నేను పాండురంగని చూచి తరించితినీ!

ఏ పూర్వ జన్మ పుణ్యమో,ఎన్ని నోముల ఫలమో అత్యంత సృజనాత్మక,ఉన్మత్త ఊహాశాలురకాలవాలమయిన తెలుగుసినిమాలు చూసి తరించు భాగ్యము నాకు కలిగినది. అందునా,భక్తి తత్వ విచారాత్మకమయిన భావ మోహపారవశ్యమునొందించు అపూర్వ కళాఖండాలను ఖండ ఖండాలుగా, తుండ తుండాలుగా తృంచి ఉప్పు కారంతో పాటుగా విదేశీ సినిమాలందించు మాల్ మసాలాలతో,స్వంత పాశవిక ప్రవృత్తీ జనితాలయిన కామ వికార కుకార టక్కు టమారాది ఐంద్రజాలికా సహిత అర్ధరహిత దుర్భర కువినోదాత్మకయిన దృష్యమాలాతోరణాల నిలయమయి, తర్కమే మర్కటమై, మస్తకము చెదలుతిన్న పుస్తకమై, ఆధునికాధునిక భావజాల విలయమై,విలయ ప్రళయ వికృత తాండవాలయమయినటువంటి, అసమాన,అప్రమేయ,అద్వితీయ,అచింత్యమగాధమమేయ మయిన తుచ్చకళాప్రదర్శనలను చూసి తరించు ఈ భాగ్యం కోసం ఎన్నెన్ని జన్మల నోములు పున్యాలూ చేసుకొన్నానో!ఒక్క రెండుగంటల సినిమాతో జన్మ జన్మాల బూజును దులిపేంత శక్తి వంతమయిన సినిమాలను నిర్మిస్తున్న మన కళాకారుల కళాకౌశలమెంత అద్భుతమో!ఒక్క రెండు గంటలలో గత జన్మల జ్ఞాపకాలను తాజా చేసి,ఎందుకొచ్చిన పాడు మానవ జన్మము,హాయిగా పక్షినో,పిల్లినో,బల్లినో అయితే కృత్రిమ ఆనందాల వెంట పడేవేలుండదుకదా అన్నంత దుర్భర వైరాగ్య భావనలు కలిగిస్తున్న మన కళాకారుల కళా ప్రదర్శనమెంత గొప్పదో కదా!

నిన్న పాండురంగడను కదిలే బొమ్మల చిత్రా విచిత్ర విన్యాస ప్రదర్శనకు వెళ్ళితిని.సినిమాను చూచు సరికి నాకేదో అయినది.నా డెందము అమందానందకందళిత హృదయారవిందమయి,భావావేశ సంజనిత వెర్రి పదింతలయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయిచున్నది.ఆహా,అది సినిమాయా,సినీ మాయా,ఓసి నీ మాయా,మాయ నీ మాయ నను మాయ చేసి మాయని గాయము చేసినది.ఆ గాయము మెదడులో కలిగినదా?తనువులోని అణువణువులో కలిగినదా ?లేక నా ఆత్మ లోలోపల గాయమయినదా?అర్ధమగుటలేదు.నా ప్రమేయము లేకుండా నా నోటి వెంట వ్యర్ధ ప్రేలాపనల ఆలాపనల విలాపానలకీలలు వెలువడుచున్నవి. అవి అక్షర రూపము ధరించి బిర బిర జాలువారుచున్నవి.
పాండురంగని మొదటి దృష్యములో ఒక ముసలి నాస్తికుడు ఆస్తికుని వేశము ధరించి రంగా నువ్వు దొంగా అంటూ ప్రాస సహితంగా దూషిస్తాడు.ఆ అనందం నుంచి తెరుకొనేలోగా నాస్తిక పుత్రాధముడు తండ్రి అడుగుజాడలలో నడుస్తూ కృష్ణుడు చేసే మంచి పనులను విడిచి రాసలీలలనే ఆదర్శముగా తీసుకుంటూ,మానాధములు క్ర్ష్నుని ఆదర్శముగా తీసుకొన్న కలిగే అనర్ధాలను ప్రదర్శిస్తాడు.క్ర్ష్నుడు ప్రపంచాన్ని తప్పు దారిపట్టిస్తున్నాడని నిరూపిస్తాడు.బాలుడిగా నున్నపుడే ఇంత ఘోరముగా ప్రవర్తించినా ఆ వీర నాస్తిక షిఖామణి ఎదిగిన తరువాత కృష్ణుడే సిగ్గుపడి మాటి మాటికీ దిగివచ్చే రీతిలో వుంటాడని వేరే చెప్పనేల?

