Menu

ఉల్లాసంగా ఉచ్చాసంగా

కొత్త సినిమాల సమీక్షలు వ్రాయడం చాలా తేలిక. ఎందుకంటే ఈ సినిమాని చూడాలా వద్దా అనుకుంటూ మీరు ఇక్కడికి వస్తారు.
దానికి రెండే సమాధానాలు ఉండగలవు. చూడాలి లేదా వద్దు. లెక్కప్రకారం రెండిటిలో ఏదోటి చెబితే సరె. ఉల్లాసంగా ఉచ్చాసంగా సినిమా సమీక్ష వ్రాయడం ఇంకా తేలిక ఎందుకంటే చూడాలి అని వ్రాయాలంటే మూడక్షరాలు వ్రాయవలసివస్తుంది, ‘వద్దు’ అని తేలికగా ఒక హగణంతో ముగించివేయవచ్చు.

ఎందుకు చూడకూడదు అని వ్రాయకపోతే, సమీక్షకు గౌరవం వుండదు. పైపెచ్చు సమీక్ష గౌరవం కంటే పాఠకుల అపోహలు ముఖ్యం, ఒక నాలుగు కరణాలలాంటివి వ్రాసిపెడితే, ఓహో ఇందుకిందుకు ఈ సినిమా చూడకూడదనమట అని వారిని వారు సర్దిపుచ్చుకుంటారు. సర్దిపుచ్చుకోవడం అనేది ఒక పెద్ద విపణి, అక్కడ చాలా వస్తువులు విక్రయించబడతాయి. కానీ ఇప్పుడు అది అప్రస్తుతం.

ఎందుకు చూడకూడదు.
ఇలాంటి సినిమాలు చూడవద్దని చెప్పడం చాలా తేలిక, కానీ ఎందుకు చూడకూడదని చెప్పడానికి చాలా కృషి అవసరం.
మొదట, ఈ సినిమా తీసేడప్పుడు దర్శకుడు తనకు తాను ఎటువంటి కొలబద్దలు విధించుకోలేదు. బాగా ఆడితే బాగున్నట్టు బాగా ఆడకపోతే బాగోనట్టు! అలాంటి సినిమాని సాంకేతికంగానో, తార్కికంగానో, మొదటి-హల్లుకు-అదనపు-అ-చేర్చబడ్డ-వేరే-ఏ-విశేషణం-గానో విశ్లేషించలేము.

కాబట్టి నేను ఈ రెండో విడత అభ్యర్థనలో (చూడవద్దని చెప్పడం తొలి విడత) చెప్పేదేఁవిటంటే, ఎటువంటి నాణ్యతా పరిమాణాలు లేకుండా తీసిన సినిమా చూడడం తల పోటుకు ఆహ్వానం అని.

అదీ నచ్చకపోతే పూర్తి స్థాయి సమీక్షలోనికి వెళదాం.

ఇక్కడ సినిమాని సినిమాలా చూడకుండా ఏ ముక్కకా ముక్కగా విఱిచి చూస్తాం. ఇది సినిమా అనే ఆశయానికి వ్యతిరేకం అని మీరు అభ్యర్థించవచ్చు. కానీ మనం తెలుగు వారం. ఒక సినిమాలో ముక్కలని ఇంకో సినిమాలో యదేచ్ఛగా పెట్టుకున్నా ఏం తేడారాదు. దీనికి సాక్ష్యం వివిధ టీవీలలో వచ్చే ఆల్ హ్యాపీస్ వంటి వివిధ కార్యక్రమాలు. అలానే పాటలు బాగున్నాయని పూర్తి సినిమా చూసి వచ్చే విశాలహృదయం మనది.

