Menu

వనజ:సమీక్ష

పరిచయం
ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప తెలుగు సినిమా నేను చూడలేదు. సినిమా చూసిన తరవాత పదే పదే గుర్తుకు వచ్చిన సినిమా “వనజ”. తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తియ్యగల దర్శక, నిర్మాలే కాకుండా, సినిమా తియ్యటంలోని అన్ని విషయాల్లో ప్రతిభ కనపరచిన సినిమా “వనజ”. అనుకోకుండా అంతర్జాలంలో కనిపించిన సినిమా “వనజ”. చూసిన తరవాత చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయా! మళ్ళీ చూసా! మళ్ళీ మళ్ళీ చూసా!

నవతరంగం సినిమా మిత్రులకి వనజ గురించి తెలిసే ఉంటుంది. కానీ, నవతరంగంలో “వనజ” గురించి సమీక్షలు చదివినట్లు గుర్తు లేదు. అందుకే ఈ ప్రయత్నం.

2006 సంవత్సరంలో తీసి, 2007 సంవత్సరంలో విడుదల చేసిన సినిమా “వనజ”. రజనేష్ దోమలపల్లి రచించి, దర్శకత్వం వహించిన “వనజ” సినిమా అమెరికాలో, కొలంబియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు కావటానికి తీసిన సినిమా!

“వనజ” సినిమాకు వచ్చిన అవార్డులు చూస్తే చాలు, ఈ సినిమా ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆకర్షించిందో!

మచ్చుకి:

 • న్యూయార్క్ టైంస్ — పూర్తిగా ఆకట్టుకుంది. వనజ ఏ కాలానికైనా సరిపోయే సినిమా.
 • న్యూస్‌వీక్ — శుభప్రదమైన రంగప్రవేశం. దోమలపల్లి తదుపరి చిత్రం కోసం ఎదురు చూడక తప్పదు.
 • షికాగో సన్ టైంస్ — అందంగా గుండెలకు హత్తుకొనే భారతీయ చిత్రం. మహాద్భుతమైన నటవర్గం. విసుగు పుట్టించే సన్నివేశం ఒక్కటి కూడా లేని సినిమా.
 • వెరైటీ — గుండె లోతుల్ని తాకే చిత్రం.
 • లాస్ఎంజిలిస్ టైంస్ — పరలోకం నుంచి వచ్చిన సినిమాలా ఉంది. అయినా ఈ సినిమాలో వాస్తవికత కళ్లకు కట్టినట్టు చూపించారు. మొదటి సినిమాతోనే ఇంత సంచలనమా …
 • బోష్టన్ గ్లోబ్ — దోమలపల్లి తన ప్రతిభను నిబెట్టుకోగలిగితే, చెప్పుకోదగ్గ సరికొత్త వ్యక్తి సినిమాలకి పరిచయం అయినట్టే. సత్యజిత్ రాయ్ మరియు డగ్లస్ సిర్క్ ల మేలుకలయిక.
 • బోష్టన్ హెరాల్డ్ — భూక్య… క్లిష్టమైన పాత్రలో మహత్తరమైన నటన.
 • ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ — మిలమిలలాడే కళ్ళున్న వనజ. ఆమె ఆత్మ, నవ్వు – హిందూ మహాసముద్రం అంత పెద్దవి.

విచిత్రం. ఈ సినిమా భారతదేశంలో విడుదల కాలేదుట. మంచి తెలుగు సినిమాలు, ఆంధ్రాలో మన తెలుగువాళ్ళు చూసే అదృష్టం లేదా! వనజ పాత్రధారి “మమత భూక్య” తన 15వ ఏట అందించిన నటన అద్భుతం.

