Menu

మన ప్రేక్షకుల దృక్పథం

పరిచయం:ఇంటర్నెట్, వందల కొద్దీ టి.వి ఛానెళ్ళు, డివిడిలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మన సినిమా ప్రేక్షకులు దృక్పథం మారిందేమో(మారిందా?), కానీ దాదాపు 65 ఏళ్ళ క్రితం మన సినిమా ప్రేక్షకుల దృక్పథం ఎలా వుండేదో తెలుసోకోడానికి 1944 లో రూపవాణి పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండి.

మన ప్రేక్షకులలో చాలామందికి చిత్రాన్ని ఏ విధముగా చూచి ఆనందించాలో కూడా తెలియదనడములో హేళన యెంతమాత్రమూ లేదు. దర్శకుడు చిత్రములో అక్కడక్కడ ప్రవేశ పెట్టిన సన్నివేశాలలోని అంతరార్థం గ్రహించకుండానే మన ప్రేక్షకులకు చిత్రాన్ని విమర్శించడం బాగా అలవాటైపోయింది. ఫిలిం కొరత ఏర్పడిన కరువు రోజుల్లో కొన్ని ఘట్టాలని క్లుప్తీకరిస్తే, అర్థం చేసుకోలేని ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. పదకొండువేల అడుగులలో కథ మొత్తం పూసగుచ్చినట్టు చూపాలంటే వీలుపడదు. ప్రేక్షకలోకం కొంతవరకు సూక్ష్మదృష్టితో చూస్తే తప్ప యెంత మంచి చిత్రమైనా రాణించడము చాలా కష్టము.

ఒక వ్యక్తి తన గృహము నుంచి బయల్దేరి, రైలు యెక్కి, మరో గ్రామము వెళ్లి, అక్కడనుంచి యే కారుమీదనో ప్రయాణము చేసి తన స్నేహితుని వసతి జేరిన దృశ్యము చూపించలసివుందనుకోండి. దర్శకుడు ఈ దృశ్యాన్నంతా ఒక తృటి కాలంలో చూపేందుకని-క్లోజ్ షాట్ లో, తలుపువేసి బయలుదేరుతున్నట్లు, ఆ వ్యక్తి చెయ్యి గొళ్ళెము మీద చూపించి, అదే చేతిని రైలు పెట్టెకు వుండే వూస మీద, తరువాత అదే చేతిని కారు తపుపునకు వుండే హేండిల్ మీద, తిరిగి ఆ చేతిని తలుపు తడుతున్నట్లు చూపించి, ఆ చేతినే ఇంకో చేతితో కలుపుతున్నట్లు చూపిస్తే చిన్న షాటులో ఎంతో కథని యిరికించవచ్చు. ఈ షాటు చూచి మన ప్రేక్షకుడు ఆ దృశ్యాన్ని అర్థం చేసుకోలేకపోతే మన చిత్రాలు ఎట్లా రాణిస్తాయో మీరే ఆలోచించండి.

ఒక ప్రేక్షకుడు-రామరాజ్యం-మన తెలుగు లవకుశ లా రక్రి కట్టలేదని వాదిస్తాడు. అతడి వాదనలోని ముఖ్యాంశాలు-చాకలి వాడి పార్టు సరిగా చూపలేదని-సీతను అడవిలో వదలి వెళ్ళిపోతున్న లక్ష్మణున్ని ఉద్దేశించి, సీత ఏడుస్తూ పాటపాడలేదని-యీ విమర్శ ఎంత సమంజసంగా వుందో ఆలోచించండి.

దర్శకుడు కొన్ని కొన్ని చోట్ల సృష్టించిన ఘట్టాల్ని అర్థము చేసుకుంటే చిత్రము యొక్క ఘనత యెంతో విశదమౌతుంది. చాకలికి వంటికన్ను సృష్టించడములోని సారాంశము, లక్ష్మణుని మాట విని మూర్ఛపోయిన సీత వెనుకవున్న చెట్టుకొమ్మనుంచి, జతపూలలో నుంచి-ఒక పూవు రాలిపడిపోవడములోని గూఢార్థము, సీత నదిలో పదబోయే ముందు ఆ నదివడ్డునే యెండిపోయిన చెట్టుని చూపించడం లోని ఉద్దేశ్యం, సీత గర్భవతి అని చూపించే ముందు వలయాకారముగా ఉన్న దీపాలమధ్యలో జ్యోతిని చూపించడములోని వుపమానము అర్థము చేసుకోలేని ప్రేక్షులకు ’రామరాజ్యం’ యేం రుచిస్తుంది?

ప్రేక్షకునికి విశాల దృక్పథం అలవడితేనే తప్ప, దర్శకుడు యెన్ని వుద్దేశ్యాలు హృదయములో పెట్టుకొని-యెంతో శ్రమతో – తీసిన చిత్రము కూడా రాణించకుండా పోతుంది. చిత్రములోని అంశాల్ని గాఢముగా పరిశీలించి, దర్శకుడి ప్రజ్ఞాపజ్ఞల్ని విమర్శిస్తే తప్ప, మనకు మంచి చిత్రాలు రావడం దుర్లభం. తక్కువరకం హాస్యానికి అలవాటుపడి, క్రొత్త రకము పాటలకు చెవులుకోసుకు చిత్రాలని చూస్తూ వుంటే, మన దర్శకులు కూడా అదే రకము చిత్రాల్ని తీస్తూ డబ్బు గుంజుకోవడం నేర్చుకొంటారు.

–శ్రీ పైడి వెంకట్రావు

Courtesy:రూపవాణి ఆర్కైవ్స్ @ cscsarchive.org

2 Comments
  1. rajendra kumar devarapalli August 25, 2008 /