Menu

హెల్ బాయ్ (2004)

పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత తరం సూపర్ హీరోలు కొత్త రక్తం నింపుకుని నూతనోత్సాహంతో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నారు. అయితే ఇలా క్రియేషన్, రీ-క్రియేషన్ సైకిల్ లో వచ్చిన ఒక నవ సూపర్ హీరో ’హెల్ బాయ్’.

ఇంతకీ అసలు ఎవరీ  హెల్ బాయ్?:ఈ సూపర్ హీరో పేరు లోనే బాలుడున్నాడు కాబట్టి ఇప్పుడున్న సూపర్ హీరోలందరిలో చిన్నవాడు ఈ హెల్ బాయే అనుకుంటా. ఈ బాలుడి సృష్టికర్త మైక్ మిగ్నోలా. చాలామంది సూపర్ హీరోలకి మల్లే ఈ సూపర్ హీరో కూడా ముంద కామిక్ పుస్తకాల ద్వారా పరిచయమయినా ప్రాణం పోసుకుంది మాత్రం నవతరం సినీ మాంత్రికుడు Guillermo del Toro చేతిలో.

హల్ బాయ్ కథా కమామీసు: ఈ సినిమా కథ 1944 లో స్కాట్ ల్యాండ్ లో మొదలవుతుంది.ప్రపంచ దేశాలన్నింటినీ తన అదుపులోకి తెచ్చుకొని ప్రపంచాధిపతి కావలన్న హిట్లర్ ప్రోత్సాహంతో నాజీ సైనికులు రస్పుటిన్ మాంత్రికుని సాయంతో ప్రాజెక్ట్ రగ్న రోక్ మొదలుపెడ్తారు. ఈ ప్రాజెక్టు లో భాగంగా క్షుధ్ర శక్తులను (Ogdru Jahad-the Seven Gods of Chaos) ఆవాహన చేసి వాటి సాయంతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయాలని తలుస్తారు. కానీ వారి ప్లాన్ సక్రమంగా జరగకుండా అడ్డుపడతాడు Trevor Bruttenholm అనే ప్ర్రొఫెసర్. అమెరికన్ పారా నార్మల్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ సంస్థ అధ్యక్షుడైనా ఈయన ఆర్మీ సాయంతో రగ్న రోక్ ప్రాజెక్టు సక్రమంగా జరగకుండా ఆపినా రస్పుటిన్ తలపెట్టిన ఆవాహనా కార్యక్రమంలో నరకంలోనుంచి ఊడిపడతాడు హెల్ బాయ్ (అసలు పేరు అనుంగ్ యున్ రామ). నిజానికి హెల్ బాయ్ ఒక క్షుధ్ర శక్తి అయినప్పటికీ బాలుడిగా వున్న హెల్ బాయ్ ని Bruttenholm తన ఆదీనంలోకి తీసుకుని  తండ్రిలా పెంచుతాడు. అప్పట్నుంచీ Bruttenholm కు పారానార్మల్ రీసెర్చ్ లో సహాయం చేస్తూ ప్రపంచంలోని క్షుధ్ర శక్తులపై పోరాటం జరుపుతుంటాడు హెల్ బాయ్.

రగ్న రోక్ ప్రొజెక్ట్ లో మరణించిన రస్పుటిన్ ని అరవై ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తారు అతని అనుచరులు. రస్పుటిన్ తిరిగి రావడంతో అతని ఆగడాలు మళ్ళీ మొదలుపెడతాడు. రగ్న రోక్ ప్రొజెక్ట్ లో సాధించలేనిది ఈ సారి ఎలాగైనా సాధించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ ప్రయత్నాల్లో Bruttenholm ని చంపేస్తాడు రస్పుటిన్. రస్పుటిన్ మరియు అతని ఆగడాలను హెల్ బాయ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.

