Menu

మేఘే ఢాకా తారా

భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ (ఋత్విక్ ఘటక్) ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి. భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ నవ్య సినిమా రంగంలో గ్రేట్ మాస్టర్స్ గా చెప్పుకునే ముగ్గురిలో (సత్యజిత్ రే, మృణాల్ సేన్) రిత్విక్ ఘటక్ ఒకరు.

ఆయన నిర్మించిన చిత్రాల్లో ఒక్కొక్కటి ఒక దృశ్య కావ్యం.కాని ’మేఘే ఢాకా తారా’ ను ఆయన చిత్రాల్లో కెల్లా గొప్ప చిత్రమని ఆయనే పేర్కొన్నారు.ఇందులో స్వార్థాన్ని త్యజించి,  తన కుటుంబంలోని వారి అవసరాలు నెరవేర్చడం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన నీత ముఖ్యాభినేత్రి. ఈ చిత్రంలో స్త్రీత్వాన్ని, త్యాగాన్ని ప్రధానాంశాలుగా చేసుకొని మధ్య తరగతి జీవుల మనస్తత్వాల్ని స్వార్థాల్ని విశ్లేషిస్తాడు రిత్విక్ ఘటక్.

నిజానికి రిత్విక్ సమాజంలో కిందస్థాయి ప్రజల్లోని ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ ఉన్న సాంస్కృతిక పరమయిన అంశాల్ని తీసుకొని విశ్వజనీనమయిన మార్క్సిస్టు సంస్కృతిలోకి అన్వయించి విశ్లేషిస్తాడు. అందులో భాగంగానే బెంగాలీ ప్రజానీకంలో ఉన్న గౌరీదాన్ అన్న అచారాన్ని మౌళికాంశంగా తీసుకొని ఈ చిత్రం రూపొందించారు ఘటక్. ఈ చిత్రానికి మౌళికమయిన కథకు ఓ చిన్న కథ ఆధారం. బెంగాల్ లో అత్యధికమయిన ప్రజాధరణ కలిగిన ఓ పత్రికలో వచ్చిన ఆ కథను ఆధారం చేసుకొని ఈ సినిమా రూపొందించారు ఘటక్. ఆ కథలోని ప్రధాన ఇతివృత్తానికి ఘటక్ తన అలోచనల్ని, అభిప్రాయాల్ని జోడించి కథా కథనాన్ని రూపొందించుకున్నారు.

బెంగాల్ లో గౌరీదాన్ ఆచారం ప్రకారం గౌరీకి పెళ్ళిచేసి పంపించడం ప్రధానాంశం. గౌరీ శివుల పెళ్ళి జానపద గీతాల లయతో గొప్పగా చేస్తారు.అయితే శివుడు సుదూరంగా ఉన్న పర్వత శ్రేణువుల్లో నివసిస్తూ వుంటాడు.’మేఘే ఢాకా తారా’ లో చివర్లో నీత తీవ్రమయిన అనారోగ్యంతో పర్వత సానువుల్లోని ఆసుపత్రికి చేరుతుంది. అంతే కాదు చిత్రంలో జగత్ ధతీ ఉత్సవంలో మహిళలంతా లయబధ్ధంగా పాడే ’ఉమా రావమ్మా’ పాట గౌరీదానాన్నే స్ఫురింపజేస్తుంది. ఇలా సూచనాత్మకంగా సాగే చిత్రీకరణ రీతిలో ఘటక్ తన ప్రతిభను చూపిస్తాడు. ఇంకా స్త్రీలలో కనిపించే మూడు రూపాల్ని ’మేఘే ఢాకా తారా’ లో భిన్నమయిన మూడు పాత్రల్లో స్పష్టంగా చిత్రిస్తాడు.పెద్ద కూతురు నీతా పాత్రలో సాధ్వీ లక్షణాన్ని, దయామయ గుణాన్ని వివరిస్తే, ఆమె సోదరి గీత పాత్రలో అందమూ, శృంగారయుతమూ అయిన లక్షణాల్ని ప్రోదిచేస్తాడు. ఇక తల్లి పాత్రలో స్వార్థమూ, క్రూరత్వమూ కనిపిస్తాయి. ఇలా ’మేఘే ఢాకా తారా’ లో స్త్రీ పాత్రల విశ్లేషణ చేస్తూనే సామాజిక లక్షణాల్ని, స్వార్థపరత్వాన్నీ తెగడతాడు రిత్విక్ ఘటక్. ఈ చిత్రం గురించి భారతీయ సినీ విమర్శారంగంలో విస్తృత మయిన చర్చ జరిగింది. కుమార్ సహానీ, ఆశిష రాజ్యాధక్ష లాంటి ఎంతోమంది చర్చకు ఉపక్రమించారు. ’మేఘే ఢాక తారా’ ఓ అధ్యయన చిత్రంగా నిలిచిపోయింది.

