Menu

సినిమా కథ

[ నవతరంగంలోని సినిమా సమీక్షలు చదివిన తరవాత, ఎప్పుడో కొడవటిగంటి కుటుంబరావు రాసిన “సినిమా కథ” ఇప్పటికీ ఎంత చక్కగా వర్తిస్తుందో నవతరంగం మిత్రులకి పరిచయం చేద్దామని ఈ ప్రయత్నం. – విష్ణుభొట్ల లక్ష్మన్న]

కథానాయిక పాడుతూ ఫేడిన్ అయి, క్లొజప్‌లో పాడుతూ మనకేసి చూసి నవ్వుతూ గదంతా డాన్స్ చేస్తున్నది. ” ఎంత హాయి! ఎంత హాయి!” అనే పల్లవిని బట్టి ఆమెకు హాయిగా వున్నట్టూ, అందుకే డాన్స్ చేస్తున్నట్టూ మనకు తెలుస్తున్నది.

ఇంతలో కాఫీ పట్టుకొని కూతురు పాటకు లయగా అడుగులు వేస్తూ వచ్చి, పాటా, బాజా భజంత్రీలు ఆగిపోయేదాకా నిలబడి కూతురుకు కాఫీ అందిస్తూ ” ఎటువంటివాడు రావలసి ఉన్నాడో!” అన్నది తల్లి.

కథానాయిక ప్రణయ కోపం మొహం పెట్టి “పోమ్మా!” అన్నది.

” ఏమే? మంచి డాక్టరు మొగుడైతే ఇద్దరూ ప్రాక్టీసు పెడితే ఎంత బాగుంటుంది?” అన్నది తల్లి.

కూతురు నోటి నుంచి కాఫీ కప్పు దించి (లిప్‌స్టిక్ పెదవులకు కాఫీ తడి లేదు), “నువ్వెప్పుడూ ఇట్టాగే అంటావు!” అని చెప్పింది, మొహం చిట్లించి మూతితో మాత్రమే నవ్వుతూ.

మన కథా నాయికకు తండ్రి లేడుగాని ఆయన పటం గోడన వేలాడుతున్నది – ఇంత బూజుగాని, దుమ్ముగాని లేకుండా దానికి ఒక దండ కూడా వేసి ఉంది.

తల్లి ఏడుపు గొంతు పెట్టి ఆ ఫొటో దగ్గరకు వెళ్ళి ” ఆయన ఉంటే మనకిన్ని ఇబ్బందులు రాకపోను కద!” అన్నది.

కూతురు “హాయి హాయి” పాట మర్చిపోయిన దానల్లే నిట్టూర్చింది.

ఈ తల్లీ కూతుళ్ళు పడే కష్టాలు మనం తెలుసుకోవటం అవసరం. కూతురు ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నది. నూటికి నూరేసి మార్కులు తెచ్చుకుంటున్నది. తల్లి అంట్లు తోమి కూతుర్ని చదివిస్తున్నట్లు నిదర్శనాలేమీ లేవు. అయినా వాళ్ళకి డబ్బులేదు, రాబడిలేదు. అందుకని తల్లి జార్జెట్ చీరలు కడుతున్నది. కూతురు సాదా నైలాన్ మాత్రమే ధరిస్తున్నది. డబ్బుంటే ఇంకాఎంత పెద్ద ఇంట్లో ఉండి, ఎంత బాగా బతికే వాళ్ళో పాపం!

అయితే కథానాయిక గనక, మెడికల్ కాలేజీలో సహాధ్యాయినులందరూ చెలికత్తెల్లాగా వుండి కణ్వాశ్రమం శకుంతలకు అనసూయా, ప్రియంవద లెలా ఉండేవారో అలా ఉండి, ఆమె ఆకలే తమ ఆకలిగా, ఆమె ప్రణయమే తమ ప్రణయంగా, పరమాదర్శంగా ప్రవర్తిస్తున్నారు.

ఇప్పుడు మనం హీరోను కలుసుకోవాలి. ఇతను కూడా మెడికల్ కాలేజీ స్టూడెంటే. నాయికా నాయకులిద్దరూ ఒకటే క్లాసు. వాళ్లిద్దరి మధ్యా ప్రేమబంధం ఉన్నదని క్లాసందరికీ తెలుసు. మగ స్టూడెంట్లు దుష్యంతుడి వేడుక చెలికాళ్ళులాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ క్లాసులో ఇంకా ఆడపిల్లలున్నా వాళ్లను గురించి మగ స్టూడెంట్లు పట్టించుకోరు.

