Menu

ఆమిర్ (హిందీ) – తప్పకుండా చూడవలసిన చిత్రం

‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ పోయిన వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘అమీర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది.

అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. ఆ కిడ్నాపర్లు చెప్పినట్టు చేస్తే అందరికీ విముక్తి అని ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి  తన ద్వారా చేయించదలుచుకున్న పనేమిటి? తన తలరాత (किस्मत)ని ఫోన్ కాల్ ద్వారా శాసిస్తున్న వ్యక్తికి, అప్పటి వరకూ తన భవిష్యత్తును తనే మలుచుకున్న అమీర్ ఆఖరికి చెప్పిన సమాధానం ఏమిటి? అన్నది ఈ సినిమా ఇతి వృత్తం.

ఇలాంటి విషయాన్ని ఎన్నుకోవడం లోనే, మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ‘రాజ్ కుమార్ గుప్తా’ యొక్క పరిణితి, అభిరుచి కనపడుతుంది. అమీర్ పాత్రలో నటుడిగా ఒక కొత్త ముఖంగా ‘రాజీవ్ ఖండేల్వాల్’ పరిచయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుండే రాజీవ్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటనతో పాటూ, తెరమీద తన ఉనికి చాటుకునేలా ఉన్న ఇతడి స్క్రీన్ ప్రెజెంస్,వాయిస్ క్వాలిటీ రాబోయే కాలంలో అతడ్ని నిలబెడుతుందనిపిస్తుంది. దాదాపు 1 గంటా 35 నిమిషాల ఈ సినిమాలొ ఇతను తప్ప ఇంకెవ్వరూ స్క్రీన్ పైన కనిపించరు. ఆయినా ప్రేక్షకుల్ని కట్టిపడవెయ్యగలిగాడంటే, భవిష్యత్తులో చాలా సినిమాలలో ఇతను కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది.

అమీర్ విమానం లో ముంబై రావడంతో సినిమా మొదలై, అక్కడే ఇమిగ్రేషన్ అధికారి తన లగేజ్ మూడు సార్లు చెక్ చేసి “తను ఒక ముస్లిం,కాబట్టి అనుమానించాలి” అన్న భావాన్ని ఎత్తిచూపుతాడు. అయినప్పటికీ ఆ సంఘటన లో అమీర్ చూపే సహనం, మిగతా సినిమాలో తన ప్రవర్తనకి,ఆఖర్న తను తీసుకునే నిర్ణయానికీ ప్రాతిపదికగా మారుతుంది. ఇలా ఆరంభంలోనే ఒక పాత్ర స్వభావాన్ని సున్నితంగా చెప్పిన సినిమాలు ఈ మధ్యకాలంలో చూసినట్లు లేదు.

టైటిల్స్ పడుతుండగా రాబొయే ప్రమాదానికి కాంట్రాస్ట్ గా , ఒక గొప్ప ఇంగ్లీష్ క్లాసిక్ పాట “It’s a good day…how could any thing be wrong” నేపధ్యంలో వినవస్తుండగా ముంబై నగర శుభోదయ దృశ్యాల్ని దర్శకుడు బంధించాడు. సినిమాలో వాడిన మిగతా పాటలు (http://www.musicindiaonline.com/music/hindi_bollywood/s/movie_name.9755/) కూడా, నేపధ్యసంగీతం లో భాగంగానే వినిపిస్తాయి.  ఇక్కడ సినెమాటోగ్రాఫర్ ‘అల్ఫోజ్ రాయ్’ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముంబై నగర ఉదయ శోభని ఒకవైపూ, చిన్నచిన్న సందులూ గొందులూ, షేడీ హోటళ్ళూ, చూడానికే అసహ్యంగొలిపే ‘చాల్’లూ, అక్కడి మనుషులూ, మటన్ షాపులూ వంటివాటిని మరొవైపు తను కెమెరాలో చక్కగా బంధించిన విధానం ప్రశంసనీయం. రాంగోపాల్ వర్మ ‘సత్య’, అనురాగ్ కాశ్యప్ తీసిన ‘బ్లాక్ ఫ్రైడే’ చిత్రాల తర్వాత ముంబైలోని కొన్ని ప్రదేశాలను ఇంత సూక్ష్మంగా చూపిన సినిమా ఇదేననిపిస్తుంది. అంతేకాక ప్రముఖపాత్రధారి మానసిక స్థితిని బంధించడం, ఈ సినిమాకి అత్యంత కీలకం. ఆపని ఈ సినెమాటోగ్రాఫర్ ఖచ్చితంగా, సఫలం చేశాడు.

