Menu

దారి తప్పిన దశావతారం

ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ముందుగా సరైన కథ నెంచుకోవాలి. మంచి కథ లభిస్తే సగం పని అయ్యినట్లే. మిగతా సగం కథనం, దృశ్య నిర్మాణం, నటీనటుల ప్రతిభా, మ్యూజిక్ ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దశావతారానికి ఒకరకంగా చెప్పలంటే మంచి కథే లభించింది. మంచి ఫొటోగ్రఫీ కూడా ఉంది. నటీ నటుల ప్రతిభకీ కొదవ లేదు. సంగీతమూ పరవా లేదు. కానీ కథనం దగ్గర కొచ్చేసరికే దశావతారల కన్ ఫ్యూజన్ మొదలయ్యింది. అలాగే పది పాత్రల పోషణలో వెరైటీ చూపిద్దామనే తపన లో కథనం కాస్తా కాలు జారింది. దాంతో మంచి కథ కాస్తా మామూలు కథలా తయారయ్యింది. దీనికి కమల్ హాసన్, దర్శకుడు రవి చంద్రన్ కారకులు. కాకపోతే సినిమా చూస్తున్నంత సేపూ తరవాత ఏం జరుగుతుందీ అన్న ఉత్కంఠ కంటే, తరవాత సీన్లో కమల్ హాసన్ ఎలా ఇంకో పాత్రలో వస్తాడా అన్న ఆత్రుతే సినిమా మూడొంతుల వరకూ సాగుతుంది. ఈలోగా సినిమా ముగింపొచ్చేస్తుంది. వెరశి ఇంతేనా అన్న ఫీలింగ్ మిగులుతుంది.

హాలు నుండి నిరాశావతారంతో బయటకొచ్చే ప్రేక్షకుడి అనుభూతి ఇదీ. అయితే మొత్తం సినిమా అంతా ఇలానే ఉందా?, కనీసం ఏ ఒక్కటీ బాగోలేదా? అంటే, లేదనీ అనలేం. కాకపోతే ఓ మంచి సినిమా చూసిన అనుభూతి మాత్రం కలగదు. మరలా మరలా ధియేటర్ కి మిమ్మల్ని మాత్రం రానీయదు.

ఇహ కథలోకి వస్తే – గోవింద్ ( కమల్ హాసన్ 1 ) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ( కమల్ హాసన్ 2 ) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో చైనాలో సీతాకోక చిలుక రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ “కేవోస్” సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన రంగరాజ నంబియార్ ( కమల్ హాసన్ 3 ) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో చిదంబరంలోని వైష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య ( ఆసిన్ ) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పెన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో వాషింగ్టన్ లో తేలుతుంది.

ఇక్కడ గోవింద్ అనే బయో సైంటిస్ట్ మానవాళిని చిటికలో అంతం చేసే సింథటిక్ బయో వైరస్ కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఓ చిన్న బాక్స్ లో పెట్టి ఎఫ్ బీ అయ్ కీ చెప్పే తరుణంలో ఫ్లెచర్ ( కమల హాసన్ 4 ) అనే టెర్రరిస్ట్ దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, ఇండియా వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి ( మల్లికా షరావత్ ) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న అతని అన్న ( కరాటే ఫైటర్ – కమల హాసన్ 5 ) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకన పడుతుంది.

ఈ లోగా బలరాం నాడార్ ( కమల హాసన్ 6 ) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ బాక్స్ కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ ( ఆసిన్ ) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ లక్ష్మి బామ్మ ( కమల హాసన్ – 7 ) కామాక్షి చేతిలో పడుతుంది. అదికాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది కామాక్షి. అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహామూ , లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర స్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై పుణ్యకోటి ( కమల హాసన్ – 8 ) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి కరీముల్లా ( కమల్ హాసన్ – 9 ) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయ పడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న అవతార్ సింగ్ ( కమల్ హాసన్ – 10 ) అతని భార్య ( జయప్రద ) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు వెండితెర మీద వెతుక్కోవాల్సిందే!

