Menu

కళ-సినిమా

పరిచయ వాక్యం: ఇదంతా ఇప్పటి మాట కాదు. దాదాపు 60 ఏళ్లకు పై మాటే! ఆ రోజుల్లో, అంటే మనకు స్వాతంత్ర్యం రాక ముందన్నమాట, రూపవాణి అనే సినిమా పత్రిక వుండేది.ఈ పత్రిక లోని వ్యాసాలు కొన్ని ఇక్కడ ఆర్కైవ్ చేసి వుంచడంతో, ఆ రోజుల్లో మన వాళ్ళు సినిమాని ఏ విధంగా ఆదరించేవారో అని చదువుకుంటూ పొతే చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం కలిగించేలా వుంది అక్కడి సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో సినిమాని మన వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారనిపిస్తుంది. ఈ పత్రికలో పాఠకుల అభిప్రాయాలు, సినిమా కి సంబంధించిన వ్యాసాలు చదివితే మీకూ అలానే అనిపించవచ్చు. కానీ ఈ పత్రిక మొత్తం ఇలాంటి ఉపయోగకరమైన విషయాలే కాదు, ఇప్పటి లాగే గాసిప్స్ లాంటి కబుర్లూ వున్నాయి. ఈ రూపవాణి పత్రికలో నుంచి కొన్నిఉపయోగకరమైన వ్యాసాలు రాబోయే రోజుల్లో నవతరంగంలో ప్రచురించబోతున్నాం. అప్పటి విషయాలు ఇప్పుడెందుకనిపించినా అప్పుడూ ఇప్పుడూ మన ఆలోచనా శైలిలో మార్పును తెలుసుకోడానికి ఈ వ్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయని నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ వ్యాసాలు CSC archives నుంచి వారి అనుమతితో ప్రచురింపబడుతున్నాయి. చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. —-నవతరంగం

cinema-art.gifకళ-సినిమా:

కళ – జీవితంలో ఇంతకు పూర్వమెప్పుడూ- అనేక విధాలుగా ప్రాముఖ్యం వహించింది. ఇక ముందు కూడా వహిస్తుంది. వర్ణనాత్మకమూ, విమర్శనాత్మకమూ నైన భావుకతవైపుకు మానవుని హృదయచైతన్య ప్రవాహమును అతిశయింపచేసే రసాస్వాదన, ఆధ్యాత్మిక దృక్పథం నుంచి సౌందర్యాన్నీ ప్రయోజనాన్ని ముడిపెట్టగల సామర్థ్యంలో, కళకు జీవితంలో అసామాన్యమైన స్థానం వుంది.

రంగస్థలంమీద, దేవాలయాల్లో, ఉత్సవాలల్లో, ప్రజలు కళను ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు సినిమాల ద్వారా తెలుసుకున్నంత మందిని ఇదివరకెన్నడూ ప్రజలు తెలుసుకుని యెరుగరు. శ్రీమంతులకైనా బీదవారికయినా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వార్తలు, విజ్ఞానం (science), కళ, జీవితం, రాజకీయాలు, ప్రచారం అన్నీ సినిమాల ద్వారా వ్యాపింపచేయవచ్చు. అక్షర రూపాలలో అణిగిపోయిన కళాజీవుల సాధన ఫలితానికి, వర్ణ సృష్టి చేసి, చలనాన్ని కల్పించి, మాటలు నేర్పి దాచుకోటానికి సినిమాలు ఎంతో సహాయభూతాలవుతున్నాయి. ఇతర పరిశోధనలలాగానే- సైన్సు చేసిన ఈ మహత్తర పరిశోధనను (సినిమాలను) ప్రజా సముదాయానికి ప్రయోజనకారిగా చేసుకోవచ్చు; కళ, భౌతిక శాస్త్రం స్పృశించిన అన్ని శక్తులవలెనే, చలన చిత్రాలను కూడా (సినిమాలు) రససమ్మిళితమైన విశాలదృష్టిని, చక్కని అభిరుచిని, సుస్థిరమయిన సంఘనిర్మాణానికి ఉపయోగిమ్చుకోవచ్చు. టాకీలు ఈ ప్రయోజనాన్ని సులభసాధ్యం చేశాయి; వర్ణచిత్రాలు (colour films) ఇంకా అభిరుచికరంగానూ, ఆకర్షణీయంగానూ చేశాయి. మానవుని దౌర్బల్యాన్ని స్వార్థానికి వినియోగించుకోటం కాని, అతనిలోని హీన స్వభావాన్ని విస్తరింపచేయటం కాని, కళ యొక్క ఉద్దేశ్యం కాదు. కళ యెప్పుడూ వివిధ భావనల సమీకరణానికి, సత్యప్రచారానికి తోడ్పడుతూ, జీవిత స్రవంతిలో కొట్టుకునివొచ్చే సుమ్దర, మధుర చిహ్నాలను సమీకరింపచేస్తుంది. జీవితపు లోతుల్లో మునిగితేలే ప్రజా సమూహానికి కష్టసాధ్యమైన ఈ సంయోగాన్ని సినిమాలు తేలికచేస్తున్నాయి. సుదూర దిజ్మండలములో తుత్తునియలై మిలమిలలాడుతూ కనబడే ఒకనాటి మన మహావైభవ గర్వకారణాలనన్నిటినీ చూస్తూ నిలబడి, ముందు యుద్ధానంతర పునర్నిర్మాణావేశపు తుఫాను విసురుల్లో, క్షణికంగా, జంతువులకన్నా హీనమైన దశలోవున్న మానవజాతికి సముద్ధరింపచెసే ప్రయత్నానికి అందరూ చేతులు కలుపవలిసి వుంటుంది. కళ అగోచరానికి స్పష్టీకరణ. నిశితభావనకు బాహ్యస్వరూపం. ఇంద్రియములద్వారా గ్రహింపదగిన వాస్తవికత. ఇది శిలలు, లోహాలు, రంగులు, ధ్వనులు, చాయ, శరీరము మొదలైన దృశ్యాదృశ్య సాధనాలవల్ల సాధింపబడుతోంది. వీటన్నిటినుండీ భావాలు వ్యక్తమవుతాయి. సౌందర్యాన్ని చవిచూసిన అనుభవాలు నిండి వుంటాయి.

