Menu

దశావతారం

ఉపోద్ఘాతం:దశావతారం సినిమాలో పెద్ద జోకేంటంటే సినిమాలో కొత్త పాత్ర ఎవరైనా ప్రవేశిస్తే చాలు, కొంప తీసి ఈ క్యారెక్టర్ కూడా కమల్ మరో అవతారమా అని ప్రేక్షకులు అనుమానంతో కళ్ళు గుచ్చి స్క్రీన్ మీద చూడడం. ఈ సినిమా చూస్తుండగా నా పక్కన కూర్చున్న ఒకావిడ మల్లికా షరావత్ ని చూసి ఈ క్యారెక్టర్ కూడా కమల్ మరో అవతారమా అని అడిగింది ఆమె పక్కనున్నాయన్ని. ఈ సినిమాలో కమల్ గురించి తప్ప చెప్పుకోవాల్సింది ఏమీలేదు. కానీ భారత దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా గురించి ఏదో ఒకటి మాట్లాడకపోతే టాక్ ఆఫ్ ది టౌన్ అయిన దశావతారాన్ని ignore చేసినట్టవుతుంది కనుక, ఈ సినిమా గురించి నేను చేసిన లోతైన విశ్లేషణ ఇది. నేను చూసింది తమిళ్ వర్షన్ కనుక ఈ తెలుగు రివ్యూ తమిళ్ సినిమా గురించి అని గ్రహించగలరు.

కథ:అమెరికాలో సైటింస్ట్ గా ఉన్న గోవింద్ కనుక్కున్న ఒక బయొలాజికల్ వెపన్ అమ్ముకుని డబ్బు చేసుకుందామనుకున్న గోవింద్ బాస్ ప్రయత్నాలను తప్పించుకుంటూ ఆ బయొలాజికల్ వెపన్ దుష్టుల చేతులో పడకుండా చేయడానికి గోవింద్ పడ్డ శ్రమగా ఈ సినిమా కథను చెప్పుకోవచ్చు.

ఇలాంటి కథలతో హాలీవుడ్ నుంచి కుప్పల తెప్పలగా వచ్చిన ఎన్నో సినిమాల ప్రేరణతో ఈ సినిమా రూపొందించబడింది. కథా పరంగా పెద్దగా వైవిధ్యం లేకపోయినా సరిగా తీసుంటే మంచి కమర్షియల్ సినిమాగా నిలబడివుండేది ఈ సినిమా. సినిమా మొదలయ్యే సరికి గోవింద్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడడంతో మొదలవుతుంది. 12 వ శతాబ్దంలో శైవులకు వైష్ణవులకూ మధ్య తలెత్తిన గొడవలతో మొదలుపెట్టి అక్కడ ఒక కమల్ ని విష్ణు భక్తునిగా పరిచయం చేసి, ఇంతలోనే చంపేసి, ప్రేక్షకులు ’అయితే ఏంటయ్యా” అని నిలదీసేలోపే  దానికీ ఈ సినిమా మిగిలిన కథకూ సంబంధం ఏమీ లేదనుకోకండి, ఎక్కడో చైనాలో సీతాకోకచిలుక రెక్కలాడిస్తే అమెరికాలో పెను తుఫాన్ సంభవిస్తుంది కదా అని కయోస్ థియరీ పాఠాలు చెప్పి అలాగే ఒకరితో ఒకరికి సంబంధం లేని వివిధ వ్యక్తుల జీవితాలలో సంభవించిన వేర్వేరు సంఘటనల సమాహారమే ఇప్పుడు నేను చెప్పబోయే కథాంశం అని చెప్పడంతో అసలు కథ అమెరికాలో మొదలవుతుంది.

అమెరికాలో సైటింస్ట్ గా వున్న గోవింద్ (రెండో కమల్) పరిశోధనా ఫలితమైన ఒక బయలాజికల్ వెపన్ ని అతని బాస్ డబ్బుకు కక్కుర్తిపడి తీవ్రవాదులకు అమ్మేయాలని చూస్తాడు. అలా జరగకుండా గోవింద్ ఆ వెపన్ ఉన్న ఒక చిన్న డబ్బా తీసుకుని పారిపోతాడు. అతన్ని వెంటాడుతూ క్రిస్టియన్ ఫ్లెచర్(మూడో కమల్) అనే ఒక మాజీ CIA ఏజెంట్ బయల్దేరుతాడు. ఇదంతా బుష్ (నాలుగో కమల్)కి తెలిసి కంగారు పడతాడు.

