Menu

Atonement

Atonement సినిమా చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నా ఎదో ఒక కారణం వలన ఇన్నాళ్ళూ చూడలేకపోయాను. పోయిన వారాంతరం ఎలాగో కుదుర్చుకుని వెళ్ళి ఈ సినిమా చూసాను. సినిమా మరీ గొప్పగా లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలలో ఇది ఒకటి.

ఈ సినిమా మొదటి సగం ఒక రోజులో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడితే మిగిలిన సగం ఒక జీవిత కాలపు కథను కలిగి వుంటుంది. ఇది Briony మరియు Cecilia అనే ఇద్దరి అక్కా చెల్లెల్ల కథ. వీరిద్దరిలో చిన్నదయిన Briony కి కాస్తంత సృజనాత్మకత ఎక్కువే! పదమూడేళ్ళకే నాటకాలూ అవీ రాస్తుంటుంది. ఇక పెద్దదయిన Cecilia అప్పుడే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పట్టభద్రురాలయి ఇంటికి వచ్చి వుంటుంది. కథ జరిగే నాడు ఆ ఇంట్లో ఈ అక్క చెల్లెల్లే కాకుండా వారి బంధువులమ్మాయి Lola కూడా వారితో పాటే వుంటుంది. వీరితో పాటు ఆ ఇంట్లో వున్న మరో వ్యక్తి Robbie. ఇతను ఆ ఇంటి నౌకరు కొడుకు మరియు కేంబ్రిడ్జిలో Cecilia తో పాటు చదువుకుని కూడా వంటాడు.

మొదట్నుంచీ Cecilia మరియు Robbie ల మధ్య ఏదో జరుగుతుందని Briony కి అనుమానం. దానికి తగ్గట్టుగానే Cecilia మరియు Robbie ల మధ్య స్నేహానికి మించిన భావమేదో వుందన మనకీ అనిపిస్తుంది. అప్పుడప్పుడే యుక్తవయసులోకి అడుగెడుతున్న Briony కి వీరద్దరి మధ్య జరుగుతున్న అదేంటో అప్పుడప్పుడే అర్థమవుతుంటుంది. ఒక్కో సారి ఏమీ లేకపోయినా తన ఊహాశక్తికి పని పెట్టి మరీ ఎదో వుందనుకుని భ్రమ పడుతుంది. Cecilia మరియు Robbie ల పై ద్వేషం కూడా పెంచుకుంటుంది.

ఉదయాన్నే మొదలయిన కథ రాత్రయ్యే సరికి పాకాన పడుతుంది. ఆ రోజు రాత్రి Lola పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన అత్యాచార ప్రయత్నం Robbie పై నెట్టి అతనిపై తనకున్న కోపాన్ని తీర్చుకుంటుంది Briony. ఆమె చేసిన ఫిర్యాదు కారణంగా ఏ పాపమూ తెలియని Robbie జైలు పాలవుతాడు. అక్కడ్నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగి రెండవ ప్రపంచ యుధ్ధనేపధ్యంలోకి చేరుతుంది.

చిన్ననాడు తను చేసిన పాపానికి శిక్షగా Briony యుధ్ధసమయంలో ఒక నర్స్ గా చేరి క్షతగాత్రులకు సేవలందించి తన పాపాలకు పరిహారం (Atonement) చేసుకోవాలనుకోవడమే ఈ కథ ముఖ్యాంశం.

ఒక రోజు సాయంత్రం వారి మధ్య జరిగిన అనూహ్య సంఘటనల నేపధ్యంలో జరిగే డ్రామా ను సినిమా మొదటి సగంలోఆధ్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు Joe Wright.ముఖ్యంగా Robbie, Cecilia, మరియు Briony ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్. ఎలాంటి కథనయినా కథనం ద్వారా కొత్త ప్రక్రియలు ఎన్నుకుని నూతనంగా ప్రేక్షకులకందించడంలోనే మంచి దర్శకుని పనితనం తెలుస్తుంది.

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం కథనంలో దర్శకుడు చేసిని కొన్ని నూతన ప్రక్రియలు. ఒకే విషయాన్ని వేర్వేరు ధృక్కోణాలలో చూపించడం అనేది కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో చాలా effective గా వుపయోగించాడు దర్శకుడు. ఉదాహరణకు ఒక సీన్లో Briony కిటికీ లోనుంచి బయటకు చూస్తూ దూరంగా ఒక water fountain దగ్గర నిల్చున్న తన అక్క Cecilia మరియు Robbie లను గమనిస్తూ వుంటుంది. కొద్ది సేపటికీ Cecilia తన దుస్తులు విప్పేసి నీళ్ళలో దూకుతుంది. కాసేపటికి బయటకు వచ్చి Robbie వైపు అదోలా చూసి వెళ్ళిపోతుంది. అక్కడ జరిగిన సంభాషణలేవీ వినకుండానే ఎదో వూహించుకుంటుంది Briony. ఆమెతో పాటే ప్రేక్షకులు కూడా! నిజానికి ఆమె ఊహించనేదీ అక్కడ జరగదు. అసలక్కడ ఏమి జరిగింది అనేది ప్రేక్షకులకు ఆ తర్వాత సీన్లో అవగతమవుతుంది. ఈ విధంగా Briony చూసిన విషయం ముందు చూపించి అసలక్కడ ఏమి జరిగిందనేది తర్వాత చూపించడమనేది దాదాపు కొత్త ప్రక్రియే. అంటే Cause-Effect అనే వరుస పాటించకుండా ముందు effect చూపించి ఆ తర్వాత cause చూపించడమన్న మాట.

కాకపోతే సినిమా మొదటి సగంలో మాత్రమే ఇలాంటి కొత్త కల్పనలు చేసిన దర్శకుడు రెండో సగంలో పెద్దగా ఏమీ చెయ్యలేదనే చెప్పాలి.కానీ క్లైమాక్స్లో మాత్రం ప్రేక్షకులకు మరో నవ కల్పన ద్వారా సంబరం కలుగ చేసాడు Joe Wright.

గతంలో వచ్చిన Pride and Prejudice సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు, మరియు Pride and Prejudice సినిమా ద్వారా ఆస్కార్ వరకూ వెళ్ళిన Keira Knightley తో కలిసి Joe Wright రూపొందించిన ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు. కాకపోతే మొదటి సగంలో కథపై వున్న పట్టు రెండో సగంలో లేకపోవడం కాస్తా నిరాశ కలిగిస్తుంది.

Atonement అనే నవల అధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ నవల చదివిన చాలా మంది సినిమాగా తీయడం కష్టమని మూతివిరిచేసినా Joe Wright ఈ నవలను నిజాయతీగా స్క్రీన్ పైకి అనువదించడంలో సఫలమయ్యాడనే చెప్పొచ్చు.

4 Comments
  1. అబ్రకదబ్ర September 9, 2008 /