చిత్ర కథాంశం విషయానికొస్తే భారత స్వాతంత్ర్యానంతరం 50 వ దశకం చివరి అర్థభాగం అత్యంత సంక్షుభితమయిన కాలం. బెంగాల్ విభజన, బెంగాల్ కరువు లాంటి తీవ్రమయిన విషయాల్ని చవిచూసిన బెంగాలీ సామాజిక వాతావరణ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుంది. వలస వచ్చిన ఓ కుటుంబంలో నీతా పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె తన వాళ్ళకు అండగా నిలుస్తుంది. ఆర్థికంగా తన వారికి సహకరిస్తూనే కుటుంబంలో నియమబద్ధమయిన వాతావరణం రూపొందేందుకు యత్నిస్తుంది. అయితే వరసగా జరిగిన పలు సంఘటనలు ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తాయి. ఆ ఇంట్లో పెద్దకొడుకు సంగీత సాధన చేస్తూ పెద్ద గాయకుడిగా ఎదగాలని కలలు కంటూ ఉంటాడు. చిన్నవాడు మోంటు ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ మెషిన్ ప్రమాదంలో గాయపడతాడు. ఇక నీతా తండ్రి సాహిత్యమూ, బెంగాలీ స్వేచ్ఛావాదాల అధ్యయనంలో ఎదిగినవాడు. ఆయన కూడా ఓ ప్రమాదంలో గాయపడి ఇంట్లోనే ఉంటాడు.

నీతా చెల్లెలు గీతా అందగత్తె. శృంగారాన్ని ఒలకబోస్తూ తిరుగుతుంది. నీతా ప్రేమించిన సైంటిస్టు సనత్ ను ఆకర్షించి గీత తనవైపు తిప్పుకుంటుంది, అతన్ని పెళ్ళాడుతుంది. ఇక నీతా తల్లి స్వార్థంతోనూ, క్రూరత్వంతోనూ నిండివుంటుంది. ఆమె అన్నింటికి నీతాపైన ఆధారపడుతూనే గీతపట్ల, ఆమె అందం పట్ల ప్రత్యేక ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది.

అలా కాలం గడిచిపోతూ ఉండగానే శంకర్ తన సంగీతాన్ని నమ్ముకుని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తను పడుతున్న బాధకు తోడు నీతా అరోగ్యం క్షీణిస్తుంది. ఆమెకు క్షయ వ్యాధి సోకుతుంది. తను చిన్ననాటి నుండి కలలు గంటున్నట్లు పర్వత శ్రేణుల్లోకి వెళ్ళాలని ఆమె తీవ్రంగా తలపోస్తుంది.

మరోవైపు ధిక్కారంతో పట్నం వెళ్ళిన శంకర్ కి మంచి అవకాశాలు రావడంతో పేరు, డబ్బు ప్రోగవుతాయి. పెద్ద గాయకుడై ఇంటికి తిరిగివస్తాడు. ఇంటి బాధ్యతల్ని స్వీకరిస్తూనే నీతాను షిల్లాంగ్ లోకి ఆసుపత్రికి చేరుస్తాడు. ఇంట్లో గీతకి పాప పుడుతుంది. అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించిన నీతా తను ఇంకా ఎంతో కాలం జీవించాలనుకుంటుంది. కాని ఆమె రోదనలు పర్వత సానువుల్లో ప్రతిధ్వనించి ఆమె క్షోభ విశ్వవ్యాపితమవుతుంది.

నీతా పాత్రని ఇరుసుగా చేసుకుని రిత్విక ఘటక్ రూపొందించిన ’మేఘే ఢాకా తారా’ కాళీమాత భావనని ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక నేపథ్యంలోంచి విశ్వజనీనం చేస్తూ గొప్ప చిత్రంగా నిలుస్తుంది.

ఆయన అన్ని చిత్రాల్లోలాగే సంగీతం ఈ చిత్రంలో గొప్ప పాత్రని పోషిస్తుంది. అయితే ఆ సంగీతం అలంకరణగానో, ప్రత్యేకమయిన అంశంగానో గోచరించదు. అది దృశ్యాలతో సంయోగం చెంది వెంటనే వేరుపర్చలేని స్థితికి చేరుకుంటుంది. జ్యోతీంద్ర మైత్రీ అందించిన సంగీతం ఆయా సందర్భాల్లో మనం గుర్తించలేనంతగా దృశ్యాల్లో కలిసిపోతుంది. ఇక చిత్రంలో ఉపయోగించిన పాటలు, బంగ్లా దేశీ జానపద గీతాలు అద్యంతం ప్రేక్షకుల్ని ముందుకు నడిపిస్తాయి.

స్ర్తీ కోణంలో నిర్మితమయిన రిత్విక ఘటక్ చిత్రం ’మేఘే ఢాకా తారా’ దృశ్య కావ్యం అన్నమాటకు సరిగ్గా సరిపోయే చిత్రం.

9 Comments
  1. Manjula August 6, 2008 /
  2. శంకర్ August 9, 2008 /
  3. MBS PRASAD June 26, 2010 /
    • స్నేహిత్ June 26, 2010 /
    • NaChaKi June 26, 2010 /
  4. స్నేహిత్ June 26, 2010 /
  5. MBS PRASAD June 28, 2010 /
  6. MBS PRASAD June 28, 2010 /