పాటలు. ఈ సినిమాలో పాటలు వున్నట్టు గుర్తుకువస్తుంది కానీ. ఇంకేం గుర్తుకు రావట్లేదు. పీడకలల్ని మరచి పోవడానికి మన బుఱ్ఱలో ఒక సదుపాయం వుందఁట. ఘోరమైన సంఘటనలు జరిగిం తరువాత దానికదే ఆ ప్రక్రియ మొదలవుతుంది. అదేదో జరిగుంటుంది.

కామెడీ. దీన్ని ఇంకా విడగొట్టాలి.
మొదటి సగం మొదటి భాగంలో కుటుంబ సమేతంగా జరిగిన కామెడీ బాగుంది.
రెండవ సగం రెండవ భాగంలో కలకత్తా నేపథ్యంలో జరిగిన కామెడీ కూడా బాగుంది.
మిగిలిన దంతా వట్టి గట్టి పంకం.

దీనిని వివరించాలి కదా ఎందుకు బాలేదని. హూఁ..
వివరణ – కామెడీ సటిల్గానూ సందర్భోచితంగాను సమయస్ఫూర్తి గలిగినది గానూ లేదు.

నటీనటబృందం. దీన్ని సైతం ఇంకా విడగొట్టాలి.
ఈ సినిమాలో కొందరు నటించారు, కొందరు నటనలో శిక్షణ పొందారు. ఈ రెండవ వర్గస్తులు ప్రేక్షకులను శిక్షించారు. అందవిహీనంగా వున్న వారు మన కథానాయకుణ్ణి చూసి ఆత్మవిశ్వాసం తెచ్చుకుంటారు. ఆడపిల్లలు మనిప్పుడు మాట్లాడుపిల్లని చూసి మూఖానికి సున్నం వ్రాసుకోవడాలు మానుకుంటారు. కథానాయకుడు కన్నడిగుడు కాబట్టి డబ్బింగు చేయించుకున్నాడు. ఇది ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ.

కథ వంటివి.
సమీక్ష వ్రాస్తున్నప్పుడు ‘వంటివి’ వంటి చులకనపాటును సూచించే పదాలు ఎలా వాడగలడు సమీక్షకుడు అని మీకు సందేహం రావచ్చు. నేను వ్రాయబోయేది కథ గురించి కాదు. ఎందుకంటే ఈ సినిమాలో కథ లేదు కాబట్టి. కథ లాంటివి ఏవో వున్నాయి. అదిగో మళ్ళీ ‘ఎవో’ అని తేలికపాటు పదాలు వాడుతున్నాడు అనవద్దు. ఈ సినిమాలో కథలాంటిది కూడా ఏదీ కనబడలేదు.

సాంకేతికాంశాలు.
కథవంటివి లేనప్పుడు సాంకేతికాంశాలవంటివాటి గురించి ఏఁవని వ్రాస్తాం.

దర్శకత్వం.
క్యూట్ లవ్ స్టోరీ తీద్దామనుకున్నాడు కరుణాకరన్. కానీ విఫలమయ్యాడు.
క్రితం సినిమాలు తొలిప్రేమ, వాసు లతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఏఁవీ లేదు.

ఈ సినిమా ఎవరు చూడవచ్చు? అన్నది పది డాలర్ల లేదా వంద రూపాయల ప్రశ్న.
సినిమా అంతా బాగోక పోయినా వట్టి ముగింపు మాత్రం హాస్యాస్పదంగా వుండడం – అది కూడా చాలా వరకు డబ్బింగ్ ఆర్టిస్టు వల్ల – నచ్చేవాళ్లు ఈ సినిమాను ముగింపును తప్పక చూడగలరు.

నవతరంగం రేటింగ్ – ఒకటిన్నర డిగ్రీ టార్చర్

12 Comments
  1. chavakiran July 30, 2008 /
  2. సాయి బ్రహ్మనందం గొర్తి July 30, 2008 /
  3. Sowmya July 31, 2008 /
  4. veer July 31, 2008 /
  5. కుసుమ July 31, 2008 /
  6. Hari Charana Prasad August 1, 2008 /
  7. sekhar October 1, 2008 /