ప్రణయ కథలకు మకుటాయమానం - మల్లీశ్వరి
Aug 14th, 2008 | రచయిత: అతిథి | వర్గాలు: featured • lead • భారతీయ సినిమా • విశ్లేషణ
పరిచయం:తెలుగు సినిమా చరిత్రను ఎవరు గ్రంధస్థం చేసినా “మల్లీశ్వరి” సినిమాకు ప్రత్యేకించి కొన్ని పేజీలు కేటాయించక తప్పదు. మధుర సంగీతమయిన “మల్లీశ్వరి” ప్రణయగాథలకు మకుటాయమానం. ఒక పుష్కరకాలంపాటు తన మనసులో అల్లుకుంటూ వచ్చిన ఊహలకు బి.యన్. కల్పించిన అందమైన దృశ్యరూపం మల్లీశ్వరి. చిత్ర జగత్తులో ’కావ్య గౌరవమును’ సంపాదించగల కళాసృష్టి ఈ సినిమా.ఈ సినిమా విడుదలయినప్పుడు ఫిల్మ్ ఇండియా పత్రిక ఈ సినిమా గురించి ” Malleswari is an inspiring motion picture-a picture that will save us a blush when compared with the best motion pictures of the world” అని రాసారు. అప్పటికీ ఇప్పటికీ తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది ’మల్లీశ్వరి’.
కథాసంగ్రహం:దక్షిణాపథమంతా పరిపాలించిన విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయలవారిని గురించి ఆబాలగోపాలమూ అప్యాయంగా చెప్పుకుంటూ వచ్చిన గాథలు ఈ ’మల్లీశ్వరి’ కథకు ఆధారం. ఐదువందల సంవత్సరాలకు పూర్వము సిరిసంపదలకు, సకల కళలకు ఆలవాలమై అఖండ వైభవంతో తూలతూగే రాయలవారి సామ్రాజ్యంలో విజయనగర ప్రాంతమైన వీరాపురం అనే ఒక చిన్న పద్మశాలీల గ్రామం….
మల్లి, నాగరాజు బావమరదళ్ళు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిచిపోతుంది వాళ్ళ బాల్యం. మల్లిది కలిగిన కుటుంబం. నాగరాజు నిరుపేద. అయితే ఈ వ్యత్యాసాలేవీ వాళ్ల స్నేహానికి అడ్డంకి కావు. ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. మల్లి తల్లి డబ్బుమనిషి. బావే అయినా ఈడొచ్చిన కూతురు అలా నాగరాజుతో తిరగడం ఆవిడకు నచ్చదు. నాగరాజు మంచి శిల్పి. కానీ, అతని కళ కాసు పండించడం లేదు. తిరునాళ్లకు వెళ్ళిన మల్లి, నాగరాజు కుండపోతగా వర్షం కురవడంతో ఓ శిథిల సత్రంలో తల దాచుకుంటారు. సరిగా అదే సమయానికి రాయలవారు తమ ఆస్థానకవితో అక్కడికి వస్తారు. మల్లి, నాగరాజులు మామూలుగానే ఆటపాటల్లో, కవిత్వంలో వుంటారు. మల్లి గానం, నాట్యం రాయలవారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. త్వమేవాహం అన్నట్టున్న ఆ ప్రేమజంట ఆయనకు ముచ్చట కలిగిస్తుంది. తనెవరో ఆయన వీళ్ళకు చెప్పడు. వీళ్లకూ ఆయనెవరో తెలియదు. రాయలవారే గనుక తన మల్లి నాట్యం చూస్తే పల్లకీ పంపించి రాణివాసం ఏర్పాటు చేస్తారని నాగరాజు ఆమెతో వాళ్ల సమక్షంలోనే కవ్వింతకు అంటాడు. వర్షం ఆగిపోవడంతో రాయలవారు వెళ్ళిపోతారు.
