Menu

నా కళ్ళతో దశావతారం – 2

దశావతారం సినిమా గురించి ఇటీవలే ఓ టపా రాసాను. కానీ, ఆ సినిమా లో కమల్ పోషించిన పది పాత్రల గురించీ రాయాలనుకుని, అది పెద్దదైపోయిందని ఆపేశాను. ఆ టపా కొనసాగింపు ఈ టపా. మొదటి భాగం ఇక్కడ.

1. గోవిందరాజు పాత్ర: సైంటిస్టు గోవిందరాజు పాత్ర – కమల్ కమల్ లా ఉన్న మూడు పాత్రల్లో ఇది ఒకటి. (మిగితా రెండు నంబి, బలరామ నాడార్.) ది టిపికల్ కమల్ హాసన్ ని ఇక్కడ చూడొచ్చు. పాత్ర పరంగా బానే ఉంది. పాపం ప్రధాన పాత్రే అయినా పాటలేదు. 🙂 ఈ పాత్ర పరంగా ఒకే సందేహం. గో.రా. పేరు ఎందుకు వాడుకున్నారు? అన్నది. అది తమిళ వర్షన్ చూసిన వాళ్ళ కథనం విన్నాక అర్థమైంది – అక్కడ వేరే పేరు వాడుకున్నారు కనుక, తెలుగులో గో.రా. ను తేవలసి వచ్చింది అని. కానీ, అలా చూసినా కూడా నాకు ఆ బిట్ అనవసరం అనిపించింది. ఈ పాత్ర పరంగా కమల్ పర్వాలేదనిపించాడు నాకు. ది టిపికల్ కమల్ అయినా కూడా, వయసు తెలుస్తోంది కనుక, పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

2. రంగరాజన్ నంబి పాత్ర: ఇది చూస్తూ ఉంటే, నిజంగా ఆ నంబి ఉండి ఉంటే ఇలాగే ఉండేవాడేమో అనిపించింది. అంత బాగా కుదిరాడు కమల్ ఈ పాత్రకి. ఎక్కువ డైలాగులూ గట్రా లేవు గానీ, ఉండి ఉంటే బాగుండేది. అసలీ పాత్రే పెట్టి పెద్ద కథ ఒకటి నడిపించి ఉండాల్సింది. (అప్పుడు పది పాత్రల కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యేది కాదు, కమల్ దుగ్ధ తీరేదీ కాదు అనుకోండి… అది వేరే విషయం.) ఈ పాత్ర ఆహార్యం విషయంలోగానీ, తెరపై చూపే విషయంలో గానీ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అసలు సినిమాలో ఈ భాగం తీసినట్లు ఇంకే భాగమూ తీయలేదేమో.

3. బుష్ పాత్ర: బుష్ పాత్రకి కమల్ బాగా సరిపోయాడు. బుష్ కదలికల్నీ, కవళికల్నీ ఎంత చదివాడో ఆ పాత్ర పోషణలోనే తెలుస్తోంది. ఇంతకీ నాదో సందేహం. ఇలా బుష్ ని ఓ ఐటెం లాగా చూపిస్తే, ఆయనూరుకుంటాడా? అని. ఈ పాత్ర మేకప్ కూడా బుష్ లాగానే ఉంది. ఎటొచ్చీ, కమల్ మాదిరిగా లేదు…అదీ సమస్య. 😉 అయితే, ఇక్కడో లాజిక్ ఉంది. కమల్ లా ఉంటే, అమెరికన్ లా ఎలా ఉంటారు? అందుకని, అమెరికన్ లాగా అనిపించడానికి పడ్డ కష్టమన్నమాట ఇది 🙂

4. ఫ్లెచర్ పాత్ర: నాకు బాగా నచ్చిన పాత్రల్లో ఇదొకటి. విలనీ ని అద్భుతంగా చూపించారు ఈ పాత్రలో. ఈ పాత్ర శరీరాకృతి దగ్గర్నుండి, ప్రవర్తనా, భాషా, ముఖ్యంగా మేకప్ – ఎక్కడ కూడా నాకు కమల్ లాగా అనిపించలేదు. ఈ వాక్యాన్ని చెప్పడం లో వ్యంగ్యం మాత్రం లేదు సుమండీ. అంతగా, పూర్తి వేరే మనిషిగా తన్ను తాను ఆవిష్కరించుకున్నాడు కమల్. ఫ్లెచర్ అనగానే ఫ్లెచర్ గుర్తుకొస్తాడు కానీ కమల్ కాదు. అంతగా కమల్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు.