అనుకోని పరిస్థితుల్లో ఆ బయలాజికల్ వెపన్ ఇండియా చేరడంతో దాంతో పాటే కథ, కథ తో పాటే గోవింద్, గోవింద్ తో పాటు ఫ్లెచర్ ఇండియా కి షిఫ్ట్ అవుతారు. ఇండియాలో విమానం దిగగానే గోవింద్ కి స్వాగతం పలుకుతాడు నాయుడు(ఐదో కమల్). నాయుడు ఇండియన్ ఇంటెలిజన్ అధికారి. అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ లో గోవింద్ టెర్రరిస్ట్ గా చిత్రీకరించబడతాడు. అందర్నీ తప్పించుకుని బయలాజికల్ వెపన్ ఉన్న ప్రదేశమైన చిదంబరం చేరుకుంటాడు.అతన్ని ఫాలో అవుతూ ఫ్లెచర్ కూడా అక్కడికే చేరుతాడు.

ఇదిలా వుండగా గోవింద్ ని వెంటాడుతూ ఫ్లెచర్ అమెరికాలో ఒక జపాన్ అమ్మాయి చంపేస్తాడు.ఆ అమ్మాయు అన్న జపాన్ లో పెద్ద మార్షల్ ఆర్ట్ ఫైటర్. తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకుని ఆమె ను చంపిన వారిపై పగతీర్చుకోవాలని ఇండీయా బయల్దేరుతాడుఆ జపనీస్ యోధుడు(ఆరో కమల్).

చిదంబరం చేరుకున్న గోవింద్ ఆ బయలాజికల్ వెపన్ కృష్ణవేణి (ఏడో కమల్)అనే వృద్ధురాలి దగ్గర వుందని తెలుసుకుంటాడు. అది చేతికందబుచ్చుకునే సమయంలో జరిగిన సంఘటనల కారణంగా  కృష్ణవేణి మనవరాలు(అసిన్) తో కలిసి ఆ వూర్నుంచి పారిపోతారు. వెళ్తూ వెళ్తూ ఆ బయలాజికల్ వెపన్ దాగివున్న ఒక దేవుని విగ్రహాన్ని పట్టుకుని పోతారు.

పరిస్థుతుల కారణంగా ఆ విగ్రహాన్ని ఇసుకలో పూడ్చిపెడతాడు గోవింద్. సరిగ్గా అదే సమయానికి ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాతో గొడవ పెట్టుకుంటాడు గోవింద్. ఈ గొడవ జరుగుతుండగా ఇసుక స్మగ్లింగ్ రాకెట్ ని బయటపెట్టడానికి వస్తాడు పుణ్యకోటి(ఎనిమిదో కమల్). పుణ్యకోటి కి స్మగ్లింగ్ మాఫియాకి మధ్య జరుగుతున్న గొడవలో అదును చూసి తప్పించుకుంటాడు గోవింద్. అలా తప్పించుకుని  పారిపోతూ మార్గమధ్యంలో కార్ ఏక్సిడెంట్ కారణంగా  ఒక పొడవాటి కాబూలీవాలా (తొమ్మిదో కమల్ )ని కలుస్తాడు గోవింద్. ఆ కాబూలీ వాలా తల్లి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఒక హాస్పిటల్ చేరుకుంటారు అందరూ.

ఇదే సమయానికి అవతార్ సింగ్(పదో కమల్) అనే పంజాబీ సింగర్ ఒక ప్రోగ్రామ్ కోసం అక్కడ చేరి ఆసుపత్రి పాలవుతాడు.

ఇలా పది పాత్రలు పరిచయం అయ్యే సరికి సినిమా దాదాపు ముగింపుకొచ్చేస్తుంది. ఇక వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ప్రయత్నమే ఈ సినిమా క్లైమాక్స్.