కళలను, లలిత కళలుగానూ, పారిశ్రామిక కలలుగానూ నిర్వచించవచ్చు. స్వతంత్ర కల్పనాశక్తి స్తంభించిపోయిన నాడుల లితక్ళలు ఖూదా బూజుపట్టిపోయినాయి. స్తబ్ధత ఏర్పడింది. దేనికయినా అభివృద్ధి చాలా అవసరమైన వస్తువు. జీవితంలోని సారం పోయి రసవిహీనమైనప్పుడు, దానిని అదే పోషించుకోవలసిన అవసరం కలిగినప్పుడు, అవాంతరాలనుంచి వైదొలగడానికి – ’కళ కళకోసమే’ అనే నినాదం బయలుదేరింది. కళ అనిపించుకోతగినదేదైనా, రంగులతో కాని, ధ్వనులాటో కాని, సంచలనంతో కాని హృదయాన్ని ద్రవింపచేసి, అపారమైన ఆనందానుభూతిని తన్మయత్వాన్ని కలిగించగలిగితే అది యెప్పుడూ వట్టిపోయినది కానేరదు. అది జీవితాన్నుంచి విడిపోలేదు.మానవునికి శరీరమూ, ఇంద్రియములూ ఎంత ప్రధానమైనవో, ఆధ్యాత్మిక మానసిక శక్తులు కూడా అంతే ప్రధానమైనవే. నిష్పలమైన నూతన నిర్మాణ వాంఛవలన కలిగే ఏకాంతవాసాభిలాష, కళకు జీవితానికి మధ్యవున్న లోపాన్ని విస్తరింపచేసి-వారికి కల పిచ్చివూహలలోని కల్పిత స్వర్గపు ఆనందాన్ని అభివృద్ధిచేస్తుందే కాని – ఇతర ప్రయోజనాన్ని సాధించలేదు. అది కూడా వారికి అనుకున్నంత ప్రయోజకారి కానేరదు. ఎందువలనంటే కళ మానవుని శరీరాత్మలనుండి ఉత్పన్నమయ్యేది.స్వచ్చమైన కళ – మానవునికి ఆధ్యాత్మికంగానూ, ఆస్వాదనా రూపంగానూ, ఆనందాన్ని సుఖాన్ని యిస్తుంది. పారిశ్రామిక కళలు క్షణికమయిన మైమరుపును కలిగిస్తాయి. వాటికి గల ప్రధాన భేదము. మొదటిది ’మనస్సుకు వికాసవంతము’-రేండొది శారీరకము.

సామాన్య మానవుని జీవితాన్ని మార్చగల అద్భుతమైన శక్తి సినిమాలకున్నదన్న సంగతి ప్రతి దర్శకునికీ (Director) ప్రఖ్యాతుడైన సినిమా వ్యాపారస్థునకూ తెలుసు. అలాంటి శక్తిని చేతియందు ఇముడ్చుకున్న ప్రతివ్యక్తీ ,దాన్ని న్యాయంగా ఎక్కువ భాఘం ప్రజోపయోగం కోసం వినియోగించాలి. సినిమాలు వాటికున్న నూతనపద్ధతులతోనూ, అపారమైన కొత్త ’ఇంప్రూవ్‍మెంట్స్’ తోనూ ఈ మార్పు తీసుకుని రాగలవు.

సినిమాలలో, ఉపన్యాసాలలో, నాటకాలలో, నటనలలో, నాట్యంలో, సంగీతంలో ఎక్కడైనా కళ ఉత్తేజాన్నిస్తుంది. వికాసాన్ని కల్పిస్తుంది. అంతరంగాన్ని కదిపి మహదానందాన్ని చేకూరుస్తుంది. వివేకం గల ప్రతి దర్శకుడూ, నటీనటులూ నిజంగా హృదయపూర్వకంగా చేయాలనుకుంటే చేయగలరు. ప్రజానీకం, మాకు కళామయమయిన నూతన చిత్రాలు కావాలని ’డిమాండ్’ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

శ్రీ ఉదయశంకర్

సేకరణ:Centre for the Study of Culture & Society వారి (రూపవాణి) ఆర్కైవ్స్ నుంచి

One Response