హీరో ఎప్పుడూ ప్రపంచాన్ని ఉద్ధరించే పనులే చేస్తుంటాడు కనకనూ, హీరోయిన్ “ఎంతహాయి!” పాడి చాలా సేపయింది కనకనూ, అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి “బిచ్చగాళ్ల కోసం ఒక నాటకం వేద్దామనుకుంటున్నాం. అందులో మీరు భరమాత వేషం వేసి డాన్స్ చేయాలి?” అంటాడు.

“మీరడిగితే ఏదైనా చేస్తాను” అంటుంది కథానాయిక (ఆమె అతన్ని ప్రేమిస్తున్నట్లు స్పష్టం కాగలందులకు).

హీరో ఆ మాటలను అర్ధం చేసుకోకనో, చేసుకొనో, “మీరలా అంటారని నాకు ముందే తెలుసు” అని, మొహం చిట్లిస్తాడు, తీవ్రమైన ఆలోచన ఉన్నట్టు.

అక్కడ నుంచి పాట అందుకొని హీరోయిన్ వీధి వెంట పాడుకొంటూ, మధ్య మధ్య భాగవతారల్లే అడుగేస్తూ వీధుల వెంటా, ఒక చేను పక్కగా, ఒక మోట బావి చుట్టూ తిరిగి, ఒక కొండ ఎక్కిదిగి పాట, భజంత్రీలు ఆగే సమయానికి ఇంటికి వచ్చేసింది.

ఆమె లోపలికి అడుగు పెడుతుండగానే ఆర్కెస్ట్రా కెవ్వున అరచింది. ఎందుకంటే హీరోయిన్ ఇంట లేనప్పుడు ఆమె మేనమామ వచ్చి ఉన్నాడు. అతన్ని చూడగానే హీరోయిన్ మొహం ముడుచుకుపోయింది. ఎందుకంటే ఈ మేనమామ విలన్. అందుకనే హీరోయిన్ని చూచి నవ్వి ” డాక్టర్ వచ్చిందే! ఇతరుల రోగాలు నయం చెయ్యటం కాదు, నా హృదయంలో జబ్బు నయం చేస్తేనే నువ్వు నిజమైన డాక్టర్ అని ఒప్పుకుంటాను.”

హీరోయిన్ ప్రణయకోపం మొహం పెట్టి అతనికి ఎడంగా తప్పుకొని లోపలికి పోతుంది. విలన్ ఎందుకో గట్టిగా నవ్వుతాడు.

హీరోయిన్ ” అమ్మా, అమ్మా” అంటూ తల్లి దగ్గరకి వచ్చే ముందే వ్యాసపీట మీద భాగవతంలాంటి పుస్తకం పెట్టుకొని కొద్దిపాటి ఆర్కెష్ట్రా సహాయంతో “నల్లనివాడు పద్మ నయనంబులవాడు” అనే పద్యం పన్నెండేళ్ళ పిల్ల గొంతుతో మాల్గోస్ రాగంలో సంగతులు వేసి పాడుతున్నది. పద్యమూ భజంత్రీలు అయిపోగానే హీరోయిన్ లోపలికి వచ్చి ” అమ్మా, అమ్మా” అన్నది.

తల్లి అంతలోనే గొంతు మార్చి, “మామయ్యెచ్చాడు తల్లీ” అన్నది.

” ఆ దుర్మార్గుణ్ణెందుకు రానిచ్చావు మనింటికి?” అన్నది హీరోయిన్. పళ్ళు కొంచెంగా కొరికి మొహం చిట్లించి ముక్కులెగరేస్తూ.

తన కూతురుకి విలనంటే కోపమని అర్ధమై తల్లి ఆశ్చర్యంతో “అదేమిటే?” అన్నది.

” నీకు తెలియదులే అమ్మా” అన్నది కథానాయిక, విలన్ చేత అనేక సార్లు బలాత్కరింపబడిన దానిలాగా.

