Menu

గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష

ఈ మధ్య నా దగ్గరున్న కొన్ని తెలుగు పుస్తకాల బూజుదులిపి చదవడం మొదలెట్టాను. అందులో ఒకటి ‘సినీరమణీయం 1’ అని, ముళ్ళపూడి వెంకటరమణ గారి సినీ వ్యాసాల, సమీక్షలు,కథల సంకలనం. దాంట్లో 129 వపేజీ కొచ్చేసరికీ నా కళ్ళు కాస్త పెద్దవయ్యాయి. ఇప్పటివరకూ నాకు నచ్చిన హిందీ చిత్రాలలో ప్రముఖమైనది గురుదత్ ‘ప్యాసా’ प्यासा  (1956). రమణగారి కలంనుంచీ ఆ సినిమా సమీక్ష అక్కడ కనబడింది. పూర్తి సమీక్ష ఉత్సాహంగా చదివేసరికీ, నిజం చెప్పాలంటే నీరసమొచ్చింది.

‘చచ్చినవాడి కళ్ళు చారడేసి’ అనే లోకం తీరుతో సమీక్ష మొదలెట్టి, “చచ్చినవాడు మళ్ళీ బ్రతికొచ్చి,నేను చావలేదుస్మండీ అదృష్టవశాత్తూను అంటే, తక్షణం ఆ యొక్క లోకుల దృష్టిలో వాడి చారడేసి కళ్ళు చింతాకులంత చిన్నవై ఊరుకుంటాయి. వాళ్ళు వాణ్ణి భరించలేరు; వాడు బతికున్నానని నిజం చెబితే సహించలేరు. అని చాటి; సత్యాన్ని నిరూపించి స్థాపించడం “ప్యాసా” దర్శకనిర్మాత గురుదత్ లక్ష్యం” అని మెచ్చుకుని. “దీన్ని ప్రజలకు అందజేయడం కోసం అతడు కల్పించిన కథను పరికిస్తే, అందులోమటుకు పరిణతిచెందిన కళాకారుడి ప్రతిభ తాలూకు క్రీనీడలు కూడా కనబడవు” అని తేల్చేసారు.

రమణ గారు సమీక్షలో తనకు బొంబాయి పరిశ్రమ మీద ఉన్న అసంతృప్తిని “ఇందులో ఉన్న మంచి ముత్యంలాంటి జీవిత సత్యాన్ని, దాని చుట్టూ కథ పేరిట పూసిన బొంబాయి మసినీ పోల్చిచూసినపుడు, ఆ సత్యాన్ని చూసిన దృష్టికీ, దాన్ని ఈ చిత్రకథ అమర్చడానికి వెదకిన దృష్టికీ చాలా దూరం ఉందనిపిస్తుంది” అని తెల్పారు. అంటే ‘ప్లాట్’(plot) బాగుందిగానీ, దాన్ని తెరపైకి అనువదిండానికి ఉపయోగించిన ‘ప్రిమైస్'(premise) కి బొంబాయి పరిశ్రమ వారి మసి అంటుకున్నదని రమణ గారి భావన.

ఈ పోలికలూ, అసంతృప్తీ వినేసరికీ నాకు కాస్త చికాకుగా అనిపించిన మాట వాస్తవం. ఎందుకంటే మొట్టమొదటి సారిగా ఈ సినిమా నేను కాలేజిలో ఉండగా దూరదర్శన్ పుణ్యమా అని TV లో చూశాను. చూసిన క్షణంలొ విపరితంగా నచ్చేసిన సినిమాలలో ఇదొకటి. తరువాత యూనివర్సిటీలో ఉండగా మా డిపార్ట్ మెంట్ వీడియో లైబ్రరీలో ఈ సినిమా ఉండటంతో, ఆ రెండు సంవత్సరాలలో దాదాపు 40 సార్లు విజయవంతంగా చూసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి ఇంత తేలిగ్గా ముళ్ళపూడి రమణ లాంటి సినీరచయిత,సాహితీ వేత్త అప్పట్లొ అనుకున్నారేమిటా? అని తెగ బాధపడ్డానుకూడా.