సంపాదనలేని తనకు మల్లి అందరాని జాబిల్లే అన్న విషయం నాగరాజుకు మెల్లగా అర్థమవుతుంది. అందుకని ముందు తనుకూడా సంపాదనాపరుడు కావాలని నిర్ణయానికి వస్తాడు. తన అదృష్టాన్ని వెదుక్కుంటూ దేశాటనకు బయలుదేరుతాడు. నాగరాజు వూరు వదిలిన కొద్దిరోజులకే మల్లీశ్వరికి కోటనుంచి రాణివాసం ఆహ్వానం వస్తుంది. తల్లి సంతోషానికి అవధులు లేవు. కానీ బావ నాగరాజులేని ప్రపంచం మల్లికి శూన్యం. అది రాణివాసమైనా సరే. నిర్విరాకంగా కోటకు బయలుదేరి వెడుతుంది. రాణివాసంలో మల్లి ఒంటరిజీవితానికి అక్కడి పరిచారిక జలజ ఒక ఓదార్పు. నాగరాజు అదృష్టం పండింది. అతని పనితనానికి గుర్తింపు లభించింది. బాగా సంపాదించాడు. ఆనందంతో మళి వూరికి తిరిగివచ్చాడు.కానీ, మల్లి లేదు. రాణి వాసానికి వెళ్ళిందన్న వార్త వినగానే నిశ్చేష్టువుతాడు. విరాగిలా తిరుగుతున్న అతన్ని రాచకోటకు చెందిన శిల్పి తన వెంట తీసుకువెడతాడు. కోటలో తయారవుతున్న నర్తనశాల మందిర నిర్మాణంలో పని ఇస్తాడు. కోటలో నాగరాజు మల్లిని కలుస్తాడు. వాళ్ళ జీవితంలో మళ్ళీ పున్నమి. జలజ సాయంతో తరచూ చాటుగా కలుసుకుంటుంటారు. అన్ని రోజులూ ఒక్కలా వుండవు కదా. ఒక రోజు వీళ్ళిద్దరూ రాచభటులకు దొరికిపోతారు. రాణివాసంలో ఉన్న మహిళ పురుషులెవరితోనూ జత కట్టరాదు. అలాచేస్తే ఆమెకు, అతని స్నేహితునికి కూడా శిరచ్ఛేదం తప్పదు. మల్లినీ, నాగరాజునీ రాజాస్థానంలో ప్రవేశపెట్టారు. సత్రంలో తమతో మాట్టాడిన పెద్దాయన్ని అక్కడ రాయలవారిగా చూసి ఇద్దరూ తెల్లబోతారు. ఆ వర్షం కురిసిన సాయంత్రం సత్రంలో తన మనోహర నృత్యంతో తమను పరవశింపజేసిన మల్లినీ, తమ నర్తనశాలలో అపూర్వమైన శిల్పాలను సృష్టించి విజయనగరానికి శాశ్వత కీర్తి కలిగించిన నాగరాజును రాయలవారు పెద్దమనసుతో క్షమిస్తారు. ప్రేమజంట ఆనందానికి అవధులు లేవు. ప్రభువుల వారికి వినమ్రంగా నమస్కరించారు.