“నిన్ను తనకిచ్చి పెళ్ళి చెయ్యమంటున్నాడు. బాగానే ఉంటుంది కూడాను. ఐన సంబంధం. బోలెడంత సంపాదిస్తున్నాడు. ఫ్యాక్టరీకి మేనేజరయాట్ట. మూడొందలు జీతమిస్తారు. బీచిలో పెద్ద బంగళా, ముప్ఫైవేల ఖరీదు చేసే కారు కొన్నాట్ట. నూరు రూపాయలకు తక్కువ ఖరీదు చేసే ప్యాంటు వెయ్యడు. క్లబ్బుకెళ్ళి రోజుకి నూరురూపాయల బుడ్డి సారా తాగుతాట్ట. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజుస్తాడమ్మా. నాకీ మధ్య వంట్లో బాగోటం లేదు కూడాను” అంటూ తల్లి దగ్గటం మొదలెట్టింది.

అంతదాకా కళ్ళు మూసుకొని హీరోను జ్ఞాపకం చేసుకొంటున్న హీరోయిన్ కళ్ళు చాలా పెద్దవి చేసి ఆదుర్దాగా “ఏమిటమ్మా? ఏమిటమ్మా?” అంటూ తల్లి మీద అమ్మశక్తి లాగా పడింది.

ఆ బొమ్మ లోంచి ఇంకో బొమ్మ వచ్చేటప్పటికి తల్లి మంచం మీద పడుకొని దగ్గుతున్నది. ముందు డాక్టరూ, అతని బ్యాగ్ పట్టుకొని హీరో వచ్చారు. తల్లికి తల పిసుకుతున్న హీరోయిన్ లేచి “రండి, డాక్టర్!” (రండి డాక్టరుగారూ, అనటం పల్లెటూరు గమార్ల లక్షణం.) అంటూ హీరో చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని రెడీగా ఉన్న స్టూలు మీద పెట్టింది.

హీరో ఆమె కేసి రేసుల్లో డబ్బు పోగొట్టుకున్నట్టు చూశాడు. ‘విన్నాను విన్నాను’ అన్నట్టుగా తల పైకీ కిందకీ ఆడించింది.

డాక్టరు స్టెతొస్కోపు తీసి రోగి గుండెలమీద పెట్టి పెద్ద నిట్టూర్పు విడిచి, మూలిగి “క్షయ! సీరియస్! బోత్ లంగ్స్ ఎఫెక్టెడ్!” అన్నాడు.

త్వరలో తాను డాక్టరు కాబోతున్నది కనుక “నయమవుతుందా డాక్టర్” అని కొట్టవచ్చినట్టుగా అడిగింది.

డాక్టరు చప్పరించి “ఈ రీలు దాటదు” అనేశాడు.

హీరో వూరికే ఉండటమెందుకని “శానిటోరియంకు పంపిస్తేను, డాక్టర్?” అన్నాడు.

డాక్టరు దీర్ఘంగా ఆలోచించి “అలా చెయ్యవచ్చు” అన్నాడు. అతను బరువుగా వెళ్ళిపోతుంటే భజంత్రీలు విషాదంగా వాయించారు.

పరీక్షలకు ముందు మెడికల్ విద్యార్ధులందరూ ఒక చోటికీ, విద్యార్ధినులందరూ ఇంకో చోటికీ పిక్నిక్ వెళ్ళారు. ఆడవాళ్ల పిక్నిక్ బాగుంది.ఎవరూ ఏమీ అనకుండానే వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని మనకు అర్ధమవుతుంది.

అదృష్టవశాత్తూ ఒక మర్రి చెట్టుకు పెద్ద ఉయ్యాల వేసి ఉంది. ఆ ఉయ్యాల మీద ఎక్కి కథానాయిక “ఓలలలా! ఓహో లలలా!” అంటూ పాడుతున్నది. ఆమె సఖురాండ్రు పక్కగా నిలబడి కవాతు చేస్తున్నారు.డ్రిల్ సార్జెంటు ఉండి చెప్పినట్టుగా వాళ్ళు స్టెతస్కోపులను ఒకేసారి మెడకు వేసుకొని, ఒకేసారి పైకెత్తి, ఒకేసారి గుండ్రంగా తిప్పి, ఒకేసారి చెవులకి పెట్టుకొని, ఒకేసారి తమ గుండెలు పరీక్ష చేసుకొని చాలా గమ్మత్తు చేస్తున్నారు.

