Menu

Zodiac (2007)

1960-70 లలో అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టిస్తాడు జోడియాక్ అనే సీరియల్ కిల్లర్. అతన్ని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో డిటెక్టివ్ గా వున్న David Toschi, స్వతంత్రంగా ఈ కేసుని పరిశోధించాలని ప్రయత్నించే పత్రికా విలేఖరి Paul Avery, వేరెవ్వరికీ పరిష్కరించ సాధ్యమవ్వని ఈ కేసుని తన మనోబలంతో పరిష్కరించగలడనుకునే కార్టూనిస్ట్ Robert Graysmithల కథే జోడియాక్.

అమాయకులైన ప్రజలను అమానుషంగా చంపడమే కాకుండా, తన తదుపరి యత్నాలను ఎప్పటికప్పుడూ రహస్యలిపితో కూడిన సందేశాలతో వార్తాపత్రికలకు తెలియచేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తాడో వ్యక్తి. తనని తాను జోడియాక్ గా పిలుచుకుంటూ ప్రేరణకారణమేమీ లేకుండానే కేవలం తనలోని మృగాన్ని సంతోష పెట్టడానికి అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటాడు.

జోడియాక్ ను పట్టుకుని శిక్షించే పనిమీద నియమింప బడ్డ David Toschi తన జీవితంలో చాలా భాగం ఈ కేసు పరిశోధనలో వెచ్చిస్తాడు. కానీ అతనికన్నివైపుల నుంచి నిరాశే ఎదురవుతుంది. హత్యలు వేర్వేరు ప్రదేశాల్లో జరగడం, ఆ హత్యా ప్రదేశాలు వేర్వేరు పోలిసు స్టేషన్ల పరిధిలోకి రావడం, సాటి పోలీసుల దగ్గర్నుంచే సరైన సహకారం లభించకపోవడం. జోడియాక్ గురించి ప్రజలందరికీ తెలిసిపోవడం లాంటి ఎన్నో అంశాలు అతని పరిశొధనకు అడ్డుగోడల్లా నిలుస్తాయి.

జోడియాక్ పంపించే సందేశాలను ప్రచురించే శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్ అనే వార్తా పత్రికలో విలేఖరిగా పనిచేసే Paul Avery జోడియాక్ కేసు పరిశోధనలో కొత్త కోణాన్ని వెలికితీస్తాడు. తన పరిశోధనతో జోడీయాక్ ఎవరన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతను తాగుడుకి బానిసయ్యి చివరకి తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితం వ్యర్ధం చేసుకుంటాడు.

Paul Avery పని చేసే శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్ కార్యాలయంలోనే కార్టూనిస్ట్ గా పనిచేసే Robert Graysmith మొదటినుంచీ జోడియాక్ కేసు గురించి ఎంతో శృధ్ధ వహిస్తాడు. అంతే కాకుండా Paul Avery చేసే పరిశోధనలో తన వంతు సాయం చేస్తాడు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ పోలీసులు, ప్రజలు, మీడియాతో పాటు చివరకి ఆ సీరియల్ కిల్లర్ కూడా జోడియాక్ సంగతి మర్చిపోతారు. సరిగ్గా అలాంటి సమయంలోనే Robert Graysmith తన పరిశోధనను మొదలుపెడ్తాడు. తన పరిశోధనా ఫలితాలను ZOdiac అనే పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెస్తాడు. ఈ ప్రయత్నంలో అతను తన భార్యకు, కుటుంబానికీ దూరమవుతాడు.

ఒక సీరియల్ కిల్లర్ నేర పరిశొధనా నేపధ్యంలో ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలా మారిపోయాయన్నది Zodiac సినిమా అసలు కథ. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమా గతంలో సీరియల్ కిల్లర్ల జీవితాల ఆధారంగా వచ్చిన ఎన్నో సినిమాలకు భిన్నంగా ఉంటుంది.గతంలో Fight Club, Panic Room, Seven వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించన David Fincher ఈ జోడియాక్ సినిమాకు దర్శకుడు.

Seven సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన David Fincher తన దర్శకత్వ ప్రతిభను ఎప్పటికప్పుడు పదును పెడ్తున్నట్టుగా ఋజువు చేస్తూ Zodiac సినిమా ద్వారా ఒక అద్బుతమైన సినిమాను మనకందించారన్నది మాత్రం విజం.

దాదాపు మూడు గంటల పాటుగా నిడివి కలిగిన ఈ సినిమా ఎక్కడొ కొన్ని చోట్ల తప్పితే ఎక్కడా పట్టు కోల్పోకుండా అత్యంత నైపుణ్యంతో నిర్మింపభడింది. Seven చిత్రం ద్వారా హంతకుడు పోలీసులతో ఆడే ఆటను కొత్త ఫక్కీలో ప్రేక్షకులందించిన తర్వాత The Game చిత్రం ద్వారా మరో కొత్త తరహా చితాన్ని రూపొందించి ఆ తర్వాత Fight Club సినిమాతో Multiple Personality Disorder కలిగిన ఒక వ్యక్తి అంతరంగపు లోలోతుల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళి అక్కడ్నుంచి Panic Room లో వదిలేసి ప్రేక్షకులని భయభ్రాంతులకు గురిచేసిన David Fincher, Zodiac సినిమా ద్వారా మరో సారి తన ప్రతిభకు సాక్ష్యం చూపాడు.

ఇంతకముందు హాలీవుడ్ లో వచ్చిన Dirt Harry మరియు Bullitt సినిమాలు David Toschi జీవితం ఆధారంగా నిర్మింపబడ్డాయి. అదే విషయం మనకు ఈ సినిమాలోని ఒక సీన్లో నిర్ధారించాడు David Fincher. Robert Graysmith రచించిన Zodiac ఈ సినిమాకు ఆధారం. Zodiac రచించిన తర్వాత Robert Graysmith Zodiac Unmasked అనె మరో పుస్తకన్ని కూడా రచించారు. అంతే కాకుండా Zodiac కేసుల ఆధారంగా మరో పుస్తకాన్ని రచించే ఆలోచలో కూడ వున్నరట.ఏదేమైనప్పటికీ దాదాపు నలభై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ unsolved mystery గానే మిగిలిపోయిన Zodiac కేసుని అధ్బుతంగా సినిమా రూపంలో మనకందిచారు David Fincher.

అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం, 1960-70 లలో అమెరికాను గుర్తుకు తెచ్చే విధంగా, అతి సూక్ష్మంగా సృష్టించబడిన పరిసర ప్రాంతాలు, రంగాలంకరణ సామాగ్రి, నటి నటుల హావభావాలు, సినిమా మనస్థితికి తగ్గట్టుగా ఉండే సంగీతం లతో యదార్ధాన్ని కళ్ళముందుకు తెచ్చే దర్శకత్వ శైళి లతో కలిపి, ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రేక్షకులకొక కొత్త అనుభూతిని కలిగిస్తుంది

15 Comments
  1. Sai Brahmanandam Gorti July 21, 2008 /
  2. Sowmya July 22, 2008 /
  3. సాయి బ్రహ్మానందం గొర్తి July 22, 2008 /
  4. ravi July 23, 2008 /
  5. ravi July 23, 2008 /
  6. bhanu prakash July 23, 2008 /