సినిమా గురించి:”What makes a man a man? A friend of mine once wondered. Is it his origins? The way he comes to life? I don’t think so. It’s the choices he makes. Not how he starts things, but how he decides to end them.” తో మొదలయ్యి “What truly makes a man is, not how he starts things, but how he decides to end them.” తో సినిమా ముగిసే వరకూ అద్భుతమైన విజువల్స్ తో, గ్రాఫిక్స్ తో కూడి యాక్షన్ సీక్వెన్సెస్ తో చకచకా నడిచిపోయే కథనం తో ఉన్న ఈ సినిమా యాక్షన్, ఫాంటసీ సినిమాలు నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుందని నా నమ్మకం.

Genre bending సినిమాగా ఈ హెల్ బాయ్ ని వర్ణించవచ్చు. కుప్పలు తెప్పలుగా వస్తున్న సూపర్ హీరో మరియు ఫాంటసీ సినిమాల మూస ధోరణి లో కాకుండా అద్వితీయమైన శైళితో రూపొందిన ఈ సినిమా తప్పక చూడాల్సిందే. అలా అని ఇది ఒక మాస్టర్ పీస్ అని పొగడడం లేదు కానీ ఈ సినిమాలో ఉన్న తప్పులు మొదటి సినిమా కాబట్టి క్షమించి వదిలేయొచ్చని మాత్రమే చెప్తున్నాను.

Guillermo del Toro కాకుండా మరెవరి చేతిలోనయినా అయితే ఈ పాత్ర ఈ సినిమాలో చూపించినంత అద్భుతంగా రూపొందకపోయుండొచ్చేమో. Pan’s Labarynth సినిమాతో ప్రపంచ ప్రేక్షకులకు దగ్గరయిన Guillermo ప్రస్తుతం వున్న దర్శకుల్లో ఒక అద్వితీయ ధృక్కోణం కలిగినవాడిగా చెప్పుకోవచ్చు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి ఫాంటసీ సినిమాలకు దర్శకత్వం వహించిన పీటర్ జాక్సన్ తన రింగ్స్ ట్రైలజీ కి ప్రీక్వెల్ గా నిర్మించే The Hobbit సినిమాకి దర్శకత్వం వహించడానికి Guillermo ఎన్నుకున్నాడంటే Guillermo దర్శకత్వ ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. అది కాకపోయినా హెల్ బాయ్, పాన్స్ లాబరింథ్ సినిమాలు చూసిన వారెవరైనా Guillermo ప్రతిభ ను గుర్తించవచ్చు.

తన సినిమాల గురించి Guillermo ఈ విధంగా చెప్పారు.

“That’s what I love about fairytales; they tell the truth, not organised politics, religion or economics. Those things destroy the soul,” claims Del Toro. “That is the idea from Pan’s Labyrinth and it surfaces in Hellboy and, to some degree, in all my films.”

“I don’t think it’s a conscious decision, it’s a proclivity, a compulsion.

ముగింపు: బ్యాట్ మ్యాన్ సినిమా ’డార్క్ నైట్’ తో పాటు విడుదలయిన ’హెల్ బాయ్-2’, డార్క్ నైట్ అంత గొప్ప హిట్టుకాకపోయినప్పటికీ కళాత్మక సినిమాలు, ఫాంటసీ సినిమాలు నచ్చే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చింది.మొదటి సినిమాతో పెద్దగా పాపులర్ కాలేకపోయినా కేవలం రెండు సినిమాలకే హెల్ బాయ్ ఒక కల్ట్ ఫేవరేట్ కావడంలో ఆశ్చర్యం లేదు. ఒక వేళ ఈ సీరీస్ లో మరో సినిమా అంటూ వుంటే అది Guillermo నే తియ్యాలని నా ఆకాంక్ష.

PS: హెల్ బాయ్ 2 : ది గోల్డన్ ఆర్మీ రివ్యూ కోసం రేపు నవతరంగం కి తిరిగిరండి.

2 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి August 22, 2008 /
  2. అబ్రకదబ్ర December 30, 2008 /