నిర్మాణ విశేషాలు:మల్లీశ్వరి సినిమా నిర్మాణానికి బీజం 1938లోనే పడింది. “వందేమాతరం” సినిమాలో హీరో తన సహాధ్యాయులతో కలిసి హంపీ పిక్నిక్ కి వస్తాడు. ఆ సన్నివేశాల షూటింగుకని వాహినీ యూనిట్ అక్కడికి వెళ్ళింది. చరిత్రాత్మకమైన విరూపాక్ష దేవాలయంలో షూటింగ్ జరుగుతోంది. మందిరం నడి మధ్యన నుంచుని యూనిట్ కు సూచనలిస్తున్న బి.యన్ మనసులో వున్నట్టుండి ఒక విషయం గుర్తుకువచ్చింది. ఇదే మందిరంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణదేవరాయల వారు ఇలాగే నిలబడి స్వామివారికి పూజలు చేశారు. ఈ భావన రాగానే బి.యన్. కి ఒళ్ళు జలదరించింది. తెలుగు భాషా ఉత్థానానికి ఎనలేని సేవలందించిన ఆ మహనీయుని చుట్టూతా కథ అల్లుతూ ఒక ప్రేమకావ్యాన్ని నిర్మించాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. కథ కోసం ఆయన అనేక సంవత్సరాలు అన్వేషించారు. కానీ, దొరకలేదు. చివరికి ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తన మిత్రుడు బుచ్చిబాబు రాసిన నాటకం ’రాయల కరుణకృత్యము’ నాటిక ఆయన్ని ఆకర్షించింది. బుచ్చిబాబు నిజానికి ఈ నాటకాన్ని అంతకుముందే అంటే 1944 లో రాశారు. భారతి మాసపత్రిక తన మే నెల సంచికలో ప్రచురించింది. ’ఇలస్ట్రేటెడ్ వీక్లీ’ లో వచ్చిన మరో కథ కూడా బి.యన్.రెడ్డీని ఆకట్టుకుంది. ఈ రెంటి ప్రభావంతో ఆయన ఒక కథ ఆలోచించారు. అయితే, బుచ్చిబాబు నాటక ప్రభావం “మల్లీశ్వరి” లో మనకు స్ఫుటంగా కనిపిస్తుమ్ది. టైటిల్స్ లో ఆ విషయం ప్రస్తావించకపోవటానికి కారణం బుచ్చిబాబు ప్రభుత్వోద్యోగి అయివుండడమే భరాగో అంటున్నారు.
సరే, కథ అనుకున్నాక సంభాషణలు ఎవరిచేత రాయించాలన్న ప్రశ్న తలెత్తింది. బి.యన్. కు అప్పుడూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గుర్తుకు వచ్చారు. “వందేమాతరం” సినిమా ప్రివ్యూలో మొదటిసారిగా వాళ్లిద్దరూ కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే తామిద్దరూ ఒక గూటి పక్షులం అన్న విషయం అర్థమైపోయింది.కాకినాడ వైపు వెళ్ళినప్పుడల్లా బి.యన్. ఆయనింట్లోనే బస చేసేవారు. కృష్ణశాస్త్రి కవిత్వాన్ని జయదేవుని అష్టపదులతో సరిసమానంగా పేర్కొనేవారు.తరువాత తను తీసిన మూడు సినిమాల్లోనూ కృష్ణశాస్త్రి చేత కనీసం ఒక్క పాటయినా రాయించాలని చాలా ప్రయత్నించారు బి.యన్. కానీ, ఈ సుకుమారుడు కలం కదిపితేనా? 1949 లో కృష్ణశాస్త్రి మద్రాసు వచ్చేశారు. “మల్లీశ్వరి” కథ తయారయినప్పుడు కృష్ణశాస్త్రి మాటా, పాటలుంటేనే ఆ కథ సెల్యులాయిడ్ కావ్యమవుతుందని బి.యన్. గట్టిగా విశ్వసించారు. సినిమా పద్ధతులన్నీ చెప్పి మాటలు, పాటలు రాయించారు. భావ కవిత్వానికి ఆద్యుడయిన దేవులపల్లి రాకతో తెలుగు సినీ సాహిత్యం కూడా ఒక కొత్త మలుపు తీసుకుంది.
