Menu

బచ్నా యే హసీనో

పరిచయం:వారం వారం ప్రజల మెదళ్ళు మొద్దుబార్చే కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయిన యశ్‍రాజ్ ఫిల్మ్ నుంచి వచ్చిన మరో కళాఖండం బచ్నా యే హసీనో. మన దేశపు సినిమాలు మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో సెటప్ చేయడం బాగా పాపులర్ చేసిన యశ్‍రాజ్ ఫిల్మ్స్ తరహాలో బాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాలను తీయడం వెనుక కారణాలేంటో తెలియదు కానీ ప్రతి వారం ఒక్కో దేశం చూసి చూసి జనాలకు విసుగొచ్చే పరిస్థితి వచ్చేసింది. మిగిలిన వాళ్ల సంగతి తెలియదు కానీ నాకయితే (బాలీవుడ్ సినిమాల పుణ్యం) స్విట్జర్లాండ్ లోని ఆల్ప్ పర్వతాలు రోజూ చూసే మావూరి చెరువుగట్టు ను చూసినంత సుపరిచతమయిపోయాయి. పోయిన వారం ఆస్ట్రేలియా, ఈజిప్టు చూసి ఇలా ఊపిరి పీల్చుకునే లోపే, ఈ సారి ’బచ్నా యే హసీనో’ సినిమా ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఒకే సారి మూడు దేశాలు (మన భారతం కాకుండా) చూపించే ప్రయత్నం చేసారు యశ్‍రాజ్ ఫిల్మ్ వాళ్ళు.

కథ: ఇక కథలోకి వస్తే, ఇది మరీ రొటీన్ బాలీవుడ్ కథ కాకపోయినా పెద్ద వైవిధ్యభరితమైనదీ కాదు.తన జీవితంలో ముగ్గురు అమ్మాయిలతో రాజ్[రణ్బీర్ కపూర్] జరిపిన ప్రేమ కలాపాలు ఈ సినిమా కథ ముఖ్యాంశం.

కాలేజీ ముగించుకుని హీరో రాజ్ శెలవుల్లో స్విట్జర్లాండ్ కి వెళ్తాడు. అక్కడ మాహీ[మినిషా లాంబ] అనే అమ్మాయి తో పరిచయం ఏర్పడుతుంది.DDLJ సినిమాలో రాజ్ లాంటి హీరో తన జీవితంలోకీ రావాలని ఎదురుచూస్తున్న మాహీ ఈ రాజ్ లో ఆ రాజ్ ని చూసి మనసు పారేసుకుని ఒక రాత్రిలో అతనితో ప్రేమలో పడిపోతుంది. కానీ రాజ్ ఈ విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోడు సరికదా, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ’one night stand’ గా ఆ ప్రేమ కథకు ఫుల్ స్టాప్ పెడతాడు. ఇది 1996 లో జరుగుతుంది.

ఆ తర్వాత 2002 లో పక్కింటి అమ్మాయి రాధిక[బిపాషా బసు]తో పరిచయం పెంచుకుంటాడు రాజ్. ఆమెని ప్రేమలోకి దించి ఆమె తో చాలా రోజులపాటు ’Live-In relationship’ కూడా కొనసాగించి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆమెకి చెప్పాపెట్టకుండా సిడ్నీ వెళ్ళిపోయి మరో అమ్మాయికి అన్యాయం చేస్తాడు.

సిడ్నీలో వుండగా రాజ్ కి పరిచయమవుతుంది దీపికా. ఆమె ఎంబియే చదువుతూనే టాక్సీ నడుపుతూ, షాపులో పని చేస్తూ వుంటుంది. అలాంటి అమ్మాయితో సీరియస్ గా ప్రేమలో పడతాడు రాజ్. దీపిక పరిచయంతో అప్పటివరకూ తను చేసిన తప్పులు తెలుసుకుంటాడు రాజ్. తన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇండియా బయల్దేరి మాహీ దగ్గర, ఇటలీలో వున్న రాధిక దగ్గర తన తప్పు తెలియచేసి క్షమాపణలు చెప్పి ఆస్ట్రేలియా తిరిగివచ్చి దీపిక ప్రేమను సాధించడంతో కథ సుఖాంతమవుతుంది.

విశ్లేషణ: సినిమాలో మాహి-రాజ్ ల మధ్య జరిగే ఎపిసోడ్స్ DDLJ నుంచి, తప్పు తెలుసుకొని మాజీ ప్రియురాళ్లను కలుసుకొనే అంశం ’Broken Flowers’ సినిమా నుంచి, ఇటలీలో బిపాసా బసు-రణ్బీర్ మధ్య సన్నివేశాలు Devil Wars Prada నుంచి ఎత్తివేసిన సీన్లు కాగా సంగీతం పాత సినిమాల నుంచి మోసుకొచ్చాక ఈ సినిమాలో పెద్దగా ఒరిజినాలిటీ ఏమీ లేదు. కానీ ’One Night Stands’, ‘Live-In relationships’ లాంటి ప్రొగ్రెసివ్ థాట్స్ ఈ సినిమాలో ఉండడం, అలాంటి సినిమాలు ప్రేక్షకులు చూసి ఆనందించి సినిమాని హిట్టు చెయ్యడం బాలీవుడ్ అభివృద్ధి పథాన నడుస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి బోల్డ్ థీమ్స్ తో బోలెడు సినిమాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