స్క్రీన్ప్లే:సినిమా చూసేటప్పుడు అనిపించలేదు కానీ  ఇప్పుడు పైన కథంతా రాసాక  అనిపించిన  విషయమేమిటంటే  ఈ సినిమా  కథా  కథనాలు  మంచి సక్సెస్ కాగలిగిన సినిమాకు కావాల్సిన  అంశాలన్నీ ఉన్నాయి. నిజానికి ఇంతకు ముందు ఏ భారతీయ సినిమాలో లేని అంశాలున్నాయీ సినిమా కథలో.కానీ ఈ సినిమా లో కథనం సాగిన తీరు ఎంతో పేలవంగా వుంది. ఇదే స్క్రీన్ ప్లేతో మంచి సినిమా రూపొందించివుండవచ్చని నాకనిపించింది.

రెండు మూడేళ్ళ నుంచి దశావతారం అని ఊదరగొట్టేసిన తర్వాత ఎన్నోఅంచనాలతో సినిమాకెళ్ళిన ప్రేక్షకుడికి చివరికి మిగిలేది ’half baked stuff’ మాత్రమే. అంతర్జాతీయ అంశాలతో , పాత్రలతో సినిమా తీయాలనుకోవడం బాగానే వుంది కానీ ఆ అంశాలను సరిగ్గా తెరకెక్కించలేక సీరియస్ సాగాల్సిన సినిమా కొంత సేపటికి ఒక ‘bad joke’ లాగా అనిపిస్తుంది.

కాసేపు సీరియస్ నడిచిన సినిమా కొంచెం సేపటికి కమల్ గత సినిమాలైన మైకేల్ మదన్ కామ రాజు లాంటి సినిమాలలాగా కామెడీ మోడ్ లోకి వెల్తుంది. ఆ సమయంలో పండిన జోకులు ఫర్వాలేదు కానీ ఆ తర్వాత సినిమా అంతా గందరగోళంగా అతుకుల బొంతలా వుంటుంది. సినిమాలోనీ అన్ని సబ్ ప్లాట్స్ నీ క్లైమాక్స్ లో ఒకదగ్గరికి తెచ్చే ఐడియా బాగానే వుంది కానీ చాలా విషయాలు కన్విన్సింగ్ గా వుండకపోవడంతో తలనొప్పికి గురవుతారు ప్రేక్షకులు.

కమల్ మరియు అశిన్ మధ్య నడిచే డ్రామా మొత్తం ఆల్రెడీ ఎక్కడో చూసినట్టే వుంటుంది. ఒక్కటే సేవింగ్ గ్రేస్ ఏంటంటే వారిద్దరిమధ్య  ప్రేమా గీమా అంటూ అనవసర కాలయాపన చేయకుండా హాలీవుడ్ సినిమాలలాగా చివరి సీన్లో వాళ్ళిద్దరని కలిపేయడం బాగుంది.

దర్శకత్వం:ఈ సినిమాకి KS రవి కుమార్ దర్శకత్వమే పెద్ద వీక్ పాయింట్. అంతర్జాతీయ స్థాయి సినిమా అన్నప్పుడు ఆ స్థాయిలో అలోచించగలిగే వాళ్ళు ఈ సినిమాకి దర్శకత్వం వహించి వుంటే  బావుండేది. శివాజీ అనే బ్లండర్ చేయకుండా వుండుంటే ఈ సినిమాకి తప్పకుండా శంకర్ దర్శకత్వం వహించుండాల్సింది అని ధైర్యంగాచెప్పుండొచ్చు. కానీ శివాజీ తర్వాత శంకర్ నీ నమ్మలేం.ఒక వేళ కమలే దర్శకత్వం వహించివున్నా బావుండేదేమో. దర్శకత్వం  పరంగా  ఈ సినిమాలో చాలా లోపాలే వున్నాయి. అవీలోపాలనడం కంటే రవికుమార్ కి అంతకంటే తీయడం రాదని కూడా అనవచ్చేమో!

