Menu

సర్కార్ రాజ్

Warning:Spoilers ahead

కథ:లండన్ కి చెందిన రాజన్ కుటుంబం నిర్మించే పవర్ ప్లాంట్ కోసం మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయనాయకులకు, గూండాలకు, పారిశ్రామికవేత్తలకూ సాధ్యం కాని ఆ పనిని సక్రమంగా నిర్వహించే గలిగే వారు ఒక్కరు ఉన్నారని తెలుసుకుంటుంది అనితా రాజన్ (ఐశ్వర్యా రాయ్). అతనే సర్కార్ (అమితాబ్ బచ్చన్)!

నాలుగైదు ఊళ్ళల్లో వుండే నలభై వేలమందిని తమ స్వంత ఊర్లను ఖాళీ చేపించడంలో తన సహాయం కోరడం పై మండిపడతాడు సర్కార్. ఇలాంటి విషయాల్లో సహాయం చేయడానికి ససేమిరా అంటాడు. కానీ ఈ విషయంలో సర్కార్ తో ఏకీభవించడు అతని కొడుకు శంకర్ (అభిషేక్ బచ్చన్). మహారాష్ట్ర ప్రగతి కోసం కొంతమందికి అన్యాయం జరిగినా ఫర్వాలేదని, ఆ పవర్ ప్లాంట్ నిర్మించడంలో తమ పూర్తి సహకారం అందిస్తామని అనితా కు మాటిస్తాడు శంకర్.

తనిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో శంకర్ ఎదుర్కున్న ఇబ్బందులతో మిగిలిన కథ మొత్తం సాగుతుంది.

విశ్లేషణ:ఆగ్ సినిమాతో బూడిదయిన పోయిన రామ్ గోపాల్ వర్మ ఘన కీర్తి తిరిగి నిలబెట్టే చిత్రంగా సర్కార్ రాజ్ కోసం ఆయన అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా వర్మనూ, ఆయన కీర్తిని మరింత దిగజార్చకపోవచ్చుకానీ, ఈ సినిమాతో ఒకప్పటి ఖ్యాతిని తిరిగి తెచ్చుకోకపోవచ్చు.

ఇక కథనం విషయానికొస్తే మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య వస్తున్న లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఆలోచన వర్మకీ ఎక్కినట్టుంది.ఈ సినిమాలో స్టోరీ లైన్ మాత్రం బాగానే ఉంది. కానీ మొత్తానికి కథ నడీపిన తీరు చాలా పేలవంగా వుంది. దాదాపు సినిమా అఖరు ఇరవై నిమిషాల వరకూ ఏదో జరుగుతున్నట్టుంటుంది, చివర్లో అమితాబ్, ఐశ్వర్యాని పక్కన కూర్చోపెట్టుకుని అంతా వివరంగా చెప్తే గానీ, “ఓహో అదా సంగతి” అనిపిస్తుంది ప్రేక్షకుడికి.సినిమాలో ఉన్న మిగిలిన పాత్రలన్నీ కుట్రపన్ని శంకర్ ని చంపి ఆ స్థానంలో తమ వారినెవరినైనా ప్రవేశ పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే పవర్ ప్లాంట్ అనే ఒక అబద్ధాన్ని సృష్టించారన్నట్టు మనకి సినిమాలో ఎక్కడా అనిపించదు. ఇదంతా కుట్ర అని అమితాబ్ ఐశ్వర్యకు చెప్తే విని మనం నోరెళ్ళబెట్టాల్సిందే (ఆశ్చర్యంతో). అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే అసలా పవర్ ప్లాంట్ ఆలోచన ఐశ్వర్య రాయ్ దే. ఆ పవర్ ప్లాంట్ అనే ఆలోచన శంకర్ ని చంపడానికి ఉపయోగించిన కుట్రలో భాగమైతే అందులో అందరికీ భాగముండి, ఐశ్వర్యకు భాగం లేకపోవడం ఏంటో, పవర్ ప్లాంట్ నిర్మించాలని లండన్ నుంచి ఇండియా వచ్చినావిడకి, ఆమె పవర్ ప్లాంట్ గురించి ఆమెకే తెలియని విషయాలు చెప్పడం ఏంటో కన్విన్సింగ్ గా వుండదు.

