Menu

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mechanism లాగా ఏర్పడిన తరుణం అది. ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ, ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు.

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పెళ్ళికి ముందే ఒక హరిజనుణ్ణి ప్రేమిస్తే, సాంప్రదాయక వివాహానంతరం కూడా ఈ విషయం తెలిసిన  భర్త, తాత ఆ అమ్మాయిని తన ప్రేమికుడితో కలపడం అనేది ఈ చిత్రకథ. నాయిక ‘హేమ’ (భమిడిపాటి సబిత), నాయకులు ‘హరిబాబు’ (రవికాంత్) ప్రేమికులుగనక వారినే ప్రముఖపాత్రధారులని చెప్పలేని కథనం ఇది. అందుకే ఈ సినిమాలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ (screen space) కూడా లేని ఆ అమ్మాయి భర్త గౌరీనాధుడు (గిరీష్), శంకరాభరణం శంకరశాస్త్రి పంధాని మరికొంత ముందుకునడిపిన తాత ‘యాజులు’ (జె.వి.సోమయాజులు) ప్రముఖపాత్రలుగా ఉద్భవిస్తారు. వీరి కోణం నుంచీ ప్రేక్షకుడికి సినిమాలో చెప్పదలుచుకున్న సందేశం అందించబడుతుంది. అందుకే, ‘సప్తపది’ ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో చెప్పబడిన కులాంతర వివాహం కథ అని సూత్రీకరించడం జరిగింది.

సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రనిర్మాణ స్ఫూర్తిని గురించి దర్శకుడు విశ్వనాధ్ చెబుతూ, ” ‘ఆచారవ్యవహారాలన్నవి మనసును క్రమమైన మార్గంలో పెట్టడానికేతప్ప, కులమనే పేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు’ అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలే ఈ చిత్రనిర్మాణానికి ప్రేరణ” అని చెబుతారు. తను ఇంతకు మునుపు సృష్టించిన ఒక పాత్ర చెప్పిన మాటే ప్రేరణగా, మరో ఆణిముత్యం లాంటి సినిమాకు రూపకల్పన చెయ్యడం, కళాతపస్వి అని పిలువబడే ఈ కళాకారుడికే చెల్లు.

సప్తపది చిత్రం సంగీతపరంగా (కె.వి.మహదేవన్), సాహిత్య పరంగా (వేటూరి సుందరరామ్మూర్తి) ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి పాటా ఒక ఆణిముత్యం వాటిల్లోని ప్రతి భావం ఒక నిత్య సత్యంలా అనిపించే సంగీతసాహిత్యాలు ఈ సినిమా సొత్తు. ఇక ఈ చిత్రంలో ఆచితూచిసాగే మాటలు (జంధ్యాల) కూడా చెప్పుకోదగ్గవే. వ్యాసం యొక్క విషయం ‘బ్రాహ్మణ ధృక్కోణం’ కాబట్టి,వాటికి సంబంధించినవాటిని మాత్రమే సమగ్రంగా చర్చించి, మిగతావాటిని కేవలం ఉటంకించడం మాత్రమే జరుగుతుంది.

కథా పరంగా మొదట్లో చెప్పినట్లు, ఈ చిత్రానికి ప్రధాన పాత్రధారి యాజులైతే, కథానాయకుడు మాత్రం గౌరీనాధుడని చెప్పుకోవాలి. ఇక కథనం మరియూ పాత్ర కల్పనలని దృష్టిలో ఉంచుకుంటే, సినిమా ఆఖరికి వాంఛితమైన మార్పుకూడా యాజులు పాత్రలో వస్తే, గౌరీనాధుడు బ్రాహ్మణత్వం (బ్రహ్మజ్ఞానము తెలిసిన) మూర్తీభవించిన నాయకుడిగా గోచరిస్తాడు. ఇక ఇతర పాత్రలు చాలావరకూ అటు యాజులు మరియూ నాయిక హేమ కుటుంబ సభ్యులు కనుక, అంతా బ్రాహ్మణులే అని చెప్పుకోవచ్చు. పోతే మరో ప్రముఖపాత్ర ‘రాజుగారు’ (అల్లు రామలింగయ్య). రాజుగారి పాత్రని పరిచయం చేసినప్పుడే, అతను యాజులకి ఆప్తమిత్రుడితోపాటూ, మనస్సాక్షిగా (conscious keeper ) కూడా అనిపిస్తాడు దర్శకుడు.   కానీ,  అసలు సమస్య ‘హరిజన’ కథానాయకుడి పాత్ర సృష్టిలో గోచరిస్తుంది.