ఒక తీవ్రవాద ముస్లిం అజ్ఞాత ఫోన్ వ్యక్తిగా నటించిన ‘గజ్ రాజ్ రావ్’ ముఖం ప్రేక్షకుడికి ఎప్పుడూ పూర్తిగా  కనపడకపోయినా, ఆ పాత్ర వ్యక్తిత్వం, ఆలోచలలూ,అశయాలూ తను గొంతులోనే పలికించిన తీరు, ఈ సీన్లని దర్శకుడు తీసిన విధానం చూస్తే,సినిమా తియ్యాలనికునే ప్రతి ఒక్కరికీ కొంత అసూయ కలగక తప్పదు. ఉదాహరణకి, ఫోన్లో హీరోను బుజ్జగిస్తూ మాట్లాడే ఒక సీన్లో, ఆ అజ్ఞాతవ్యక్తి కుటుంబంలోని ఒక చిన్నపాపతో ఆడుకుంటూ మాట్లాడతాడు. ఇంటర్ కట్లలో ఈ సీన్ చూస్తే, ఆ అజ్ఞాతవ్యక్తి గొంతుకకు హీరో ముఖంలోని భావాలూ, ఆ చిన్నపాప స్పందన ఒకేలా అనిపిస్తాయి. ఇంకో సీన్లో, కీ-ఇచ్చిన బొమ్మని ఆ అజ్ఞాతవ్యక్తి నెత్తిపై మోదుతుంటే ఆగిఆగి నడవడాన్ని, హీరో నడవడికతో కాంట్రాస్ట్ చేసి దర్శకుడి చక్కటి స్క్రీన్ ప్లే ని పరిచయం చేశాడు.  ఆరంభాన్ని ఇంటర్వెల్ కూ, క్లైమాక్స్ ని ఆరంభానకీ మార్చి గొప్ప స్క్రీన్ ప్లే అని చెప్పుకునే మన దర్శకులకి ఈ చిత్రాన్ని ఒక పాఠంగా ఉపయోగించుకోవచ్చు.

సినిమా అంతా ఒక ఎత్తైతే, క్లైమాక్స్ లో అమీర్ పాత్ర తీసుకునే నిర్ణయం ఈ సినిమా కథను ఒక అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. తన జీవితాన్ని ఇష్టమొచ్చిన విధంగా మలచుకొనే అవకాశం ఈ దేశం కల్పించిందని నమ్మే ఒక సాధారణ ముస్లిం యువకుడు, ముస్లిం తీవ్రవాద భావాలకు వ్యతిరేకంగా తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఇచ్చే సందేశం…ఇంతవరకూ భారతీయ సినిమా చూడనిది. అందుకే ఈ సినిమా అందరూ తప్పక చూడవలసింది.

రెండు ప్రధాన పాత్రలు తప్ప ఇంకెవరూ దాదాపు లేని ఈ 95 నిమిషాల సినిమా తియ్యడం నిజంగా UTV వారి సాహసానికి ఉదాహరణ. కానీ ఇంత  చక్కటి కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, ప్రతి సీనూ పండించిన నటులు, అంతటినీ కెమెరాలో బంధించిన ఫోటోగ్రఫీ, ఇంకా ప్రతి సీన్ నూ ఎలివేట్ చేసిన నేపధ్య సంగీతం (అమిత్ త్రివేది) ఉంటే, అది చిన్న సినిమా అయినా అనామక నటులైనా జనరంజకంగా ఉంటుందని ఈ చిత్రం ఋజువు చేస్తుందని ఆశిద్దాం.

(విడుదలై రెండు వారాలయ్యింది కాబట్టి సినిమా కథ మొత్తం చెప్పినా నష్టం లేకపోయినా, ఈ సినిమా అందరూ చూడాలని నేను నమ్ముతున్నాను గనక పూర్తి కథ ని తెలియజెప్పక కేవలం విశ్లేషణతో ఈ సమీక్షని ముగిస్తున్నాను)

5 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 22, 2008 /
  2. శంకర్ June 23, 2008 /
  3. Sreekanth July 2, 2008 /