Menu

భారతీయ సినిమాల్లో స్త్రీ

నాటి నుంచి నేటి దాకా మానవ వ్యక్తీకరణలకు ప్రతిరూపాలైన కళారంగాల్లో స్త్రీలను చిత్రించడంలో కూడా ’వివక్ష’ జీవితమంత విశాలంగానే సాగుతూ వచ్చింది. గత శతాబ్దం మానవాళికి అందించిన మహత్తరమైన కళారూపం సినిమా కూడా స్త్రీలపట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తూనే ఉంది. సమిష్టి కళారూపమై సమాజపు అన్ని కోణాల్ని ఆవిష్కరిస్తూ ముందుకు రావాల్సిన సినిమా మహిళా దృక్పధాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకు సాగింది.ప్రజలపైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని నమోదుచేస్తున్న ఈ దృశ్య శ్రవణ మాధ్యమం స్త్రీలను, స్త్రీల సమస్యల్ని, స్త్రీల వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో చిత్రించలేక పోయింది.’ప్రధాన స్రవంతి’ సినిమాగా ప్రజల ముంగిళ్ళ ముందు వెలుగొందుతున్న వ్యాపార సినిమా స్త్రీని ఒక వినియోగ వస్తువుగానో, ఒక అలంకరణ గానో, ఆకర్షణగానో చిత్రించిందే తప్ప స్త్రీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం దాదాపుగా చేయలేదు. స్త్రీ వాద చిత్రాల మాట అటుంచి స్త్రీని పరిపూర్ణ వ్యక్తిగా చిత్రించడంలో కూడా భారతీయ ప్రధాన స్రవంతి సినిమా ఘోరంగా విఫలం చెందింది. అనేకానేక చిత్రాల్లో భార్యలు గాను, ప్రియురాళ్ళు గాను, వ్యాంపులు గాను చిత్రీకరించారే తప్ప రక్తమాంసాలున్న సొంత ఆలోచనలు సొంత వ్యక్తిత్వం వున్న మహిళగా చూపించే ప్రయత్నాలు అతి స్వల్పంగానే జరిగాయి. ఇంకా ఇటీవల కాలంలో ప్రేయసికి వ్యాంపుకి మధ్య ఉన్న విభజన రేఖను తుడిచేసి ఉదాత్తమైన భావనలకి ఉనికి లేకుండా చేసేసారు. చెట్లవెంట, గుట్టలవెంట పరుగులు తీయడానికి, బూతుల్లాంటి పాటలకి స్టెప్పులు కదపడానికి లేదా త్యాగానికి నిలువెత్తు రూపమై కన్నీటి కుండలా కనిపించడానికి మాత్రమే స్త్రీ పాత్రలు రూపుదిద్దుకుంటున్నాయి.

అయితే భారతీయ సినిమా చరిత్రను పరిశీలించినప్పుడు అక్కడక్కడా మహిళా సమస్యలపైన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు లేకపోలేదు. విజ్ఞులైన చలన చిత్రకారులు కొంతమంది మైలురాళ్ళుగా నిలిచిపోగల చిత్రాల్ని నిర్మించారు.

కానీ భారతీయ సినిమా రంగంలో అధిక శాతం చిత్రాల్లో స్త్రీని అయితే పతివ్రతగానో లేక శక్తి స్వరూపిణిగానో చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. రెండు భిన్నధృవాలుగా వున్న వ్యతిరేకమైన స్త్రీ పాత్ర చిత్రణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక సారి భారతీయ సినిమాను అవలోకిస్తే….

