Menu

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: జ్యోతిక, మలయాళ నటుడు పృథ్వీరాజ్, ప్రకాశ్‍రాజ్, స్వర్ణమాల్య మరియు, అప్నా బ్రహ్మానందం. నిర్మాత ప్రకాశ్‍రాజ్. దర్శకుడు రాధామోహన్. సంగీతం విద్యాసాగర్.

కథ విషయానికొస్తే, ప్రకాశ్‍రాజ్, పృథ్వీరాజ్ ఇద్దరూ కీబోర్డ్ కళాకారులు. విద్యాసాగర్ జట్టులో వాళ్ళు సభ్యులు. వీళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు అద్దెకి తీసుకుంటారు. వీళ్ళు బహ్మచారులని వీళ్ళ పొడ గిట్టదు ఆ అపార్ట్మెంట్ సెక్రెటరీ అయిన బ్రహ్మానందానికి. ఇంతలో, ఓ రోజు పృథ్వీరాజ్ రోడ్డుపై జ్యోతిక ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రేమిస్తాడు. తరువాత తెలుస్తుంది, ఆమె తమ అపార్ట్మెంట్ లోనే ఉంటోందని, మూగ-చెవిటి అమ్మాయని. పృథ్వీరాజ్ ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ, ఆమె స్నేహితురాలైన స్వర్ణమాల్య ద్వారా ఆమెకి పెళ్ళి అంటే ఉన్న ద్వేషాన్ని గురించి తెలుసుకుని, మొదట స్నేహం మొదలుపెడతారు. కొన్ని మలుపుల తరువాత కథ సుఖాంతమౌతుంది – రెండు జంటలూ ఏకమవడంతో.

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటీ అంటే మొదట – ఈ కథని తీయడానికి ప్రకాశ్‍రాజ్ తీసుకున్న చొరవ. దీన్ని తీయడానికి ఎంతమంది సిద్ధంగా ఉండేవారో ఊహించలేను కానీ…. సినిమా మొత్తం మీద ఒక్క ముక్క కూడా మాట్లాడని హీరోయిన్, రొమాంటిక్ సీన్లు లేని ప్రేమ, పెద్ద హీరోయిజం చూపని హీరో – ఈ మూడూ చాలు రెండడుగులు ముందుకేసిన వారిని మూడు అడుగులు వెనక్కి వేసేలా చేయడానికి. కథాపరంగా నాకు ఈ సినిమా చాలా నచ్చింది. సింగిల్ పాయింట్‍గా ఏదో ఒకటో రెండో పాత్రల చుట్టూ తిరగకుండా రకరకాల పాత్రలు తెరపైకి తీసుకొస్తూ, వాటి మధ్య బంధాలని అల్లడంలో ఈ కథ సఫలీకృతమైంది. సినిమా ఆద్యంతమూ ఓ వైపు కదిలించే కథలున్నా (స్వర్ణమాల్య, జ్యోతిక, ప్రొఫెసర్ల కథలు) ఎక్కడ కూడా ఇది పూర్తి సీరియస్ సినిమా అనిపించదు -కారణం, హాస్యం. ప్రకాశ్‍రాజ్ హాస్యం చాలా బాగుంది. బ్రహ్మానందం కి డబ్బింగ్ వినడం కాస్త కొత్తగా అనిపించింది, ఆ పాత్ర కూడా బాగా కుదిరింది. హీరో పాత్ర- ఇప్పటి సినిమాలకి కాస్త భిన్నమైన హీరో పాత్ర. సాఫ్ట్ హీరో తరహా అనమాట. వీటన్నింటినీ మించి, జ్యోతిక నటన బాగా ఆకట్టుకుంది నన్ను. ఇన్నాళ్ళలో ఏ సినిమాలోనూ నాకు జ్యోతిక ఇంతగా నచ్చలేదు, నటన పరంగా. ఇంకా కథనం – చాలా బాగుంది. ఆ డైలాగులు, సన్నివేశాలు – నాకు ప్రతీదీ నచ్చింది ఈ సినిమాలో. ముఖ్యంగా సంగీతం గురించి హీరో జ్యోతికని అడిగే సన్నివేశం, జ్యోతిక సైగలతో హీరో ఆమె గొంతుని సృష్టించుకునే ప్రయత్నం చేయడం, ప్రకాశ్‍రాజ్ స్వర్ణమాల్య ని మొదటి సారి కలిసిన సన్నివేశం, ఆమెని పెళ్ళి చేసుకుంటావా? అని అడిగే సన్నివేశం, జ్యోతిక ని పృథ్వీరాజ్ మొదటిసారి చూసే సన్నివేశం, ప్రకాశ్ రాజ్ హాస్యం -నాకు బాగా నచ్చాయి ఈ సినిమాలో. పాటలు కూడా బాగున్నాయి. నాకు పాటల్లో వాడే తమిళం అర్థంకాదు కానీ, ఈ పాటలు విన్నాక అది కూడా అర్థం చేసుకోవాలి అన్న కుతూహలం కలిగింది. మొత్తానికి ఓ మాట చెప్పాలంటే, ఈ సినిమా కొత్తగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, కదిలించేలా ఉంటుంది, ఆలోచించేలా ఉంటుంది – “వలపూ వగపూ నవ్వూ ఏడుపు కలబోతేరా జీవితమూ..” అన్న వాక్యాల్లోని నిజాన్ని పునరుద్ఘాటించేలా ఉంటుంది.

తమిళం అర్థమయ్యేలాగుంటే, ఈ సినిమా తప్పక చూడండి. అర్థం కాకున్నా కూడా చూట్టానికి ప్రయత్నించండి. 🙂 మంచి సినిమాకి ప్రచారం ఇవ్వడం మంచి ప్రేక్షకులుగా మన బాధ్యత మరి – ఏమంటారు?

6 Comments
  1. Venu June 26, 2008 /
  2. lucky June 30, 2008 /
  3. sasank July 1, 2008 /