వేయేల? పరీక్షలకు ముందు లేడీ మెడికోలు పిక్నిక్ వెళ్ళి ఏమేం చేస్తే ఆదర్శప్రాయంగా ఉన్నట్టు పావలా క్లాసు వాళ్ళకు తోస్తుందో అవన్నీ చేస్తున్నారు.

ఇంకో లొకేషన్లో మెడికల్ విద్యార్ధులు అందరూ సైకిళ్ళెక్కి ఫార్మేషన్ రైడింగ్ చేస్తున్నారు. అన్నీ వొకేసారి కొన్న సైకిళ్ళు. సరికొత్తవి. హరిదాసు వెంట భక్తులు పాడినట్టుగా హీరో అన్న ప్రతి పంక్తిని అంటూ అందరూ కోరస్ పాడుతూ వస్తున్నారు. అదృష్టవశాత్తూ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.

అక్కడ అమ్మాయిలు దాగుడుమూత లాడుతున్నారు. హీరోయిన్ కళ్ళకు గంతలు కట్టుకొని తన స్నేహితురాళ్ళను దొంగ చెయ్యటానికి చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి హీరో ఒంటరిగా వస్తాడు. చెలికత్తెలంతా పారిపోయి చెట్లచాటున దాక్కుంటారు. హీరోయిన్ గాలిలో ఈదుతూ వచ్చి హీరోని తాకి “ఆ! దొరికావులే!” అంటుంది. (కవిగారు ఈ మాట పసందుగా వేసారు.)

హీరోయిన్ గంతలు తీసి పారేసి, కళ్ళూ నోరూ పెద్దవి చేసి ” మీరా?” అంటుంది. అనుమానం ఉండటం మంచిదికాదని, హీరో బరువుగా నిట్టూర్చి – ” అవును….. నేనే!” అన్నాడు.

చెట్ల చాటు నుంచి వెకిలిగా నవ్వులు వినిపిస్తాయి. హీరోయిన్ ప్రణయకోపం మొహం పెట్టి, “ఊరుకోండి! వాళ్ళంతా మనని ఏడిపిస్తారు!” అంటుంది.

“నేనేమీ చెయ్యలేదే!” అన్నట్టుగా హీరో తన చేతులు అటు ఇటూ తిప్పి చూసుకొంటాడు.

“రేపే కదా మన ప్రదర్శనం?” అంటుంది హీరోయిన్ హీరో పక్కనే నడుస్తూ.

“అవును” హీరో నిట్టూరుస్తాడు.

కర్టెన్ పైకి లేస్తుంది. హీరోయిన్ భరతమాతగా ప్రేక్షకులకు కనిపిస్తుంది. “లేవండి! నడుములు – కట్టండి! దీక్షలు – పట్టండి! లంచాలు – ” అంటూ పాడుతూ హీరో ప్రవేశిస్తాడు. అనేక మంది ఆడవాళ్ళు అజంతా డ్రస్సులు వేసుకొని సాముగరడీలు చేస్తారు. ఆ గరిడీలకు పాటకు ఏమీ సంబంధం ఉండదు. కెమెరా ఒక పక్కకు వొరిగిపోతుంది. తరవాత రెండో పక్కకు వొరిగిపోతుంది. ఆఖరికి చేసేది లేక తల్లకిందులై పోతుంది. ప్రేక్షకుల్లో ఒకాయన జేబులో నుంచి చిన్న పొట్లం తీసి భావన అల్లం ఇంత నోట వేసుకొని అమ్మాయల అజంతా డ్రెస్సు కేసి శ్రద్ధగా చూస్తాడు….

ప్రదర్శనమైనాక అందరూ హీరోను, హీరోయిన్‌ను అభినందిస్తారు. హీరోయిన్ భరతమాతలాగా బాగా నిలబడినందుకూ, హీరో “పట్టండీ, కొట్టండీ, కట్టండీ” అన్న మాటలకు సరిగా చేతులు ఊపినందుకూ, సామూ గారడీలు చేసి, వెనక్కు మొగ్గలు వేసి వక్షప్రదర్శనలు చేసిన అమ్మాయిలకు గ్రూప్ ఫొటోలో వాళ్ళ నొక్కక్కరు అభినందించారు.

