Menu

Life is beautiful (1997)

Life is beautiful – నేను ఏదో సినిమా కాపీ చేసుకోబోయి ఇది కాపీ చేసుకున్నాను నా కంప్యూటర్ లోకి. తర్వాత గమనించి, ఇదెలా ఉంటుందో! అనుకున్నా. ఒకరిద్దరు ఇందులోని హాస్య పార్శ్వాన్ని గురించి చెప్పడంతో, చూశాను. చూసాక, ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నన్ను బాగా కదిలించిన సినిమాల్లో ఇది ఒకటి. ఏమి ఆలోచించి ఆ పేరు పెట్టారో తెలీదు కానీ, నేనైతే Guido is wonderful అని పెట్టేదాన్ని. గీడో అంటే హీరో పాత్ర పేరు. ఇది ఒక ఇటాలియన్-ఇంగ్లీషు సినిమా.

కథంతా హీరో కొడుకు జోషువా చెప్పిన ఫ్లాష్‍బ్యాక్ లా వస్తుంది.కథ విషయానికొస్తే, మొదటి అర్థభాగం అంతే గీడో-డోరా ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందీ అన్న దగ్గర మొదలై, వాళ్ళకి జోషువా పుట్టి ఐదేళ్ళ వాడవడం దగ్గర ముగుస్తుంది. అయితే, ఒకానొక రోజు అనుకోకుండా, అవాంఛనీయంగా-వీళ్ళు ముగ్గురూ జర్మన్ కాన్సన్ట్రేషన్ క్యాంపు లోకి పంపబడతారు. ఇక్కడ గీడో,జోషువా డోరా నుంచి వేరౌతారు. డోరా ఆడవాళ్ళ జైల్లో, వీళ్ళిద్దరూ మగవాళ్ళ జైల్లో. జోషువాతో గీడో అసలు విషయం చెప్పకుండా ఇదంతా ఒక ఆట అనీ, వెయ్యి పాయింట్లు మొదట సాధించిన వారికి యుద్ధ ట్యాంకు బహుకరిస్తారనీ – ఇలా కథలు చెబుతూ చివరి దాకా నెట్టుకొస్తాడు. జోషువా కూడా దాన్ని నమ్ముతాడు. జర్మన్ల ఓటమితో ఈ ఖైదీలందరూ బయటపడటంతో సినిమా ముగుస్తుంది. చివర్లో మన గీడో కాల్పుల్లో చనిపోతాడు. జోషువా వాళ్ళ అమ్మని కలుసుకుంటాడు. మొదటి అర్థం నిండుగా మంచి హాస్యం. “అమ్మాయిల్ని పడేయడానికి ఈ సినిమా చూడండి” – అని ఈ సినిమా గురించి ఒకరి వ్యాఖ్య విన్నాను. ఈ సినిమా చూసాక అందులోని నిజాన్ని ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నా. 🙂 అదొక్కటి కాదు కానీ, పాత్రధారుల నటన ఈ మంచి హాస్యానికి visual appeal ఇచ్చింది. రెండో అర్థభాగంలో కూడా స్క్రిప్ట్ కి తగ్గట్లు ఆ నటనే విజువల్ అప్పీల్ని ఇచ్చింది మళ్ళీ.

సినిమా మొత్తం మీద గీడో పాత్ర చిత్రణే అన్నింటికన్నా ముఖ్యమైనది, చూసే మనిషిని సూటిగా తాకేదీ కూడానూ. ఎన్ని కష్టాల్లోనూ గీడో అదే విధంగా ఉంటాడు-అదే అక్కడ ఆకట్టుకునే విషయం. ఆ పరంగా చూస్తే, ఇదొక గొప్ప ఆశావాదం పాఠం. అలాగే, బాధల్లోనైనా చిరునవ్వును వీడకనే తత్వం స్ఫూర్తిదాయకం. గీడో సృజనాత్మకతకు జోహార్లు.ఇంతకీ, ఈ సినిమా దర్శకుడూ, గీడో పాత్రధారీ ఒకరే. దర్శకత్వం చేస్తూ కూడా హీరోగా వేసి, అంత మంచి ప్రదర్శన ఇచ్చినందుకు అతనికి ఎన్ని వీరతాళ్ళైనా వేయవచ్చుఅసలు. నాకైతే ఈ సినిమా గొప్ప జీవిత పాఠం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా గీడో ఆటిట్యూడ్ అలా ఎలా ఉండగలిగిందో…అడిగి కనుక్కోవాలి. 🙂 గీడో పాత్రధారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంది నాకైతే. కథ చాలా బాగా రాసారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలి…. మన సినిమాల్లో కూడా వస్తే…అంతకంటేనా!

10 Comments
  1. శంకర్ June 28, 2008 /
  2. శంకర్ June 28, 2008 /
  3. Sowmya June 28, 2008 /
  4. Srividya June 29, 2008 /
  5. sujata June 29, 2008 /
  6. అరవింద్ July 3, 2008 /
  7. udaygurrala February 25, 2010 /