Menu

నా కళ్ళలో దశావతారం – 1

నేనూ “దశావతారం” చూసేసాను. సినిమా రిలీజుకి చాన్నాళ్ళ ముందునుంచీ ఎదురుచూసీ, చూసీ, విడుదలయ్యాక కథ చదవకుండా రివ్యూలు మాత్రం చదువుతూ…నేనెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తూ చివరికి….ఒక మంచిరోజున…చూసేసాను. నామటుకు నేనేమాత్రం నిరాశ చెందలేదని చెప్పుకోడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే బోలెడు సమీక్షలూ వ్యాసాలు వచ్చేసాయి దీనిమీద. నవతరంగంలోనే రెండు మూడు వ్యాసాలు ఇదివరకే వచ్చేసాయి. మళ్ళీ నేను రాయాలా? అంటే, భిన్న దృక్కోణాలు ఉంటాయి, రాయండి అన్నారు వెంకట్ గారు. ఇది కమల్ అభిమాని (హీరోగానే కాదు..కథకుడిగా కూడా) రాస్తున్న సమీక్ష అని మీకు అనిపిస్తే దానికి నేనేమీ చేయలేను. 🙂 ఏమో, ఆ అభిమానంలో నేను ఈ సినిమా లోపాలు చూడలేదేమో… ఐనా పర్లేదు. ఇటీవలి కాలం లో ఒక సినిమా చూసి దాని గురించి తరువాతి రోజంతా, రాత్రితో సహా …గడిపిన దాఖలాల్లేవు నాకు. ఒకే సినిమాని వారం తేడా లో థియేటర్లో రెండోసారి చూట్టం కూడా ఇదే మొదటిసారి నాకు.

ప్రధానంగా, సినిమా మొదలైన ఇరవై నిముషాల్లో తీసిన విధానం అద్భుతం. రంగరాజన్ నంబిగా కమల్ నటన, కొద్ది సేపే అయినా కూడా మరిచిపోలేనిది. పన్నెండో శతాబ్ది దృశ్యాలన్నీ చాలా బాగా తీసారు. “రాయిని మాత్రం కంటే..” పాట విన్నప్పుడల్లా ఇది పవర్‍ఫుల్ పాట, ఎలా తీస్తారో అనుకుంటూ ఉండేదాన్ని. ఆ పాటలోని పవర్ కి, ఆ తీసిన విధానానికి సరిగ్గా సరిపోయింది. ఈ పాటని ఇలా తీయాలన్న ఆలోచన ఎవరిదోగానీ, అద్భుతం. సైంటిస్టు గోవింద్ పాత్ర లోనే మనకి కమల్ సాధారణ మేనరిజమ్స్ కనిపిస్తాయి నిజానికి. మిగితా తొమ్మిది పాత్రలూ వేటికవే ప్రత్యేకం. దేని మేనరిజమ్స్ దానివి. దేని ప్రత్యేకతలు దానివి. ఇలా ఒకే మనిషి ఇన్ని పాత్రలు పోషించడం – అదీ అంత వైవిధ్యభరితమైనవి- అనన్య సామాన్యం. ఇది కమల్ హాసన్ ఒక్కడు మాత్రమే చేయగలడు అనిపించింది సినిమా చూస్తూ ఉంటే. బామ్మ పాత్రకి తన ఎత్తు ఎలా తగ్గించగలిగాడో, కనీఫుల్లా పాత్రకి అలా పెంచేసాడు. కమల్ ఓ మాంత్రికుడు… దేన్నైనా తెరపై చూపించగలడు. బామ్మ, నంబి, పొడుగు మనిషి, గోవింద్, ఫ్లెచర్, బుష్, దళిత నాయకుడు పుణ్యకోటి, పోలీస్ అధికారి బలరామ నాడార్, జపాన్ మనిషి, పాప్ సింగర్ అవతార్ సింగ్ – ఇలా ఏ పాత్ర తీసుకున్నా అక్కడ ఆ పాత్రే కనిపించింది నాకు. ఆ పాత్ర నడక, తీరు – ఎక్కడా ఒకదానికి, మరో దానికీ పోలిక లేదు. అమెరికన్లే అయినా కూడా బుష్, ఫ్లెచర్ – ఇద్దరి మాటతీరులో కూడా తేడా స్పష్టంగా చూపగలిగాడు కమల్ (అదే తెలుగులో ఎస్పీబీ గొంతు). మిగితా పాత్రలకి వాయిస్ డబ్బింగ్ సరే సరి.