ఇలా పది పాత్రల్లో దర్శనిమిచ్చిన కమల్ హాసన్ కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ముఖ్యంగా బలరాం నాడార్, పుణ్యకోటి, బామ్మా పాత్రల్లో కమల్ హాసన్ జీవిచాడు. ఆయా పాత్రలు తప్ప కమల్ హాసన్ కనిపించడు. ఇహ పోతే మిగతా పాత్రల్లో ఫ్లెచర్, జార్జ్ బుష్ పాత్రలు మేకప్ ఎక్కువయ్యి చూడ్డానికి కాస్త ఇబ్బందే కలిగిస్తాయి. జపనీస్ ఫైటర్ గా మేకప్ పరవాలేదు. ప్రత్యేకంగా ఫ్లెచర్ మరియు బుష్ మేకప్పులు మాత్రం మరీ పిండి బొమ్మల్లా అనిపించాయి. కాస్త మేకప్ తగ్గించుంటే బాగుండేవి. ఒక్కోసారి చూసి చూసి ఈ పాత్రలు విసుగు పుట్టించాయంటే కారణం కేవలం మితిమీరిన మేకప్ వల్లే!

అవతార్ సింగ్ పాత్రా, కరీముల్లా పాత్రా కథలోకి బలవంతంగా చొప్పించబడినట్లు తెలుస్తూనే ఉంటుంది. ఈ పాత్రలు కమల్ హాసనే వెయ్యాల్సిన అవసరమూ, అగత్యమూ కనిపించదు. కేవలం పది పాత్రలు వేయాలి అనుకోడానికే చెప్పుకోవాలి తప్ప కథకి ఏమాత్రమూ పట్టునివ్వని పాత్రలివి. ఒక్క ఆసిన్ ని మినహాయిస్తే, మూడుగంటల కథలోనూ కమల హాసన్ నటనా వైవిధ్యం తప్ప, చెప్పుకో దగ్గ ఇంకో నటుడు కనిపించరు,. మిగతావన్నీ ప్రత్యేకత లేని సహాయ పాత్రలే. ఉన్నంత మేరలో బాగానే నటించారు. ఆసిన్ బాగా నటించింది.

అంత వరకూ సీరియస్ గా సాగిన బలరాం నాడార్ పాత్ర ప్రవేశంతో సినిమాలో పెద్ద రిలీఫ్ వస్తుంది. బలరం నాడార్ పాత్రలో కమల్ నటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని పాత్రల్లో మేకప్ ఎబ్బెట్టుగా కనిపించినా ప్రతీ పాత్రలోనూ కమల్ వైవిధ్యాన్ని చూపడానికి చాలా కష్ట పడ్డాడు. అతని శ్రమ ప్రతీ పాత్రలోనూ కనిపిస్తుంది.

రిలీజుకు ముందు చాలా పాత్రల విషయం బయటకి రాలేదు. ముఖ్యంగా పుణ్యకోటి, నంబియార్ పాత్రా, బామ్మ పాత్రా. బయటకు రిలీజు చేసిన కొన్ని పాత్రల ఫొటోలు సినిమాలో ఎక్కడా లేవు. అందువల్ల సినిమా చూస్తున్నంత సేపూ ఏ పాత్రలో కమల్ దర్శనమిస్తాడా అని ఎదురు చూడ్డమే సరిపోతుంది.