నటన:కమల్ పది పాత్రలు పోషించిన ఈ చిత్రంలో మిగిలిన వారెవరికీ పెద్దగా నటించే అవాకాశం లేదనే చెప్పాలి. కమల్ పోషించిన పది పాత్రల్లో  నాయుడుగా, దళిత లీడర్ గా చేసిన పాత్రలు అద్భుతం అని చెప్పొచ్చు. పొడుగు కాబూలీవాలా పాత్ర ఎబ్బెట్టుగా వుంది.కృష్ణవేణి,ఫ్లెచర్, బుష్ పాత్రల్లో కమల్ మేకప్ ఘోరంగా ప్లాస్టిక్ మాస్క్ పెట్టుకున్నట్టు వుండడమే కాకుండా నటనలోనూ పూర్తి ఆర్టిఫిషియాలిటీ తెలిసిపోతుంది. గోవింద్ పాత్రలో పెద్దగా చెప్పుకోదగ్గ నటనంటూ ఏమీ లేదు. జపనీస్ యోధుని పాత్ర లో ఫర్వాలేదనిపించాడు. 12వ శతాబ్దపు శైవ భక్తునిగా బాగానే ఉన్నా, అవతార్ సింగ్ పాత్ర కు పెద్ద  ప్రాముఖ్యం లేకపోవడంతో సర్దార్జీగా చూడ్డానికి బాగానే ఉన్నా పెద్ద ఫలితం లేదు.

మిగిలినా పాత్రల్లో అసిన్ ఉన్నంతలో బాగానే చేసింది.

సంగీతం: అస్సలు బాగోలేదు. అటు పాటలు గానీ, ఇటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కానీ వైవిధ్యం లేదు.

ఇతర సాంకేతిక అంశాలు: మిగిలిన వాటిల్లో ఆర్ట్ వర్క్ బాగానే వుంది. ఎడీటింగ్ అక్కడక్కడా గజిబిజి గా వుంది.సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బావుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశాల్లో ఒకటి స్పెషల్ ఎఫెక్ట్స్. కొన్ని చోట్ల వావ్ అనిపించేలా మరి కొన్నిచోట్ల యాక్ అనిపించేలా ఉన్నాయి స్పెషల్ ఎఫెక్ట్స్.ఏదేమైనా  మన సినిమా  వాళ్ళూ గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వుంది. మనకున్న బడ్జెట్, టెక్నాలజీ లాంటి  పరిధులు ఎరిగి మనం ఎంత చేయగలమో అంత మాత్రం సరిగ్గ చేస్తే మేలు. లేకపోతే  ఇతర దేశస్థులకు మన సినిమాలు పెద్ద జోక్ గా తయారవుతాయి. 

విశ్లేషణ:ఏరియల్ షాట్ లో ఈ సినిమామొదలయిన  తీరు ఫర్వాలేదుకానీ హాలీవుడ్ లో రొటీన్ అయిపోయిన కథాంశాన్ని ఎన్నుకోవడం ఈ సినిమాకి చేసిన మొదటి తప్పు. అందులోనూ ఈ రోజుల్లో మన ప్రేక్షకులు ఏమీ తెలియని అమాయకులు కాదు. అమెరికాలో బయలాజికల్ వెపన్స్ పై చేసే పరిశోధనాలయంలో అందరూ హాయిగా తమిళంలో మాట్లాడుకోవడం సినిమా మొదట్లోనే పంటికింద రాయిలా పడుతుంది.అక్కడ్నుంచి మొదలయ్యి బుష్ పాత్రలో సరిగ్గా ఇమడని కమల్, ఫ్లెచర్ పాత్రలో టెర్మినేటర్2 లోని T-1000 పాత్రను పోషించిన  రాబర్ట్ ప్యాట్రిక్ ను అనుకరణ, అవ్వై షణ్ముగి  లో బామ్మ పాత్ర తో పోలిస్తే వందరెట్లు తక్కువ అనిపించే ముసలమ్మ పాత్ర, ఎలాగోలా ఇరికించాలని తప్పితే ఏ మాత్రం ప్రాముఖ్యత లేని అవతార్ సింగ్ పాత్ర లు ఈ సినిమాకివీక్ పాయింట్స్.జేమ్స్ బాండ్ తరహా కథ ఎన్నుకుని పంచతంత్రం లా కామెడీ చేయాలనుకోవడం మరో పెద్ద తప్పు.అంత పెద్ద కథ, అన్ని పాత్రలు చూపించాల్సిన  ఇలాంటి సినిమాలో కూడా అనవసరమైన పాటలు, అర్థం పర్థం లేని చేజింగ్లూ సినిమా నిడివిని పెంచాయే గానీ మరే ప్రయోజానాన్ని కలుగజేయలేదు. ఎన్నో అంచనాలతో వేయికళ్ళతో ఎదురుచూసిన దశావతారం 2008 లో వచ్చిన చెత్త  సినిమాల్లో ఒకటిగా  మిగిలిపోవడానికి ఎన్నో కారణాలే ఉన్నాయి.