పొడుగుమనిషి మేకప్ మాత్రం మరీ ప్లాస్టిక్ మొహం లా అనిపించింది. మాటతీరు కూడా వింతగా ఉంది. పూర్తిగా మరో మనిషిలా కనబడే ప్రయత్నంలో వచ్చిన సమస్య అనుకుంటా ఈ మొహం. జపాన్ మనిషి, ఫ్లెచర్, బామ్మ, కనీఫుల్లా, పుణ్యకోటి – ఈ ఐదింటిలో ప్రధానంగా కమల్ కమల్ లాగా కనబడే అవకాశాలు చాలా తక్కువ. సాధారణంగా సినిమాల్లో హీరో మారు వేషాలేస్తే, విలన్ కి తప్ప అందరికీ (ప్రేక్షకులకి కూడా) అర్థం అయిపోతుంది. ఈ సినిమా లో ప్రత్యేకత అదే – ప్రేక్షకులకి కూడా చివరిదాకా (అది కూడా లోకనాయకుడా పాట పుణ్యమా అని) తెలియకుండా ఉండే అవకాశాలు లేకపోలేదు – ఆ మేకప్ అంత బాగా వేసారు. (ఇది వ్యంగ్యమనుకున్నా సరే, సవ్యమనుకునా సరే..;)) ఒక్కోళ్ళకీ ఒక్కో విషయంపై ఆసక్తి. కమల్ కి ఈ పది పాత్రలేసి రికార్డు సృష్టించడంలో ఆసక్తి. “అసలు పది పాత్రలెందుకు? అవసరమా?” అనే వారు కూడా ఉన్నారు. అవసరమా? లేదా? అన్నది ప్రశ్నే కాదు అసలు ఇక్కడ. అలా ఆలోచిస్తే, సినిమాల్లో హీరోలు ద్విపాత్రాభినయాలూ, త్రిపాత్రాభినయాలూ మాత్రం చేయడమెందుకు? ఇంకోళ్ళనే పెట్టుకోవచ్చు కద. నవరాత్రి లో తమిళ్ లో శివాజీ గణేశన్, తెలుగులో ఏఎన్నారూ చేయలేదూ…అలాగే ఇదీనూ. దీన్ని కమల్ ఓ ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఇంకోరెవరూ చేయలేని విధంగా చేసాడు కూడానూ.

ఈ సినిమాలో కథే లేదు అన్నది నేను చాలామంది దగ్గర విన్న మాట. విన్నప్పుడల్లా నాకు ఆ మాట కాస్త నవ్వు తెప్పిస్తూనే ఉంది. కథ లేకపోవడమేమిటి? అంత బాగా కథ అల్లితేనూ? పది వేర్వేరు కథలని అలా లింక్ చేయగలగడం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకసారి ఆగి, ఒక కథకుడి పక్షాన నిలబడి ఆలోచిస్తే అర్థమౌతుంది అందులో ఎంత శ్రమ ఉందో, ఎంత తెలివితేటలు కావాలో దానికి. నిజానికి జీవితమంటే ఏమిటి? ఇలా భిన్న సంఘటనల కలయికే కదా! ప్రతి మనిషి జీవితమూ ప్రపంచంలో చాలా మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది (Its a wonderful life అన్న ఆంగ్ల సినిమా కాన్సెప్ట్). ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే తెలుస్తుంది ఈ సినిమాకి కథంటూ ఒకటి ఉందో లేదో. ఒకసారి ఆలోచిస్తే – మన జీవితాల్లోనే అలా సంబంధంలేని మనుష్యుల్తో మనల్ని కనెక్ట్ చేసే సంఘటనలు దొరక్కపోవు. ఎటొచ్చీ కథంటే మనం ఎక్కడ్నుంచో ఊడిపడాలని అనుకుంటాం. ఇలా ఉంటుందని అనుకోము. అదీ సమస్య. మూడు నాలుగు కథలున్నప్పుడే వాటిని కనెక్ట్ చేయడం కష్టం (తీన్ దీవారే, బేబెల్ వంటి సినిమాలు ఇలాంటి కథలకి ఉదాహరణలు). మరి పది కథలంటే మాటలా? నాకీ సినిమా కథ చాలా నచ్చింది.కమల్ లోని కథకుడు నాకెప్పుడూ ఇష్టమే. ఒక సత్యమే శివం, ఒక భామనే సత్యభామనే, ఒక హేరామ్ – ఏది తీసుకున్నా అతని కథలిచ్చిన సినిమాలు నాకెంతో నచ్చాయి. ఈ కథ అల్లడంలోనే అర్థమౌతోంది కమల్ హాసన్ మేధస్సు. ఇంతబాగా కథ రాస్తే, దాన్ని కథలేదని విమర్శించే వాళ్ళకి వ్యతిరేకంగా వకాల్తా తీసుకుంటూ ఈ మాటలు: ఒక్కసారి మీరే కథకుడనుకోండి – ఈ కథ రాయడం ఎంత కష్టమో అర్థమౌతుంది. ఒక్క సారి ఈ కథ ఫ్లో లో వెళితే అర్థమౌతుంది కథుందో లేదో. ఇలాంటి ఓకథ మన సినిమాల్లో ఇప్పటి దాకా రాకపోవడం వల్ల మన ప్రేక్షకులకి అలా అనిపించిందేమో అని నా అనుమానం.