ప్రేమకథ అన్న తరువాత నాయికా నాయకుల వ్యక్తిత్వాలూ, ఇష్టాఇష్టాలూ, పరిచయ-ప్రణయాలూ సినిమాలో చూపడం సహజం. కానీ సప్తపది చిత్రంలోని భావుత్వం తొణికిసలాడే విశ్వనాధ్ గారి కథనంలో, కొంత అసృష్టత కనిపిస్తుంది. అదీ ముఖ్యంగా నాయకుడి పాత్ర సృష్టిలో. అతనెవరో? ఎక్కడ్నించి వచ్చాడో? గుణగణాలేమిటో? ఖచ్చితంగా చెప్పగలిగే ఆధారాలు సినిమాలో కనిపించవు. ఒక నాట్య ప్రదర్శనలో పిల్లనగ్రోవి ఊదుతూ ప్రత్యక్షమై, గోదారి ఒడ్డున ఒక మంటపం దగ్గర వేణువు వాయిస్తూ నాయికకు పరిచయమై, ఆభేరీరాగాన్ని ప్రేమలేఖగా పంపి, సంగీతంతో నాయిక మనసుదోచుకుంటాడు. “రేపల్లియ ఎదఝల్లున పొంగిన మురళి” అనే పాటలో నాయిక తండ్రిని మంచిచేసుకుని నాయికకు దగ్గరౌతాడు. అంతా బాగుందన్న తరుణంలో “నేనొక హరిజనుణ్ణి” అని ఒక గొల్లపిల్లవాడితో చెప్పి, నాయికకు తెలిసేలా చేస్తాడు. ఇప్పటివరకూ, ‘పోనీ కథానాయకుడే నిజాన్ని దాచాడుకాబట్టి, ఇలా చిత్రించడం సరే’ అని సరిపెట్టుకునేంతలో మరికొన్ని, అసంభద్దాలు కనిపిస్తాయి.

“చిన్నప్పటి నుంచీ, ఏంచేసైనా నేను అనుకున్నది సాధించే తత్వం నాది” అని ప్రశ్నించిన నాయికతో అంటాడు నాయకుడు. దీనికి తోడు తను మోసంతో ఎలా వేదం, సంగీతం నేర్చుకుందీ తప్పుచేసినవాడిలా చెప్పుకొచ్చిన నాయకుడు, చివరిగా “ఇన్నాళ్ళూ అబద్ధాలలోనే బ్రతికాను. ఎవర్నీ అన్యాయం మాత్రం చెయ్యలేదు” అని సత్యం పలుకుతాడు. ఈ వివరణలో బ్రాహ్మణత్వాన్ని ఆశించే ఒక యువకుడు కనబడతాడేతప్ప సమాజానికి ఎదురుతిరిగిన హరిజనుడు కనపడడు. బహుశా, అప్పటికి దళితవాదం ప్రాచుర్యంలో లేకపోవడం వలన కథా రచయితకు (కె.విశ్వనాథ్) హరిజనుడు తిరుగుబాటు చేస్తే ‘బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా చేస్తాడేకానీ, బ్రాహ్మణత్వంకోసం చెయ్యడు’ అన్న విషయం తెలిసుండకపోవచ్చు. లేకపోతే చివరిలో యాజులు చెప్పే “భగవంతుడు గుణగణాల్ని బట్టి నాలుగు కులాలు నిర్ణయించానన్నాడుగానీ, పుట్టుకనిబట్టి కాదు” అనే ఆర్యోక్తికి సరితూగేలా నాయకుణ్ణి ‘కర్మ బ్రాహ్మణున్ని’ చెయ్యడానికి అతని చేత (దొంగతనంగా) వేదం, సంగీతం నేర్పించడానికి పూనుకొనుండోచ్చు.