ఫాల్కే నిర్మించిన ’రాజా హరిశ్చంద్ర’ చిత్రంతో భారతీయ చలనచిత్ర రంగం ఊపిరి పోసుకుంది. సినిమా నిర్మాణం ఆరంభమైన మొదటి దశాబ్దంలోనే మహిళా ప్రాధాన్యతా చిత్రాల నిర్మాణం ఆరంభమైంది. భారతీయ చలన చిత్ర రంగంలో మొట్టమొదటి మహిళాత్మకమైన చిత్రం 1919 లో వచ్చింది. ’అహల్యా ఉద్దార్’ పేర నిర్మితమైన ఈ పౌరాణిక చిత్రంలో అహల్య వృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. అలా మొదలైన సతీదేవి చిత్రాల పరంపర భారతీయ చలన చిత్ర రంగంలో విరివిగా కొనసాగింది. 1920  దశకంలోనే సతీ పార్వతి. సతీ తుల్సీఉంద, సతీ దక్షియజ్ఞె, సతీ అంజని, సతీ అనసూయ, సతీ పద్మిని, సతీ సీత, సతీ సావిత్రి ఇలా ఎన్నో సతీ చిత్రాలు వెలుగు చూసాయి. ఈ చిత్రాలన్నింటిలో మనసావాచా పతివ్రతలై ఆజన్మాంతం భర్తనీడనే జీవితం గడుపుతూ ఆ భర్త కోశం జీవితాన్ని త్యాగం చేసిన స్త్రీల కథలని ఇతి వృత్తాలుగా తీసుకున్నారు. 1930-40 లలో సతి మదాలస, సావిత్రి, సతీ సులోచన, సతీ నాగకన్య తదితర చిత్రాలు నిర్మితమయ్యాయి. 1950-60 లలో కూడా ఈ సతీ చిత్రాల ఒరవడి కొద్దిగా కొనసాగినా ఆ తర్వాత సతీ చిత్రాల ఒరవడీ మారింది. పౌరాణిక గాధల్లోంచి నేరుగా కథలు తీసుకోవడం తగ్గింది. కానీ పాతివ్రత్యాన్ని దాన్ని ఔన్నత్యాన్ని, స్త్రీల సేవా గుణాల్స్ని, వారు ఆహుతయ్యే లక్షణాల్ని తీసుకుని ఆధునిక కథన రీతుల్లో చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టారు. దానికి ప్రధానంగా ముత్తెదువ (సుహాగన్) అన్న భావాన్ని ఇతివృత్తంగా స్వీకరించారు. స్త్రీకి భర్తే సర్వస్వం అన్న భావజాలానికి పెద్ద పీట వేస్తూ అనే క చిత్రాలు ఆ తర్వాతి కాలంలో నిర్మితమయ్యాయి. సతీ పరీక్ష, దుల్హన్, పతీ పరమేశ్వర్, చరణోంకి దాసి, సుహాగ్ సింధూర్, మై సుహాగన్ హు, సుహాగన్ లాంటి చిత్రాలు భారతీయ సినిమా రంగంలో నిర్మితమయ్యాయి. ఆ పద్ధతిలో అన్ని ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ చిత్రాల నిర్మాణం కొనసాగింది.

అయితే చాలా విచిత్రంగా భారతీయ చలన చిత్ర రంగంలో పాతివ్రత్యం, సతి ఇతి వృత్తాలతో ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ సరిగ్గా సమాంతరంగా స్త్రీని శక్తి స్వరూపిణిగా చిత్రించిన సినిమాలూ వచ్చాయి. వీరోచిత పనులు నిర్వర్తించే స్త్రీ పాత్రలు ప్రధాన పాత్రలుగా అనే క చిత్రాలు వచ్చాయి. ఈ రెండు భిన్న ధృవాల్లాంటి పాత్రల చిత్రణ హిందూమత తాత్వికతనుమ్చి ఎదిగినట్టుగా ప్రస్ఫుటమవుతుంది. హిందూ తాత్వికతలో స్త్రీని ఆదిశక్తిగా పూజించడం వుంటుంది. కాని జీవుతంలో పతివ్రతగా అనేక కష్టాలు పడడమూ మనకు కనిపిస్తుంది.

అయితే గత శతాబ్ది తొలి అర్థభాగంలో సతి. శక్తి స్వరూపాల్లో స్త్రీని చిత్రిమ్చిన చిత్రాలు నిర్మించడంతోపాటు స్త్రీలను ఉదాత్తమైన పాత్రలుగా తీర్చిదిద్దిన చిత్రాలూ వచ్చాయి. ముఖ్యంగా 30 వ దశకంలో సుబ్యమణ్యం తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన ’బాలయోగిని’ ఆ కాలానికి గొప్ప ప్రగతశీలమైన చిత్రం. ఆ చిత్రంలో ఓ బ్రాహ్మణయువతి గుండు గీయించుకుని ఈ చిత్రంలో నటించింది, ఫలితంగా బ్రాహ్మలంతా సుబ్రమణ్యంను తమ కులం నుంచి వెలివేశారు.ఆ తర్వాత ఆయనే 1959 లో ’త్యాభూమి’ చిత్రం నిర్మించారు. ఆ చిత్ర కథ నేటి పరిస్థితుల్లో కూడా విశిష్టమైందే. ఓ ధనవంతుడు భార్యను వదిలేస్తాడు. ఆమె అష్టకష్టాలు పడి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది. భర్త తన ధనాన్ని దర్పాన్నీ పోగొట్టుకుని ఆమె పంచన చేరేందుకు తిరిగి వస్తాడు. కాని ఆమె అతన్ని అంగీకరించదు. అయితే అతని జీవనం గడపడానికి భరణం ఏర్పాటు చేస్తుంది. టూకీగా ఇదీ కథ. ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా ప్రదర్శించిన వైనం నేటిక అభిలషనీయమైనదే. ఆ తర్వాత బి.యన్ రెడ్డి తెలుగులో ’సుమంగళి’ చిత్రం నిర్మించారు. నిజానికి 1925 లోనే విధవా వివాహాంశాన్ని తీసుకుని తొలిచిత్రం వచ్చిందని చెపుతారు. తెలుగులో నాటి సుమంగళి తర్వాత తిరిగి 1980 ల్లో ప్రేమాకారంత్ ’ఫణియమ్మ’ చిత్రంలోనూ, విజయా మెహతా ’రావు సాహెబ్’ చిత్రంలోనూ మరి అతి కొద్ది చిత్రాల్లోనే స్త్రీల వైధవ్యమూ వ్యక్తిత్వ వికాసాలపైన సరైన చిత్రాలు వచ్చాయి.