ఆ తర్వాత మ్యూజిక్ కంపోజింగ్ కార్యక్రమాలు మొదలయినాయి. మొదటగా దేవులపల్లి రాసింది చిన్ననాటి మల్లి, నాగరాజుల పాట. సాహిత్యం విన్నాక బి.యన్. మామూలుగానే, ’కుదేల్ బ్రదర్!కుదేల్’ అంటూ కె.వి.రెడ్డి, బ్రిజ్ మోహన్ దాస్ (వాహినీకి ఆ రోజుల్లో జనరల్ మేనేజర్) దగ్గర తన ఆనందం వెలిబుచ్చారు. ఆ తరువాత దేవులపల్లివారికి చావు కబురు చల్లగా చెప్పారు, ఆ పాట సినిమాలో వాడటం లేదని. “మన సినిమాలో మల్లి, నాగరాజులు పద్మసాలీల పిల్లలు. విద్యాగంధం లేనివారు. పైపెచ్చు చిన్న పిల్లలు. మీరు మీ పాటలో ఒక అద్భుతమైన వూహాప్రపంచాన్ని ఆ పిల్లలచేత ఆవిష్కరింపచేశారు. సినిమాలో ఆ పిల్లలు ఈ పాటపాడితే ఎంత హాస్యాస్పదంగా వుంటుంది?ఆలోచించండి” అన్నారు. దేవులపల్లి నీరుగారిపోయారు. కానీ, బి.యన్ చెప్పింది నిజమే. అందుకని తన కవితావేశాన్ని తగ్గించుకుని, భావాలకు మాత్రం రెక్కతొడిగి పాట రాశారు. అదే సినిమాలో మనం చూసిన రావి చెట్టుమీద ’ఓ పిల్లా….’ పాట. పాడింది వల్లూరి శకుంతల, గాదె రామకృష్ణారావు. వీళ్ళిద్దరూ ఆ రోజుల్లో బాలానందం రేడియో కార్యక్రమాల్లో పాడుతుండేవారు. పిల్లల పాటలు పిల్లల చేతనే పాడిస్తే బావుంటుందని బి.యన్ రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు సాయం కోరారు. ఆయన వీళ్ళిద్దరినీ సిఫార్సు చేశారు. అన్నట్టు “మల్లీశ్వరి” సినిమాలో రాయలవారి అస్థానకవి వేషం వేసింది న్యాయపతి రాఘవరావే.
“మల్లీశ్వరి” సినిమాకు అక్షరాలా ఆరునెలలపాటు సంగీత యజ్ఞం జరిగింది. ఈ సినిమాలో ఏ పాటా ముందు ట్యూన్ అనుకుని ఆ తరువాత రాసింది కాదు. రాసిన తరువాతే సన్నివేశ ఔచిత్యాన్ని బట్టి బాణీ కట్టినవి. బాణీలన్నీ తను కట్టినవేనని, అద్దేపల్లి రామారావు అర్కెస్ట్రా నిర్వహణ చూసేవారని సాలూరి రాజేశ్వరరావు చెప్పేవారు. ఘంటసాల, భానుమతి ప్రతిరోజూ రిహార్సల్స్ కు వచ్చేవారు. పూర్తి ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ జరిగేవి. సాలూరి తన కెరీర్ లో అపురూపంగా చెప్పుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి “చంద్రలేఖ”, రెండోది “మల్లీశ్వరి”.
నటీనటులు:ఇక తారల విషయానికి వస్తే నాగరాజు వేషానికి బి.యన్ మొదటినుంచీ అనుకున్నది నందమూరినే. “మల్లీశ్వరి” వేషాన్ని మొదట ఎవరైనా కొత్త తారచేత చేయిద్దామని ఆయన భావించారు. ఆ తార కోసం అన్వేషించి రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేశారు. సోదరుడు కొండారెడ్డి చేత స్క్రీన్ టెస్ట్ కూడా చేయించారు. అయితే స్క్రిప్టు తయారయ్యాక చూసుకుంటే సినిమాకు మల్లి పాత్ర చాలా కీలకం అని అర్థమయిపోయింది. కొత్త పిల్ల ఇంత పద్ద భారం నిభాయించలేదని మళ్ళీ పాత తారలకే మొగ్గారు. “స్వర్గసీమ” విడుదలయిన ఈ ఐదేళ్ళలోనూ భానుమతి దక్షిణాదిన సూపర్ స్టార్ అయ్యింది. ఆవిడకు అతిశయమూ జాస్తి అయ్యిందన్న ప్రచారమూ వుంది. అయినా, బి.యన్ ఆవిడవైపే మొగ్గు చూపారు.
