Menu

Hazaaron Khwaishein Aisi (2005)

కొనాళ్ళ క్రితం ఈ సినిమా చూసాను. ఎప్పట్నుంచో వినడమే కానీ, చూసిందే లేదు. ఇన్నాళ్ళకి అవకాశం చిక్కింది. “హజారో ఖ్వాహిషే ఐసీ” (ఇలాంటి వేల కలలు) డెబ్భైల నాటి యువత జీవితాల ఆధారంగా తీసిన సినిమా. మన సినిమాల్లో ఇలాంటివి రావడం చాలా అరుదు. ఈ సినిమా దర్శకుడు సుధీర్ మిశ్రా గురించి చదువుతూ ఉంటే తెలిసింది, అతను ఈ తరహా కథాంశాలతో సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడని.

సినిమా కథ విషయానికొస్తే ఇది ప్రధానంగా – సిద్ధార్థ్(కేకేమీనన్ ), విక్రం(షైనీ అహూజా), గీతా (చిత్రాంగదా సింగ్) అన్న మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురూ కాలేజీ విద్యార్థులుగా ఉన్నప్పుడు మొదలై, ఆ తరువాత వాళ్ళ జీవితాలెలా మలుపులు తిరిగాయి, అప్పటి ప్రభుత్వం ఎమర్జెన్సీ వల్ల వాళ్ళ జీవితాల్లో కలిగిన కుదుపులూ – ఇదీ ఈ చిత్ర కథాంశం. సిద్ధార్థ్ ధనవంతుల కుటుంబం లో పుట్టి, విప్లవం ప్రభావం లో, సంఘాన్ని మార్చాలన్న ఆరాటం లో, నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడై ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. గీత కి సిద్ధార్థ్ అంటే ఇష్టం, విప్లవ భావాలంటే గౌరవమూ ఉన్నా కూడా, ధైర్యం చేయలేక, వేరొకరిని పెళ్ళి చేసుకుంటుంది. అయినా కూడా, వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంటుంది. విక్రం ఓ గాంధేయవాది కొడుకు. కానీ, అతనికి బాగా డబ్బు సంపాదించాలనీ, జీవితం లో విజయవంతం అవాలనీ కోరిక. దానికోసం అతను ఏ దారిలోకి వెళ్ళేందుకైనా సంకోచించడు. ఇతనికి కాలేజీ రోజుల్నుంచీ గీత అంటే ఇష్టం. కొన్నాళ్ళకి గీత తన వివాహ బంధం తెంచుకుని సిద్ధార్థ్ లాగే బీహార్ లోని భోజ్పూర్ గ్రామానికి వచ్చేసి, అక్కడ సమాజ అభివృద్ధి కోసం పని చేస్తూ ఉంటుంది. కొడుకు పుడితే, తన తల్లిదండ్రులకి అప్పజెప్పేసి ఈ పనిలో ఉండిపోతుంది. విక్రం రకరకాల దారుల్లో ధనవంతుడౌతూ పరపతి కూడా పెంచుకుంటాడు. సిద్ధార్థ్ ఉద్యమంలో కొనసాగుతాడు.