కాకపోతే ఇంత మంచి కథనెన్నుకొని కథనంలో వచ్చేసరికి అంత గొప్పగా చిత్రీకరించ లేదనే చెప్పచ్చు. కొన్ని చోట్ల ఘోరంగా లాజిక్ దెబ్బ తీసే సన్నివేశాలున్నాయి. అమెరికన్ దేశస్థుడైన ఫ్లెచర్ ఇండియాలో భారతీయులకంటే స్వేచ్ఛగా ప్రతీ మూలా ప్రత్యక్షమవ్వడం ఎక్కడా లాజిక్కందదు. సినిమా ముగింపు సన్నివేశంలో ఎంతో మంది సునామీకి బలయ్యి హృదయ విదారకంగా ఏడుస్తుంటే, అక్కడే ఆసిన్ తన ప్రేమని వ్యక్త పరచడం మరీ దారుణం అనిపించింది. ఆ సునామీ సన్నివేశం అయ్యాక వేరే సన్నివేశంలో చెప్పించ్చచ్చు కదా? మొదట్లో చూపించిన రంగరాజ నంబియార్ కథకీ, గోవిందు పాత్రకీ ముడి పెడతారని అనుకుంటాం. కానీ ఆ థ్రెడ్ ముగింపు ఘోరంగా చెడింది. పన్నెండో శతాబ్ధంలో ముంచేసిన విష్ణు విగ్రహం సునామీలో కొట్టుకు రావడం, ఆ విగ్రహ దగ్గరే లక్ష్మీ, గోవిందు తమ ప్రేమల్ని తెలుపుకోవడమూ ఇవేమీ మనసుకి అతుక్కోవు. ఏదో ముడి పెట్టేయాలి అన్నట్లుగానే చూపించారని పిస్తుంది తప్ప ఎక్కడా లాజిక్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసినట్లు కనిపించదు.

అలాగే జపనీస్ ఫైటర్ కి గోవిందంటే మంచి వాడని అనిపించడానికీ, తన చెల్లెల్ని ఫ్లెచరే చంపేడని తెలుసుకోవడం సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పటికే మూడు గంటలయ్యిందీ, వేసిన అన్ని ముడులూ విప్పుతూ కూర్చుంటే ఇంకో మూడు గంటలవుతుందని నిర్మాతా, దర్శకుడూ అనుకున్నారేమో హడావిడిగా ముగించేసినట్లు కనిపిస్తుంది.

అదేవిధంగా చివర్లో చూపించిన సునామీ సన్నివేశం ఏదో కథని కంగాళీగా ముగించేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులోనే మత సామరస్యం, కుల నిర్మూలన, బయో వెపన్ల వల్ల మానవాళికి సంభవించే విపత్తూ, ఇవన్నీ చివర్లో మూట కట్టి ప్రేక్షకుడి నెత్తిన పెట్టినట్లుగా అనిపిస్తుంది తప్ప, ఇవేమీ అంతర్లీనంగా కథలోనూ, కథనంలోనూ ముడి వేయ బడ్డాయని ఏ మాత్రమూ అనిపించదు. చివర్లో సునామీ సన్నివేశం మాత్రం కళ్ళ నీళ్ళు రప్పిస్తుంది.

ఇలాంటి చిన్నా చితకా తప్పులే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలగ నీయకుండా చేసాయి. సినిమాలో కమల్ హాసన్ని మినహాయిస్తే, రవి డైరక్షన్ సూపర్ అని చెప్పుకోతగ్గ సీన్లు అంతగా అనిపించవు. సినిమా టైటిల్స్ దగ్గర్నుండి, శుభం కార్డు పడే వరకూ అంతా కమల్ హాసన్ దే ! ఇదే సినిమాకి ప్లస్సూ, ఇదే మైనస్సూ అయి కూర్చున్నాయి. సాధారణంగా ఒక నటుడి గొప్పతనం, ప్రతిభా బయట పడేవి తోటి ప్రతిభావంతుల నటన ముందే! కానీ ఈ సినిమాలో కమల్ హాసన్ ముందు ఎవరూ కనిపించరు. పోటీ పడి నటులు నటించారు అన్న మాటే రాదు. ఈ సినిమాలో కమల్ కి, హాసనే పోటీ!