1991 సంవత్సరంలో ఆంధ్రాలో గర్జనపల్లిలో ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన మమత, తన తల్లితండ్రులకున్న ఆరుగురు ఆడపిల్లల్లో ఆఖరమ్మాయి. తండ్రి ఫారెష్ట్ ఆఫీసరు. మమత ఎనిమిదో తరగతి చదువుతుండగా “వనజ”లో నటించే అవకాశం వచ్చింది. అంతకు ముందు నాట్యంలో కాని నటనలో కాని పరిచయం లేని మమత, ఒక్క ఏడాదిలో రెండూ నేర్చుకొని పరిణితి సాధించింది. 15 ఏళ్ళకే, తన మొదటి సినిమాలో తల్లి పాత్ర అత్యత్భుతంగా పోషించింది.

సినిమా కథ

దక్షిణ భారతదేశం (ఆంధ్రా)లో, సాంఘిక కట్టుబాట్లు బలంగా ఉన్న కాలంలో, జాలరి కుటుంబంలో పుట్టిన 15 ఏళ్ళ వయసున్న వనజ తన జీవితంలోని వడిదుడుకుల్ని అధిగమించే ప్రయత్నమే ఈ సినిమా. తండ్రి చేపలు పట్టి అమ్మి తెచ్చే డబ్బు నానాటికి తక్కువ అవుతుండటం వల్ల పెరిగే అప్పుల భారం తగ్గించడం కోసం, ఆ ఊర్లో రమా దేవి అన్న జమిందారిణి (ఊర్మిళ దమ్మన్నగారి) ఇంట్లో పనికి కుదురుతుంది వనజ.

అంతకు ముందు, ఒక ముసల్ది సోది చెపుతూ, వనజకు డాన్సరుగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెపుతుంది. వనజకి ఉన్న తెలివి తేటలకి, ఉత్సాహానికి ముచ్చట పడి, పూర్వాశ్రమంలో గొప్ప నర్తకిగా పేరుపొందిన జమిందారిణి వనజకు పాట, కూచిపూడి నృత్యం నేర్పుతుంది. ఆ కాలంలోనే, 23 ఏళ్ళ వయసున్న జమిందారిణి కొడుకు శేఖర్ (కరణ్ సింగ్) ఆ ఊరి ప్రాంతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనటానికి అమెరికా నుంచి తిరిగి వస్తాడు.

కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, 15 ఏళ్ళ వయసున్న వనజను శేఖర్ లోబరుచుకొని బలాత్కరిస్తాడు. అందుకు ఫలితంగా వనజ గర్భవతి అయ్యిందన్న విషయం తెలిసిన జమిందారిణి, తన కోడుకుని కోప్పడి, వనజకు ఆబార్షన్ చేయిస్తానంటుంది. అందుకు ఒప్పుకోని వనజ జమిందారిణి ఇంటినుంచి పారిపోయి, ఒక స్నేహితురాలి ఆశ్రయంలో, కొడుక్కి జన్మ ఇస్తుంది. తరవాత, ఎలాగో బతిమాలి మళ్ళీ జమిందారిణి ఇంటికి తన కొడుకుతో సహా వచ్చి ఉంటుంది. జమిందారిణి ఆదేశం మేరకు, వనజ కొడుకు జమిందారిణి ఇంట్లో పిల్లవాడుగా పెరుగుతాడు. వనజకు మాత్రం తన కొడుకు మీద ఎటువంటి హక్కు ఉండదు. ఇది జరిగిన ఒకటి, రెండు నెలలకి వనజ తండ్రి చనిపోతాడు. వనజ తల్లి తన చిన్నప్పుడే చనిపోటం వల్ల, వనజ ఒంటరిదై పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, తన జీవితానికి గమ్యం వెతుక్కుంటూ, అతి చిన్న వయస్సులో వనజ జమిందారిణి ఇంటినుండి ఒక్కత్తే బయటకు వచ్చేయటంతో సినిమా ముగుస్తుంది.