భానుమతి మాటా, పాటా ఈ సినిమాకు ఎంత బలాన్ని ఇచ్చాయో ఇవాళ కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ కి ఇది ఏడవ సినిమా.మొదటి ఐదు సినిమాలు సాంఘికాలే. ఆర సినిమా పాతాళభైరవి జానపదం. వూరూ వాడా నందమూరి మోజులో కొట్టుకుపోయింది. అదే సమయంలో బి.యన్ ఆయనకు ఈ సినిమా నందమూరి చేసుకున్న మరో అదృష్టం. భానుమతి, నందమూరిలను తెరమీద చూసిన బి.యన ఆనందానికి పగ్గాలు లేవు. ఆయన కాగితం మీద ఏదయితే రాసుకున్నారో దానిని తెరమీద తు.చ తప్పక చూపించారు వీళ్ళిద్దరూ.
చిన్నప్పటి మల్లి, నాగరాజులుగా వేసిమ్ది మల్లిక, వెంకటరమణ. ఈ వెంకటరమణ తెనాలి కుర్రాడు. గోవిమ్దరాజుల సుబ్బారావుగారి తమ్ముడి కొడుకు. సుప్రసిధ్ధ చిత్రకారుడు బాపుకు స్వయాన బావమరిది. ఇక మల్లికలో భానుమతి ఛాయలు కనిపించడంతో ఆమెను చిన్నప్పటి మల్లిగా తీసుకున్నారు. రాయలవారిగా చేసింది శ్రీవత్స. అంతకుముందు విజయావారు తీసిన షావుకారులో ఆయన జానకి తండ్రిగా వేశారు. మల్లి మావయ్య హనుమంతప్పగా వేసింది వంగర వెంకట సుబ్బయ్య. ఆయన గురించి తెలియనిదెవరికి? మల్లి, నాగరాజుల ప్రేమను మొదటినుంచి ఆశీర్వదిస్తూ వచ్చే పూజారి వేషం వేసింది ఈ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేసిన సి.నాగేశ్వరరావు. నాగరాజు తల్లి గోవిందమ్మగా వేసింది వెంకుమాంబ. రాయలసీమకు చెందినావిడ. సినిమాలకు రాకముందు నాటకాల్లో చాలా ప్రసిధ్ధి. బసక్క, రామక్కలుగా వేసింది సురభి కమలాభాయి, గంగారత్నం. వీళ్ళల్లో కమలాభాయి తెలుగులో వచ్చిన తొల టాకీ ’భక్తప్రహ్లాద’ లో లీలావతిగా వేసింది. ఇక కోటలో మల్లి పరిచారిక జలజగా వేసింది టి.జి.కమల. తేనె గొంతిక కమల అసలు పేరు తోట గోవిందమ్మ. ఆనాడు తెలుగు సినిమా పరిశ్రమ ఎంతమాత్రమూ గుర్తించకుండా ఉపేక్షించిన మణిపూస.
ముగింపు:’మల్లీశ్వరి’ సినిమాలో వాహినీ పాత కాపు చిత్తూరు నాగయ్య కనిపించరు కానీ, వినిపిస్తారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానాన్ని చదివింది ఆయనే. పురంధర దాసు రచించిన పిళ్లయార్ గీతం ’శ్రీ గణనాథ’ బృందగానంగా వస్తుంటే సినిమా టైటిల్స్ పడతాయి. గణేశ స్తుతితో తన సినిమాలు ఆరంభించడం బి.యన్ కు ఓ ఆనవాయితీ. జనమంతా సినిమాలోని సాహిత్య సొగరుకు వహ్వ అన్నారు. సంగీత సౌరభానికి శిరస్సు వంచి సలాం చేశారు. వాహినీవారికి ’మల్లీశ్వరి’ అటు కూ, ఇటు కాసులనూ కూడా పండించింది. చైనాలో జరిగిన తూర్పు ఆసియా ఫిలిం ఫెస్టివల్ లో మొదటిసారిగా ఒక తెలుగు ప్రదర్శించబడటం ’మల్లీశ్వరి’ తోనే మొదలయింది. తెలుగువాడు గర్వంగా ఛాతి విరుచుకుని ఇది మా సినిమా అనిచ చెప్పుకునే సెల్యులాయిడ్ కావ్యం ’మల్లీశ్వరి’.
రచన: శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి
సేకరణ: “కళాత్మక దర్శకుడు-బి.యెన్.రెడ్డి’ అన్న గ్రంధంనుండి.