ఇక కుటుంబ జీవనాన్ని విశ్లేషించినపుడు అత్తా కోడళ్ళ సమస్యలు, వరకట్న సమస్యలు తదితరమైనవి కనిపిస్తాయి. అలాంటి సమస్యల్ని తీసుకొని కూడా కొన్ని చిత్రాలు వచ్చాయి. 1933 లో దేవకీ బోస్ ’అప్నాఘర్’  నిర్మించాడు. శాంతారామ్ ’దునియా నామానే’, ’దహేజ్’ సినిమాలు నిర్మించాడూ. అలాగే 1950 కి పూర్వం వచ్చిన స్వయం సిద్ధ, మై అబలా నహీహు లాంటి సినిమాలతో పాటు సూర్యకుమారి, గుళేబకావలి, రూప్ రేఖా, బన్సిబహలా, గృహలక్ష్మి, మా, మాకీ మమతా, నారీ రాజ్ లాంటి చిత్రాలు వెలుగు చూశాయి.

భారతీయ సినిమా ప్రపంచం సరిగా అర్థ్ం చేసుకోని మరో మహిళా సమస్య అయిన వ్యభిచారం పై కూడా కొన్ని సినిమాలు నిర్మితమయ్యాయి. కాని ఆ సమస్యని సరైన కోణంలో అర్థం చేసుకొని సరైన పంథాలో నిర్మించిన చిత్రాలు తక్కువే. తొలి రోజుల్లో రాజనర్తకిని ప్రధాన పాత్రగా చేసుకొని పలుచిత్రాలు వచ్చాయి. ఒక్క వసంతసేన ఇతివృత్తంగానే ఎన్నో చిత్రాలు వచ్చాయి. 1929, 1934,1941 లో వచ్చిన వసంత సేన సినిమాలే కాకుండా 1983 లో గిరీష్ కర్నాడ్ నిర్మించిన ’ఉత్సవ్’ కూడా ఇదే కథాంశాన్ని కలిగివుంటుంది. ప్రముఖ నటుడు శశి కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో రేఖ వసంతసేన పాత్రలో గొప్పగా రాణించింది. ఇక అనార్కలి పాత్ర ఇతివృత్తంతో మొఘల్ ఎ అజామ్, అనార్కలి చిత్రాలు రాగా పాకీజా, ఉమ్రావ్ జాన్ లాంటి చిత్రాలు గొప్పగా రాణించాయి. ఇంకా దేవదాస్, ప్యాసా తదితర చిత్రాల్లో వ్యభిచారుభుల పాత్రలకు గౌరవ ప్రదమైన స్థానం కల్పించి ఉదాతంగా చిత్రించారు.  అలాగే బి.ఆర్. ఇషారా ’చేతన’, సాగర్ సరహబ్ది నిర్మించిన ’బజార్’.శ్యాం బెనగల్ నిర్మించిన ’మండి’, మీరానాయర్ నిర్మించిన ’సలాంబాంబే’ తదితర చిత్రాల్లో వ్యభిచారులు, వ్యభిచార గృహాల ఇతివృత్తాలపైన నిజాయితీగా వ్యాఖ్యానించారు.