ఆహా,మన కళాకారులెంత ఊహా శాలురో!పాత కాలమునందు మహిళలను పరదా చాటున బంధించి వుంచేవారు.ఆ ధునిక కాలమున మహిళలు బంధనాలు తెంచుకుని,విశ్రుంఖలముగా ప్రవర్తించుచూ తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తున్నారు.అది రంగని పాత్రద్వారా కసి కసిగా చూపినారు.పెళ్ళి చేసుకోరా పిల్లవాడా అంటే,ఆధునిక భావజాల యువకునిలా ఇల్లువదలి పారిపోయి,కనబడ్డ అమ్మాయితో ఎటుల వీలు దొరికిన అటుల,ఎంత వీలు దొరికిన అంత శృంగార కేళీ విలాసాలు జరుపుతాడు.అంతటితో అయిపోలేదు,తానేయే ప్రాంతాల అమ్మాయిలతో ఎలా ఎలా ఏమేమి చేశాడో పాట రూపమున ప్రజలందరికీ ప్రకటిస్తాడు.యువతులను పూలతో పళ్ళతో(fruits,teeth) మోదుతూ తన ప్రావీణ్యాన్ని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడా మగవాడు.వొట్టికుండ శబ్దముచేయును,చేతకాని వాడు మాట్లాడును,కొంచెమున్న కొండంతలు చేసి చెప్పును,లేని దాన్ని అందరికీ చూపి సంత్ర్ప్తి పడును అంటుంది మానసిక శాస్త్రం.ఈ సినిమా దర్శకుడికింకనూ వివాహము కాలేదు.కావున,స్వాభావికముగా రతికేళీ పయిన అధిక కుతూహలముండును.ఆ కుతూహలమునంతయూ.రంగని పాత్ర ద్వార,ఆ పాత్ర తుచ్చ ప్రవర్తన ద్వార ఆయన తీర్చుకుని సంతృప్తిపడినాడేమోనని మానసిక శాస్త్ర నిపుణులననినారు.ఏది ఏమయిననూ ఈ పాటలో రతి,రతిలో పాటలు సెన్సారు వారిని పారవశ్యాంబుధిని ముంచి నిర్వీర్యులను చేసినదని తెలియుచున్నది. ప్రచీన బంధనాలు తెంచుకున్న ఆధునిక యువతులందరూ తమ లైంగిక తృప్తులకోసము ఆ కాలములో సమరము,స్వయంప్రకాషూలు లేని కారణాన రంగని చుట్టూ మూగుతారు. ఇది మన సమాజమున సకల రుగ్మతలకూ కారణమయిన తుచ్చ బ్రాహ్మణులకాగ్రహము కలిగించును.ఎప్పటిలాగే వారంతా కబాబ్మే హడ్దీలలాగా ఎవరినీ ఆనందించనీయరు.తాము ఆనందించరు. పోయి,నాయకుడి నాస్తిక తండ్రితో కంప్లయింటు చేస్తారు. ఆయన మొసలి కన్నీళ్ళు కార్చి కొదుకును మందలించినట్టు చేసి రెచ్చగొడతాడు.

మరచితిని ఈ సినిమాలో బ్రాహ్మణులు తిండిపోతులను సిద్ధాంతమును నిరూపించుతూ ఒక తిండిపోతు బ్రాహ్మణుడుడుండును.ఆయాన గంధమును నాకి మనలను ఆనంద పరచును.దేశమున తిండి అంతయూ ఎవరు తినేస్తున్నారో మరో సారి మనకు హాస్యముగా తెలియును.నవ్వి నవ్వి కంట నీరు పొంగును.

ఇక,ఈ చిత్ర విచిత్ర చిత్రమునందు నాయిక బహు దొడ్డ నాస్తికురాలు.ఆమెకు కోంత మతి భ్రమణము కలదు.అయిననూ,ఆమె కిట్టూ కిట్టూ అంటూ కృష్ణుని దూషించును.చూచు వారు భక్తి అని భ్రమ పడుదురు.కానీ ఆ భక్తి లో ఎంతయో రక్తియున్నది.కృష్ణుని తలలో మంటలు వచ్చును.అప్పుడామె మంతెన సత్యనారాయణరాజున కాదర్శమవు రీతిన ప్రకృతి వైద్యము చేయును.ఆమెకాలికంటిని ధూళి రాసిన తల మంటలు తగ్గునని వికారాకారముతో వికృతముగా,గౌరవశూన్యంగా,ముగ్గురుపిల్లల తండ్రికి తాతలా కనిపించు నారదుడు చీప్పును.దాంతో విజృంభించిన ఆ పరమ నాస్తికాస్తికనవలా శిరోమణీరత్నము,కసికసిగా బురదలో పేడలో కాలిని రాసి రాసి,పాతాళమునందు పేరుకునివున్న పాతకాలాన్నిటినీ తన కాలికి పూసుకొని,ఆ ధూళిని చేతితో కస్సున గీచికోని కృష్ణ విగ్రహమునకు పూయును.ఆ దుర్గంధభూయిష్ట,సర్వపాతక సహిత ధూళి కృష్ణుని తల మంటలు తగ్గించును.తగ్గకున్న ఆమె ఇంకేమేమి ఎక్కడెక్కడనుంచి తీసి,పూయునో అని భయప్పడినట్టున్నాడు భగవంతుడు.ఎంతయినా,మనిషి ఊహకు అంతులేదు కదా!ఇకనుంచీ మన ప్రకృతి వైద్యులు యువతి పాదధూళీ లేపనాలు తయారు చేసి సకలరోగాలు తగ్గింతురనుటలో సందేహము లేదు.ఆమెకు ఒకరోజు కలలో కృష్ణుడు కనబడి,నీ పాదలేపనాలు పూసి నా తల తీసినావు.పోయి ఆ నాయకుడి పనిపట్టుమూ అని చెప్తాడు.అతడు అమ్మాయిల వెనక పడి ఎయిడ్సు రోగము తెచ్చుకొన యత్నించుచున్నాడు.గతములో కాసనోవా యను మహానుభావుడి రికార్డు బద్దలుకొట్టాలని చూచుచున్నాడు.వాడి యజ్ఞము భంగము చేయుము అని ఆదేశిస్తాడు.ఎంతయినా భగవంతుడికి ఎవరూ పైకి వచ్చుట నచ్చదుకదా.అందరి యాగాలనూ భగ్నం చేస్తాడు.దాంతో ఈ వనిత కిట్టునిమీద ఆనపెట్టి నాయకుడి ఇల్లు చేరును.