స్క్రీన్ ప్లే: పెద్దగా లాజిక్ లు మిస్సుకాకుండా స్క్రిప్టు రాసుకునే వాళ్ళలో వర్మ ఒకడు. కానీ ఈ సినిమాలో బాగా మిస్సయింది లాజిక్కే. అయితే మరో సారి ఆలోచిస్తే వర్మ మనసులో ఏదో పెట్టుకుని ఈ సినిమా తీసారనిపిస్తుంది. ఇందులో explain చేయని కొన్ని అంశాలు మూడో భాగం లో చెప్పడానికి అట్టే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది.

నేను వక్రంగా ఆలోచిస్తున్నానో లేదో తెలియదు కానీ, మనకి సర్కార్ మూడో భాగం లో తెలిసొచ్చేదేమిటంటే శంకర్ చంపించడంలో అనితా దే ముఖ్య పాత్ర అని. ఎలాగూ శంకర్ చనిపోయివుండడం, సర్కార్ ముసలి వాడవడంతో సర్కార్ స్థానాన్ని అనితా ఆక్రమించి లేడీ డాన్ లా ముంబాయి ని రూల్ చేయడం సర్కార్ మూడో భాగం లో వుంటుందేమో అని నా అనుమానం.

అలాగే ఈ సినిమాలో సంభాషణలు మామూలుగా మాట్లాడినట్టుగా ఉండదు. వర్మ స్పెషాలిటీ వన్ లైనర్స్ ఎక్కువయిపోయి ప్రతి సంభాషణ చాలా ఆర్టిఫీషియల్ గా వుంటుంది. దానికి తోడు అవసరమున్నా లేకపోయినా మోతాదు కి మించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి.

దర్శకత్వం: ఇది వర్మ తీసిన చాలా సినిమాలకంటే బెటర్ సినిమానే కానీ it’s not Varma’s best. గతంలో సత్య, కంపెనీ, గాయం లాంటి సినిమాలతో గ్యాంగ్ స్టర్ సినిమాలంటే వర్మ మాత్రమే తీయగలడు అనిపించేలా చేసిన వర్మకు సర్కార్ రాజ్ ఏ విధంగానూ పెద్ద అచీవ్మెంట్ కాదనే చెప్పాలి. కాకపోతే ఆగ్ సినిమా తర్వాత తనలో ట్యాలెంట్ ఆవిరయిపోలేదని, అవకాశమొస్తే మంచి సినిమాలు తీయగలననే ప్రామిస్ మాత్రమే సర్కార్ రాజ్ చేయగలిగింది కానీ ఇది వర్మ ట్యాలెంట్ కి తగ్గ సినిమా అని మాత్రం నిరూపించలేకపోయింది.

ఈ సినిమాలో కొన్ని సీన్లయితే కేవలం వర్మ మాత్రమే తీయగలడు అన్నంత గొప్పగా వున్నా, ఓవరాల్ గా పెద్ద క్లారిటీ వుండదు దర్శకత్వంలో. ఉదాహరణకు పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ తీయడంలో ఇది వరకే వర్మకు మంచి పేరుంది. ఈ సినిమాలో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ కి కొత్త అర్థమే తెచ్చాడు వర్మ. ఉదాహరణకు ఒక వ్యక్తి కోణంలో చూపించాల్సిన అంశాన్ని అక్కడ వ్యక్తి స్థానంలో కెమెరా పెట్టడం ద్వారా చూపించడం జరుగుతుంది. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ నిజంగా ఆ వ్యక్తి చూస్తున్నట్టుగానే అనిపించాల్సినప్పుడు చాలా మంది చాలా విధాలుగా చేస్తారు. మహానగర్ లో సత్యజిత్ రే హ్యాండ్ హెల్డ్ కెమెరా వాడడం ద్వారా పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంశాన్ని ఎంఫసైజ్ చేస్తారు. అయితే ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు అన్ని సినిమాల్లో ఎం జరుగుతుందంటే వ్యక్తి ని కెమెరాతో రీప్లేస్ చేయడం. కానీ ఈ సినిమాలో వ్యక్తి మరియు కెమెరా ల కాంబినేషన్ లో వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ ఒక మంచి ప్రయోగం. ఈ విధంగా సినిమా టెక్నిక్ తో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే వర్మ, టెక్నిక్ పరంగా అత్యుత్సాహం ప్రదర్శించడం ఆయన లోని మరో కోణం.

