Apradhi Kaun(1957)

Aug 19th, 2008 | రచయిత: సౌమ్య | వర్గాలు: featuredleadభారతీయ సినిమాసమీక్షహిందీ

“అపరాధీ కౌన్” అన్నది 1957 నాటి హిందీ డిటెక్టివ్ సినిమా. నిర్మాత బిమల్ రాయ్. అసిత్ సేన్ దర్శకుడు. సలీల్ చౌధురి సంగీతం. తారాగణం -అభి భట్టాచార్య, మాలా సిన్హా, జాగిర్దార్, తరుణ్ బోస్, లిలియన్. బిమల్ రాయ్, సలీల్ చౌధురి, మాలా సిన్హా తప్ప తక్కిన పేర్లు నేను వినను కూడా లేదు. వీళ్ళవి కూడా పేర్లు వినడమే కానీ, ఏమీ తెలీదు. అయినా సినిమా చూసేసాను… పేరు చూసి. :) నో రిగ్రెట్స్.

కథ: యోగేశ్వరనాథ్ కి ముగ్గురు కొడుకులు -దీనానాథ్,శ్రీనాథ్,పీతాంబర్. దీనానాథ్, పీతాంబర్ ల ప్రవర్తనతో విసుగెత్తిన అతను ఆస్తంతా శ్రీనాథ్ కి రాసేస్తాడు. వాళ్ళిద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఇంటి నుండి వెళ్ళిపోతారు. కానీ, జీవిత చరమాంకంలో ఎందుకో అతని మనసుమారి విల్లు తిరగరాసి ఆస్తంతా వాళ్ళిద్దరీ రాసి చనిపోతాడు. శ్రీనాథ్ ఈ విల్లు సంగతి తెలిసి జానకీనాథ్ వద్ద దాన్ని దాస్తాడు. పీతాంబర్ సంగతి వదిలేస్తే, దీనానాథ్ ముసలివాడై, అవిటివాడై శ్రీనాథ్ ఇంటిని చేరడంతో కథ మొదలౌతుంది. ఇంతలో జానకినాథ్ అనుమానాస్పదంగా మరణించడంతో పోలీసులు శ్రీనాథ్ ని అనుమానించి అతని కోసం వచ్చేసరికి శ్రీనాథ్ కూడా శవమై కనిపిస్తాడు. ఇప్పుడిక ఆ ఇంట్లో ఉండే వారందరూ అనుమానితులే - అతని మేనేజర్, అక్కడ నివసించే డాక్టర్, నర్సు శోభ, దీనానాథ్, డాన్సర్ లిలీ, ఇంట్లో పనివాడు - అందరూ. ఈ కేసు ఛేధించడానికి డిటెక్టివ్ రాజేశ్ నాథ్ రంగంలోకి దిగుతాడు. రాత్రుళ్ళు ఈ ఇంట్లో ఓ ముసుగు వ్యక్తి తిరగడం కనిపిస్తూ ఉంటుంది.అసలీ ముసుగు వ్యక్తి ఎవరు? హత్య చేసింది ఎవరు? ముసుగు వ్యక్తికి ఇంట్లో వారికీ సంబంధం ఏమిటి? పీతాంబర నాథ్ ఏమయ్యాడు? ఉన్నాడా-పోయాడా? - ఇదీ మిగిలిన కథ.

నాకు తెలిసీ ఈ సినిమాలో నటీనటులెవరూ స్టార్లు కారు. అందుకే, చాలా సహజంగా కుదిరింది అంతా. కథ బానే ఉంది. అయితే, ఇన్నాళ్ళ తరువాత యాభైఏళ్ళ క్రితం నాటి సినిమా చూసినందుకో ఏమో గానీ, హీరో పరిశోధన మొదలైన కాసేపటికి అసలు హత్య చేసిందెవరో ఊహించగలిగాను. ఇన్ని సినిమాల అనుభవం లేని యాభైలలో ఈ సినిమా మంచి సస్పెన్స్ సినిమా కిందే లెక్క. సినిమాలో డిటెక్టివ్ అసిస్టంట్ పాత్ర ఓ అనవసరమైన పాత్ర. అలాగే, అక్కడ శ్రీనాథ్ హత్య అన్న సీనులోనే అసహజత్వం ఉంది. ఊరికే అనుమానం కలిగించడానికి తప్ప ఆ నౌకరు పాత్ర అనవసరం. అలాగే, హీరోకీ, నర్సు శోభకీ మధ్య ప్రేమ మొదలవడం అసహజంగా అనిపించింది. అయినా, కేసు కేసుకీ ఓ ప్రేమ వ్యవహారం పెట్టుకుంటే, ఇక ఈ హీరో మన్మథ అని పేరు మార్చుకోవాల్సిందే! డిటెక్టివ్ సినిమా కనుక కథంతా చెప్పేయలేను కానీ, కథలో అక్కడక్కడా “అలా ఎలా జరుగుతుంది?” అన్న భావన కలగనే కలిగింది నాకు. ఉదాహరణకి జానకీనాథ్ హత్య జరిగే సీన్లు మరీ డ్రమటిక్ గా అనిపించాయి.

ఇలా నేనెంత నిట్‍పికింగ్ చేసినప్పటికీ, సినిమా ఎంటర్‍టైనర్ అనే చెప్పాలి. మాలా సిన్హా చాలా ఫొటోజెనిక్ గా ఉంది. ఆవిడకీ, మన జమున గారికీ నాకు చాలా పోలికలు కనిపించాయి. మాలాసిన్హా-అభి భట్టాచార్యల జోడీ చాలా బాగుంది. పాటలు - సినిమాలో అవసరమా లేదా అన్న విషయం పక్కన పెడితే, వినసొంపుగా ఉన్నాయి. “తర్వాతేమౌతుంది? తర్వాతేమౌతుంది?” అన్న కుతూహలాన్ని కలిగిస్తూనే సాగింది సినిమా అంతా. మన “అవే కళ్ళు” సినిమా గుర్తు వచ్చింది సినిమా చూసే కొద్దీ. రెండింటి మధ్యా common link ఏదో ఉంది. ఏమిటి? అన్నది నాకు స్పష్టంగా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి.

మొత్తానికి “అపరాధీ కౌన్” చూడదగ్గ సినిమా. యాభై ఏళ్ళ క్రితం మన వాళ్ళ అపరాధ పరిశోధన సినిమాలు ఎలా ఉండేవి తెలియాలంటే ఈ సినిమా ఓ సాంపిల్. ఓ రోజెప్పుడో మీకు బోరు కొట్టినప్పుడు, ఏమీ తోచనప్పుడు అలా సోఫాలో కూర్చుని చూస్కోడానికి అనువైన సినిమా. షెమారూ వీసీడీ. వెల అరవై ఆరు రూపాయలు.

ట్యాగులు: , ,

ఇవి కూడా చదవండి

No related posts

దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.