ఉద్యోగస్తులైన మహిళల ఇతివృత్తాలపై నాటినుంచి నేటిదాకా అనేక చిత్రాలు వచ్చాయి. 1926, 27 లలోనే ’టైపిస్ట్ గర్ల్’, ’టేలిఫోన్ గర్ల్’ , ’ఎడ్యుకేటడ్ వైఫ్’ లాంటి చిత్రాలు, 1934 లో ’కాలేజి గర్ల్’, ఇందిర ఎం.ఏ, 1943 లో నర్స్, 44 లో ’లేడీ డాక్టర్’ చిత్రాలు వచ్చాయి. తర్వాత కె.ఎ. అబ్బాస్ 1100 గర్ల్స్, సత్యజిత్ రే ’మహానగర్’, మృణాల్ సేన్ ’ఏక్ దిన్ ప్రతి దిన్’ లాంటి చిత్రాలు నిర్మించారు. మరాఠీలో జబ్బర్ పటేల్ నిర్మించిన ’ఉంబర్తా’ గొప్ప మహిళా చిత్రంగా పేర్కొనవచ్చు.

దళిత స్త్రీని ఇతివృత్తంగా చేసుకొని 1936 అచూత్ కన్య 1945 లో అమ్రపాలి నిర్మించబడ్డాయి.ఆ తర్వాత సాంఘిక అణిచివేత ప్రధానంశంగా నిర్మితమైన ’అంకూర్’ ‘నిషాంత్’, ’మిర్చ్ మసాలా’, ’దామూల్’, చక్ర తదితర అనేక చిత్రాల్లో దళిత స్త్రీ జీవితంపైన ఫోకస్ చేశారు. చారిత్రక చిత్రాల్లో 1953 లో సోహ్రోబ్ మోడి నిర్మించిన ’ఝాన్సీకీ రాణి’, తర్వాత హేమమాలిని ప్రధాన భూమికను పోషించిన ’రజియా సుల్తానా’ లాంటి చిత్రాలున్నాయి. ఇక మీరా అని రెండు చిత్రాలున్నాయి. 1947 లో సాహ్రబ్ మోడి నిర్మించగా ఎం.ఎస్.సుబ్బలక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. 1980 లో గుల్జార్ నిర్మించిన ’మీరా’ లో హేమమాలిని మీరా పాత్రను పోషించారు.

ఇలా స్త్రీల స్థితిగతులపైన కొన్ని మంచి చిత్రాలు వచ్చినప్పటికి భారతీయ సినిమా రంగం స్త్రీ కోణాన్ని అస్సలు పట్టించుకోలేదన్నది నిష్ఠూర సత్యం. నిజానికి ప్రతి చిత్రంలో స్త్రీ పాత్ర ఉన్నప్పటికీ వెలుగునీడల్లో వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి బదులు వ్యాపార చిత్రసీమయావత్తూ స్త్రీ పాత్రల్ని ఆకర్షణకు లేదా దు:ఖానికి ప్రతిరూపాలుగానే స్వీకరించాయి. అయితే భారతీయ సమాంతర సినిమారంగం ప్రధానంగా సామాజికాంశాలపైనా లేదా వ్యక్తి గత మానసిక ఆవిష్కరణలపైనా దృష్టి సారించినప్పటికీ అనేక సమాంతర చిత్రాల్లో స్త్రీ పాత్రలు వర్తమాన సామాజిక జీవనంలోని మహిళల ప్రతిబింబాలు గానే ఆవిష్కృతమయ్యాయి. మరోపక్క ప్రతిభావంతులైన మహిళాదర్శకులు కూడా రంగం మీదికి వచ్చి మహిళా అంశాలపైన చలనచిత్ర నిర్మాణానికి పూనుకుంటున్నారు. అందులో అపర్ణా సేన్, విజయా మెహతా, మీరా నాయర్, కల్పనా లాజ్మి, సాయి పరాంజపే, ప్రేమా కారంత్, పామెలా రూక్స్, గోపీ దేశాయి, అరుణా రాజే, సుహాసినీ మూలే, దీపా మెహతా లాంటి పలువురు చిత్ర జగత్తులో తమదైన ముద్ర వేసే దిశలో కృషిని కొనసాగిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సరిపోవు. మహిళా కోణంలోంచి సాంఘిక,ఆర్థిక వివక్షలకు వ్యతిరేకంగా చైతన్యశీలమైన చలనచిత్రాల నిర్మాణం జరగాల్సి వుంది. మేధావులు, సినీ దర్శకులు ఎంతో తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమిది.

5 Comments
  1. Venkat Balusupati June 27, 2008 /
  2. Venkat Balusupati June 27, 2008 /
  3. Manjula June 27, 2008 /