Menu

‘ద్వీప’(కన్నడ సినిమా 2002)

ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది.

కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం. మరికొన్నింటిని ఆరాధిస్తాం. కానీ ‘ద్వీప’, అనుభవించాల్సిన చిత్రాలకోవలోకి వస్తుంది.

ఒకవైపు డ్యాం పునరావాసం పై సామాజిక చర్చతోపాటూ, మరో వైపు మానవసంబంధాల సున్నితత్వాన్ని కూడా స్పృశించిన చిత్రమిది.  ముంపుకు గురవ్వబోయే ద్వీపాన్ని విడిచి వెళ్ళని నమ్మకం, ప్రేమ ఒకవైపు కనిపిస్తే, తన సామ్రాజ్యమైన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మహిళ పడే తపన, ప్రయత్నం కనిపిస్తాయి. ఇంత క్లిష్టమైన విషయాన్ని తెరపైకి అనువదించడం చాలా కొద్దిమంది దర్శకులకే సాధ్యం. వారిలో ఒకరు, ‘గిరీశ్ కాసరవళ్ళి’ అన్నది నిజం. సినిమా నిడివి కొంత ఎక్కువనిపించినా, చెప్పాలనుకున్న విషయం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి కొంత ఓపిక ప్రేక్షకులకి తప్పదు.

గణపయ్య (అవినాష్) మరియూ నాగక్క(సౌందర్య) అనే భార్యాభర్తలు వారి పెద్దదిక్కు గణపయ్య తండ్రి దుగ్గజ్జ (వాసుదేవ రావ్) తో కలిసి ఒక ద్వీపంలో ఉంటారు. అక్కడి చిన్న గుడిలో పౌరోహిత్యం చేస్తూ, “నేమ” అనబడే ఒక సాంప్రదాయ పూజను జరుపుతూ, పొట్టపోసుకొంటూ ఉంటారు. అది ఒక డ్యామ్ సైట్ కావడం వల్ల త్వరలో ముంపుకు గురయ్యే ద్వీపాలలో ఒకటిగా గుర్తించి ప్రభుత్వం అందరినీ ఖాళీ చెయ్యమంటుంది. తండ్రి ఆ స్థలాన్ని వదిలి రావడానికి ఇష్టపడకపోతే కొడుకూ, కోడలు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండటానికి ఒక నవయువకుడు ‘కృష్ణ’ కూడా అక్కడికి వస్తాడు. చివరికి ఆ ద్వీపం మునిగిపోతుందా? నాగక్కకీ, కృష్ణకీ మధ్య ఉన్న స్నేహం ఏవిధంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది? చివరికి ఈ ప్రకృతి మరియూ వ్యక్తిగత కష్టం నుండీ ఈ కుటుంబం ఎలా గట్టెక్కింది? అన్నదే ఈ చిత్ర కథ.

ఈ కథని ఆసరాగా చేసి, దర్శకుడు కాసరవళ్ళి చర్చించిన విషయాలు పునరావాసం అనే సమస్యమీద ఒక మంచి దృక్కోణాన్ని విశదపరుస్తాయి. ఈ చిత్రంలో గణపయ్య పాత్ర పునరావాసాధికారితో అంటుంది “నేలకీ, ఇంటికీ, పొలానికీ ఇంత అని మీరు కాంపెన్షేషన్ ఇవ్వగలరు. కానీ మాకు ఈ ఊరివాళ్ళిచ్చే గౌరవానికీ, మర్యాదకూ పునరావాసం ఎట్లా జరుగుతుంది?” అని. అలాగే ఇంకో దగ్గర “మా జీవన విధానాన్ని బట్టి మీ లెక్కలుండాలిగానీ, మీ లెక్కల్ని బట్టి మా జీవితాల్ని వెలకడతారా?” అంటాడు.

ప్రభుత్వ అధికారి “ఈ గుడి పత్రాల ప్రకారం మీదికాదు. సార్వజనిక ఆస్తి, ఊరికంతా చెందుతుంది” అంటాడు,ఈ దృశ్యం ద్వారా దర్శకుడు మనుషుల విలువల్ని ప్రభుత్వ ఎంత పేపర్ల మయంచేసిందో సున్నితంగా ఎత్తిచూపిన విధానం ఆలోచింపజేస్తుంది. ఇదే సీన్లో “నమ్మకాన్ని నిజమనుకోకు. ‘నిజం’ కావాలంటే, దానికి ప్రభుత్వ ఆమోదం కావాలి. లేదా ఆమోదయోగ్యమైన పత్రాలు కావాలి” అని అధికారి చేత చెప్పించి, ప్రభుత్వం యొక్క insensitivity ని ఎత్తిచూపుతాడు. అందుకే నమ్మకాల్నీ, మర్యాదలకీ, జ్ఞాపకాలకీ నిజంగా పునరావాస సమయంలో విలువకట్టగలమా? అన్న ఒక క్లిష్టమైన ప్రశ్నని ఈ చిత్రం ద్వారా దర్శకుడు లేవనెత్తాడని చెప్పొచ్చు.