దీనికి తోడు, నాయకుడితో నాయికను ఒక విచిత్రమైన కోరికని కోరనిచ్చి అతని మీద కలిగే కాస్తోకూస్తో సానుభూతి కాస్తా హరించినట్లనిపిస్తుంది. కులాల పట్టింపులూ, నాయిక యొక్క నాన్నగారి విధివిధానాలను చూసినవాడై, మనసులు ఒకటైనా మనుషులు కలవరనే నిర్ణయానికొచ్చిన నాయకుడు, “నువ్వు ఎవరి సొత్తూ కాకూడదు. నేను కట్టుకునే ఆలయంలో, నువ్వు నాదేవతలా ఉండిపోవాలి. నేనాదేవతని ఆరాధిస్తూ,ఇలా బ్రహ్మచారిగా రాలిపోవాలి” అని నాయికను కోరి ఒప్పిస్తాడు. వినడానికి ఎంత ఉదాత్తంగా అనిపించినా చాలా అసంబద్ధమైన కోరిక అని మాటల రచయితకు తెలిసుకాబట్టే, ఈ కోరిక కోరేముందు “నిన్ను ఒక విచిత్రమైన కోరిక కోరతాను” అని నాయకుడిచేత అనిపిస్తాడు. ఇంకా విచిత్రమేముటంటే, ఈ చిత్రంలో కథానాయకుని పేరు ఒక్క గొల్లపిల్లవాడుతప్ప ఎవ్వరూ ఉచ్చరించరు. కొన్ని సమీక్షల్లోకూడా నాయకుడి పేరు (ఫ్లూట్ వాయిస్తాడుకాబట్టి) ‘మురళి’ అని రాయగా చదివాను. కానీ సినిమాలో అతని పేరు ‘హరిబాబు’.

సహజీవనం చెయ్యడానికి ధైర్యం చెయ్యలేని నాయికా నాయకులు.  ప్రేమించినా, పెళ్ళికినోచుకోక ఆరాధిస్తూ బ్రతికేద్దామనుకునే హీరోహీరోయిన్ల ప్రేమకథని ఇలా నడిసంద్రంలో నిలిపి, హేమకు గౌరీనాధుడితో (యాజులు ద్వారా) పెళ్ళి నిశ్చయిస్తాడు దర్శకుడు. ఈ పెళ్ళినిర్ణయానికి ఒక్క సీన్ ముందే, ప్రేమికులని సంతానవృక్షం దిశగా సప్తపది నడిపి, సినిమాకథకు ఒక పీటముడికూడా వేస్తాడు. ఇక్కడినుండీ మొదలవుతుంది అసలు నాయకుడు గౌరీనాధుని కథ.

హరిబాబు ఈ పెళ్ళితరువాత తెలియని చోటుకి తన విరహాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతే, హేమ పెళ్ళిని అంగీకరించి గౌరీనాధునికి భార్యగా నిలబడుతుంది. కాకపోతే “పరస్త్రీ తల్లితో సమానమని మనసావాచా నమ్మిన” గౌరీనాధుడికి, శోభనంరోజు రాత్రే హేమ అమ్మవారిలా కనబడుతుంది. హరిబాబు- హేమల ప్రేమ, సంతానవృక్షానికి ఊయలకట్టిన విషయం తెలుసుకున్న గౌరీనాధుడు,”నీ మనస్సు పరాధీనంలో ఉందికాబట్టి,ఇన్నాళ్ళూ నాకు నేను పూజించే అమ్మవారిలా కనిపించావు” అని చెప్పి, హరిబాబుని తీసుకొచ్చి ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరుతాడు. ఒకవైపు నాయికను అసంబద్ధకోరికను కోరి, పెళ్ళిచేసుకునే ధైర్యంలేని హీరో , పెళ్ళిచేసుకున్న అమ్మాయి ప్రేమ సంగతి తెలిసి, ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరే పాత్ర మరొకవైపు. ఇక ప్రేక్షకుడికి నాయకుడెవరో చెప్పకనే తెలుస్తుంది.