కమల్ సినిమా అనగానే హాస్యం గుర్తుకు వస్తుంది నాకు. “హేరామ్”, “ద్రోహి” – ఈ రెండూ తప్ప మిగితా ఏ సినిమాలోనూ (నేను చూడనివాటిని వదిలేస్తే) హాస్యం పరంగా నేను “బాలేదు” అనుకున్న సందర్భమే లేదు. ఈ సినిమా కూడా హాస్యం పరంగా బానే ఉంది. ముఖ్యంగా బలరామ్ పాత్ర ఉన్న దృశ్యాలు. పొడుగు మనిషి కనీఫుల్లా ఉన్న దృశ్యాలు కూడానూ. అతని ఇంట్రో సీనులోనే కామెడీ ఉంది అసలు. ఇదంతా కమల్ సినిమాల్లో మాత్రమే కనిపించే హాస్యం. డైలాగులు “క్రేజీ” మోహన్. కమల్ మార్కు కామెడీ అని అన్నా కూడా, నిజానికి అది “క్రేజీ”మోహన్ మార్కు కామెడీ. 🙂 బలరామ నాడార్ గోవింద్ ని ఇంటరాగేట్ చేసే సమయంలో అడిగిన ప్రశ్న – “టెరిఫిక్ సైంటిస్టా? సైంటిఫిక్ టెర్రరిస్టా?” వంటివి చాలా నవ్వు తెప్పించాయి. బుష్ ద్వారా చేయించిన కామెడీ మరో రకం. అతన్ని ఎలా చూపించారు అన్నది పక్కన పెడితే, “if it is complicated, don’t explain” వంటి డైలాగుల్ని నవ్వకుండా చూసినవారు, విన్నవారూ కూడా ఉన్నారని నేననుకోను (బుష్ అభిమానులు తప్ప). బలరామ నాడార్ పాత్ర ని చూడగానే ఎందుకోగానీ, ఇంద్రుడు-చంద్రుడు లో మేయర్ గుర్తు వచ్చాడు నాకు 🙂

కథలోని నాస్తికవాదం అంశం విషయానికొస్తే, దాన్ని నేనో వాదనగా చూసాను తప్ప, ఇప్పుడేదో ఇది చూసి జనం నాస్తికులైపోతారు, లోకం నాశనమౌతుంది అన్న బెంగతో కాదు. అయినా, కథల్లో నాస్తిక పాత్రలుండకూడదా ఏమిటి? నిజజీవితంలో నాస్తికులుండరూ? మన సెక్యులార్ దేశంలో పాపం వాళ్ళని కూడా అంగీకరించొద్దూ? అసలు నాస్తికులంటూ ఎవరూ ఉండరన్న వాదనొకటుంది కానీ, ఇప్పుడదంతా ఈ వ్యాసానికి సంబంధం లేదు కనుక ఆపేస్తున్నా. ఎటొచ్చీ, సినిమా ఆఖర్లో ఆశిన్ తో – “దేవుడు లేడని నేనెక్కడన్నాను? ఉంటే బాగుండు అని మాత్రమే అన్నాను” అని కమల్ అన్నప్పుడు మాత్రం నవ్వాగలేదు. శైవ-వైష్ణవ తగాదాల గురించి జరిగిన వివాదంలో చారిత్రక సత్యం ఎంత? అన్నది తెలీదు నాకు. కనుక ఆ విషయంలో నో కామెంట్స్.