కాస్త బాధ తగ్గాక స్థిమితంగా బేరీజుచేస్తే, కొన్ని సత్యాలు గోచరించాయి. నిజానికి ఈ సినిమా రిలీజయినప్పుడు ఫ్లాపై కూర్చుందట. ఆ అతరువాత కాలంలో, అదీ గురుదత్ మరణానంతరం ఈ చిత్రాన్ని అటువైపు సినీపండితులూ, ఇటు వైపు సినీ ప్రేక్షకులూ ఒక ‘క్లాసిక్’ అని తీర్మానించేసారు. అంటే ఈ సినిమాలోని కథానాయకుడు ‘విజయ్’ పాత్రకూ నిజజీవితంలోని గురుదత్ కూ ఎక్కడో స్వారూప్యం ఉందన్నమాట. ఈ కోణంలో ఈ చిత్రాన్ని అర్థం చేసుకుంటే ఇదొక గొప్ప చిత్రం అనిపించకమానదు. నేను ఈ సినిమా మొట్టమొదటి సారిగా గురుదత్ ఎవరో తెలియనప్పుడు చూసినా, ఒక shared social psych లో భాగంగా ఇది ఒక personal cinema అనిపించి, మనసుకు హత్తుకొని ఉండాలి. లేదూ, ఈ సినిమాని నా జీవితంలో “ఎవరూ నన్ను సరిగ్గా గుర్తించటం లేదు” అన్న భావనలో ఉన్నప్పుడైనా చూసుండాలి అనిపించింది. బహుశా రెండూ నిజాలేనేమో!

ఒక సారి అప్పటి (1950s) హిందీ సినీమా స్థితి చూసుకుంటే దిలీప్ కుమార్, రాజ్ కపూర్ మరియూ దేవ్ ఆనంద్ లు రాజ్యమేలేవారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి, వీరి చిత్రాలవి ఒక్కొ పంధా. ఇన్నాళ్ళ తరువాత వారి సినిమాల్ని కేటగరైజ్ (categorize) చేస్తే, దిలీప్ కుమార్ ని నెహ్రూ ఆదర్శాల్ని తెరపైకి తీసుకు వచ్చిన కథానాయకుడిగా విమర్శకులు గుర్తిస్తారు. రాజ్ కపూర్ ని అప్పటి సమాజంలోని కురీతుల్ని తెరపైకి తెచ్చిన రొమాంటిక్ సంస్కరణ వాదిగా వర్గీకరిస్తారు. దేవ్ ఆనంద్ ఒక పట్నం (urban) బాబు లా , నగరజీవనంలోని ఆశయాలకు ప్రతీకగా విశ్లేషిస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ అన్ని పార్శ్వాలనూ, ఒక వ్యక్తిగత దృక్కోణంలో తన సినిమాలో ప్రతిఫలించిన దర్శకనిర్మాత, నటుడు గురుదత్. ఆ కాలంలో వ్యక్తిగత సినిమా (personal cinema) అనే ఊహ సినీజనాలకి రాక, తన సినిమాల విధానాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారేమో, అనిపిస్తుంది.

‘ప్యాసా’ ఒక విఫలమైన కవి, ప్రేమికుడు,తమ్ముడు,కొడుకు మరియూ యువకుడి కథ. గొప్ప కవిత్వం రాసినా ఆదరణ ఉండదు. ప్రేమించిన అమ్మాయి (మాలా సిన్హా) బ్రతకనేర్వని కథానాయకుణ్ణి వదిలి, డబ్బున్న ఆసామిని (రెహమాన్) పెళ్ళిచేసుకుంటుంది. తల్లిని చూసుకునే ఆర్థిక స్తోమత ఇతడికి ఉండదు. అన్నల చేత ఎప్పుడూ, ఎందుకూ కొరగానివాడిలా నిరసించబడతాడు. ఈ సమాజం తొసిపుచ్చిన (reject) యువకుడిగా మిగులుతాడు. తనలాగే సమాజం చేత త్యజింపబడి, నిరసించబడే ఒక పతిత(వహీదా రహమాన్) చేత మాత్రమే అభిమానించబడతాడు. ప్రమాదవశాత్తూ అతను చనిపోయాడని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆ పతిత కథానాయకుడి అముద్రిత కవితల్ని తన డబ్బంతా వెచ్చించి అచ్చువేయిస్తుంది. కవితలు గొప్ప సంచలనాన్ని సృష్టిస్తాయి, అప్పటివరకూ తన ఉనికిని త్రోసిపుచ్చిన అందరూ అతని ఇమేజ్(image) కి బ్రహ్మరధం పడతారు. ఈ తతంగాన్ని గమనించిన నాయకుడు, ఈ కుత్సిత బంధువర్గం, సమాజం, ప్రజల డొల్లతనం గ్రహించి “ఈ (ఇలాంటి) ప్రపంచం దొరికినా ఏమి లాభం” (ए दुनिया अगर मिलभि जायॆतो क्या है?) అనుకుంటూ, తనను ఆదరించిన పతితను తీసుకుని, రమణ గారి మాటల్లో, “దిగంతాల వేపు షికారెళ్ళిపోతాడు సాయంసంధ్యలోకి”.

