Menu

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది.

1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు పై వాక్యాలు. అంతవరకూ సాదా సీదాగా సాగుతున్న తెలుగు పాటలోకి మల్లెల జలపాతంలా చొచ్చుకు పోయింది కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం. తెలుగు సినిమా పాటకి కొత్త వొరవడిని చూపించి, కావ్య వర్ణనా రీతిని చొప్పించిన ఘనత కృష్ణ శాస్త్రి గారి కవిత్వానిది. భావ కవిత్వ సాగరాన్ని చిన్న పాటలో చుట్టేసిన కమనీయ విశిష్ట భావనా శిల్పం ఆయన కవిత. ఎంత రాసినా కాసింత మిగిలిపోతుంది.

పైన ఉదహరించిన పాట పల్లవి మల్లీశ్వరి సినిమాలోదే! పల్లవి ఎత్తుగడే అలా ఉంటే, ఇహ చరణాలు సంగతి సరే సరి. మధురమైన ప్రేమ భావన వల్ల కలిగిన అనుభూతికి విరహాన్ని జోడించీ, ప్రణయ సౌందర్యాన్ని ప్రకృతి కౌగిలిలో చుట్టేసిన విరహ భావాలు అవి.

కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా

నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

అందనంత అర్థాన్ని అలవోకగా పలికించే సరళమైన పదాలవి. వ్యాఖ్యలూ, వివరణలూ అవసరం లేని పొందికైన భావ కవిత్వం అది. అందులో బాధ ఉంది. ఆ బాధలో తెలీని సుఖం ఉంది.

మల్లీశ్వరి సినిమాలో మాటలూ, పాటలతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కృష్ణ శాస్త్రి స్పృశించని తెలుగు హృదయం ఒక్కటీ లేదు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మల్లీశ్వరి సినిమాలో పాటలు ఓ మలయ మారుతంలా తెలుగు ప్రేక్షకుల్ని సమ్మొహితుల్ని చేసాయి.

కేవలం పాటలోనే కాదు, విడిగా చదువుకున్నా వెన్నెల రాత్రులూ, మల్లెల విరహాలూ మనముందు సాక్షాత్కరింపచేసే మత్తైన మకరందాలవి. ఎన్నిసార్లు చదివినా, కొత్త కొత్త అనుభూతులు కలిగిస్తాయి.

సాధారణంగా పాటల్లో సాహిత్యానికి ఒక స్థాయి కనిపించేలా చేసేది సంగీతం. మంచి సంగీతంతో ఏ సాహిత్యానికైనా విలువ మరింత పెరుగుతుంది. సాహిత్యం సంగీతం కంటే ఓ మెట్టు కిందనే ఉంటుంది. కానీ కృష్ణ శాస్త్రి పాట సంగీతాన్ని మించి మరో మెట్టు పైన ఉంటుంది.

ఆయన పాటల్లో ప్రత్యేకతని మల్లీశ్వరి సంగీత దర్శకులు, సాలూరి రాజేశ్వరరావు చాలా సార్లు ధృవీకరించారు. ప్రతీ పాటకీ సన్నివేశాన్ని బట్టి ఒక్కో రాగం నిర్ణయించుకుంటాడు సంగీత దర్శకుడు. సాధారణంగా సినిమాల్లో ముందుగా వరసలు కట్టిన తరువాతే పాట రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వరసకి ( ట్యూన్ ) కి సరిపడేలా పదాలు రావాల్సుంటుంది. అదీకాక పాడడానికి అనువుగా రాయాలి. కొన్ని మాటలు పాటల్లో ఇమడవు. అందువల్ల ముందు సంగీత వరుస కట్టిన తరువాతే రాయడం పరిపాటి. కానీ మల్లీశ్వరి సినిమాకి పాటలు అన్నీ ముందు రాసిన తరువాతే ట్యూన్లు కట్టారు. “ఈ పాటల్లో సాహిత్యం చదువుతుంటేనే అలవోకగా ట్యూన్లు వచ్చాయి. ఏ మాత్రం శ్రమ లేకుండా అతి సులువుగా పాటలు కట్టాను. లలిత గీతాలు రాసిన అనుభవం వల్ల కృష్ణ శాస్త్రి గారి కవిత్వం ఒక పాటలా సాగింది. ” అని రాజేశ్వరరావు అన్నారు.

మనం నిత్యం చూసే పువ్వుల్నీ ఆకుల్నీ, సెలయేళ్ళనీ, గాలుల్నీ సరళ మైన పదాలతో, సున్నితమైన భావాలతో పాట రాయడం అందరికీ రాదు. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అంత సులభం కాదు. ఎవరికీ రానిదీ, చేతకానిదీ అతి సునాయాసంగా చెప్పే గుణం ఆయన పాటకుంది. చిత్ర గీతాల్లో భావుకతని ప్రవేశ పెట్టిన తీరుని ఎంతో మంది అనుకరించారు కానీ, ఆయన స్థాయిలో ఎవరూ రాయలేక పోయారన్నది జగమెరిగిన సత్యం.

