Menu

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్ బార్‍లో పాటలు పాడే క్యాబరే సింగర్‍ని వశపరచుకోవడానికి ప్రయత్నించడంతో తన జీవితానికి సార్ధక్యం లభిస్తుందనుకుంటూ బ్రతికేస్తుంటాడు. నాలుగు మాటలు ఎవరితోనన్నా మాట్లాడితే అందులో మూడున్నర మాటలు తనగురించి, ఇంకో సగం తాను ఎదుటివాళ్ళ నుండి ఏం ఆశిస్తూంది ఉంటాయి. తనను ఎంతగానో ప్రేమించిన భార్యను అంత ఘాడంగా ప్రేమించలేక నానా ఇబ్బందులు పెట్టి ఆత్మహత్య చేసుకునే భాగ్యం కలిగిస్తాడు.  ఇంతటి సహ్రుదయుడికి నా అనేవాళ్ళు ఎవరూ లేకపోయినా టిటానిక్ బార్ ఎజమాని మాత్రం స్నేహం లాంటిది చేస్తూ చీప్ లిక్కర్‍తో పోషిస్తూ ఉంటాడు. ఒకానొక సమయాన ఒక స్మగ్లింగ్ విషయంలో Karrerని ఉపయోగించుకోవాలనుకుంటాడు ఈ బార్ ఓనర్. అయితే మన Karrer ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టే ఆలోచన ఒకటి వేసి ఆ బార్ సింగర్‍ భర్తకి డబ్బాశ చూపించి మూడు రోజులపాటు ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాడు. ఆ సమయంలో తన పధకం ప్రకారం ఆమెను వశపరచుకొన్నప్పటికీ Karrerలోని స్వార్ధాన్ని గ్రహించిన ఆమె కలిసి జీవించడానికి ఒప్పుకోదు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని భర్త జరిపే స్మగ్లింగ్ వ్యవహారం మీద పోలీసులకు ఉప్పందిస్తాడు. అయితే అక్కడి పోలీస్ వ్యవస్ధ అంత పటిష్టం కాకపోవడంతో ఆ పధకం కూడా ఫెయిల్ అవుతుంది. ఇక తిరిగొచ్చిన భర్త ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంకెప్పుడూ తన భార్యవైపు చూడొద్దని వార్నింగ్ పడేసి , బాగా తాగేసి పడుకుంటాడు. వీళ్లిద్దరి దగ్గరా సరైన సెక్యూరిటీని ఫీల్ కాని ఆ బార్ డ్యాన్సర్ తన యజమానితో ఉడాయిస్తుంది. ఈసారి ఉన్నా ఒక్క ఆధారాన్ని కూడా తెగనరికే మహత్తరమైన పధకం ఒకటివేసి తన మిత్రుడులాంటి బార్ ఓనర్ పైన కూడా పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళు షరా మామూలుగా కేసు బలంగా లేదనీ ఇంకా ఏవేవో కారణాలు చెప్తారు. ఇంక ఏవిధంగానూ ఆమెను పొందలేననే బాధతో పిచ్చోడిలా రోడ్డుమీద పడి కుక్కలతో తిరుగుతూంటాడు ( మనుషులెవరూ తనను చేరదీయరనే విశ్వాసంతో).