ఆహా,ఆధునిక మహిళలు సిగ్గుపడేరీతిలో తన మొగుడిని ఎంచుకోవటమేకాదు,వాడి ఇంటిముందు తిష్టవేసి దొంగ కొంగ జపాలుచేసి తొడగొట్టి సవాల్చేసి,కలలో వాడితో డ్యూయెట్టుపాడేసి,పాతకాలపు పతివ్రతలంతా పనికిరాని పచ్చళ్ళని నిరూపిస్తుంది.మహిళాలంతా ఈమెను ఆదర్శముగా తీసుకొని ఆచరించిన ఎంత బాగుండునో కదా!

చెప్ప మరచితిని నాయిక వెర్రి మొర్రి నటనలు చూసి ఇంటివారందరూ ఉబ్బితబ్బిబ్బయి అబ్బయని ఆమెను పెళ్ళికాకముందే కోడలిగా ఒప్పుకొందురు.ఎలాగో నాయకుడి రతి శక్తి ఆ వూరి అమ్మాయిలందరికీ తెలుసుకాబట్టి ఎవారూ పెళ్ళిచేసుకొన ఇచ్చ్గించుటలేదు.కాబట్టి ఈ మతిలేని పొరుగూరిపిల్ల కోరి వచ్చి ఇంటిముందు మౌన పోరాటము సాగించుచున్నది.ఈమెకు ఇచ్చి కట్టిన నాయకుడి సెక్సు భ్రమణమునకీమె మతి భ్రమణము సరిపోయి సకల జనుల చిత్త చాంచల్యములణగిపోవునని భావిస్తారు.

అయ్యయ్యో చెప్ప మరచితిని,నా మతి పండా(నా మతి పండయిన ఈ పాటికీ సినిమాలో ఏయువతి బొడ్డునో కక్ష్యగా చేసుకొని యుండెడిది.) అసలు యువతీ రత్నమును చెప్పమరచితిని.ఈ చిత్రమునందు ప్రత్యేక ఆకర్షణగా ఒక వొళ్ళుతప్ప ఇంకేమీ లేని వారవనితాకాంత ఉన్నది.మన నాయకుడికి కూడా వొళ్ళుతప్ప మరేమీ అవసరములేదుకదా!అందుకే ప్రధమవీక్షణముననే వారి ఉన్న కాస్తంత మతికూడా కోతి అగును.ఆమె తొడపయిన తబలావాయిస్తూ,థా థా అంటూంటే నాయకుడు బలిష్తులయిన వస్తాదులను,ముత్యాలగొలుసులతో కొట్టి చిత్తు చేస్తాడు.అంత రాతి కండలు ముత్యాల గొలుసుతాకిడికెంతగానో నొచ్చియుండును.ఈ దృష్యమునందు దర్శకాగ్రేసరుడు ఒక చమత్కారము నింపినాడు.బలిష్టులు కొట్టినట్టు నటించగానే నాయకుడు వారవనిత తొడపయిన పడతాడు.అయ్యో దెబ్బ తగిలిందా అనేబదులా వయసు మళ్ళిన వనిత లైంగికసౌఖ్యానుభూతి పొందును.కామాంధునికి కత్తిపోటులోకూడ రతివేటు కనిపించునుకదా!
ఇక ఆ వారవనిత నాయకునితో లివిన్ రిలేషన్షిప్పు ఆరంభించును.ఇదంతా చూస్తున్న ఏషియంపెయింటు దిట్టంగా పూసుకున్న కృష్ణుడు రంగ ప్రవేశం చేస్తాడు.ఇదిగో ఇలా మాటి మాటికీ దివినుంచి దిగివస్తూ,భక్తుల పనులు చేయిపట్టి భగవంతుడు చేస్తూండటంవల్లనే కదా ఆస్తికులంతా సోమరిపోతులవుతున్నారు.అయితే,ఆ కృష్ణ మాయ కన్న మనిషి మాయనే గొప్పది అని ఈ సినిమా నిరూపిస్తుంది.నాయిక మోహంలో పడి నాయకుడు వారవనితను విస్మరిస్తున్నాడన్న అక్కసుతో మళ్ళీ ప్రకృతి వైద్యం చేసి నాయకుడి కడుపులో మంట రగిలిస్తారు.ఆహా అప్పుడు నాయకుడి నటననేమని వర్ణించను.ఆ కడుపులో మంట మనకే ఉన్నట్టు భావిస్తాము.ఆ మంటకూడా మాటలనేటప్పుడు మరచిపోతాడు.అప్పుడే నాయకుడి నాస్తికత తెలుస్తుంది.భజన చేస్తున్న వారిని ఆపమంటాడు.వొచ్చిన సాధువుని దూషిస్తాడు.తల్లిని తండ్రిని తిడతాడు.భార్యను పొమ్మంటాడు.పురుషాహంకారపు పందికి ప్రతిబింబంలా ప్రవర్తిస్తాడు.అయితే ఇదంతా,మంట ప్రభావం వల్ల తప్ప వేరే కాదు.స్వతహాగా నాయకుడు మంచివాడే.కనబడ్డ అమ్మాయిలనంత ప్రేమించి,ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలని ప్రయత్నిస్తున్న మహానుభావుడు.అయితే ఈ దుష్ట దేవుడు,తుచ్చ బ్రాహ్మణులు అతనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు.ఇప్పుడో దృష్యం వుంది.నాయకుడు భగవద్గీత విసరగానే దాన్ని అందుకున్న నాస్తిక తండ్రి వెంటనే ఆ బరువును భార్యకిచ్చేస్తాడు.పాత కాలంలో స్త్రీలను పురుషులు ఎంతగా హింసించి,బరువులన్నీ వారిమీద పెట్టేస్తారో ఈ సన్నివేశం చూపుతుంది.ఆడవాళ్ళ బరువులగురించి,ఎనిమిది మాతలతో కృష్ణుడే ఒక వ్యాఖ్య చేస్తాడనుకోండీ సినిమాలో.
ఇక ఇక్కడినుంచీ సినిమా వేగంగా సాగుతుంది.ఒకటిన్నరగంటలు దుష్చర్యలు చేసిన నాయకుడు,క్షణంలో తన తప్పు గ్రహించేస్తాడు.కాళ్ళుపోగానే కళ్ళు తెరచుకుంటాయి.పార్టీ మార్చి,పదవిపోగానే మళ్ళీ అమ్మ అంటూ పాత పార్టీకి ఆవచ్చి హోం కమింగ్ అనే నాయకులలాగా తల్లి తండృల పాదాలు వొత్తుతాడు.ఆ దృష్యంలో తండ్రి ఎంత సంతృప్తిగా పడుకుంటాడంటే, ఇది మన తెలుగు సినిమా అని గుర్తులేకపోతే ఇదేదో బ్రోక్ బాక్ మౌంటయ్న్ అనుకునేవాడిని.కృష్ణుడు,నాయకుడిని కౌగలించుకున్న దృష్యంలో వారి ముఖ కవళికలు కూడా ఇదే భావనను కలిగించాయి.
మళ్ళీ అందరూ అనందిస్తుంటే చూడలేని దేవుడు నాయకుడిని డిస్టర్బ్ చేస్తాడు.కానీ పాద స్పర్షాసౌఖ్యాన్ని అనుభవిస్తున్న నాయకుడు నేను రాను పోరా అంటాడు.వెళ్ళలేక దేవుడు రాయి అయి నిలుచుంటాడు.కానీ,భార్యకు బాగాలేదనగానే అన్నీ వదలి పరుగెత్తుతాడు.కిట్టూను చూడనివ్వటంలేదని ఆమె నిరాహార దీక్ష చేస్తుంది.దాంతో కోపం వచ్చి కృష్ణ విగ్రహం తల తిరిగేలగా,గోడవిరిగి రాళ్ళు పడి అడ్డుపడ్డ బ్రాహ్మలు చచ్చేలాగా పాట పాడతాడు హీరో.అయితే ఆపాట మాధుర్యము భరించలేకనో,మరెందుకో,నాయిక చచ్చి పోతుంది.ఎందుకు పెళ్ళి చేసుకుందో,ఎందుకు పొమ్మనగానే వదిలేసిందో ఎందుకు చచ్చిపోయిందో దేవుడికే తెలియాలి.ఇక ఇక్కడినుంచీ సినిమా పాటలతో,దేవ నాయకుల ఎత్తుకు పైఎత్తుగా సాగుతుంది.చచ్చిన భార్యను బ్రతికిస్తానంటాడు దేవుడు.కానీ మగవాడు భార్య చచ్చిపోవాలని కోరుకుంటాడని ఆ మధ్య ఒక మేధావి చెప్పిన మాటను నమ్మిన హీరో అది తప్ప అన్ని వరాలూ కోరుకుంటాడు.చివరికి ఎందుకు చూస్తున్నామో,ఏమి సాధిస్తున్నామో అర్ధం కాక చీ పాడు దేవుడు అని నాస్తికులమయిపోవాలనిపిస్తుంది.