ఈ విషయం విన్న గౌరీనాధుడి తండ్రి (జె.వి.రమణమూర్తి), “పిదపకాలం పిల్లలూ, పిదపకాలం బుద్ధులూ” అని ఈసడిస్తే, అంతవరకూ సాంఫ్రదాయం కట్టుబాట్లూ అని కటువుగా కనిపించిన యాజులు మాత్రం మౌనం వహిస్తాడు. తన మిత్రుడైన రాజుగారితో చర్చిస్తాడు. ఇటు బ్రాహ్మణులకూ, అటు హరిజనులకూ వారధిలా ఉన్న రాజుగారు, ‘శంకర విజయం’లో శంకరాచార్యుడూ,మాలవాడికీ మధ్యజరిగిన ఆత్మ-పరమాత్మల సంవాదం గుర్తుచేసి, “మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం” అని కులాల పట్టింపుల్లోని అర్థరాహిత్యాన్ని గుర్తుచేస్తాడు. దానితోపాటూ నేపధ్యగీతంలా వచ్చే “ఏకులమూ నీదంటే? గోకులమూ నవ్వింది. మాధవుడూ,యాదవుడూ నాకులమే లెమ్మంది” అనే పాటవచ్చి యాజుల మనసుపొరల్లో, కులంగురించి ఏర్పడుతున్న సృష్టతకు ఆద్ధంపడుతుంది. అంతేకాక, “ఆది నుంచి ఆకాశం మూగదీ, అనాదిగా తల్లిధరణి మూగది. నడుమవచ్చి ఉరుముతాయి మబ్బులూ, ఈ నడమంత్రపు మడుసులకే మాటలు. ఇన్ని మాటలు” అని లోకులకు కులం గురించిఉన్న పట్టింపులు ఎంత మూర్ఖమో దర్శకుడు తెలియజెబుతాడు.

పెళ్ళికి శాస్త్రోక్తమైన అర్థం  తెలిసిన యాజులు ఈ అంతర్మధనంలో సత్యాన్ని బేరీజుచేసుకుని, హేమను హరిబాబుతో సాగనంపడానికి చీరసారెతో బయల్దేరుతాడు. అప్పటివరకూ చాటుగా చెవులు కొరుక్కున్న జనం, ఇప్పుడు మూకుమ్మడిగా దీనికి వ్యతిరేకంగా కర్రలుపట్టుకుని నిలబడతారు. అప్పుడు వారడిగిన ప్రశ్నలకి శాస్త్రాన్ని ఉదహరిస్తూ యాజులు అందరి (ప్రేక్షకుల) కళ్ళూ తెరిపిస్తాడు. “పెళ్ళంటే ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు. ఇద్దరి మనస్సుల్ని కలపడం”. “త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెబుతోది”. ఇన్నేళ్ళూ కొడుకులా పెంచుకున్న నా కూతురిని నీకొడుకుకి అప్పజెబుతున్నాను. వాళ్ళిద్దరూ స్నేహంగా, సఖ్యతగా ఉండుగాక” అని కన్యాదాత కన్యాదానం చేస్తూ అంటాడని. అయితే “ఆ స్నేహం, సఖ్యత లోపించిన తరువాత” వారు కలిసి ఉండడం మంచిది కాదనీ, అందుకే “ఆ సఖ్యతకు అర్హుడైన” వాడితో అమ్మాయిని పంపిస్తున్నాననీ తెలియజెబుతాడు.