నటనా కౌశల్యం

ఈ సినిమాలో అందరూ ప్రతిభావంతంగా నటించారు. వనజ పాత్రధారి “మమత భుక్య” నటన అన్నిటికన్న మిన్న. అతి క్లిష్టమైన సన్నివేశాలని చాలా బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో, మమత నటన చూసి మొత్తం యూనిట్ అంతా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారని ఒక ఇంటర్వ్యూలో మమత చెప్పింది. అలాగే, సినిమా ప్రివ్యూ చూపించిన తరవాత తనకి Standing Ovation ఇచ్చారని, అది తన జన్మలో ఎప్పుడూ మర్చిపోలేనని మమత, న్యూయార్క్ లో “వనజ” సినిమా విడుదలపై జరిగిన ఒక ఫంక్షన్‌లో చెప్పింది. ఈ సినిమా ఎందుకు ఇండియాలో విడుదల కాలేదో అని కూడా ఆశ్చర్య పడింది.

పైన చెప్పిన విమర్శల్లాగే, నాకూ ఈ సినిమా అంతా ఇంకేదో లోకంలో తీసారా అని అనిపించింది. నటీనటుల నటన ఏమీ కృత్రిమంగా లేకుండా, అతి సహజంగా ఉంది. సంభాషణలు చెప్పటం, అందుకు స్పందనగా పాత్రల మొహాల్లో కనపడే భావాలు, చాలా చక్కగా ఉన్నాయి. జమిందారిణిగా “రమా దేవి” నటన కూడా అత్యద్భుతం. వనజ తండ్రి పాత్రధారి, అలాగే జమిందారిణి ఇంట్లో వంట చేసే పాత్రధారి, శేఖర్ పాత్రధారి నటన – అన్నీ ఎంతో గొప్పగా ఉన్నాయి.

సాంకేతిక ప్రతిభ

ఈ సినిమాకి సంగీతం ఎంతో ప్రధానమైనది. కూచిపూడి నృత్యానికి తగ్గట్టు మంచి సంగీతం అందించారు. అలాగే, ఆంధ్రాలోని పల్లెటూరి వాతావరణాన్ని అతి చక్కగా చిత్రీకరించారు.

నా ఆలోచనలు

“తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు” అన్న నా సణుగుడు, ఈ సినిమాతో సద్దుమణిగింది. “తెలుగులో మంచి సినిమాలు తియ్యగల ప్రతిభావంతులు ఉన్నారు” అనిపించింది. ఇలాంటి సినిమాలు వ్యాపార పరంగా విజయం సాధించగలవో లేవో నాకు తెలియదు. కానీ, సినీప్రియులు మాత్రం తప్పకుండా మెచ్చుకుంటారని నా దృఢ నమ్మకం. ఇప్పటి తెలుగు సినిమాల్లో మామూలుగా కనపడే హీరో-హీరోయిన్ల పిచ్చిగంతులు, వాటికి తగ్గట్టే ఉండే పాటలు, ఎక్కువ భాగం చెత్తగా ఉండే సంభాషణలు, ఏమాత్రం ఆకట్టుకోలేని నటీనటుల నటనలతో పోలిస్తే, “వనజ” సినిమా ఎక్కువమంది ఆదరించే ఒక చక్కని వినూత్న ప్రయోగం.

ఇంత చక్కని సినిమా అందించిన, దర్శక, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక వర్గం – అందరూ అభినందనీయులే!

తెలుగు సినిమాకు మళ్ళీ మంచి రోజులొచ్చినట్టేనా!

–లక్ష్మన్న విష్ణుభొట్ల

17 Comments
 1. Venkat Balusupati July 16, 2008 /
 2. శంకర్ July 16, 2008 /
 3. శంకర్ July 16, 2008 /
 4. శంకర్ July 16, 2008 /
 5. sasank July 17, 2008 /
 6. sagatujeevi July 17, 2008 /
 7. అరవింద్ July 17, 2008 /
 8. sasank July 23, 2008 /
 9. shanta Rayaprolu July 24, 2008 /