పాత సినిమాలో నాయకుడి కుటుంబమే కాదు,మిగతా బోలెడంత భక్తులు విఠలుడిలో కలవటం చూపుతారు.కానీ,ఆధునిక వ్యక్తిగత సమాజానికి దర్పణంపడుతూ,నాయికా నాయకులిద్దరే పైకి పోతారు.ముసలితనంలో తల్లి తండ్రులను వొత్తిన కాళ్ళు చాలని వదిలి పోతారు.
ఇప్పుడే అందిన తాజా వార్త,పాత భక్తులు,దేవుళ్ళూ అంతా నాస్తుకులయిపోతున్నారట.లేకపోతే,మతం మారి పోతున్నారట.రాఘవేంద్రరావు,భారవిల బారిన పడేకంటే,అన్నమయ్య,రామదాసు,పుండరీకుల గతి పట్టేకంటే నాస్తుకులయిపోవటం మంచిదని అనుకుంటున్నారట.మతం మారితే,తమ జోలికి వచ్చే ధైర్యం వుండదని మారిపోతున్నారట!

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

13 Comments to “నేను పాండురంగని చూచి తరించితినీ!”

  • రోకలి లో తల పెట్టి, తరువాత రోకలి పోటు, గురించి, గొడవ పెట్టడం అంటే ఇదే.
    అసలు మీరందరు, రాఘవేంద్రుని సినిమా లో, ఏమి ఉహించికొని వెళ్లి, సినిమా చూసిన తరువాత, ఈ గగ్గోలు, పెడ్తున్నారు. రాఘవేంద్రుని సినిమా అదీ భక్తి సినిమా ఇంతకముందు చూసిన వాళ్లు ఎవరూ, ఇంతకంటే, ఎక్కువ ఊహించుకొని, సినిమా కు వెళ్లాము అని అంటే మాత్రం, వాళ్లను బాగు చేయటం మాత్రం, ఎవరి తరం కాదు.
    ఇక రాఘవేంద్రుడు ఇలానే సినిమా ఎందుకు తీయాలి అంటె దానికి సమధానం చాలా simple. He is a commercial director. His primary goal is to make money for his producer. అంతవరకు అలోచిస్తే ఆయన ఓ successful director. ఒకే concept తో ఒకటి తరువాత మరొకటి తీసి ఈమాత్రం success చేయగలిగిన తెలుగు directors ఎంతమంది ఉన్నారో చెప్పండి.
    నావరకు నేను ఏది అయితే expect చేసి వెళ్లానో (పూలు, పళ్లు అని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా) అంత వరకు, నన్ను director గా రాఘవేంద్రుడు ఎప్పుడూ నిరుస్థాహ పరచలేదు.
    ఇక హిందు భక్తి ని ఇలా, commercial గా వాడడం ఏమీ బాగాలేదు అంటారా, అది మన ప్రభుత్వాలే చేస్తున్నప్పుడు, ఇంతకంటే ఘోరంగా, రాఘవేంద్ర రావ్ ని, అనుకొని ఎమి లాభం.

