సినిమాల్లో “అవమానకర” దృశ్యాలపై వివాదాలు - ఒక చరిత్ర పుట

Aug 23rd, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: featuredleadభారతీయ సినిమావిశ్లేషణ

ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక దృశ్యం, ఒక సమూహం వారినో, కులం వారినో, వర్గం వారినో అవమానపరిచే విధంగా ఉండి, వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని రోడ్డుకెక్కడం, నిరసనలు ప్రదర్శించడం ఆనవాయితీగా మారిపోయింది. ఉదాహరణకు ‘రెడీ’ లో కూచిపూడి నాట్యాచార్యులు. ‘కంత్రి’ తో దళితులు. ‘గోరింటాకు’ తో వికలాంగులు మొ”. కొన్ని సంఘటనల్లో ఇవి చాలా సహేతుకమైన స్పందనలనిపించినా, అప్పుడప్పుడూ రాజకీయ ఉద్దేశాలూ, సినిమా ప్రమోషన్ కిటుకులుగా కనపడటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో, ఇలాంటి తంతు మన తెలుగు సినీరంగానికి కొత్తేమీ కాదని నిరూపించే ఒక వ్యాసం నా కంటబడింది. 1951 మే నెలలో యు.వి.కామేశ్వర రావు గారు రాసిన వ్యాసాన్ని ఇక్కడ సమాచారం కోసం పొందుపరుస్తున్నాను. ఈ వ్యాసం ‘అన్వేషి రిసెర్చ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్’,హైదరాబాద్ వారు (1999 లో) ఒక వర్క్ షాప్ కోసం ప్రచురించిన సంకలనంలో నాకు లభించింది.

————————————————————————————-

భ్రమ

“వైశ్య జాతికే తీరని కళంకం తేగల న్యూనతపరచే అవమానకర దృశ్యాలను షావుకారు చిత్రం నుంచి తొలగించడం న్యాయం ధర్మం కాదంటారా? ఒక జాతిని తన చిత్రంలో అవమానపరచడం మర్యాదా లక్షణమేనా?”- అంటాడు మిస్టర్ ఎం.ఆర్.ఆర్.గుప్త (మార్చి రూపవాణిలో)

శ్రీ బి.వి. రామానందము “గొల్లపిల్ల” అనే పిక్చరు నిర్మించపోతే రాజమండ్రి యాదవ సంఘము అసమ్మతితో “పెంకిపిల్ల”గా మారింది. ఏ జాతైనా తమ పూర్వ సంస్కృతి గురించి ఏహ్యభావం ప్రదర్శించరాదు. “గొల్లపిల్ల” అని పేరు పెట్టినంతమాత్రాన యాదవకులమున కొచ్చే కళంకం ఏమీ కనపడదు. భగవంతుని అవతారమైన శ్రీకృష్ణభగవానుడు యాదవవంశంలో జన్మించి ఆ జాతిని పునీతం చేసాడు. నేడు ఆయన్ని మనం దైవం క్రింద ఆరాధిస్తున్నాము. అయితే, ఈ ఈ యాదవ సంఘము వారు పి.పుల్లయ్యగారి “గొల్లభామ”తో ఏల జోక్యముకలుగ చేసుకోలేదు. ఈ నాడు ప్రతివారూ అంటే- చాకళ్ళు రజకులని, మేదర్లు మహేంద్రులని, పల్లెవారు అగ్నికుల క్షత్రియులని, సాలీలు దేవాంగులని, గొల్లలు యాదవులని మొదలయిన విధముగా పేర్లు మార్చుకుంటున్నారు. ఇందు తప్పులేదు. కాని తమ పూర్వ నామధేయము వుదహరింినంత మాత్రానా ఏహ్యభావమును ప్రకటించుట భావ్యము కాదు. ఈనాడు ఏ బ్రాహ్మణుని అయినను, “భూసురోత్తమా!” అంటే తోకతొక్కిన త్రాచులా పైకి లేస్తాడు. కాని ఆ పేరే ఒకప్పుడు శిఖరాగ్రముల నధిగమించిందని మనం మరువరాదు.