ఆగ్ సినిమా ఘోర పరాజయంతో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకోవడం బాగానే వుంది కానీ ఏదో చెయ్యాలన్న తపన ఈ సినిమా ప్రతి ఫ్రేములో కొంచెం ఓవర్ గానే కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర్నుంచి, సినిమాటోగ్రఫీ, డైలాగులు అన్నీ మోతాదు కి మించిన వైవిధ్యం కనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ:సినిమాటోగ్రఫీ పరంగా అమిత్ రాయ్ తన పని బాగానే చేసాడు కానీ అది కేవలం లుక్ అండ్ ఫీల్ లో మాత్రమే. టెక్నిక్ పరంగా ఈ సినిమాలో కొంచెం అతి కనిపిస్తుంది. ఉదాహరణకు చాలా స్పేరింగ గా వాడాల్సిన ’ట్రాక్ ఇన్-జూమ్ ఔట్(Vertigo)’ షాట్ ని అవసరంలేని చోట అతిగా వాడడమే.

ఈ సినిమాలో చాలా వరకూ మనకు నటులు పూర్తిగా కనిపించరు. ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డం వస్తూనే వుంటుంది. అంతా ప్రేక్షకుడు దాక్కొని దాక్కొని ఎదో రహస్యాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో తెలుసుకోకూడని రహస్యం ప్రేక్షకులు తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి టెక్నిక్ బాగానే వుంటుందేమో కానీ సినిమా మొత్తం ఇలా చూపించడం కొంచెం విసుగ్గానే వుంటుంది.

ఇద్దరు వ్యక్తులు మాట్ల్లాడుకుంటున్నప్పుడు వారిద్దరి మొహాలూ స్పష్టంగా కనిపించనివ్వకుండా మసక మసకగానో లేదో ఏవో వస్తువులు మధ్య నుంచో చూపించినప్పుడు, నా దృష్టిలో , అలా చేస్తున్నందుకు సరైన జస్టిఫికేషన్ వున్నప్పుడే ఆ సీన్ పండుతుంది. ఉదాహరణకు శంకర్-సర్కార్ ల ఒక సంభాషణ మొత్తం లో యాంగిలో టీ పాయ్ కింద కెమెరా పెట్టి తీయడం జరుగుతుంది. ఆ సీన్లో టీ పాయ్ మీదున్న వివిధ వస్తువులు వారికి అడ్డొస్తుంటాయి. ఈ విధంగా చూపించడానికి కారణం లేకుండా కేవలం లుక్ అండ్ ఫీల్ బావుంది కదా అని చేస్తే ఆ షాట్ కున్న విలువ పోతుంది. అదే సర్కార్ కి శంకర్ కి అభిప్రాయ బేధాలు వున్నప్పుడు ఇలా చూపించి, వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు వారి మధ్య అడ్డు వచ్చిన వస్తువులను తొలిగిస్తే ఆ విషయాన్ని మాటల్లో కాకుండా విజువల్ గా చెప్పిన క్రెడిట్ దర్శకునికీ/ సినిమాటోగ్రాఫర్ కీ లభిస్తుంది.

ఏదేమైనా అమిత్ రాయ్ మంచి టాలెంట్ ఉన్న సినిమాటోగ్రాఫర్ గా ఈ సినిమాతో గుర్తింపు పొందుతాడు.

సంగీతం: అవసరమున్నా లేకపోయినా చాలా భారీ సంగీతం బ్యాక్ గ్రౌండ్లో వినిపించడంతో అక్కడక్కడా వున్న మంచి సంగీతం గుంపులో గోవిందా అయిపోతుంది ఈ సినిమాలో.

