Menu

El baño del Papa:ఈ నెల సినిమా

పరిచయం:ముప్పై లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే దేశంలో సంవత్సరానికి పది కంటే తక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నా గత కొద్ది సంవత్సరాలలో ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉరుగ్వే సినిమాలు ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకున్నాయి. ఉరుగ్వే నుంచి వచ్చిన అన్ని సినిమాలు చూడదగ్గవి కాకపోయినా Whisky మరియు 25 Watts సినిమాలు మాత్రం ఇటీవలి కాలంలో ఈ దేశం నుంచి వచ్చిన మంచి సినిమాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు El baño del Papa 2007 లో వచ్చిన కొన్ని మంచి సినిమాల్లో ఒకటి.ఈ సినిమా కూడా లండన్, టోరంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా చాలా చిత్రోత్సవాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది.

ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదవండి.

కథ: El baño del Papa అంటే The Tolilet of the Pope అని అర్థం. ఉరుగ్వే లో 1980లలో జరిగిన ఒక సంఘటన అధారంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. ఉరుగ్వే లోని ఒక చిన్న టౌన్ అయిన మెలో (Melo) లో నివసించే బెటో(Beto) మరియు అతని స్నేహితులు దగ్గర్లో ఉన్న బ్రెజిలియన్ టౌన్ నుంచి వస్తువులు స్మగ్లింగ్ చేసి మెలో లోని వర్తకులకు అమ్మి తమ జీవితాలు కొనసాగిస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వూరికి Pope వస్తున్నారని టి.వి లో చెప్పిన వార్తల ద్వారా తెలుస్తుంది.

టివి లో ప్రతి రోజూ ’త్వరలో వస్తున్న పోప్’, ’పోప్ సభకు వేల సంఖ్యలో హాజరుకానున్న ప్రజలు’ అంటూ ఊదరగొట్టేస్తున్న వార్తలు చూసి Melo పట్టణ వాసులకు కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. ఈ వార్తలు రోజు రోజుకీ ఎక్కువవుతుండడంతో ఊరి జనాలందరూ ఆ రోజు వస్తున్న వేల మంది జనాలకు ఏమేం అమ్మి సొమ్ము చెసుకోవచ్చో అని ఆలోచించి, తమకున్న కొద్దో గొప్పో ఆస్తులన్నీ అమ్మో, తాకట్టుపెట్టో కొందరు తిను బండారాలు, కొందరు పిల్లలాడుకునే వస్తువులు తయారు చేయడంలో మునిగిపోతారు.

ఊర్లో వారందరూ ఇలా ఆలోచిస్తుండగా బెటో మాత్రం వీళ్ళందరిలా ఏదో ఒకటి అమ్మడం కాకుండా కాస్తా వెరైటీగా ఆలోచించి, సభకు తరలివచ్చే జనాల కోసం ఒక టాయిలెట్ నిర్మించి అది ఉపయోగించుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దామనుకుంటాడు. టాయిలెట్ నిర్మాణంలో బెటో పడ్డ శ్రమ, ఆ తర్వాత పోప్ వచ్చి ఆ వూరి వారి జీవితాల్ని ఎలా మార్చివేశాడు అన్నది ఈ సినిమాలోని ముఖ్య కథాంశం.

విశ్లేషణ: పేద దేశమైన ఉరుగ్వే నుంచి వచ్చిన సినిమా అయునప్పటికీ సాంకేతికంగా ప్రపంచ దేశాల ఉత్తమ సినిమాల నాణ్యత కలిగిన ఉన్న ఈ సినిమా అన్ని విధాలుగా ’రిచ్’ గానే ఉందని చెప్పవచ్చు.స్క్రీన్ ప్లే రచయిత  Enrique Fernández , సినిమాటోగ్రాఫర్ César Charlone లే ఈ సినిమాకి దర్శకులు కూడా.

ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అన్నిటికంటే చాలా బావుంటుంది.అందుకు కారణం César Charlone. ఈయన పేరు మీరు వినుండుకపోవచ్చు కానీ City of Gods సినిమాకి ఈయనే సినిమాటోగ్రఫీ చేశారు. అలాంటి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలో సినిమాటోగ్రఫీ ఎలా వుంటుందో చెప్పనక్కర్లేదు.

ఈ సినిమా లో నటుల గురించి తప్పక ప్రస్తావించాలి. ఎవరో ఒకరిద్దరు ప్రెఫెషనల్ నటులు తప్పితే ఈ సినిమాలో నటించిన మిగిలిన వాళ్ళంతా సామాన్య ప్రజానీకమే. అందుకే ఒక విధంగా ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా కూడా వుంటుంది.

ఒక సినిమా ద్వారా ఒక దేశం గురించి, ఆ దేశ పరిస్థుతుల గురించి ప్రపంచానికి ఎలా తెలియచేయవచ్చో అనడానికి ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ.

ముగింపు:ఉరుగ్వే సినిమాలకి బడ్జెట్ చాలా తక్కువ. సినిమాల్లో నటించే నటులూ, పని చేసే సాంకేతిక నిపుణులూ చాలా సార్లు వుచితంగానే పనిచేస్తారట. ఇవన్నీ ఆ సినిమా మొదలయ్యే ముందు లండన్ చిత్రోత్సవంలో ఆ దర్శకుడే స్వయంగా చెప్పాడు. దాంతో పాటు ఆయన చెప్పిన మరో విషయం నన్ను కదిలించి వేసింది. ఆయన తన సినిమా లండన్ చలనచిత్రోత్సవానికి ఎన్నిక కావడం గురించి కృతజ్ఞతలు చెప్తూ, “ఇందాక ఇక్కడికి వస్తుంటేనూ, ఈ చల్లని సాయంత్రం, దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు, చుట్టూ లండన్ నగరం చూసి నాకు చాలా దిగులేసింది. నేను దర్సకుణ్ణి కాబట్టి ఇక్కడి వరకూ రాగలిగాను. నాలాగే నాతో పాటు ఈ సినిమాకి పని చేసిన వాళ్ళందరూ ఈ అందమైన నగరంలో ఇక్కడుండుంటే ఎంత బావుండేదో అని అనిపిస్తుంది. కానీ అది కుదరదని నాకు తెలుసు. ఎందుకంటే మేము పేద వాళ్ళం.” అనడంతో నాకు చాలా బాధ కలిగింది.

ఈ సినిమా మాస్టర్ పీస్ అనటం లేదు కానీ చూసి ఆనందించడమే కాకుండా religion, mass-media లాంటి అంశాల గురించి ఆలోచనలు రేకెత్తించే సినిమా. వీలయితే తప్పక చూడండి.

3 Comments
  1. ravi August 8, 2008 /