5. జపాన్ మనిషి పాత్ర: ఏ కాస్త కూడా కమల్ అనిపించని పాత్రల్లో ఇదొకటి. కానీ, ఈ పాత్రకోసం కమల్ జాపనీస్ లో కూడా డైలాగులు చెప్పుకున్నాడంటే అర్థమౌతున్నది అతను తీసుకున్న శ్రద్ధ. ఎక్కడా ఇదో భారతీయుడు పోషించినట్లు తెలియలేదు. నిజం జాపనీయుడే నటించినట్లు అనిపించింది. ఇలా అసలు నటిస్తున్నది ఎవరో కూడా అర్థం కానంత బాగా నటించడం మరి మరొకరికి సాధ్యం కాదు. అసలు ఇది మంచి విషయమో,కాదో కూడా తెలీడం లేదు నాకు. ఓ పక్క ఇంకో ప్రశ్నే లేకుండా అర్థమవుతోంది కమల్ లోని నటనా ప్రతిభ – చూసేవారికి చూస్తున్నది తననా? ఇంకోరినా? అన్న అనుమానం కలిగించేంతగా తన్ను తాను మారుస్తూ వైవిధ్యం కలిగిస్తున్నాడు కనుక. ఓ పక్క -ఇలా చేయడం వల్ల అతని ప్రతిభ గురించి మళ్ళీ మళ్ళీ అతనే చెప్పడం తప్ప జరిగేదేమిటి? అని అనుమానం. ఈ కథ ఇంకోరెవరో రాసి, ఇంకోరెవరో స్క్రీన్‍ప్లే చేసి ఉండాల్సిందేమో…అప్పుడు ఇది ఇలా మేగాలోమేనియా లా అనిపించేది కాదేమో.

6. బలరామ నాడార్ పాత్ర: బలరామ నాడార్ – పేరు తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వు ఆగడం లేదు నాకు నిజానికి. అంత బాగా హాస్యం పండించాడు కమల్ ఈ సినిమాలో. అసలు ఈ పాత్రతోనే పూర్తి స్థాయి హాస్య సినిమా తీస్తే చూడాలనిపించింది నాకు. ఈ పాత్ర కనబడే విధానం “ఇంద్రుడు-చంద్రుడు” లో మేయర్ పాత్రకి దగ్గరగా అనిపించడం యాదృచ్ఛికమో లేక మరొకటో మరి నాకు తెలీదు. “సైంటిఫిక్ టెర్రరిస్టా? టెరిఫిక్ సైంటిస్టా?” అన్న వాక్యం ఎన్ని సార్లు గుర్తు తెచ్చుకున్నానో లెక్కలేదు. ఇంతకీ, దీనికి ప్రధానంగా మనం తలుచుకోవలసినది సంభాషణల రచయితనైనా కూడా, తెరపై హాస్యాన్ని విజయవంతంగా పండించిన కమల్ ని తలుచుకోకుంటే ఎలా?

7. బామ్మ కృష్ణవేణి పాత్ర: కృష్ణవేణి పాత్రలో కొంతవరకు మేకప్ కృత్రిమంగా అనిపించినా కూడా, కమల్ నటన నాకు చాలా నచ్చింది. ఈ పాత్ర ద్వారా పండించిన హాస్యం కూడా నచ్చింది. చిత్రంలోని మిగితా పాత్రలకీ, ఈ పాత్రలకీ చాలా తేడా ఉంది. నా ఉద్దేశ్యంలో, కమల్ ఈ పాత్ర పోషించడం వేరు, మిగితా తొమ్మిదింటినీ పోషించడం వేరు. ఎందుకంటే, ఒక మగ మనిషి, ఆడ పాత్రను, అదీ ముసలి పాత్రను పోషించడం వివిధ మగ పాత్రల్ని పోషించడం కంటే కష్టం. అయినప్పటికీ, కమల్ ఈ విషయంలో విజయం సాధించాడనే చెప్పాలి.

8. పాప్ సింగర్ అవతార్ సింగ్ పాత్ర: అవతార్ సింగ్ – పంజాబీ గెటప్ బానే కుదిరింది. పంజాబీలాగ మాట్లాడటం కూడా చాలా చోట్ల బానే కుదిరింది. కాకుంటే, ఆ “ఓ ఓ సనమ్” పాటలో నృత్యాలలో మరింత పంజాబీతనం చూపించి ఉంటే ఇంకా బాగుండేది. ఇదివరలో చెప్పినట్లు, ఏ పాత్ర ప్రత్యేకత దానిది. పాప్ సింగర్ భార్యగా జయప్రద కనిపించడం నాకు pleasant surprise. చాలారోజులకి జయప్రదనీ, స్క్రీన్ పై వీళ్ళిద్దర్నీ కలిసి చూడటం బాగుంది.