ఈ సినిమా డెబ్బైల నాటి యువత ఆలోచనా విధానాన్ని చూపే ప్రయత్నం చేసింది.మూడు ప్రధాన పాత్రల్లో ఒక్కోటీ ఒక్కో తరహా మనుష్యుల్ని ప్రతిబింబించాయి. సినిమా ఆద్యంతమూ సీరియస్ కథే అయినప్పటికీ ఎక్కడా బోరు కొట్టదు సరికదా, ఆసక్తికరంగానే ఉంటుంది. కేకేమీనన్, చిత్రాంగదా సింగ్ – ఇద్దరూ బాగానే చేసినప్పటికీ, ఈ సినిమా చూశాక మనకు బాగా గుర్తుండిపోయే నటుడు షైనీ అహూజా. ఇది అతని మొదటి సినిమా అయినప్పటికీ, చాలాకాలంగా నటిస్తున్న వాడిలా చేశాడు. ఎమర్జెన్సీ సమయం నాటి సీన్లు చూస్తూ ఉంటే, నాకు అప్పటి పరిస్థితుల గురించి చదివిన వ్యాసాలు దృశ్యాలై కదలాడిన భావన కలిగింది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, విప్లవకారుల అరెస్టులు, వృద్ధ నాయకుల అరెస్టులు, సంజయ్ గాంధీని పోలిన పాత్రా, అక్కడి సంభాషణలూ – వగైరా దృశ్యాలు చూస్తూ ఉంటే కుల్దీప్ నయ్యర్ రాసిన “తీర్పు” పుస్తకం గుర్తు వచ్చింది. అప్పటికి నేను పుట్టలేదు కనుక, పుస్తకాలే నాకు రియాలిటీ అప్పటి చరిత్రకి సంబంధించినంతవరకూ. అందుకే వాటితో పోలిక. మొత్తానికి ఇందిరాగాంధీ పాలన కాలం నాటి యువతరం జీవిత చిత్రం అనుకోవచ్చు.

ఇందులోని మూడు ప్రధాన పాత్రల్లో నాకు “అసలు” యువతరం కనబడలేదు నిజానికి. అసలు అంటే, నూటికి తొంభై శాతం మంది యువత మైండ్ సెట్. వీళ్ళు ముగ్గురూ మూడు రకాల మనస్తత్వాల్ని మనకు చూపిస్తారు కానీ, అసలు అప్పటి యువత చాలావరకు చిత్రాంగదా సింగ్ పాత్రలోని conflict కీ, అహూజా పాత్రలోని ఆ “ఎలాగైనా ఎదగాలన్న” కోరికకీ ఎక్కువ దగ్గరగా ఉండేదేమో అనిపిస్తుంది. ఆ రెంటి కాంబినేషన్ సగటు యువత అని నా ఊహ. అప్పటి వారు చెప్పాలి నా ఊహలోని నిజానిజాలు. నిజానికి ఈ సినిమాని నాబోటి వారు చూస్తే ఆ కాలాన్ని గురించి అవగాహన ఎలా కలుగుతుందో, అప్పట్లో యువతరంగా ఉన్న ఇప్పటి తల్లితండ్రుల తరం చూస్తే, వారిలో అలాగే పాతకాలంనాటి జ్ఞాపకాలు కలగకమానవు. ముగింపు మాత్రం నాకు నచ్చలేదు. బహుశా, సినిమా ముగిసే సమయానికి షైనీ అహూజా మీద ఏర్పడ్డ అభిమానం వల్ల కావొచ్చు. కానీ, కథాపరంగా కూడా అలాంటి ముగింపు కథకి దోహదపరచేది ఏమిటో నాకు అర్థం కాలేదు.

మొత్తానికి ఈ చిత్రం ఎన్నో సామాజిక అంశాలని కూడా స్పృశించింది. డెబ్భైలనాటి రాజకీయ,సామాజిక చిత్రం తెలుసుకోవాలంటే, పుస్తకాలతో పాటు ఈ సినిమా చూడటం కూడా ముఖ్యం. షైనీ అహూజా కోసం రెండు మూడు సార్లు చూడొచ్చు. దర్శకత్వం కోసం కూడా. దర్శకుడు సుధీర్ మిశ్రా తో ఓ ఇంటర్వ్యూ ఇక్కడ. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని, మన సినిమాల్లో ఇలా వాస్తవికతకి, సామాజిక స్పృహకీ కూడా తగిన స్థానం ఉండాలని – అనిపిస్తోంది ఈ సినిమా చూస్తూ ఉంటే. మీరు ఇంకా చూడకపోతే తప్పక చూడదగ్గ సినిమా హజారోన్ ఖ్వాహిషే ఐసీ.

3 Comments
  1. Srinivas August 26, 2008 /
  2. Srividya August 26, 2008 /