ఏడిటింగ్: సెకాండాఫ్ లో అక్కడక్కడా జర్క్ లు తప్పిస్తే మిగిలిన సినిమా అంతా బాగానే వుంది ఎడిటింగ్.

నటీనటులు: బచ్చన్ ట్రియోలో ఇద్దరు బాగానే చేశారు ఈ సినిమాలో. ఐశ్వర్యానే ఈ సినిమాకి కి వీక్ పాయింట్. కేవలం బచ్చన్ ఫ్యామిలీనంతా సినిమాలో చేర్చి సెన్సేషనలైజ్ చేద్దామన్న తప్పితే ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం వుండదు.

ఆశ్యర్యం ఎంటంటే ఈ సినిమాలో తనీషా బాగానే చేసిందని చెప్పాలి. ఎట్లాంటి వారూ వర్మ సినిమాలోకొచ్చే సరికి రూపాంతరం చెందుతారు. నటీ నటులను అలా మార్చడంలోని సీక్రెట్ కేవలం వర్మ మాత్రమే తెలుసనుకుంటా.

పాపం షిండే తెలుగు సినిమాల్లో నటించి నటన మర్చిపోయినట్టున్నాడు అంతా కంగారు కంగారు గా ఏదో చేశాడు.కాంతి లాల్ వోరా పాత్ర పోషీంచిన నటుడు బావున్నాడు కానీ ఏ కోణంలో చూసిన మన కోట కనిపిస్తాడు ఆ పాత్రలో. తప్పకుండా కోట చేయాల్సిన పాత్ర అది.

ముగింపు: ఫైనలా గా చెప్పొచ్చేదేమిటంటే ఇది మరీ భరించలేనంత ఛండాళమైన సినిమా కాదు కానీ అలా అని గతంలో వర్మ తీసిన గ్యాంగ్ స్టర్ సినిమాలతో పోల్చదగింది కూడా కాదు. దేన్నయినా పిండి పిండి వదిలితే చివరికి మిగిలేది పల్ప్ మాత్రమే అని వర్మ గ్రహించేదెప్పుడో? గాడ్ ఫాదర్ సినిమా ఇన్సిరేషన్ తో అధిక సినిమాలు తీసిన దర్శకుడిగా వర్మ ను రికార్డ్ పుస్తకాల్లోకి ఎక్కించవచ్చేమో గానీ ఆ సినిమా లోని అంశాలతో పదే పదే సినిమాలు తీస్తే కాన్సెప్ట్ పలుచబడిపోయి రిజల్ట్ వీక్ గా వుంటుందనడానికి పెద్ద సాక్ష్యం ఈ సినిమా.ఈ సినిమాలో అక్కడక్కడా వర్మ యొక్క పూర్వపు ప్రతిభ యొక్క మెరుపులు అక్కడక్కడా తళుక్కున మెరిసినా అవి సినిమాని ఓవరాల్ గా ప్రేక్షకులు మెప్పు పొందేందుకు పనిరావు.

మొత్తానికి వర్మ అనుకున్నట్టుగా పెద్ద గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించడంలో విఫలమయినట్టే!

—-అన్వేషి

20 Comments
 1. సగటు జీవి June 7, 2008 /
 2. bhanu prakash June 8, 2008 /
 3. Su June 8, 2008 /
 4. bollojubaba June 8, 2008 /
 5. Desi June 9, 2008 /
 6. Desi June 9, 2008 /
 7. Ravi June 9, 2008 /
 8. bhanu prakash June 9, 2008 /
 9. శిద్దారెడ్డి వెంకట్ June 9, 2008 /
 10. attli sattibabu June 9, 2008 /
 11. అన్వేషి June 9, 2008 /
 12. Manjula June 9, 2008 /
 13. VarmaBoredMe June 10, 2008 /
 14. శంకర్ June 10, 2008 /
 15. రాజేంద్ర June 14, 2008 /
 16. Chetana June 24, 2008 /
 17. Ram July 23, 2008 /
 18. శోభ September 23, 2008 /