మన సోదరుడు “షావుకారు” చిత్రములో కొంత సెన్సారు చెయ్యాలంటాడు. అయితే “మాలపిల్ల” వుండకూడదని మాతంగులు, “షావుకారు” ఉండకూడదని వైశ్యులూ, వేశ్యవృత్తిని చూపకూడదని కళావంతులు నిర్మాతల మీద దండయాత్ర చేస్తే ఏం చెయ్యాలో, “తిలోత్తమ” నిర్మించిన రాజాసాహెబ్ పై బ్రాహ్మణులు, వైశ్యులు పరువునష్టందావా వెయ్యాలేమో! ఎందుచేతనంటే వైశ్యులకుండే ధనాశ, బ్రాహ్మణులను వెర్రి వెంగళాయులుగా చూపడంవల్ల.

కాని సంఘంలో వున్న కుళ్ళు బయటపెట్టాలంటే చిన్నచిన్న విషయాలికి మనం అడ్డురాకూడదు. ఇందుకు భయపడే నిర్మాతలు సాంఘిక చిత్రాలు తీయడానికి భయపడుతున్నారు- ఏ జాతి దావా తెస్తుందో అనే భయంతో. “భీష్మ”లో అగ్నికుల క్షత్రియులకు అవమానం జరిగిందని దావా వేసిన సంగతి పాఠక సోదరులకు గుర్తు వుందనుకుంటాను. నాయీ బ్రాహ్మణులకు (మంగళ్ళు) అవమానకరమైన దృశ్యం “పరమానందయ్య శిష్యులు”లో కలదని, దానిని తీసివెయ్యవలసిందని, మంత్రి శ్రీ మాధవ మీనన్ దగ్గరకు ఆ సంఘం పెద్దలు రాయబారాలు వెళ్ళారని అది త్రొసివెయ్యబడిందని తెలుస్తూంది. నిర్మాత కూడా తమ భాధ్యతను గుర్తెరిగి నిజమయిన సాంఘిక దురాచారాలనే చూపాలి. కాని వెర్రివెర్రి వేషాలు వేయించడం భావ్యం కాదు. పేరు పెట్టినంత మాత్రమున తమ గౌరవం పోతుందనుకోవడం వట్టి భ్రమ.

ఈనాడు కులములకు అర్థమువేరు. వర్తకము చేసే ఏ జాతివారైనా షావుకార్లే, చదువు చెప్పే ఎవరైనా పంతుళ్ళే. వ్యవసాయం చేసే ఎవరైనా కర్షకుడే. హెచ్.ఎం.రెడ్డిగారు “నిర్దోషి”లో అంజలీదేవి చేత (వేశ్య వేషంలో) పండిట్ రావును “ఏం పంతులుగారు” అనిపించాడు. దీన్నిబట్టి ప్రతి ప్రేక్షకుడు సినిమా ఆఖరు వరకు ఆ ఘటనలు ఏ జాతిలో జరిగాయో తెలుసుకోలేకపోయినా, యీ మాటలో యీ దురాచారమంతా బ్రహ్మణ సంఘములోనిదే అని గ్రహించుకుంటాడు. అయితే దీన్ని బట్టి రెడ్డిగారిని బ్రాహ్మణ సంఘము ధూషించాలా? లేక వకీలులో సధ్గుణాన్ని చూపినందుకు భూషించాలా?

- మే 1951

ట్యాగులు: ,

ఇవి కూడా చదవండి

బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం
రెండు చిత్రోత్సవాలు
అ .. ఇ .. మీ .. మూడు తెలుగు సినిమాలు!
బూతు చిత్రాలు -మరో సమానాంతర సినిమా!
హైదరాబాదు చలనచిత్రోత్సవం - కొన్ని సూచనలు

One comment
దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి. »

  1. మంచి సేకరణ మహేష్

దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.