Menu

ప్రజా రాజ్యం లో సినిమా

ఎనాళ్ళగానో ఊరిస్తూ వచ్చిన చిరంజీవి నిన్న ప్రజా రాజ్యం పార్టీని ప్రకటించారు. ఆయన ఎజెండా కూడా చెప్పేసారు. కానీ సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెడ్తున్న చిరంజీవి, తనకు ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యత, ప్రఖ్యాతి కలుగచేసిన సినిమా పరిశ్రమకు ఋణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. రేపటి రోజున ఎన్నికలలో గెలుపొంది చిరంజీవి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడితే సినిమా రంగానికి ఆయన చేయదగ్గ సేవలు ఎన్నో ఉన్నాయి. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా తమ పార్టీకి సినిమా పరిశ్రమకు చేయదగ్గ సేవల గురించి కూడా ఒక ఎజెండా ఉండడం ఎంతో అవసరం అని నా అభిప్రాయం.

ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో వచ్చిన ప్రభుత్వాలు కానీ మన సినిమా పరిశ్రమనుంచి మేలైన సినిమాలు రూపొందడానికి పెద్దగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో ముగ్గురు ప్రముఖుల(బి.యన్.రెడ్డి,ఎల్వీ ప్రసాద్, చక్రపాణి) శతజయంతి సంవత్సరం అయినప్పటికీ వారిని గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించిందనే చెప్పాలి. ఈ విధంగా సినీ పరిశ్రమకు చేయూతనందివ్వాల్సిన ప్రభుత్వాలు మనకు ఇప్పటివరకూ రాలేదు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలు, కళాత్మకమైన సినిమాలు రూపుదిద్దుకోవడంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం వుంది. అలాగే మన సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం వుంది.

సినీ పరిశ్రమలో ముప్పై ఏళ్ళకు పైగా పనిచేసిన వ్యక్తిగా చిరంజీవి అధికారంలోకి వస్తే సినీ రంగం అభివృద్ధికి ఆయన చేయతగ్గ సేవలు ఎన్నో ఉన్నాయి.అందులో కొన్ని ముఖ్యమైనవి :

 • ఇప్పుడు మన హెరిటేజ్ అయినటువంటి ఆనాటి ఆణిముత్యాలయిన మన తెలుగు క్లాసిక్స్ మూలపడిపోకుండా డిజిటల్ టెక్నాలజీ ద్వారా స్వస్థపరిచి పునరుద్ధరించడానికి ఒక సంస్థను నెలకొల్పాలి.
 • నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ తరహాలో కళాత్మక సినిమా నిర్మాణం చేపట్టే దర్శకులకు ఆర్థికంగా సహాయపడాలి.
 • మంచి సినిమాకి జీవం పోసే దిశలో కృషి చేస్తున్న హైదరాబాదు ఫిల్మ్ క్లబ్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లాంటి సంస్థలకు అన్ని విధాలా సహకారం అందించాలి.
 • కళాశాలలు, మరీ విశ్వవిద్యాలయాల్లో సినిమా, మీడియా కు సంబంధించిన కోర్సులు బోధించేలా చర్యలు చేపట్టాలి.
 • సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల వైపు ప్రజల దృష్టి మరల్చేలా ఆయా సామాజిక రుగ్మతలపై డాక్యుమెంటరీ సినిమాలు రూపొందించి వాటిని ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
 • ప్రస్తుతం హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ నిర్వహిస్తున్న చలనచిత్రోత్సవానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి.
 • ఎక్కడో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు పొందిన వనజ లాంటి తెలుగు చిత్రాలు మన రాష్ట్రంలో ప్రదర్శనకు నోచుకోలేకపోవడం లాంటి పరిస్థుతులు చోటు చేసుకోకుండా ప్రభుత్వమే ఇలాంటి సినిమాల పంపిణీ మరియు ప్రదర్శన బాధ్యతలు చేపట్టాలి.
 • ప్రతి సంవత్సరం చలనచిత్రాలకు అందచేసే అవార్డులు కళాత్మక విలువలకు ప్రాముఖ్యం ఇచ్చేలా, అలాగే విజేతలకు సరైన ప్రోత్సాహం కలుగచేయాలి.
 • సినిమాకి సంబంధించిన వివిధ సావనీర్, మెమరబిలియా తో ఒక మ్యూజియం, ప్రపంచ చలనచిత్ర చరిత్ర, సాంకేతిక నైపుణ్యం,చలనచిత్ర ప్రక్రియలోని వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, ప్రపంచ దేశాలనుంచి ఎన్నుకున్న ముఖ్యమైన సినిమాల DVDలతో కూడుకున్న ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం.అలాగే  ప్రస్తుతం ఉన్న గ్రంధాలయాలను ఆధునీకపరచడమే కాకుండా ప్రతి లైబ్రరీలో CD/DVD లు, సినిమాకి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేయడం.
 • బ్రిటన్, అమెరికా లాంటి దేశాల మాదిరిగా ప్రభుత్వం ఒక సినిమా అభివృధ్ధి సంస్థను నెలకొల్పి ద్వారా పైన పేర్కొన్న అంశాలను అమలు పర్చాలి.

తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా మన తెలుగు సినిమా మన సరిహద్దులు దాటి వెళ్ళటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన చిరంజీవి అధికారం చేపడ్తే పైన పేర్కొన్న అంశాలను అమలు చేయడం ద్వారా మన సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో సాయపడినవారవుతారు.

ఒక్క ప్రజారాజ్యమే కాదు, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా తాము అధికారంలోకి వస్తే పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకి మంచి భవిష్యత్తుని ప్రసాదించిన వారవుతారని నా అభిప్రాయం.

3 Comments
 1. Maadina.Ramakrishna September 4, 2008 /
 2. గీతాచార్య October 9, 2008 /