Menu

లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్

సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న చీకటి వారనుభవించే ఒంటరితనమూ, దు:ఖమూ బయటకు కనిపించవు.అందులోనూ సినిమా రంగంలో నటీమణులుగా ఎదిగిన స్త్రీలు ఎదుర్కొనే అనుభవాలు అమితమయినవి.

పితృస్వామ్య భావజాలం రాజ్యమేలుతున్న వర్ధమాన సమాజంలో స్త్రీ వినియోగ వస్తువుగా చూడబడతోంది. సినిమా రంగంలో ఆ పరిస్థితి మరింత తీవ్రమయిన రూపంలో కొనసాగుతుంది. అక్కడ స్త్రీ ఒక మనిషిగా కంటే విలాస వస్తువుగానే చూడబడుతూ వుందన్నది వాస్తవం. అక్కడ నటీమణికి కూడా మనసుంటుందని ఆమె మనిషేననే విషయాన్ని పక్కన పెట్టి ఆమె గ్లామరు, ఆమె సంపాదన, ఆమె యవ్వనం మాత్రమే ప్రధానమవుతాయి. ఆ స్థితిలో ఆమె చుట్టూరా ఉన్న కుటుంబమూ, స్నేహితులూ, తోటి కళాకారులూ అంతా దాదాపు ఒకే రకంగా ప్రవర్తిస్తారు.వాటన్నింటి నుంచి భిన్నంగా ఆమె మనసుకోసం, తోడు కోసం సొంతం అనిపించే ఓ నీడ కోసం పరితపిస్తుంది. కాని సర్వత్రా మోసాన్ని స్వార్థాన్ని ఎదుర్కొన్న నటీమణులు తన జీవితాన్నే చాలించిన సంఘటనలు సినీ రంగంలో ఉన్నాయు. మన తెలుగు చలనచిత్ర రంగం అందుకు భిన్నంగా ఏమీ లేదు.

అలా సినిమా రంగంలోని చీకటి వెలుగుల్ని స్పృషిస్తూ వెలువడ్డ పాకుడురాళ్ళు, సినీ జనారణ్యం లాంటి నవలలూ మనకున్నాయి. అలాగే మరాఠీ నటి జీవితాన్ని ఆధారం చేసుకుని శ్యాం బెనగల్ నిర్మించిన ’భూమిక’ లాంటి గొప్ప చత్రాలు వచ్చాయి.

అదే రీతిలో మధ్యేవాదిగా పేరు గాంచిన కె.జి.జార్జి ఓ వాస్తవ సంఘటనను అధారం చేసుకుని ఓ చిత్రం నిర్మించారు. ఓ నటీమణి మద్రాసులో కాలుపెట్టిన నాటి నుంచి నటిగా ఎదిగిన క్రమం అందుకోసం ఆమె పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న స్వార్థాలు చివరగా ఓ స్నేహహస్తం కోసం, ప్రేమించే మనిషి కోసం తపించి తన జీవితాన్నే చాలించిన ఆమె జీవిత కథే ’లేఖాయుదే మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్’. చలన చిత్ర నిర్మాణ పరంగా గొప్ప చిత్రమేమీ కాకపోయినప్పటకీ ఓ సామాజిక సమస్యని చర్చించిన చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుంది.

అప్పటికే ’స్వప్నదానం’ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న జార్జి 1983 లో ఈ చిత్రం నిర్మించారు. టెక్నిక్ పరంగా ఈ చిత్రంలో కథ యావత్తూ ఫ్లాష్ బ్యాక్ లోనే నడుస్తుంది. ఎలాంటి సమస్య లేకుండా కథనం సాక్షిగా సాగిపోతుంది.

లేఖ ఓ మలయాళీ సూపర్ స్టార్. ఆమె మద్రాసులో చనిపోతుంది. ఆమె అంతిమ యాత్రకు వేలాది మంది అభిమానులు ఉప్పెనలా హాజరవుతారు. శవయాత్ర సాగుతూ ఉంటుంది.ఓ కామెంటేటర్ చెప్పడం మొదలుపెడతాడు. ఆ నటి ఆత్మహత్య చేసుకుందేమోనంటాడు. ఆ మరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆమె అర్థంతర మరణకారణాల్ని తెలుసుకోవడానికి చిత్రం క్రమంగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది.

తాగుబోతయిన ఫణిక్కర్, భార్యా కూతురుతో కేరళ నుంచి మద్రాసు చేరుకొంటాడు. అందగత్తె అయిన ఆయన భార్య విశాలం కూతురు శాంతమ్మను సినిమా నటిని చేయాలనుకుంటుంది. తమకు పరిచయమున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ రాజ్ ని సంప్రదిస్తుంది. తాను త్వరలో తీయబోయే సినిమాలో శాంతమ్మకు మంచి పాత్రను ఇస్తానని పాల్ రాజ్ ప్రామిస్ చేస్తాడు. వారు వుండేందుకు ఓ స్థలం కూడా చూపిస్తాడు. వారిని ఓ సినిమా జర్నలిస్టు కారట్టూర్ కి పరిచయం చేస్తాడు. ఆ జర్నలిస్టు శాంతమ్మ పేరును లేఖ గా మారుస్తాడు.