  • రివ్యూ విశ్వనాథ వారి పద్ధతి లో బానే ఉంది….రాఘవేంద్రుడికి పెళ్ళి అయింది, మీరనుకున్నట్టు బ్రహ్మచారి కాదు…సంసారే

  • ఈ భావవ్యక్తీకరణ శైలి బాగుంది. చారి గారన్నట్లు “కె.రాఘవేంద్ర రావు, బి,ఏ” గారికి సూర్య ప్రకాశ రావు అనే కొడుకున్నాడు. మొదట హీరోగా ఒక తెలుగు సినిమాలో నటించి, విషయం లేదని తెలిసి, Morning Raaga అనే ఒక ఆంగ్ల భాషా చిత్రాన్ని నిర్మించి, అందులో నటించి ఒక నేషనల్ అవార్డ్ కూడా సంపాదించాడు. ఇందులో షబానా అజ్మీ,నాజర్ వంటి దిగ్గజాలు నటించారు.

  • Surya Prakasa rao even directed a children’s movie(?) called “Bellyful of Dreams”.

  • క్రిషణ గారూ,
    మీరన్నవి అక్షరలక్షలు చేసే సత్యాలు.దానిలో ఎటువంటి సందేహమూ లేదు.రాఘవేంద్రరావు వ్యాపారపరంగా దర్శకేందృడే, అతని సినిమాలలో వికృత లైంగిక ప్రతీకలన్నీ వీర విశృంఖల విహారం చేస్తాయన్నదానిలో ఎవరికీ సందేహం లేదు.ఇందుకు భిన్నంగా,ఆయన నిజాయితీగా భక్తి సినిమా తీస్తే ఆశ్చర్యంతో సగం ప్రేక్షకులు గుండెలాగి హాలులోనే చచ్చిపోతారన్న విషయంలోనూ సందేహమస్సలు లేదు. ఇతర వ్యాపార కథలన్నీ అయిపోయి ఇప్పుడు భక్తి వ్యాపారంలో పడ్డారనీ మనకు తెలుసు.మీ రుచి విషయంలో మీరు నిర్మొహమాటంగా నిజం చెప్పారు.అందుకు అభినందనలు.మీకు మరింత రుచించే రంజయిన సినిమాలు తామరతంపరగా తెలుగు సినీ కళాకారులు నిర్మించాలని నేను ఆశిస్తున్నాను.అయితే,ఇదే సినిమా,పాండురంగడు,ది కాసనోవా ఆఫ్ ఆంధ్రా,అన్న టాగుతో,సాంఘిక చిత్రంగా తీస్తే ఆ సినిమా చుట్టుపక్కలకు కూడా వెళ్ళము.వెళ్ళినా ఇలా ఏడవము.మీకన్నా ఎక్కువగా ఆనందిస్తాము.
    సినిమా అన్నది వ్యాపారమే అయినా అదీ ఒక కళ కూడా.ఎలాగయితే ప్రతి కళకూ కొన్ని లక్షణాలూ,సూత్రాలు వుంటాయో సినిమాకు కూడా అలానే వున్నాయి.సినిమాకూ ఒక వ్యాకరణం వుంది.కొన్ని విషయాలలో కళాకారులు తప్పనిసరిగా పాటించాల్సిన ఔచిత్యమూ వుంది.ఇప్పుడు నేను 10 కమాండ్మెంట్స్ తీసి దాన్లో రాణి మోసెస్ తో శృంగారాల్లో మునిగినట్టు కలలోనే అనుకోండి చూపాననుకోండి,అది వ్యాపారమని సమర్ధించుకోవాలని ప్రయత్నించినా,ఎవ్వరూ ఒప్పుకోరు.బెన్ హర్ సినిమాలో బ్రహ్మానందం వెర్రి జోకులు,అలీ కుళ్ళు వెకిలి జోకులు చొప్పించాననుకోండి ఎలా వుంటుంది?అరబిందో జీవితకథను తెరకెక్కిస్తూ,అతనికీ అతని భార్యకూ నడుమ ద్వంద్వార్ధాల శృంగార పాట పెట్టి పూలు,పళ్ళతో పాటూ అరటి పళ్ళు,గారెలూ నింపాననుకోండి? సాయి బాబా సినిమా తీసి ఇద్దరు వెకిలి పాత్రలను సృష్టించి వారి ద్వంద్వార్ధాల మాటలను వ్యాపారమని చూపాననుకోండి?
    జిడ్డుకృష్ణ మూర్తి జీవితాన్ని తెరకెక్కిస్తూ డ్రామా కోసమని ఒక అజ్ఞాత ప్రేమికురాలిని సృష్టించాననుకోండి?వేంకటేశ్వరుడికి ఎలాగో ఇద్దరు భార్యలు.ఇద్దరితో 3 1/2 కొండ దగ్గర సరసాలు చూపాననుకోండి?
    రాస్తూంటేనే అసహ్యంగా లేదూ?అసలిలాంటి తుచ్చమయిన ఊహలెలావస్తున్నాయనిపించట్లేదూ? అలాంటి మహా పురుషుల గురించి ఇలా ఎలా అనుకుంటారని నన్ను నిలదీయాలనిపించట్లేదూ?
    కొన్ని పవిత్ర కథలను పవిత్రంగానే తీయాలి.లేకపోతే 15 ఏళ్ళు పరిశోధించి గాంధీ జీవితాన్ని తెరకెక్కించాల్సిన అవసరం ఒక విదేశీయుడికెందుకు?వ్యాపారం అని,కాస్త శ్రంగారం,కాస్త వెకిలి హాస్యం,బోలెడన్ని పూ,పా లు నింపేస్తే పోతుంది కదా? ఓమర్ ముఖ్తార్,లారెన్స్ ఆఫ్ అరేబియా,బ్రేవ్ హార్ట్,పాట్రియాట్ లాంటి సినిమాల్లో,ఇంకా ఇలాంటి అనేక సినిమాల్లో వెకిలితనానికి తావేది?
    అశోకుడు అమ్మాయితో జలపాతంకింద ఎగుర్తూ పాడటం అనౌచిత్యం. మంగల్ పాండే-వేశ్య సన్నివేశాలు అనౌచిత్యం.అందులో విదేశీయుడి కల్పిత పాత్ర అనౌచిత్యం.అలాగే అన్నమయ్య,రామదాసు,పాండురంగడూ కూడా!
    మన చారిత్రిక వ్యక్తుల గురించి,భక్తుల గురించి,మహానుభావుల గురించీ తీసే సినిమాలు మనకు వారి పట్ల వున్న గౌరవానికి సూచనలు.ఇవే భావి తరాలకు ప్రామాణికాలవుతాయి.వారిని అవమానించినా,అపహాస్యం చేసినా,వ్యాపారమని వారిని,మన స్థాయికి దిగజార్చినా,అది మనం మనకేకాదు,భావి తరాలకూ అన్యాయం చేస్తున్నట్టు. ఒక నటుడి ఇమేజీ కోసం అన్నమయ్యకు మీసాలు అద్దటం,డ్రామా అని రామదాసుకిద్దరు హీరోయిన్లను ఉంచటం,వ్యాపారమని కృష్ణ్డితో కూడా ద్వంద్వార్ధాలు పలికిచటం,ఒక భక్తుడిని ఉట్టి కామాంధుడిగా చూపటం మనమంతా వ్యతిరేకించాలి.ఇలాంతి సినిమాలు వేరే పేరుతో తీసుకోమనండి.సాంఘికాలు లాగించమనండి.సమాజం ఖర్మ అని వదిలేస్తాం.కానీ ఇలా విశ్వాసాలతో వ్యాపారం పేరిటా అపహాస్యాలాడటం అందరమూ ఖండించాలి.కనీసం మన నిరసన తెలపాలి.
    మనం మౌనంగా అన్నిటినీ అర్ధం చేసుకుని వదిలేస్తూండటం వల్ల కళాకారులకు బాధ్యత తెలియటంలేదు.వ్యాపారమే తెలుస్తోంది.ఎప్పుడయితే చూడకేంచేస్తారు అని ఇష్టమొచ్చినట్టు కళాకారులు ప్రవర్తిస్తున్నరంటే దానికి ప్రేక్షకులే దోషులు.