ఒక భావుకుడు ప్రపంచ రీతుల్ని అర్థం చేసుకోలేక, అర్థం చేసుకున్నా వాటికి అనుగుణంగా నడుచుకో లేక, తనచుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను నిరసించి, అభాసుపాలై, అదే సమాజం చేత వంచనకు గురై, దాన్ని కాదనుకుని వెళ్ళిపోయే నాయకుడు ఇతను. సామాజిక దృక్పధంలోంచి చూస్తే తను ఒక పరాజితుడు (failure), కానీ వ్యక్తి దృక్కోణంలోంచీ చూస్తే అతడిది నైతిక విజయం (moral victory). నమ్మిన సిద్ధాంతాన్ని, విలువల్నీ కష్టతరమైన పరిస్థితుల్లోనూ నిలబెట్టుకున్న ధీశాలి, నిబద్ధతకు కట్టుబడిన లోకాన్నే త్యజించగలిగిన త్యాగపురుషుడు. ఈ పరిణామానికి రమణ గారు పెట్టినపేరు “గోరంతలనే గురుదత్ కొండంతలుచేసి చూపించారు” అని.

సినిమా కథని ఒక వ్యక్తిగత పక్షంలో చెప్పినప్పుడు, అదీ కథానాయకుడు ఒక కవి, భావుకుడూ అయినప్పుడు ఆమోదయోగ్యమైన తర్కం కన్నా, తన మనోవేదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ‘ప్యాసా’లో జరిగింది అదే అని నా నమ్మకం. సినిమా ప్రారంభదృశ్యం లోనే, పూలనీ వాటిపైన తిరుగుతున్న తుమ్మెదనీ ఆరాధిస్తున్న నాయకుడు, ఆ తుమ్మెదని త్రొక్కెళ్ళిపోయే పాదాన్ని చూసి కలత చెంది అక్కడినుండీ వెళ్ళిపోతాడు. మొత్తం సినిమా ఆదర్శాన్ని ఈ ఒక్క సీన్లో దర్శకుడు చెప్పినపుడు, గురుదత్ ఈ సినిమాలో “భూతద్దం ఉపయోగించడం. అతిశయోక్తులను విరివిగా వాడటం” పట్ల గల ప్రాతిపదికని కట్టుదిట్టంగా లేనిదీ, నమ్మదగింది కానిదిగా రమణ గారు ఎందుకు భావించారో నాకు అర్థం కాలేదు. దీనికి తోడు “ఇది సినిమా కాబట్టి, అందులోనూ బొంబాయి సినిమా కాబట్టి, కథకి చికిత్స చేసినవారు బొంబాయి ప్రవీణులు కాబట్టి అసాధ్యులు సుసాధ్యులు కావడం అధ్భుతవిషయం కాదు” అని ఒక చురక కూడా అంటించారు.

ఇంతా తెగిడి కొసరుగా,” ఉన్నలోపాలన్నీ లెక్కకు తీసుకున్నా ‘ప్యాసా’ మంచి చిత్రం” అని, ప్యాసా బొంబాయి చిత్రాలలో మహావృక్షం” అని సమీక్షని ముగించారు. కథ ఆశయాన్ని మెచ్చుకుని కథనానికి మసి అంటిందన్న రమణ గారు చివరాఖర్న ఇంతలావు ప్రశంస ఎందుకిచ్చారో అన్నదానికి, నాకు తోచిన సమాధానం ఒక్కటే. వారి నిశిత సినీతర్కం సినిమాలోని లోపాల్ని ఎత్తి చూపినా, హృదయాంతరాళల్లోని వారి రచయిత హృదయానికి ఈ సినిమా బాగా నప్పివుండాలి.

ఇక కొసమెరుపేమిటంటే, నవంబరు 2004 లో ప్రధమ ముద్రణకు నొచుకున్న ఈ ‘సినీరమణీయం 1’ సంకలనంలో ఈ వ్యాసం తరువాత ఒక బాక్సు కట్టిమరీ ప్రచురణ కర్తలు ఈ మాటలు రాసారు. ” రమణచే ఘాటు విమర్శకు గురైన ఈ సినిమా ఇప్పటికీ విమర్శకులచే మన్ననలందుకొంటోంది. సాహిత్యం, సంగీతాలకు ఒక మైలురాయిలా నిలిచిపోయింది. తెలుగులో ‘మల్లెపువ్వు’ పేరుతో పునర్నిర్మితమైంది”.

10 Comments
  1. శంకర్ July 11, 2008 /
  2. venkat Balusupati July 12, 2008 /
  3. Aravindrishi July 13, 2008 /
  4. subbarao July 13, 2008 /
  5. subbarao July 13, 2008 /
  6. శంకర్ July 14, 2008 /
  7. Sharada November 25, 2008 /
  8. వీబీ November 25, 2008 /