పాల్ రాజ్ లేఖకు అనేక ఆశలు చూపిస్తూ ఆమెను లొంగదీసుకుంటాడు. విశాలం మౌనంగా అంగీకరిస్తుంది. పాల్ రాజ్ సినిమా మొదలు కాకపోవడంతో విశాలం కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది. ఫణిక్కర్ విసుగు చెంది స్వంత ఊరుకు వెళ్ళిపోతాడు. రామప్పన్ అనే తార్పుడు గాడు విశాలం, లేఖలను ధనవంతుల చెంతకు తీసుకెళ్ళడం ఆరంభిస్తాడు. ఆర్థికంగా వారి స్థితి మెరుగుపడుతుంది. వారిద్దరూ మంచి ఇంతికి మారుతారు. అన్సారీ అనే ప్రొడక్షన్ మేనేజర్ లేఖకు మంచి పాత్రను సంపాదిస్తాడు. అలా సినీ రంగ ప్రవేశం చేసి లేఖ క్రమంగా ఎదుగుతుంది. ఆమె ప్రగతికి ఓ కేబరే డ్యాన్సర్ పుష్ప స్నేహం కూడా ఉపయోగపడుతుంది.

అప్పటికే మలయాళి చిత్ర సీమలో సూపర్ స్టార్ లా వెలుగొందుతున్న ప్రేమ్ సాగర్ లేఖని ప్రోత్సాహిస్తాడు. ఆమె పరిస్థితి మెరుగునపడుతుంది. సాగర్ ప్రోత్సాహంతో ఆమె విజయవంతమయిన హీరోయిన్ గా నిలుస్తుంది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ఆమె చుట్టూరా బంధువులు వచ్చి చేరుతారు. ఊరువెళ్ళిపోయిన తండ్రి తిరిగి వస్తాడు.

ఇంతలో కళాత్మక చిత్రాల దర్శకుడు సురేశ్ బాబు లేఖకు తన చిత్రంలో మంచి పాత్రనిస్తాడు. దానికి ఆమెకు జాతీయ స్థాయి అవార్డు లభిస్తుంది. వారిద్దరి నడుమా స్నేహం పెరుగుతుంది. తన భార్యతోనూ, కుటుంబంతోనూ అసంతృప్తిగా ఉన్న సురేశ్ లేఖకు మరింత దగ్గరవుతాడు.

మరో వైపు విశాలం ఆశలకు అంతే లేకుండా పోతుంది. మరింత డబ్బు కోసం లేఖను ఇంకా ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆమె వత్తిడి చేస్తుంది. మొదటి రోజుల్లో తమని ఆదరించిన మిత్రుల పట్ల కూడా ఆమె ఆదరంగా ఉండదు.

వీటన్నింటి మధ్య తీవ్ర మానసిక క్షోభకు గురైన లేఖ సురేశ్ బాబుతో వేరుగా ఉందామనుకుంటుంది. వేరుగా కాపురం పెడతారు. వారి సంబంధం సురేశ్ కు చెడు ప్రచారం కల్పిస్తుంది. అయినా ఆమె లెక్క చేయదు. కాని సురేశ్ భార్య, కొడుకు అతనిపై తీవ్రమైన వత్తిడి తెస్తారు. సురేశ్ లేఖను విడిచి వెళ్ళిపోతాడు. లేఖ పరిస్థితి అర్థం చేసుకున్న కేబరే డ్యాన్సర్ పుష్ప ఆమెను ఓదారుస్తుంది. ఇంతికి తిరిగి వెళ్లిపొమ్మని చెప్తుంది. కాని లేఖ తీవ్రమైన మానసిక క్షోభకు గురై దు:ఖపడుతుంది. పుష్ప నుంచి సమాచారం తెలుసుకొన్న విశాలం ఆమె భర్త లేఖ ఇంటికి వస్తారు. అన్ని తలుపులు కిటికీలు మూసి వుంటాయి. ఓ కిటికీ బద్దలు కొట్టి లోపలికి చూస్తే సీలింగ్ కు వేలాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న కూతురు లేఖ కనిపిస్తుంది.

తల్లి ఆత్యాశకూ, ప్రియుడు సురేశ్ అవకాశవాదానికీ, సినీ జనారణ్యంలో ఆమె మనిషిగా కంటే యంత్రంలాగా చూడబడటాన్ని భరించలేని లేఖ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది.ఆమె జీవితం సినిమా రంగంలో నటిగా ఎదగాలనుకున్న అనేక మంది యువతుల వాస్తవానుభవాల కూడలిగా కనిపిస్తుంది. డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కోసం రూపొందిన వ్యాపార ప్రపంచంలో ఇమడలేని ఓ గొప్ప కళాకారణి ఇతివృత్తమే ఈ చిత్రం.

అయితే ఈ చిత్రంలో సినిమాటిక్ దృశ్య పరంపరంకంటే మెలోడ్రమటికి దృశ్యాల కొనసాగింపు కనిపిస్తుంది. పాత్రల మానసికావిష్కరణల కంటే సంఘటనల కూర్పులా సాగుతుంది. మొత్తం మీద ఓ చలన చిత్ర నటి జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల్ని ఈ చిత్రం మనముందుంచుతుంది.

6 Comments
  1. అబ్రకదబ్ర July 18, 2008 /
  2. అబ్రకదబ్ర July 18, 2008 /
  3. pinnanshetty kishan August 13, 2008 /