మరో పార్శ్వంలో, ఈ ప్రకృతి సంక్షోభాల నడుమ నాగక్క తన మామ మొండితనం, భర్త నమ్మకం,  కృష్ణ స్నేహం మధ్య ఇరుక్కొని మరో వ్యతిగత విపత్తుని తెరపైకి తెస్తుంది. కృష్ణకూ, నాగక్క(నాగి) కీ మధ్యగల సంబంధాన్ని చూపిన విధానం చాలా వరకూ suggestive గానూ, sensitiveగానూ ఉంటుంది. ఏ హద్దులూ దాటకపోయినా, నాగికి కృష్ణ పట్ల ఆకర్షణ, కృష్ణ కు నాగి పట్లనున్న తపనా తెరపై ఆవిష్కరించిన విధానం చాలా సున్నితంగా ఉంది. ఒక దగ్గర, నాగి భర్త తన తండ్రితో “ఈ నీరు నన్ను ముంచకపోయినా, కృష్ణ ముంచేస్తాడు” అని చెప్పేలా ఈ సంబంధపు తీవ్రత ఈ కుటుంబం మీద కనబడుతుంది. నాగి ఈ సంక్షోభానికి తాళలేక, కృష్ణని ఆ ద్వీపం వదిలి వెళ్ళిపొమ్మని చెప్పినపుడు కూడా, పడవని మాత్రం వదిలి వెళ్ళమంటుంది. ఇక్కడ బయటి ప్రపంచానికి వారధిగా ఉన్న ‘పడవ’ తొపాటూ, నాగికి మళ్ళీ కృష్ణని కలవాలనే ఆశ ఉందేమో! అనిపించేలా తన కోరిక ఉంటుంది.

ఇంత మంచి సామాజిక సమస్యని ఎత్తిచూపడంతో ఇలాంటి సమయాలలో ఏర్పడే మానవసంబంధాల crisis ని దర్శకుడు తీసిన విధానం, తప్పకుండా చూడవలసిన సినిమాల లిస్టులో ‘ద్వీప’ ని చేరుస్తుంది. సౌందర్య మేకప్ కొన్ని సీన్లలో మోతాదు మించినట్లు కన్పడినా, తన నటన మాత్రం చాలా మెరుగ్గా ఉంటుంది. తండ్రి పాత్రలో నటించిన వాసుదేవ రావ్ చాలా సహజంగా పాత్రలో జీవించాడు. తనను చూస్తుంటే ఎక్కడో చూసినట్లే అనిపించింది. బహుశా చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో అడవిలో బందీలుగా ఉన్నప్పుడు పడవ తయారుచేసి అక్కడినుండీ తప్పించుకు వెళ్ళే మార్గాన్ని చెప్పే పెద్దాయన పాత్ర ఇతనే పోషించాడనుకుంటా! ఇక భర్త గణపయ్య పాత్రలో అవినాష్ చాలా సునాయాసంగా నటించాడు. కృష్ణగా వచ్చే యువకుడి పేరు తెలీదుగానీ తన ఉనికినీ, పాత్ర ఔచిత్యాన్నీ నిలబెట్టేలా నటించాడు.

సాంకేతికపరంగా చిత్ర లొకేషన్లనూ, వర్షాన్నీ బంధించిన సినెమాటోగ్రఫర్ ‘H.M. రామచంద్ర’ ప్రతిభ తెలుస్తుంది. అలాగే మునిగిపోయిన గుడి సెట్ వేసిన కళాదర్శకుడు ‘అడప శశిధర్’ ట్యాలెంట్ ప్రశంశనీయం. పాటలు లేని ఈ సినిమాలో దృశ్యానికీ పాత్రల భావావేశాలకీ అనుగుణంగా నడిచిన ‘కొట్టుకపల్లి ఐజాక్ ధామస్’ నేపధ్యసంగీతం చిత్రానికి చాలా ఉపయోగపడింది.

మంచి సినిమాని ప్రేమించే అందరూ చూడవలసిన సినిమా ఇది. బెంగళూరులో అన్ని VCD/DVD షాపుల్లో ఈ సినిమా ‘శ్రీ గణేష్ వీడియో’ ద్వారా 100 రూపాయలకే దొరుకుతుంది. ఈ సినిమా చాలావరకూ ఇంగ్లీషు ఉపశీర్షికలతో (subtitles) దొరుకుతుంది, కాబట్టి అర్థం చేసుకోవడానికి పెద్ద శ్రమ పడక్కరలేదు. హైదరాబాద్, కోఠీ లోని సుప్రీమ్ వారి షాపులో ఈ చిత్రం VCD లు ఉండగా నేను చూశాను. కాబట్టి లభ్యత పెద్ద సమస్య కాకపోవచ్చు.

7 Comments
  1. శంకర్ June 28, 2008 /
  2. bollojubaba June 28, 2008 /
  3. vinay August 29, 2011 /