హాలీవుడ్ నటులతో సమానంగా నటించగల వారిలో కమల్ ఒక్కడే ఉన్నాడని చాలా మంది అనుకుంటూండగానే నాకంత సీన్ లేదు అని చేసి మరీ చూపించాడు కమల్. మేకప్  పైఉన్న శ్రద్ధ కాస్త మంచి  కథ చెప్పడంలో  పెట్టివుంటే ఏమైనా లాభం వుండేదేమో!

ముగింపు:శివాజీ సినిమాతో జనాలకిచ్చిన స్ట్రోక్ చాలదన్నట్టు తమిళ సినిమా ఘనంగా జనాలమీదకొదిలిన మరో పెద్ద జోకు దశావతారం. కమల్ తనకున్న టాలెంట్ ని ఒకే సినిమాలో ప్రదర్శించేద్దామన్న తపన తప్పితే అన్ని కోట్లు ధారపోసి ఈ సినిమా తీయడం వెనుకున్న కారణాలు తెలియరావు. కేవలం కమల్ పది పాత్రల్లో ఎలా ఉన్నాడో చూద్దామనే ఆలోచనతోసినిమా చూడాలనుకుంటే ఫర్వాలేదు కానీ  మీడియా చేస్తున్న ఉత్తుత్తి  హైప్  నమ్మి ఏదో మాస్టర్ పీస్ అనుకుని సినిమకెల్తే మాత్రం మీకెదురయ్యేది నిరా శ నిశ్ప్రహలే!

లాభంలేదు మాకు సినిమాలే జీవితం, ఏదో ఒక సినిమా చూడాల్సిందే  అనే వాళ్లకి వెతుక్కుంటే అక్కడక్కాడా మంచి సినిమాలు కనిపిస్తాయి. ఉదాహరణకు పోయిన వారం విడుదలయిన హిందీ సినిమా అమీర్.వీలయితే చూడండి.అలాగే ఒకే నటుడు వివిధ పాత్రలు పోషించి మెప్పించిన చిత్రాలు చాలానే ఉన్నాయి(దాన వీర శూర కర్ణ(NTR), నవరాత్రి(శివాజి  గణేశన్), DR Strangelove (పీటర్ సెల్లర్స్)) వాటిలో ఏదో ఒకటి చూడండి. దశావతారం మాత్రం DVD లో చూసి ఫాస్ట్ ఫార్ వర్డ్ లో లాగించేయడం మేలని నా అభిప్రాయం.

–అన్వేషి

23 Comments
 1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 15, 2008 /
 2. శిద్దారెడ్డి వెంకట్ June 15, 2008 /
 3. Naveen June 16, 2008 /
 4. Sowmya June 16, 2008 /
 5. sasank June 18, 2008 /
 6. శేఖర్ June 18, 2008 /
 7. రానారె June 18, 2008 /
 8. veerablogudu June 19, 2008 /
 9. venkat Balusupati June 20, 2008 /
 10. అన్వేషి June 20, 2008 /
 11. sasank June 22, 2008 /
 12. చంద్రమోహన్ June 23, 2008 /
 13. అన్వేషి June 23, 2008 /
 14. SrIkanAth June 23, 2008 /
 15. ramakrishna June 24, 2008 /
 16. radhika August 31, 2008 /
 17. chaitanya October 7, 2008 /
 18. m seshasayanam January 3, 2009 /
 19. Dheeraj April 27, 2009 /