(ఈ సినిమాలో మనం చూసే మొదటి గ్రూప్ ఫొటో ఈ ప్రదర్శనంలోనే)

హీరో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాడు. పెద్ద సర్జన్ ఆపరేషన్ చేస్తున్నాడు. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆయన పక్కన ఉండి నేర్చుకుంటున్నారు. అందరి మొహాలకు అడ్డంగా జేబురుమాళ్ళున్నాయి.నెత్తిన గాంధీ టోపీలున్నాయి. సర్జన్ హీరో కేసి కుడి చెయ్యి చాస్తాడు. హీరో గబుక్కున ఒక పట్కారు సర్జన్ చేతిలో పెడతాడు. ఆ తరవాత సర్జన్ ఎడమ చెయ్యిస్తాడు. హీరోయిన్ ఒక స్పానర్ అందిస్తుంది. సర్జన్ ఊపిరి సలపకుండా రెండు చేతులతోనూ కటింగ్ ప్లైయర్, రెంచీలు, ఆకురాళ్ళు, చిన్న సుత్తెలూ, పిన్సర్సూ, పెన్స్లళ్ళు చెక్కే మరలు మొదలైనవి అందుకుంటూ చిట్టచివరికి మొహాన వున్న చేతి రుమాలు తీసేసి దానితో నుదురు తుడుచుకొని చిన్న చిరునవ్వు నవ్వుతాడు.

హీరో కూడా చేతి రుమాలు లాగేసి ఆపరేషన్ టేబిల్ మీద చెయ్యి పిడికిలి బిగించి పైకెత్తి “జై డాక్టరుగారికీ జై!” అంటాడు. నర్సులూ, అసిస్టెంటు సర్జెన్లు ఒక్కసారి “జై!” అని పెడబొబ్బ పెడతారు. సర్జన్ ఎందుకో హీరోను భుజం తట్టి వీపు తిప్పి వెళ్ళిపోతాడు.

హీరో అటూ, ఇటూ చూస్తాడు. హీరోయిన్ లేదు. ఆమెను వెతుక్కుంటూ వార్డుల వెంట బయల్దేరతాడు. ఆమె ఒక చోట బల్ల ముందు కూర్చొని ఏడుస్తున్నది. ఆమె ప్రక్కనే ఒక టెలిగ్రాం. హీరో దాన్ని ఎత్తి చూసీ చూడకుండానే “డెడ్” అని చదువుతాడు.

హీరోయిన్ తల్లి చావు కారణంగా లిప్‌స్టిక్, మొహన బొట్టూ, తలకు చమురూ మానేసి, మాసికలు వేసిన చీర (నైలాన్ జార్జెట్ వాయిల్ నేత చీర) కట్టుకొని దరిద్ర శోకదేవతలా ఉంది.

“ఇంక నాకు భవిష్యత్ లేదు. నా చదువు మంట కలిసి పోయింది. నేను కన్న కలలు కరిగిపోయాయి. నాబ్ – రతుకు అనాధబ్ – రతుకయి పోయింది” అంటూ ఏడుపు బాగా రావటానికి క్రింది పెదవి గట్టిగా కొరుక్కుంది.

“మనం పెళ్ళాడేసి సుఖంగా ఉండాలి” అంటాడు హీరో. “నీకేం మతి పోయిందా ఏమిటి? ఇంకా ఏడో రీలు పూర్తి కాలేదు. విలన్ సీక్వెన్సులన్నీ ముందే ఉన్నాయి. పైగా మనం ప్రేమించుకున్నాం. మనకు పెళ్ళి ఎలా అవుతుంది?” అని హీరోయిన్ మందలిస్తుంది.

హీరో నిట్టూర్చి కనుబొమలూ, తలా ఎగరేసి “అవును? మన పెళ్ళికి ఫార్ములా ఒప్పదు! ” అంటాడు.

హీరోయిన్ పెళ్ళాడిందా, లేక అవివాహిత వితంతువుగా ఉండిపోయి తన పాతివ్రత్యాన్ని కాపాడుకొందా? విలన్ ఏమైనట్లు? హీరో ఏమవుతాడు? అసలు ఇదేం కథ? ఈ వివరాలన్నీ దయచేసి మరోలా అనుకోకుండా తెర పైన చూడండి.

(25 డిశెంబరు 1975, చిత్ర సంస్కార, విజయవాడ ఫిలిం సొసైటీ సావనీర్)

–లక్ష్మన్న విష్ణుభొట్ల

One Response
  1. చందు January 18, 2009 /