    ప్రత్యుత్తరమిమ్ము
    కస్తూరి మురళీకృష్ణగా లోనికి ప్రవేశించారు. Logout »

  • మురలీ క్రిష్ణ గారూ,
    ఇప్పటికి మీ బాధ నాకు అర్ధం అయ్యింది. మొదట నేను, మీరు రాఘవేంద్రుడు, ఏమిటి, ఇలా, తీసాడు అని తెలిసీ, ఎందుకు బాధపడుతున్నారో నని, ఆశ్ఛర్యంతో, ఆ కామెంట్, వ్రాసాను.
    నాకు ఇప్పటికి అర్ధం అయ్యింది, ఏమిటి, అంటే, మీ బాధ, రాఘవేంద్ర రావ్, పాండురంగడు సినెమా కంటే, పెద్దది. ఎందుకు మనవాళ్లు, మన పురాణ పురుషుల గురించి, ఇలా, vulgar గా తీస్తున్నారు అని. అది బాలీవుడ్ కానీయండి, తాలీవుడ్ కానీయండి. దానికి answer మన అందరికి తెలిసిందే, commercialization.
    ఇక పోతే, “సినిమా అన్నది వ్యాపారమే అయినా అదీ ఒక కళ కూడా.ఎలాగయితే ప్రతి కళకూ కొన్ని లక్షణాలూ,సూత్రాలు వుంటాయో సినిమాకు కూడా అలానే వున్నాయి” అని అన్నారు. మన సినిమా లో, కళ ఎప్పుడో పోయి, పూర్తిగా వ్యాపారం అయింది అన్న realization కు నేను వచ్చాను. నాలాగే సగటు ప్రేక్షకుడు కూడ వచ్చాడని నా అభిప్రాయం.