సాంకేతిక పరంగా దశావతారం మెచ్చుకోదగ్గ సినిమా. చివర్లో చూపించిన సునామీ సన్నివేశంలో టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఫొటోగ్రపీ కూడా చెప్పుకో తగ్గట్లుగా ఉంది. మొదట్లో రంగరాజ నంబియార్ కథలో ఏరియల్ షాట్సూ, సముద్రంలో విష్ణు విగ్రహం ముంచివేత, వీటల్లో ఫొటోగ్రాఫర్ ప్రతిభ అద్వితీయంగా కనిపిస్తుంది. సంగీతం అంత గొప్పగా లేకపోయినా, “రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడా” పాటక్కటే కాస్త బాగున్న పాట. వెన్నెల కంటి మాటలు కొన్ని చోట్ల బాగున్నాయి. ముఖ్యంగా ‘తెలుగు వాళ్ళు ఇంగ్లీషులో తప్ప తెలుగులో మాట్లాడరు’ అన్న డైలాగులు కథనంలో చొప్పించిన తీరు బాగుంది. అలాగే సినిమా చివర్లో ‘దేముడు ఉన్నాడు కాబట్టే మనమందరం విపత్తు నుండి తప్పించుకున్నామని’ ఆసిన్ అంటే, ‘మరి అదే దేముడు మిగతా ప్రాణులని చంపాడు కదా?’ అంటూ దేముడున్నాడని నమ్మడం కంటే, ఉంటే బాగుంటుందని గోవిందు పాత్ర ద్వారా పలికించిన సంభాషణలు బాగున్నాయి. అలాగే సినిమా చివర్లో ప్రాణాలు తెంగించి పిల్లల్ని సునామీ బారినుండి కాపాడీ, దానికి తనే బలయ్యిన పుణ్యకోటిని చూపిస్తూ, ఏభై ఏళ్ళ క్రితం మరణించిన “నా కొడుకు దశావతారం వీడేరా!” అంటూ బామ్మ రోదించే సన్నివేశమూ బాగున్నాయి. సినిమా మధ్యలో జార్జ్ బుష్ “వాట్ ఈజ్ సోడిఉం క్లోరైడ్?” అని అడగడం లాంటివి నవ్వు రప్పిస్తాయి. అలాగే హిరోషిమా, పెర్ల్ హార్బర్ పై రాసిన సంభాషణలూ నవ్వు పుట్టిస్తాయి. ఎడిటింగ్ మొదట్లో క్రిస్ప్ గా ఉన్నా చివర్లో కాస్త అయోమయంగా అనిపిస్తుంది.

కమల్ హాసన్ సినిమా అనేసరికి భారీ పబ్లిసిటీ వల్ల కూడా అంచనాలు ఎక్కువ ఉండడం సహజమే! అన్ని పాత్రల మీద పెట్టిన శ్రద్ధ మిగతా విభాగాల్లో పెట్టినట్లు కనిపించదు. ఎంతో బాగా తీయాల్సిన సినిమా ఇలా చేసేరేమిటి అన్న నిరాశావతారంతో హాలు బయటకు రావడం ఖాయం. కమల్ హాసన్ నటన్ని చూడ్డానికైనా ఈ సినిమా ఒక సారి చూడచ్చు. ముఖ్యంగా ఇమేజ్ చట్రంలో బిగుసుకు పోయిన తెలుగు హీరోలు తప్పని సరిగా చూడాల్సిన సినిమా. నటన, పాత్ర పోషణల్లో కమల్ హాసన్ దగ్గర ప్రస్తుత యువ హీరోలు ఎంతైన నేర్చుకోవాల్సుంటుంది. ఏతా వాతా కమల్ హాసన్ భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరనీ నిర్ద్వద్వం గా చెప్పచ్చు. ఇలాంటి సినిమా ధైర్యంగా తీయడం ఒక్క కమల్ హాసన్ కే సాధ్యం. ఇది మాత్రం ఎవరూ కాదన లేరు.

—సాయి బ్రహ్మానందం గోర్తి

4 Comments
  1. Sowmya June 16, 2008 /
  2. ash June 16, 2008 /
  3. varma June 17, 2008 /
  4. pappu October 24, 2008 /