దేవులపల్లి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో నవంబరు ఒకటవ తేదీ 1897 లో జన్మించారు. బాల్యమంతా పిఠాపురం లోనే గడిచింది. కృష్ణ శాస్త్రి కాకినాడలో చదివే టప్పుడు బ్రహ్మ సమాజ ప్రభావానికి గురైన సమయంలో అనేక గేయాలు రచించారు. బ్రహ్మ సమాజానికే ఎన్నో గేయాలు రాసారు. అలా అనేక గేయాలు రాసి రాసీ , అందులో నిష్ణాతులయ్యారు. అదే చిత్ర గీతాల రచనకు ప్రేరణ కలిగించింది.

కృష్ణ శాస్త్రి గారి చిత్ర రంగ ప్రవేశం యాద్రుచ్చికంగానే జరిగింది. బెజవాడ గోపాల రెడ్డితో ఆయనకి స్నేహం ఉండేది. గోపాల రెడ్డి గారే ఒకసారి వాహినీ సంస్థ అధినేత బి.ఎన్.రెడ్డి గారికి కృష్ణ శాస్త్రి గార్ని పరిచయం చేసారు. అప్పటివరకూ రేడియోలో రాసిన లలిత గీతాల్నీ, బ్రహ్మ సమాజ గేయాల్నీ విన్న బి.ఎన్.రెడ్డి గారు తను త్వరలో తీయబోయే సినిమాకి పాటలు రాయమని అడిగారు. కృష్ణ శాస్త్రి సరేననడం సినీ రంగ ప్రవేశానికీ, గీత రచనకీ శ్రీకారం చుట్టింది. మొట్ట మొదటి సారిగా మల్లీశ్వరి చిత్రానికి మాటలూ, పాటలూ రాయడం జరిగింది. అప్పట్లో చిత్రసీమని ఒక ఊపు ఊపే సింది మల్లీశ్వరి చిత్రం. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం – రాజేశ్వర రావు గారి సంగీతాన్ని మించి పోయింది కృష్ణ శాస్త్రి కవిత్వం. మల్లీశ్వరి పాటలతో ప్రేక్షకులకి భావ కవిత్వపు నిషా అలవాటయ్యింది.

ఆయన పాటల్లో ఆర్ద్రత, క్లుప్తత, భావుకత, సౌకుమార్యం తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. ఆయన రాయని గీతమంటూ లేదు. శృంగార గీతాలూ, విషాద గీతాలూ, దేశభక్తి గీతాలూ, సామాజిక స్పృహ నిండిన గీతాలూ, పౌరాణిక, చారిత్రాత్మక గీతాలూ, ఒకటేమిటి ఆయన స్పృశించని అంశాల్లేవు. ఏ పాట రాసినా కృష్ణ శాస్త్రి గారి ముద్ర ఖచ్చితంగా తెలుస్తుంది. దాదాపు బి. ఎన్. రెడ్డి గారి అన్ని సినిమాలకీ కృష్ణ శాస్త్రి పాటలు రాసారు.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగీ చూసేవు
ఏడ, తానున్నాడో బావ
జాడ తెలిసినా పోయిరావా
అందాల ఓ మేఘ మాలా ( మల్లీశ్వరి )

కాళిదాసు మేఘ సందేశ సారాన్ని సున్నితంగా చెప్పిన ఈ పాటలో ఆర్తి ఉంది. ప్రేమతో నిండిన ఆశ ఉంది. ఎదురు చూపుంది. అలాగే “పిలిచినా బిగువటరా”, “నెలరాజా వెన్నెల రాజా”, “కోతీ బావకు పెళ్ళంటా” ఇలా ప్రతీ పాటా మల్లీశ్వరి సినిమా విజయానికి కారణం అయ్యింది.

ఒక్క మల్లీశ్వరి తో కృష్ణ శాస్త్రి ప్రాభవం పెరిగిపోయింది. ఆంధ్ర దేశమంతా ఆయన పేరు మారు మ్రోగింది. ఆ తరువాత రాసిన పాటలు కూడా తక్కువేమీ కాదు. రాజ మకుటం సినిమాకి రాసిన ఈ పాట ఆయన ప్రతిభకి మకుటాయమానంగా నిలుస్తుంది.

సడి సేయకో గాలి
సడి సేయ బోకే
బడిలి వడిలో రాజు పవళించెనే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదిరి చూసేనే
నిదుర చెదిరిందంటే నేనూరు కోనే

పండు వెన్నెలనడిగి – పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు – నిదుర తేరాదే
విరుల వీవెన బూని – విసిరి పోరాదే

ఎన్ని భావ చిత్రాలు? పాట వింటున్నంత సేపూ ప్రకృతి వడిలో మనసు సుతారంగా నిద్రలోకి జారుకుంటుంది. నిశ్శబ్దాన్ని కూడా లొంగదీసుకున్న కవిత్వమిది.

( మిగతా వ్యాసం రెండో భాగంలో….)

ఈ వ్యాసం సంక్షిప్త శబ్ద తరంగం ఇక్కడ వినచ్చు.

–సాయి బ్రహ్మానందం గోర్తి

6 Comments
  1. Sowmya July 13, 2008 /
  2. శంకర్ July 13, 2008 /
  3. MOHAMMAD August 8, 2008 /
  4. Falling Angel September 16, 2008 /