సంగీతం పరంగా ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజాలలో ఎవర్నో ఎంచుకుంటారు అనుకుంటూ ఉండగా, హిమేష్ రేషమియా ని తీసుకోడం ఆశ్చర్యాన్నే కాదు..నిరాశను కూడా కలిగించింది. ఉన్న ఐదు పాటల్లో నాకు- “రాయిని మాత్రం”, “ముకుందా ముకుందా” తప్ప మిగితావేవీ పెద్ద నచ్చలేదు. డిస్కో థెక్కుల పాటల్లా అనిపించాయి. “ముకుందా ముకుందా..” పాటలో దశావతారాలని స్క్రీన్ పై చూపించిన విధానం చాలా బాగుంది. బాపూ సినిమాల్లో పద్యాల్నీ వాటినీ దృశ్యాల్లోనే అర్థమయ్యేలా చెప్పినట్లు, ఈ పాటలో కూడా దశావతారాలని అర్థమయ్యేలా చెప్పారు. “రాయిని మాత్రం” గురించి చెప్పనక్కరలేదు ఇక. అది పక్కన పెడితే, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కానీ, ఏది ఏమైనా కూడా, రేషమియా అంటే ఉన్న చిరాకు కాస్త తగ్గిందేమో కానీ, ఈ సినిమా సంగీతం గురించిన నిరాశ అలాగే ఉంది.

సునామీ దృశ్యాలు చాలా బాగా తీసారు. గోవింద్ ఆఫీసు సంఘటనలూ, ఫ్లెచర్ పై చిత్రీకరించిన సన్నివేశాలూ – ఇవంతా ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది నాకు – టెక్నికల్ విషయాల పరంగా. కమల్ కాక ఎందరో ఈ సినిమాలో ఉన్నారు… వాళ్ళకి పాత్రల నిడివి తక్కువే అయినా కూడా, ఎవరి మటుకు వారు తమ పరిధుల్లో బానే చేసారు. అంతా బానే కుదిరింది. ఇందులో పొరపాట్లు లేవని కాదు. అక్కడక్కడా నాకు సినిమా మరీ విడ్డూరంగా అనిపించింది. ఒక్కోచోట అతి అనిపించింది. ఒక్కోచోట లాజిక్ లేకుండా అనిపించింది. అసలా లోకనాయకూడా పాట సాహిత్యం ఒక్కో చోట మరీ అతిగానూ, ఆ కే.ఎస్.రవికుమార్ డాన్స్ వేయడం అనవసరంగానూ అనిపించింది. అయినప్పటికీ, ఇలాంటి ఓ సినిమా భారతదేశంలో రాలేదు. రాదేమో కూడా బహుశా…మళ్ళీ కమల్ పూనుకుంటే తప్ప! “ఆస్కార్” రవిచంద్రన్ ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు. సినిమా చూసొచ్చాక నేను ఈ సినిమా గురించిన వ్యాసాలు కొన్ని చదివాను. సోర్సెస్ తెలీదు కానీ, అసలు దశావతారాలకీ, ఈ దశావతారాలకీ పోలికలు చెబుతూ ఉన్న వ్యాసం ఒకటి. సినిమాలో సంబంధం లేనివిగా ఒకవేళ అనిపించినా chaos effect, butterfly effect ని ప్రస్తావిస్తూ వాటి మధ్య సంబంధాలని చెప్పే వ్యాసం ఒకటీ, ఇలాంటివే మరిన్ని విశేషాలతో దశావతారం సినిమా కేస్ స్టడీ ఒకటి – ఇవన్నీ చదువుతూ ఉంటే సినిమా మరింత నచ్చింది, కమల్ అంటే గౌరవం, అభిమానం మరింత పెరిగింది. కమల్ తెలివితేటలకి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నాను.

ఈ సినిమాకి మాత్రం ఇంటర్వెల్ చాలా అవసరం అనిపించింది. ఈ కథ ని ఫాలో ఔతూ, విడి విడి దారాలను కలుపుకుంటూ, అంతా అర్థం చేసుకుంటూ, మధ్యలో ఓ సారి నెమరువేసుకోడానికి ఆ ఇంటర్వెల్ బాగా పనికొస్తుంది. సినిమా అల్లాటప్పాగా చూసేసే రకానిది కాదు. కబుర్లు చెప్పుకుంటూ కాక కాస్త శ్రద్ధగా చూడాలి – దాన్ని పూర్తిగా అర్థం చేసుకోడానికి. ఎంతరాసినా రాయాలనిపిస్తోంది ఇంకా…కానీ, ఇక్కడికి ముగించేస్తున్నా ఇప్పటికి. త్వరలో రెండో భాగంతో ముందుకొస్తా.

14 Comments
  1. chavakiran June 29, 2008 /
  2. chavakiran June 30, 2008 /
  3. sasank July 1, 2008 /
  4. Madhu. July 4, 2008 /
  5. Manjula July 5, 2008 /
  6. ramya July 6, 2008 /
  7. kiran July 7, 2008 /
  8. vinay April 15, 2009 /
  9. rayraj May 16, 2009 /