Menu

కథానాయకుడు (2008)

కథానాయకుడు సినిమా వచ్చి పదిరోజులవుతున్నా నవతరంగంలో ఇంకా ఆ సినిమా గురించి వ్యాసం రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈరోజే, వర్షాన్ని ఎదుర్కొంటూ వెళ్ళి సినిమా చూసొచ్చా కనుక నేనే మొదటి వ్యాసం రాస్తున్నాను.

కథ విషయానికొస్తే : బాలు (బాలకృష్ణ) అన్న బార్బర్ తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో ఆనందంగా ఉంటాడు. తన కొట్టుకి వ్యాపారం లేక, పిల్లల స్కూలు ఫీజులకి డబ్బుల్లేక అవస్థ పడుతున్నా కూడా మొహంలో చిరునవ్వు విడువడు. ఆ ఊరులోనే బాలు కి కాంపిటీషన్ గా కటింగ్ కాంతారావ్ ఉంటాడు. ఒకప్పుడు బాలు దగ్గర పనిచేసిన ఇతను, మాటకారితనంతో జనాల్ని ఆకర్షించి, అధునాతన సౌకర్యాలు పెట్టుకునీ బాలూకి వ్యాపారం లేకుండా చేస్తాడు. బాలూ, ఈ ఊరూ, ఇక్కడి జనాలూ – ఈ కథ ఇలా మామూలుగా సాగుతూ ఉండగా ఆ ఊరి దగ్గర ఓ సినిమా షూటింగ్ మొదలవడంతో సందడి వస్తుంది. సూపర్ స్టార్ అశోక్ కుమార్ (రజనీకాంత్) రాకతో అందరిలోనూ అతన్ని చూడాలన్న కుతూహలం. ఈ సమయంలో బాలు, అశోక్ కుమార్ ఇద్దరూ బాల్య స్నేహితులని బాలు భార్యా-పిల్లల ద్వారా ఊరిజనానికి తెలుస్తుంది. బాలూ అశోక్ తనని గుర్తుపట్టడేమో అని సంకోచిస్తూ ఉంటాడు. బాలూ అశోక్ ని కలుస్తాడా? అతని సంకోచాన్ని అబద్దంగా అపార్థం చేసుకున్న వాళ్ళకి నిజం తెలుస్తుందా? చివరికేమౌతుంది? అన్నది కథ.

నిజానికి కథలో పెద్ద పస లేదు. Typical senti cinema. అంతా అనుకున్నట్లు గానే సాగుతుంది. సీన్లు సీన్లుగా చూస్తే హాస్యం పర్వాలేదు. కానీ, ఒక సినిమాగా చూస్తే ఇది పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఎంటర్‍టైనరే కానీ, మళ్ళీ మళ్ళీ చూసే తరహా కాదు. రజనీ పాత సినిమాలు – నరసింహ, ముత్తు, చంద్రముఖి,అరుణాచలం వంటి సినిమాల తరహా ఎంటర్‍టైనర్ కాదు. కొన్ని పాటల పిక్చరైజేషన్ బాగుంది. “చలే చలే..” పాట తీసిన విధానం బాగుంది. ఆ పాట వింటూ ఉంటే, జీవితం ఇంత సింపుల్గా ఉంటే ఎంత బాగుండు అనిపించింది. చూసాక కూడా ఆ భావన అలానే ఉంది. “పెను తుఫానునైనా ఎదిరించి…” అన్న వాక్యాన్ని ఎన్నిసార్లు పాడినా సుజాత గొంతు – “పెనుతుఫానునేనా…” అనే పాడటం వింతగా ఉంది. “సినిమా సినిమా…” పాట లో సినిమా తీయడం అంటే ఎన్ని పనులు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేసారు. ఎంత మంది ఉంటారు, ఎన్ని జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి – అన్నది ఈ పాట బానే తెలియజెప్పింది. “రా రా రా” పాట ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. “om jayare jayare” పాట షూటింగ్లో భాగం అన్నట్లు చూపించారు. “వచ్చే వచ్చే వానా..” పాట చాలా సార్లు విని ఎలా ఉంటుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తే, అది అసందర్భంగా రావడమే కాక తీసిన విధానం కూడా చాలా చిరాకు పుట్టించింది నాకు. నయనతార ఎక్స్‍పోజింగ్ చేయడానికి తప్ప ఆ పాట ఎందుకో అర్థం కాలేదు. సంగీతం బానే ఉంది. ట్యూన్లు అద్భుతంగా కాకపోయినా, క్యాచీగానే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాల తరహాలో అనిపించింది సాహిత్యం కొన్ని చోట్ల.

