Menu

Kannum Kannum (2008)

నేను ఇటీవల చూసిన సినిమాల్లోకెల్లా “ఎందుకు చూస్తున్నానో!” అనిపించిన సినిమా ఇది. ఇలా మొదలుపెట్టడం ఎందుకు? అసలు దాని గురించి రాయకుండా ఉంటే పోతుంది కదా? అని అనుకోవచ్చు. కానీ, “its a pretty neat film to watch as a family” అని వికీపీడియా లో రాసుంటే చదివి ఈ సినిమా చూసాను. ఓహో… కుటుంబ సమేతంగా చూడాలంటే ఇంత “బాగా” తీయాలా! అన్న జ్ఞానోదయం అయ్యాక ఇక ఈ సినిమా గురించి రాయడం తప్పనిసరైంది నాకు.

కథ: హీరో ఓ అనాథ. జీవితంలో కష్టపడి పైకొచ్చిన మనిషి. ఓ సారి ఓ కవిత రాస్తాడు. కానీ, ఎక్కడికీ పంపడు. కానీ, హీరోయిన్ మక్కికి మక్కి, లైన్ టు లైన్ అదే కవిత రాస్తుంది (???). అదో పత్రికలో వస్తే హీరో చదువుతాడు.అప్పట్నుంచీ హీరోకీ, హీరోయిన్ కీ కలం స్నేహం మొదలు. ఒకానొక శుభముహుర్తాన అది ప్రేమగా పరిణమిస్తుంది. హీరో ఆమెని కలుసుకోడానికి వాళ్ళ ఊరు బయలుదేరతాడు. ఆ ఊరిలో తన స్నేహితుడు ఉంటే వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు.పదిరోజుల్లోనే అనుకోకుండా, హీరో డ్రైవ్ చేస్తున్న బైక్ ఆక్సిడెంట్ అయి, ప్రమాదంలో వెనక కూర్చున్న స్నేహితుడు చనిపోతాడు. హీరో అతని బాధ్యతలు తను స్వీకరించి ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంతలో, ఆ స్నేహితుడి నాలుగో చెల్లెలు-ఈ పదిరోజుల్లోనూ కాలేజీ వాళ్ళతో కలిసి టూర్ కి వెళ్ళిన మనిషి తిరిగొచ్చి, హీరో ని తన అన్నని చంపిన వాడని ద్వేషిస్తూ ఉంటుంది. హీరో తన ప్రేమ సంగతి వదిలేసి ఇంటి బాధ్యతల్లో మునుగుతాడు. ఓ సందర్భంలో హీరోకి తెలుస్తుంది – ఈ నాలుగో చెల్లెలే తన ప్రేయసి అని. కానీ, ఇప్పుడు వీళ్ళందరికీ తను అన్నగా వ్యవహరిస్తున్నాడు కద!! అందుకని ప్రేమని త్యాగం చేస్తాడు. విషయం తెలిసిన హీరోయిన్ హీరో అంత తేలిగ్గా మారలేకపోతుంది. తర్వాతేమైంది అన్నది మిగిలిన కథ.

ఈ సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ కథేం లేదు. ముగింపొక్కటి కాస్త ఉన్నంతలో రొటీన్ కి భిన్నంగా ఉంది. హీరో ప్రసన్న నటన గురించీ, హీరోయిన్ ఉదయతార నటన గురించీ పెద్ద చెప్పుకోడానికేమీ లేదు. అంతా రొటీన్. డైలాగులు కూడా పెద్ద గొప్పగా ఏమీ లేవు. పాటలు – మర్చిపోదగ్గవి. ఒకట్రెండు మినహా రెండోసారి వినాలనిపించేలా కూడా అనిపించలేదు. తమిళ్ నేటివిటీకి తెలుగు జీవితానికీ మధ్య ఉన్న అంతరం వల్లనేమో. సినిమా లో చాలా భాగం మనుష్యులు ఏడుస్తూనో, తమలో తాము కుమిలిపోతూనో ఉంటారు. అంత సీరియస్ సీన్లలో కూడా కొన్ని చోట్ల దర్శకుడి “తెలివి తేటలకి” నవ్వాగలేదు. ఇక సినిమాలో వడివేలు పాత్ర-కామెడీ పరంగా పర్వాలేదు కానీ, అసలు సినిమాలోని ఏ పాత్రతోనూ సంబంధం లేని ఈ పాత్ర ఎందుకు సినిమాలోకి వస్తూ పోతూ ఉంటుందో అర్థం కాలేదు. ఒకట్రెండు సార్లు పర్వాలేదు కానీ, సంబంధం లేకుండా అస్తమానం అలా వస్తూ పోతూ ఉండటం చిరాకు పుట్టింది.

ఇదొక సాధారణ తమిళ సినిమా. అంతే. బస్సులో వెళ్తున్నప్పుడు అందులో ఓ సినిమా వేస్తే ఎలా చూస్తామో అలా చూస్తే చాలు. అంతకంటే ఎక్కువ ఆలోచించనక్కర్లేదు ఈ సినిమా గురించి. టైంపాస్ కాక టీవీ పెట్టగానే rgv ki aag సినిమా వచ్చినా కూడా, పక్కన మంచి కంపెనీ ఉంటే దాన్ని కూడా చూడ్డానికి ప్రయత్నించొచ్చు. ఇది కూడా అలా కామెడీగా చూసుకోవచ్చు. అంతకు మించి అడుగు ముందుకేయడం కష్టం. అయినా, ఎందుకు రాస్తున్నానూ అంటే, మొదట్లో చెప్పిన కారణమే కాక, ఈ సినిమా గురించి తెలీక మీరు చూసేస్తారేమో అని.ఏక్తా కపూర్ సీరియల్ లా ఉంటుంది. ఆపై మీ ఛాయిస్.

11 Comments
  1. sri August 16, 2008 /
  2. Sowmya August 17, 2008 /
  3. lucky August 17, 2008 /
  4. Sowmya August 17, 2008 /
  5. Sowmya August 17, 2008 /
  6. lucky August 17, 2008 /
  7. lucky August 17, 2008 /
  8. అబ్రకదబ్ర August 18, 2008 /
  9. chowdary March 16, 2009 /