9. పొడుగు మనిషి కనీఫుల్లా పాత్ర: ఈ పాత్ర మేకప్ అన్నింటికంటే ప్లాస్టిక్ మేకప్. మనిషి అంతెత్తుకి ఎలా కనిపించాడో కానీ, ఐడియా బానే ఉంది. కానీ, మేకప్ విషయంలో – అంత ప్లాస్టిక్ గా చేయాల్సిన అవసరం ఏముంది? ప్లెచర్, జపాన్ మనిషి – వీళ్ళంతా అంటే, విదేశీయుల్లా కనబడాలి కనుక మేకప్ అంతగా మార్చారు. ఇది భారతీయ మొహం ఐనప్పుడు, ఎందుకంత కృత్రిమంగా మేకప్ వేయడం? నాడార్, అవతార్,గోవిందరాజు,నంబి – ఇన్నింటిలో కమల్ లా కనబడ్డ కమల్ ఈ పాత్రలో మాత్రం ఎందుకు కనబడలేదు? ఆ నాలుగూ కాక మిగితా పాత్రల్లో కమల్ మేకప్ విషయంలో అంత కష్టపడ్డం లో అర్థం ఉంది. ఈ మనిషి మేకప్, ఆ గొంతుక – అలా ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. కాకుంటే, హాస్యం పరంగా ఈ పాత్ర కూడా బానే ఉంది.

10. దళిత నాయకుడు విన్సెంట్ పుణ్యకోటి పాత్ర: కమల్ పూర్తిగా పుణ్యకోటిగా మారిపోయాడు. ఆ నడక, ఆ చూపూ, ఆ నవ్వూ – అన్నీ పుణ్యకోటికి ప్రత్యేకం. ముఖ్యంగా ఆ నడక. అసలు కమల్ హాసనే ఇది చేసాడు అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. సగం పాత్రల గురించి అలాగే ఆశ్చర్యపోయాననుకోండి, అది వేరే విషయం. అసలు ఒక్కో పాత్రా ఒక పూర్తి స్థాయి పాత్రగా ఎదగగలదు, సరైన కథ రాస్తే. కమల్ అన్ని పాత్రల్నీ అవలీలగా పోషించగలడని కొత్తగా ఈ సినిమా చెప్పేదేం లేకపోయినా కొత్తగా చెప్పింది. ఇంతటి ప్రతిభని జీర్ణించుకోడం కూడా కష్టమేమో ఒక్కోసారి. అందుకే ఏమో దీన్ని చాలామంది ఒప్పుకోలేకపోవడం.

ఈ సినిమా గురించి మధ్యలో కొంత నెగిటివ్ గా ఆలోచించినా కూడా, మళ్ళీ ఇప్పుడు దశావతారం appreciation మూడ్ లోకి వచ్చేసా ఈ వ్యాసం చివరికి వచ్చేసరికి. 🙂 మొత్తానికి నాకైతే “ది మేకింగ్ ఆఫ్ దశావతారం” అని కమల్ ఓ పుస్తకం రాస్తే అది తరువాతి తరాలకి ఉపయోగపడుతుందేమో అన్పిస్తోంది. పాత్రల్ని ఎలా సృష్టించారు? పాత్రల రూపాలు, మేనరిజమ్స్ విషయంలో ఎలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకున్నారు, కొందరు కమల్ హాసన్లు ఒకే సారి కనబడ్డప్పుడు, కలబడ్డప్పుడు – ఎలా తీసారు ఆ దృశ్యాలని.. ఇలాంటి విషయాలను వివరిస్తూ. మొదటి టపాతో పోలిస్తే ఇది కాస్త విమర్శలాగా అనిపించవచ్చు కానీ, I still like the film. కమల్ లో నార్సిసిజం ఎక్కువై ఉండొచ్చు.. లోకనాయకుణ్ణని ఫీలవుతూ ఉండవచ్చు. అదంతా దశావతారంలో బాగా చూపించుకుని ఉండొచ్చు కానీ, despite all that, it was a great effort for an Indian film. ఈ సందర్భంగానే ఈ మధ్య చదివిన ఓ ఫార్వర్డ్ లోని ఓ వాక్యం సారాంశం – “కమల్ ఈ సినిమాలో మీ దేవుడు, మీ దేవుడు అనడం ఆస్తికులకి ఇబ్బంది కలిగించి ఉండవచ్చు గానీ, మీ కమలే కదా అన్నది… పోనిద్దురూ…”. అలాగే… కమల్ మేగాలోమేనియా లో ఉండొచ్చు…కమల్ కి తనమీద అతి విశ్వాసం ఉండొచ్చు… కానీ, మన కమలే కదా.. ఎవర్నన్నా ఇష్టపడితే వాళ్ళ తప్పొప్పుల్తో సహా స్వీకరించమూ? ఇదీ అలాగే… after all, nobody is perfect 🙂

15 Comments
 1. anveshi July 14, 2008 /
 2. శంకర్ July 14, 2008 /
 3. nageswra rao July 14, 2008 /
 4. krishna July 14, 2008 /
 5. krishna July 14, 2008 /
 6. శ్రీ July 14, 2008 /
 7. venkat Balusupati July 15, 2008 /
 8. aswin budaraju July 15, 2008 /
 9. అబ్రకదబ్ర July 15, 2008 /
 10. kamala August 4, 2008 /
 11. rayraj May 16, 2009 /
 12. sadguna May 19, 2009 /