సినిమా మొదలవడమే ఒక పాట. ఆ పాటలో ముగ్గురు హీరోయిన్లతో హీరో పాట. ఒకప్పుడు మన సినిమాల్లో పాటలు అర్థాంతరంగా వచ్చినా ఎంతో కొంత కథలో ఇమిడిపోయేది (డ్రీమ్ సీక్వెన్స్, క్లబ్బులో పాట, ప్రేమ వ్యక్తపరచడం ఇలా..). కానీ ఈ సినిమాలో మనకి అసలు పాత్రల పరిచయమైనా కాకముందే హీరో తనతో పరిచయమయినా లేని ముగ్గురు హీరోయిన్స్ తో డ్యాన్సులాడడం బాలీవుడ్ లోనే సాధ్యమనుకుంటా.

ఇక మొదటి సీన్ తో మొదలుపెట్టి చివరి ఫ్రేముదాకా వీడే మీ కొత్త సూపర్ స్టార్ అనే రుద్దుడు కార్యక్రమం తో హిప్నటైజ్ అయిపోయిన ప్రేక్షకులు రణ్బీర్ ని త్వరలో మరో సూపర్ స్టార్ గా అంగీకిరస్తారనడంలో ఆశ్చర్యం లేదు.  దానికి తోడు సిక్స్ ప్యాక్ బాడి, అది చూపిస్తూ బట్టలిప్పి తిరుగడం.ఇదంతా చూస్తుంటే, ‘Ranbir will become a classic example of manufactured matinée idol’ అనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ పరంగా ఫారిన్ లొకేషన్స్ ని బాగానే క్యాప్చర్ చేశారు. దర్శకత్వ పరంగా పెద్ద వైవిధ్యం ఏమీ వుండదు. స్క్రీన్ ప్లే కూడా అంతే. కంటి రెప్ప చేతి మీద పెట్టుకుని వరం కోరడం, ఆకాశంలో నక్షత్రాల గురించి ప్రేమికుల చర్చ లాంటి తరతరాల బాలీవుడ్ క్లీషే లతో సినిమా మొత్తం నిండిపోయి వుంది.సంగీతం లో ఏమీ కొత్తగా లేదు.

ఇక హీరోయిన్ల సంగతికొస్తే బిపాసా హీరోకి సరి జోడు కాదు. వయసు కనిపించిపోతుంది. దీపిక రెండో సినిమాకే బోరుకొట్టేసేలా వుంది. మినిషా అవసరానికి మించిన మేకప్ తో ఎబ్బెట్టుగా వుంది. ఇక యశ్‍రాజ్ ఫిల్మ్స్ లో వుండే సర్ప్రైజ్ యాక్టర్ ఇందులోనూ వున్నారు. షారూక్ కి సల్మాన్, అక్షయ్ లలాగా, మినీ సూపర్ స్టార్ రణ్బీర్ కి మరో చిన్ని సైజు స్టార్ ఈ పాత్ర పోషించాడు.

ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే కమర్షియల్ సినిమాలు మీకు ఇష్టమై వుండి, ఏం చెయ్యాలో తెలియనంత టైమ్ దండిగా వుండి వుంటే ఈ సినిమా చూడొచ్చు.

ముగింపు:ఈ సంవత్సరంలో విడుదలయిన బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో హిందీ సినిమాల క్వాలిటీ మరింత దిగజారుతుందే తప్ప మెరుగుపడే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ సంవత్సరం విడుదలై హిట్టయ్యాయనిపించుకున్న సర్కార్ రాజ్, జానే తూ యా జానే నా, కిస్మత్ కనెక్షన్, జన్నత్ లాంటి సినిమాల్లో సైతం పెద్దగా ఎటువంటి వైవిధ్యం లేకపోగా అసలీ సినిమాలు అంతటి విశేష ప్రేక్షకాదరణ ఎలా పొందాయన్న అనుమానం కూడా వస్తుంది. గత శుక్రవారం విడుదలయిన రెండు బాలీవుడ్ సినిమాల్లో ఒకటయిన ’బచ్నా…’ కూడా హిట్టే అంటున్నా పైన చెప్పినట్లే ఈ సినిమా హిట్టా? అని ఆశ్చర్యపడడం తప్ప చేసేదేమీ లేదు.కాకపోతే గుడ్డి కంటే మెల్ల మేలన్నట్టు ’గాడ్ తుస్సీ గ్రేట్ హో’ తో పోలిస్తే ఈ సినిమా ఫర్వాలేదు కానీ మొత్తానికి ’just another boring Bollywood romcom‘ అంతే.

6 Comments
  1. sasank August 20, 2008 /
  2. అన్వేషి August 20, 2008 /
  3. అన్వేషి August 21, 2008 /
  4. raghu August 28, 2008 /