    “ఇప్పుడు నేను 10 కమాండ్మెంట్స్ తీసి దాన్లో రాణి మోసెస్ తో శృంగారాల్లో మునిగినట్టు కలలోనే అనుకోండి చూపాననుకోండి,అది వ్యాపారమని సమర్ధించుకోవాలని ప్రయత్నించినా,ఎవ్వరూ ఒప్పుకోరు.” అని అన్నారు. ఆ ఎవ్వరూ ఎవరో చెప్పండి, mostly christians అని మాత్రం నేను చెప్పగలను. christian or muslim characters ని మాత్రం ఇలా తీస్తే, గొడవలు అవడం మాత్రం ఖాయం. తీసిన వాడి తలకు rate పెట్టడం కూడ ఖాయం.
    కాకపొతే నా సమస్య అంతా, వాళ్ళ లాగా మనం కూడా, ఆ బాటే పడదామా, లెక ముందు నుండి భారతీయులకు(ముఖ్యం గా హిందువులకు) వున్న బలం/బలహీనత అయిన “సహనం” తో భరించుదామా అన్నది.

    చివరగా, నా ద్రుష్టి లో, అన్నమయ్య, రామదాసు, పాండురంగడు తీసి, రాఘవేంద్రుడు, ఎంతో కొంత, హిందూ మతానికి సీవ చేసాడు అని నా వుద్దెశ్యం. మీరు వున్న ప్రాంతం గురించి నాకు తెలియదు కాని, మా ప్రాంతం లో, మత మార్పిడి అన్నది, ఓ పెద్ద వ్యాపారం గా అన్ని జిమ్మిక్కులు తో, జరుగుతుంది. రామదాసు చూసి, ఓ పదిమంది భద్రాచలం, వెళ్లినా, చిలకలపూడి పాండురంగడి గుడిని, ఓ పది మంది extra వెళ్లి దండం పెట్టుకొచ్చినా, నా ద్రుష్టి లో, ఆయన సెవ చెసినట్లే.
    ఏమిటి, ఈ సినెమాలు చూసి, భద్రాచలమో, చిలకలపూడో, వెళ్లే, వాళ్లు కుడా వుంటార, అంటారా, దానికి మా ఇంట్లో, వాళ్లె, సాక్ష్యం. అది ఎలా సాధ్యం అంటారా, ఆ సినెమాలలొ, నేను గమనించింది ఎమిటి అంటే, (పూలు, పళ్లు చూసేవాళ్లు వాటిని చూస్తునారు, భక్తిని చూసేవాళ్లు భక్తిని చూస్తున్నారు అని). మన వాళ్లకు అడ్డమయిన చెత్త సినెమాలు చూసి, చూసి, వాటిలలో వాళ్లకు కావాల్సింది, తీసుకోవడం అలవాటు అయ్యిందా అని నాకు అనిపించింది.
    ఏది ఎమయినా, అన్నమయ్య సినెమా పుణ్యమా అని, ఆ సంగీతం ఎక్కువ మంది విన్నారు అనిమాత్రం చెప్పగలను.
    చివరగా, మన భావితరాల వాళ్లు, వీటినే, నిజమయిన జీవిత చరిత్రలు అనుకొంటారు ఎమో అన్న మీ భయం నాకూ ఉంది, మొన్న మా మెనకోడలు (8 years) ఎదో commercial చూస్తూ, ఇవన్ని వట్టి వే మావయ్య అంటూ వుంటే, ఆ భయం ఎదో, కొద్దిగా తగ్గినట్లు నాకు అనిపించింది. చూదాలి భావితరాలు వీటిని commercials గా నే భావిస్తారో, లేక నిజ జీవితచరిత్రలు అనుకొంటారో.

    నా వుద్దెశ్యం లో, వీటికి నిరసన తెలపాలంటే, ఈ సినిమాలు చుడక పోవడమే better అనుకొంటాను. భక్తిని ఇలా వాడెసుకోవటం మాత్రం కొంచం ఎబ్బెట్టే అంటారా, ఒప్పుకుంటాను. కాకపోతే, ఏడు కొండలకే, పంగనామాలు పెట్టి, రొండు కొండలకు తగ్గించాలని వారానికి ఒక సారి వాటికన్ వెళ్లి వచ్చే ప్రబుద్దులతో పోలిస్తే నాకు రాఘవేంద్రుడు, నచ్చుతాడు.

    నేను సమస్యను ఇంకో కోణం లో నుంచి చుస్తున్నాను తప్ప, మీరు చెబ్తున్న విషయాలు తప్పు అనడం లేదు అని గమనించగలరు. సినెమా వాళ్లను కళాకారులు గా గుర్తిస్తే, మాత్రం కోపం వస్తుంది. నేను వాళ్లను కళాకారులు గా గుర్తించడం మాని చాల కాలం అయ్యింది కాబట్టి, నా వరకు అంత కోపం రావడం లెదు.

    మనం చర్చిస్తున్న విషయం మాత్రం, రాఘవేంద్ర రావ్ పాండురంగడు కంటే, పెద్దది అన్నది మాత్రం నిజం.

  • కృషన్ గారూ,

    సాహిర్ లూధియానవీ అనే ఒక కవి ఒక పాట రాశాడు.దాన్లో ఒక చరణం లో ‘అప్నా సుఖ్ భీ ఏక్ హై సాథీ అప్నా దుఖ్ భీ ఏక్ ‘ అంటాడు.

    ఇది నిజం.మీ వివరణ దాన్ని నిరూపిస్తుంది.

    తరువాత పాదంలో, ‘అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్ అప్నా రస్తా నేక్ ‘ అంటాడు.

    ఇది మన అందరికీ ఆదర్శం కావాలి.