మొత్తం మన కమెడియన్లు అందరూ ఉన్నట్లున్నారు ఏదో ఓ పాత్రలో ఈ సినిమాలో. అందుకే, బిట్లు బిట్లు గా కామెడీ పర్వాలేదన్నది ఇందాక. కానీ, అంతా ఓ కథ లాగా చూస్తే, అక్కడ కథ పెద్దగా లేదు. అంత thin storyline పెట్టుకుని ఇలా బిట్లు బిట్లు గా కథ ఎలా నడుపుతారా అని సందేహం కలిగింది గంటకే ఇంటర్వెల్ వస్తే. రెండున్నర గంటలకే (ఇంటర్వెల్ తోసహా) సినిమా ఐపోవడంతో అర్థమైంది – అందుకే రొటీన్ కి భిన్నంగా కాస్త నిడివి తగ్గింది అని. మీనా పాత్రకి డబ్బింగ్ ఆ పాత్ర బ్యాక్‍గ్రౌండ్ కి సూటవలేదు. రజనీకాంత్ తో శ్రీనివాస్ పాత్ర సంభాషణ భలే ఉంది – “మీరెందుకు ఆర్నెల్లకోసారి హిమాలయాలంటారు? మీరెందుకు రాజకీయాల్లోకి వస్తానని రానని డౌట్లు పుట్టిస్తారు? మీరెందుకు అది చేస్తారు? ఇది చేయరు?” అని రజనీకాంత్ ని ప్రశ్నలేయడం నవ్వు తెప్పించింది. చివరి ఇరవై నిముషాలూ గుండె పిండేసే డైలాగులు. చాలా సెంటిమెంటల్ సీన్లు. మీరు సహజంగా ఎమోషనల్ ఐతే, ఓ కర్ఛీఫ్ కూడా పట్టుకెళ్ళడం బెటర్. జగపతి బాబు చాలా బాగా చేసినట్లనిపించింది. రజనీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పైగా, నటుడి పాత్ర! రజనీకి ఎస్పీబీ డబ్బింగ్ చెప్పినట్లుంది. కొత్తగా ఉన్నా కూడా, రజనీ స్టైల్ లో బాగా చెప్పారు.

చివరగా, సినిమా చాలా చోట్ల కృత్రిమంగా అనిపించింది. సాగదీసినట్లు కూడా అనిపించింది అక్కడక్కడా. కానీ, అలాంటివి ఆలోచించలేము అనుకోండి మన సినిమాల్లో..అది వేరే విషయం. రజనీ ఫాన్లకి సినిమా బాగా నచ్చవచ్చు. తక్కినవారికి మామూలు నుంచి బోరు కొట్టడం దాకా రకరకాల భావనలు కలగొచ్చు. మీకూ అలాంటి స్నేహితుడి కథ ఉంటే, మీరీ సినిమా గురించే ఆలోచిస్తూ మిమ్మల్ని అందులో చూసుకోవచ్చు. 🙂

14 Comments
  1. శంకర్ August 10, 2008 /
  2. నాగన్న August 11, 2008 /
  3. Sowmya August 11, 2008 /
  4. Raja August 11, 2008 /
  5. సౌమ్య August 11, 2008 /
  6. srinu October 8, 2008 /