Menu

గెట్ రెడి

రెడినిన్న శనివారం ఉద్యోగంతో బాగా విసిగిన ప్రతి బెంగుళూరువాడిలా నేను కూడా సినిమా చూసి నా జీవితంలో కొంత రంగు తెచ్చుకోవాలని ఆవేశంలో శపథం చేసాను. నాలాంటి వాళ్ళ వల్లే అడ్డమైన సినిమాలూ అడతాయనుకుంట అని అనిపించింది, హాలు కెళ్ళి టికెట్టు తీసుకున్నాక. కేవలం జెనీలియా వుందనే సాకుతో నేను సినిమా చూడడానికి వచ్చాను !

కానీ సినిమా మొదలయ్యిన పది నిమిషాలకు కొన్ని మంచి హాస్య సంభాషణలతో చాలా బాగుంది అనిపించింది. ఇంక ముందుకు వెళుతూ కథ ఏదో సాగుతుంది గానీ, కామెడి మాత్రం సూపర్ ఉండడంతో ఇంకేమీ తట్టలేదు. అలా మొదటి సగం అయ్యింది, నేను చాలా మంచి సినిమాకి వచ్చాం అని సంతోషిస్తున్న, అదే సమయంలో రెండో సగం ఎలా వుంటుందో అని భయపడుతున్న సందర్భంలో మావాడు చెప్పాడు, వాడు చదివిన రివ్యూలో రెండో సగం కామెడీ బాగుంటుందని వ్రాసారంట!ఇంకేముంది, సీటు బెల్టు బిగించి నవ్వడానికి సిద్ధమయ్యిపోయాను. నేను అనుకున్నదానికంటే ఇంకా చాలా ఎక్కువ కామెడీనే వుంది.

చాలా చాలాఏళ్ళ తరువాత తెలుగు సినిమా కథలో హాస్యం వుండడం చూసి నాకు చాలా చాలా సంతోషం వేసింది. అంటే మామూలుగా నాలుగు సెటైర్లు వేసో వ్రాసో త్రివిక్రంలాంటి వారిని కట్టింగ్ ఎడ్జ్ డైరక్టర్లని భావిస్తూంటారు. కానీ నిజమైనా కామెడీ కథలో వుంటుందని మనవారు మరచిపోయి జంద్యాల గారు సినిమాలు తియ్యడం మానివేసిన సమయం అయ్యింది.

కాబట్టి నేను చెబుతుందేఁవిటంటే ఒక్క ముక్కలో మీరు కామెడీ ప్రియులైతే, తప్పకుండా ఈ సినిమా చూడండి.

అంటే అంత గొప్పగా వుంటుందా, నవతరంగంలోనే తప్పక చూడాలని వుంది అని మీరు అనుకుంటే మీకు ఒకటి రెండు హెచ్చరికలు.

౧) నవతరంగంలో ఎవరైనా ఏదైనా వ్రాయవచ్చు కాబట్టి ఇది నా అమూల్యాభిప్రాయఁవని గమనించగలరు.

౨) ఈ సినిమాలో సాంకేతిక లోపాలు లేకపోలేవు.

అ) ఇది అసలైతే పూర్తి కామెడీ సినిమా, ఈ తరహా హాస్యాన్ని నవలల్లో అయితే farce అంటారు. అంటే absurd comedy అని. అలాంటి సినిమాల్లో ఫైట్లు వంటివి పూర్తి అనవసరం. ప్రత్యేకించి ఈ సినిమాలో ఫార్స్ అంత బాగా పండినప్పుడు ఫైట్లు పంటికింద రాయిలా తగిలాయి.

ఇ) అలానే కథలో కూడా అనవసర సంఘటనలు చాలానే వున్నాయి. అసలు కథలోనికి రావడానికి చాలా చాలా చోట్లు తిగిగాడు కథకుడు. ఆ విషయంలో కొంత విౙన్ లోపించింది.

ఉ) మొదట్లో ఒక ఫుట్టుబాలు మ్యాచి ఉంది, దానికీ మిగిలిన కథకూ ఎటువంటి సంబంధమూ లేదు. అది మన వారికి sports direction ఎంత అస్సలు చేతగాదో చెప్పడానికే వుంది అనిపించింది. గ్రాఫిక్సు వాడి స్పోర్టసు తీయవలసిన కర్మ ఏఁవిటో..

ఋ) పాటలు సరిగా రాలేదు. వచ్చినవి కూడా అంత బాలేవు. సినిమా టైటిలు కూడా వేరే పెట్టవలసింది.

అదన్న మాట విషయం. కానీ సినిమా మాత్రం తప్పక చూడవలసింది. బ్రహ్మానందం మరియు ఇతర కమెడియన్ల గురించైతే చెప్పనక్కరలేదు. అలానే మన హీరో రామ్ కూడా చాలా బాగా చేశాడు. క్రిత సినిమా దేవదాసులో నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఇందులో చాలా చాలా బాగా చేశాడు. the guy holds promise. మన జెన్స్ ఎప్పటిలాగా దిష్టిబొమ్మలాగా బాగా నుంచుంది. మీరు జెనీలియా ఫ్యాన్ అయ్యి మీ గాల్ రామ్ ఫ్యాన్ అయితే, లేదా దీనికి విరుద్ధంగా మీరు రామ్ ఫ్యాన్ అయ్యి మీ గాల్ జెనీలియా ఫ్యాన్ అయినా తప్పక చూడవలసిన సినిమ. (భారతంలో మామూలుగా ఈ రెండో పరిస్థితే ఎక్కువ తటస్తిస్తుంది లెండి).

ఈ సినిమా చూస్తే నాకైతే PG Wodehouse చదినట్టే అనిపించింది.

7 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 22, 2008 /
  2. ravindra June 23, 2008 /
  3. Sree Basabathina June 23, 2008 /
  4. Phani July 22, 2008 /
  5. Sowmya August 21, 2008 /