అంతావిన్న ప్రజలు వెనక్కితగ్గితే, గౌరీనాధుడు తీసుకొచ్చిన హరిబాబుతో హేమని స్వయంగా సాగనంపడానికి పడవెక్కుతాడు యాజులు. గౌరీనాధుడు రేవులో నిలబడుండగా పడవ సాగిపోతుంది. సంగీతం, నాట్యం వారికులమనీ, సప్తస్వరాలే వారికి సప్తపది అని ఒక కంఠస్వరం నేపధ్యంలో చెబుతుండగా సినిమా ముగుస్తుంది.

కులాంతర వివాహమనే విషయాన్ని తనదైన కోణంలో ఆవిష్కరించడంలో దర్శకుడు కె.విశ్వనాధ్ చాలా వరకూ సఫలమైనా, కథకుడిగా తనకుగల కొన్ని హద్దుల్ని (limitations) దాటడంలో సఫలం కాలేదు అనిపిస్తుంది. అందుకే తనకు తెలియని/అర్థంకాని కొన్ని పాత్రల్ని అసంపూర్ణంగా వదిలి కథను నడిపించాడు. అంతేకాక గౌరీనాధుడికి హేమ అమ్మవారిలా కనిపించడానికీ, నాయిక సంతానవృక్షానికి ఊయలకడుతున్నప్పుడు నాయకుడు  ” మనమిద్దరం ఒకటవ్వడానికి ఈ మూఢాచారాలూ, వింతనమ్మకాలూ అడ్డుపడుతున్నాయి. ఈ చెట్టుకే అంతటి మహిముంటే, పెద్దల మనసుల్ని మార్చి మనల్ని కలుపుతుందేమో చూద్ధాం” అన్నదానికీ ఒక సింబాలిక్ లంకె కలిపి, గౌరీనాధుని నిబద్ధతకూ కొంత supernatural గ్రహణం పట్టించినట్లనిపిస్తుంది. తనకుతెలిసిన బ్రాహ్మణదృక్కోణంలో మహత్తరంగా ఈ సమస్యను ఎత్తిచూపినా, ఒక కూలంకష సామాజిక సమస్యగా దీన్ని మలచడంలో దర్శకుడు సఫలుడు కాలేదేమో! అనిపిస్తుంది.

సప్తపది ఒక మంచి సినిమా, విశ్వనాధ్  గారు చాలా మంచి దర్శకులు. కానీ, భారతదేశ సినిమా జగత్తులో “గొప్ప” దర్శకుల జాబితాలో ఈయన చేరకపోవడానికిగల కారణాలు ఈ చిన్నచిన్నలోపాలే అనిపిస్తుంది. He is a very good director who falls short of greatness. మన తెలుగు సీనీమతల్లికి మహత్తరమైన, మంత్రపుష్పాల్లాంటి సినిమాల్ని అందించిన ఈ దర్శకదిగ్గజం మనకుమాత్రం ఎప్పటికీ గొప్పదర్శకుడే!

32 Comments
 1. శంకర్ July 15, 2008 /
 2. శంకర్ July 15, 2008 /
 3. వికటకవి July 15, 2008 /
 4. శంకర్ July 15, 2008 /
 5. అబ్రకదబ్ర July 15, 2008 /
 6. వికటకవి July 15, 2008 /
 7. సాయి బ్రహ్మానందం గొర్తి July 15, 2008 /
 8. bollojubaba July 16, 2008 /
 9. కొత్తపాళీ July 16, 2008 /
 10. కొత్తపాళీ July 16, 2008 /
 11. sujaata July 16, 2008 /
 12. కామేశ్వర రావు July 17, 2008 /
 13. ఊకదంపుడు July 20, 2008 /
 14. lalithasravanthi July 28, 2008 /
 15. Aruna August 25, 2008 /
 16. సుత్తి కత్తి November 8, 2008 /
 17. Alapati rameshu Babu November 14, 2008 /
 18. jaya January 2, 2009 /