ఇంత అద్వాన్నమైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించాల్సిన అవసరం ఏంటంటే అదే bela Terr గారి style. తాను ఏమనుకుంటాడో అది చాలా బలంగా నమ్మే వ్యక్తి ఈయన. కలెక్షన్‍ల మీదా, పాపులారిటీ మీదా ఆధారపడకుండా కేవలం తన నైపుణ్యం మీద డిపెండ్ అవ్వడం వల్లనే Bela Tarr సినిమాలన్నీ నిరాశావాదంతో నిండి ఉంటాయి. మామూలు సినిమాలు కష్టాలతో మొదలయ్యి సుఖాన్ని వెదుక్కొంటుంటే ఈయన సినిమాలు రివర్స్ గేర్‍లో వెళ్తుంటాయి.  ఇదే కధని ఇంకెవ్వరైనా తీస్తే మనం Kerrar కధని అంతలా అసహ్యించుకోలేం. ఈ సినిమా మొదటి సన్నివేశంలో ఒక మైనింగ్ జరిగే ప్రాంతంలో నివశించే Kerrar  అక్కడ ముందుకి వెనక్కి వెళ్ళే కోల్ బకెట్లను చూస్తూ సిగెరెట్ కాలుస్తూ ఉండడం చూస్తాం. ఈ సీన్ దాదాపు పది నిమిషాలపాటు సాగుతుంది. అప్పటికి మనందరం టిక్కెట్ లేకుండానే బుడాపెస్ట్ లోని మైనింగ్ జరిగే ఆ ప్రాంతంలో ల్యాండ్ ఐపోయి Kerrar వెనకాలే నిలబడి చూస్తుంటాం. అంత స్ట్రాంగ్‍గా ఉంటుంది ఆ సీన్. ఆ తర్వాత సీన్‍లో చాలా మెకానికల్‍గా గడ్డం చేసుకుంటున్న Karrerని చూసి అతను ఎంతటి రాతి మనిషో(సింబాలిక్‍గా ఈ సీన్‍లో ఒక రాతి గోడను కూడా చూపిస్తాడు) ఒక ఐడియాకి వస్తాం. ఇక సినిమాలో నిరంతర వానాస్రవంతిలో తడవలేదంటే అది చూస్తున్న మనతప్పే కానీ చిత్రీకరణలో కొంచం కూడ లోటు లేదు. ప్రధానంగా పైన చెప్పిన కధనే స్క్రీన్‍పైన నడిపిస్తూన్నా హంగేరీలో నెలకొన్న సామాజిక పరిస్ధితి అద్దంపట్టేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు. సరైన డ్రయినేజి సిస్టం లేకపోవడం వల్ల మురికితో నిండిన రోడ్లు,  ఎక్కడపడితే అక్కడ కుక్కలు తిరగడం, ఎప్పుడూ బోరున పడే వానా, ఈగలు తోలుకుంటూ ఉండే పోలీస్ స్టేషన్, మైనింగ్ బకెట్లు చేసే రణగొణ శబ్ధాలూ అన్నీ Karrerని, తనతో పాటు మనల్ని damnationలోకి లాక్కెళ్ళేవే. ఇలాంటి పరిస్ధితుల్లో జీవనం సాగించే Karrer, బార్ సింగర్, ఆమె భర్త, బార్ ఓనర్ ఈ నలుగురి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంటూ ఎప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారొ తెలియని గందరగోళంలో పడెయ్యడమే ఈ సినిమాకి ఆయువుపట్టు. ఇక Karrerకి ఆమె మీద అంత ప్రేమెందుకంటే అలాంటి జీవితంలో కూడా బార్‍లో ఆమె పాడే ఆశాజనక గీతం ఒకసారి వినాల్సిందే. సినిమాల్ని ఎంటర్‍టైన్‍మెంట్ కోసం చూసేవాళ్ళు ఈ సినిమాని skip చేయొచ్చు, కానీ సీరియస్ సినిమాల్ని ఇష్టపడేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా లాంగ్,మీడియం షాట్‍లతో ఒక కళాఖండాన్ని స్ఫురింపజేసే సినెమాటోగ్రఫర్ పనితనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. వైట్ అండ్ బ్లాక్‍లో వచ్చిన అద్భుతమైన సినిమాటొగ్రఫీ గురించి ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఈ సినిమాని గుర్తుచేసుకోకుంటే అది సంపూర్ణం కానట్టే. కొన్నిసార్లు అసలు కెమెరా ఎక్కడ పెట్టారో కూడా అర్ధం కానంత గొప్పగా అనిపిస్తుంది. ఉదాహరణకు రెండవ సీన్‍లో గడ్డం చెసుకునేప్పుడు లెఫ్ట్ నుండి మొదలుపెట్టి మనకు Karre వెనుకనుండి చూపిస్తాడు, ఈ సీన్‍లో కెమెరా ప్లేస్‍మెంట్ చాలా క్లిష్టతరంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలోని లాంగ్ షాట్‍లలోని బ్యూటీని వర్ణిస్తూపోతే ఇంకో టపా రాయొచ్చు. ప్రతీ సీన్ కూడా అంతలా ముద్ర వేస్తాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రేక్షకాదరణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల రావాల్సిన గుర్తింపు కూడా రాక ఇలాంటి సినిమాలని ఇష్టపడేవాళ్ళను కూడా చేరలేక సతమౌతున్నాయి ఈ bela terr సినిమాలు. ఏదో సినిమా అన్నాకా కధ కావాలి కాబట్టి అన్నట్టుగా ఇలాంటి చిన్నపాటి, సన్నపాటి ప్లాట్‍తో రెండుగంటలు పాటు వాయించేకంటే మంచి కధతో ఇదే టెక్నీషియన్స్ తో తీసుంటే bela tarr ఎప్పుడొ గుర్తింపు తెచ్చుకునేవాడు. అంతగా ప్రేక్షకాదరణ నోచుకోలేని ఇలాంటి సినిమాలో అంతమంది అద్భుత ప్రతిభ వృధాగా పోవడం బాధాకరం(damnation).

5 Comments
  1. sasank August 7, 2008 /
  2. ravi August 7, 2008 /