11, 2008 /