    అయితే,నేక్ రాస్తా లో ప్రయాణించటం సులభం కాదు.మీరన్నట్టు కళ లో కళ పోయి వ్యాపారం మిగిలివుండవచ్చు.కానీ,మనం మౌనంగా దాన్ని ఆమోదించకూడదు.ఎప్పుడయితే పొరపాట్లను ప్రేక్షకులు క్షమించరు అన్న భయం కళాకారుడికి వుంటుందో,అప్పుడు కళాకారుడు జాగ్రత్త పడతాడు.అది లేనప్పుడు పరిస్థితి ఇలాగే వుంటుంది.

    కొత్తల్లో నేనూ, ఇలాంటి సినిమాలను చూడకుండా వదిలేస్తే సరి, అదే ఉత్తం నిరసన పద్ధతి అనుకున్నాను.కానీ, ఎంత కష్టమయినా మనం చూసి, విమర్శించటం వల్ల కొందరికయినా ఒక దృష్టి ఇచ్చిన వారమవుతాము.నిజానిజాలు ప్రకటించటం ద్వారా మన బాధ్యత నెరవేర్చిన వారమవుతాము.మౌనంగా వుండిపోవటం కూడా నేరాన్ని ప్రోత్సహించినట్టవుతుంది కదా!

    మన తెలుగు సినిమాలపయిన,నిర్మొహమాటమయిన,నిక్కచ్చి విమర్శలు వచ్చే పరిస్థితి లేదు. సినిమాను విమర్శించాలంటే, సినీ ప్రకటనలు దెబ్బ తింటాయన్న ఆలోచన పత్రికలను వెనక్కు లాగుతుంది.అభిమానుల ఆగ్రహం విమర్శకులను వెనక్కు లాగుతుంది.మొహమాటాలు మిగతావారికి అడ్డుపడుతున్నాయి.ఇటువంటి పరిస్థితిలో మన అభిప్రాయాలను స్వేచ్చగా,వ్యక్తీకరించి,చర్చించుకునే వేలు మనకుంది.దాన్ని ఉపయోగించుకుందాం.

    ఇందువల్ల లాభం లేదని అనుకోకండి.ప్రపంచంలో ఎలాగయితే పనికిరానిదేదీలేదో అలాగే ఫలితం వుండని సంఘటనా లేదు.కాబట్టి,మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోవాలి.సమాజాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న సినిమాలగురించి,వాటి బాగోగుల గురించి,నిజాయితీగా,నిక్కచ్చిగా విమర్శించి,విశ్లేషించుకోవాలి.ఏమో,భావి దర్శకుడెవరో మన చర్చలు చూడచ్చు.ఆ ప్రభావంతో సినిమాల దిశను మార్చవచ్చు.

    మానవుడు ఆశాజీవి.ఆశ మనిషికి ఊపిరి.కాబట్టి,మన వాళ్ళింతే,అదంతే అనుకోకూడదు.మన పని మనం చేస్తూ పోవాలి.

    మీరు గమనించండి.ప్రపంచాన్ని ఎప్పుడూ గుంపు మార్చదు.మార్పు ఒక మహానుభావుడివల్ల వస్తుంది.సమాజం అతడిని అనుసరిస్తుంది.మారుతుంది.

  • Directors of Old generations were pious,they shot movies with Bhakti,and they were propqagating the Bhakti culture to the masses.They never shot movies for money only.New Directors are ran out of stories and they,reinvented Pandurangadu in their own way , and the aim is >>to make money .
    Your review is hilarious and good.Hope some sense prevails on these Writers,Directors. and Actors

  • hi yaar,

    pandurangani paruvu tisaru. try to write more reviews. ur expression and style is good.

  • బాగా చెప్పారు…అలాగే ఆ సినిమాకూడా టేస్టుకు తగ్గ ఫలితాన్నే పొందింది.
    అయితే కమర్షియల్ అంశాలు లేకుండా ఇటువంటి సినిమాలు తీయలేమా…తీస్తే చూడరా…
    అంటే…నేను కమర్షియాలిటీ కోసమైతే చాలా కథలున్నాయి కదా…ఇవెందుకు నాశనం చేయటం అంటాను. ఎందుకంటే ఈ సినిమాలో ఓ పాటలో బాలయ్య బాబు…బ్యాంకాకులో సుందరాంగులతో నృత్యాలు చేస్తూంటాడు. అఫ్ కోర్స్ ఆయన భగవంతుడు రూపం కాబట్టి అలా చేసాడని సరిపెట్టుకున్నా…స్నేహ పాత్ర మాత్రం..ఒక భక్తురాలుగా కాకుండా నువ్వు లేనిదే…నీ స్పర్శ లేనిదే నే బ్రతకలేను అన్నట్లు నిరాహార దీక్షలు చేస్తూంటుంది. అయ్యో అదీ ప్రక్కన పెడితే అసలు ఈ కథ ఏ కాలంలో జర్గుతోంది. ఏ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ సంప్రదాయాలు..సామాజిక పరిస్ధితులు తెరపై కనపడతాయా…ఏదో డ్రామా చూస్తున్నట్లు ఉంటుందే కానీ…కాబట్టి కమర్షియాలిటీ కోసం గాంధీ సినిమా తీస్తే అందులో ముమైత్ ఐటం సాంగ్ పెట్టే దర్శకులు ఉన్నప్పుడు అంతకు మించి ఆశించటం అనవసరమే. -సూర్య ప్రకాష్ జోశ్యుల

  • I feel like I’m watching a blue film…. there is no base for this movie…

  • GOOD REVIEW

  • intha raasinavaallu, mari meeru
    raaghavendra rao ki pelli aindanna sangathi ela miss ayyaro artham kavatledu.

    how

    kumar

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories