Menu

నాకు తెలిసిన తెలుగు సినిమా

పరిచయం

ఆంధ్రాలో. నా హైస్కూలు, కాలేజి చదువుల రోజుల్లో, తెలుగు వాళ్ళకు ఇష్టమైన విషయాలు రెండే అనిపించేది. మొదటిది పేకాట, రెండవది సినిమా. ఇప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండక పోవచ్చు. ఇక్కడ ముచ్చటించుకొనే విషయం సినిమా కాబట్టి, ఈ సినిమా కథేమిటో చూద్దాం!

నేను పుట్టి పెరిగింది, పశ్చిమ గోదవరి జిల్లాలో “సరిపల్లె” అనే ఒక పల్లెటూరులో. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న “గణపవరం” అన్న కొంచెం పెద్ద పల్లెటూళ్ళో ఒకే ఒక సినిమా హాల్ ఉండేది. అక్కడ చూపించే సినిమాలే మాకు (కవల పిల్లలం అయిన నేనూ, రామన్నా) అనుభవ యోగ్యం. కొన్ని కొత్త సినిమాలు (1968 ప్రాంతాల్లో), అప్పుడప్పుడు పాత సినిమాలు ఇలా పరిచయమైనవే!
కానీ, ఒక్కొక్క సినిమా మా ఊళ్ళో మూడు వారాలకి పైగా ఆడేది. ఆడుతున్న సినిమా కాక, మరేదైనా సినిమా చూడాలంటే, మా ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న “తాడేపల్లిగూడెం” లేకపోతే “భీమవరం” వెళ్ళక తప్పదు. ఇంట్లో చెప్పకుండా ఇలా చూసిన సినిమాలు ఎన్నో. ఎతా వాతా జరిగిందేమిటంటే, నేనూ మా రామన్నా ఎక్కువగానే సినిమాలు చూసేవాళ్ళం. దానికి తోడు, మా ఇంట్లో అందరికీ ఉన్న పాటల పిచ్చి వల్ల, కొన్ని సినిమాలు బాగాలేకపోయినా, పాటల కోసం చూసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా, డబ్బులు కొట్టేసి చూసిన సినిమాలు కూడా ఎక్కువే.

కాలేజీ చదువుల కోసం హైదరాబాదు వచ్చిన మేం, 1970 ప్రాంతాల్లో మొదలయి చాలానే తెలుగు సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడప్పుడు, కాలేజీ ఎగ్గొట్టి, మోర్నింగ్ షోకి వెళ్ళటంతో మా సినిమా పాండిత్యం మరీ గట్టిపడింది. ఒక్కొక్క సినిమా 20, 30 సార్లు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పు కూడు, మల్లీశ్వరి, దొంగ రాముడు, పూజాఫలం, ఇద్దరు మిత్రులు, చిరంజీవులు, దేవదాసు … ఇలా నచ్చిన సినిమా ఒక్కక్కటి ఎన్నో సార్లు చూసాం. నాకూ, రామన్నకీ జ్ఞాపక శక్తి ఎక్కువే. అందులో కవలలం అవటం వల్ల, నేను చూసిన సినిమాల నుంచి రామన్న, వాడు చూసిన సినిమాల నుంచి నేను చర్చించుకొని మా సినిమా పరిజ్ఞానాన్ని పెంచుకొనే వాళ్ళం. అప్పుడప్పుడు, నోట్ బుక్ తీసుకొని, సినిమా నడుస్తూ ఉండగా, ఆ చీకట్లోనే చాలా పాటల సాహిత్యం రాసుకొని, ఇంటికి వచ్చి పాటలు ప్రాక్టీస్ చేసే వాళ్ళం. అప్పట్లో, చిక్కడపల్లిలో ఉండే మేం, అక్కడికి అప్పుడు దగ్గరగా ఉన్న సినిమా థియేటర్‌లు, సుదర్శన్, సంగం, బాలాజీ, వెంకటేశ్వర, దీపక్, శాంతి, మొదలైనవి మాకు కొట్టిన పిండే! ఇప్పటికీ మాకు సినిమాలంటే ఎందుకంత ఇష్టం? అన్నది అర్ధంకానిది. ఒక ముఖ్యమైన కారణం మేం చదుకున్న కాలేజీల్లో లెక్చెరర్స్ బాగా అర్ధం అయ్యేట్లు పాఠాలు చెప్పకపోటం. మరొకటి అల్లరి చిల్లరిగా తిరిగే మా వయస్సు. ఏదైతేనేం. తెలుగు సినిమాలపై మా పునాదులకి కారణాలు ఇవే.

1980 సంవత్సరం కొత్తల్లో, నేనూ రామన్నా ఆంధ్రా వదిలాం. అయినప్పటికీ, అడపా దడపా తెలుగు సినిమాలు చూస్తూనే ఉన్నాం. కొంతవరకు 80, 90 దశాబ్దిల్లో వచ్చిన సినిమాలను బాగానే చూసినా, గత 10 ఏళ్ళుగా వస్తున్న సినిమాల పరిచయం మాకు తగ్గిందనే చెప్పాలి. దానికి తోడు, తెలుగేతర సినిమాలు చూట్టం ఎక్కువైంది. హీందీ, బెంగాలీ, హాలీవుడ్ సినిమాలే కాక, జాపనీస్, ప్రెంచి సినిమాలు కూడా ఎక్కువగానే చూసే వాళ్ళం. వాటి విషయం ఇక్కడ ప్రస్థావనకి కారణం – ఈ జ్ఞానంతో తెలుగు సినిమాలపై నా అభిప్రాయాలు ఇప్పుడు ఏమిటి? అది చెప్పాలనే ఈ ఉపోద్ఘాతమంతా.

అప్పటి సినిమాలు

అపైన చెప్పిన తెలుగు సినిమాలన్నీ అప్పుడు ఎంత సంతోషంగా చూసామో, ఇప్పటికీ వాటి విలువలు అలాగే ఉన్నాయి. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. మంచి కథతో, నటీనటుల నుంచి మంచి నటనను పిండగలిగే సామర్ధ్యం ఉన్న దర్శకులతో, ఉన్నత స్థాయి సంగీత విలువలే కాక, మంచి సాంకేతిక విలువలతో ఆ రోజుల్లోనే వచ్చిన ఆ సినిమాలు ఇప్పటికీ మేం మరచిపోలేం. అప్పటికి ఇంకా సూపర్ స్టార్స్ కాని ఎంటిఆర్, ఏన్నార్‌లు చాలా క్రమశిక్షణతో, బాధ్యతతో నటించే వారు. సినిమా అన్న పరిశ్రమని అందరూ సీరియస్ గా తీసుకొనేవారు. కమర్షియల్ సినిమా ప్రధమ ఉద్దేశ్యం డబ్బులు చేసుకోటం అయినా, చాలా కళాత్మక విలువల్ని గుర్తుంచుకొని, సామాజిక స్పృహతో సినిమాలు తీసేవారు. సినిమా సంభాషణలు, పాటల్లోని సాహిత్యం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ – ఇలా అన్నీ చక్కగా ఉండేవి. 70 దశాభ్దం చివర్లో మొదలయి చాలా కాలం వరకు అంత గొప్పగా వచ్చిన తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి. అడపా దడపా ఒకో మంచి సినిమా వచ్చినా, మొత్తం మీద చెత్త సినిమాలే ఎక్కువ. అందుకు తోడు నటీనటుల్లో విర్రవీగిన గర్వం కూడా సినిమాల పతనానికి కారణం. నటనకే నిర్వచనం చెప్పిన నటులు, క్రమశిక్షణ తప్పి, బాధ్యతారహితంగా ప్రవర్తించే సినిమా పరిశ్రమ ఇందుకు తోడయింది. సినిమాల్లో కళాత్మక విలువలు గురించి పట్టించుకోటం తగ్గిపోయి, సినిమా ఫక్తు వ్యాపారం అయ్యింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఒకటుంది. 50, 60 దశాభ్దాల్లో వచ్చిన సినిమా నిర్మాతలు కూడా, సినిమాని ఒక వ్యాపారంగా చూసినప్పటికి, సినిమాల్లో కొన్ని విలువలు ఉంచటానికి తాపత్రయ పడేవారు. ఆ కాలంలో వచ్చిన ప్రతీ సినిమా గొప్పదే అనీ నేను అనను. అప్పట్లో కూడా చెత్త సినిమాలు కొన్ని వచ్చేవి. కాకపోతే వాటి సంఖ్య తక్కువే.

ప్రముఖ దర్శకులు

కె. వి. రెడ్డి, బి. ఎన్. రెడ్డి, చిత్తూరి నాగయ్య, కమలాకర కామేశ్వర రావు, చిత్రపు నారాయణ, ఆదుర్తి సుబ్బారావు మొదలైన దర్శకులు ఒక తరానికి ప్రతినిధులైతే, బాపు, విశ్వనాథ్, జంధ్యాల, దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, వంశీ, ఇ. వి. వి. సత్యనారాయణ, రేలంగి నరశింహా రావు, మొదలైన దర్శకులు మరో తరానికి ప్రతినిధులు. ఈ రెండు తరాల దర్శకుల్లో కొందరిని నేను మర్చిపోతే, అది నా మతి మరుపే తప్ప, ఎవ్వరినీ విస్మరించాలని కాదు. గత ఐదు సంవత్సరాలుగా వస్తున్న దర్శకుల పేర్లు కూడా నాకు తెలియదు. వీరిలో పాత తరం దర్శకులు చాలా మంది సినిమా నిర్మాణంలో సాధికారత సాధించుకున్నారు. వీరితో పోలిస్తే, తర్వాత తరం దర్శకులు దర్శకత్వంలో కొంత కొత్త దారులు తొక్కి తమదైన శైలి సృష్టించారు. అయినప్పటికీ, వీరి పద్ధతులు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాయి. బాపు లాంటి అతి ఉత్తమ శ్రేణికి చెందిన తెలుగు ఉత్తమ చిత్రకారుడు కూడా, సినిమాల దర్శకత్వంలో చాలా విజయాలు సాధించినా, సినిమా క్లైమాక్స్‌లో తత్తరపడటం కనపడుతుంది. ఉదాహరణకు, బుద్ధిమంతుడు సినిమా అంతా బాగా జరిగి చివరలో గోపురం మీద కలశం దింపటం, తరవాత బోట్ ఛేసింగ్ లాంటివి సాధారణ సినిమాల ముగింపులా తోస్తుంది. అలాగే, “న భూతో న భవిష్యతి” అన్నట్టు తీసిన ముత్యాల ముగ్గు సినిమా ముగింపు కూడా గందరగోళంగా ముగుస్తుంది. అందాల రాముడు సినిమా కూడా ఇంతే! దర్శక రత్నగా పేరుపడ్డ దాసరి సినిమాలు ఆర్ధికంగా నిర్మాతలకు పేరుతెచ్చినా, దాసరి సినిమాల్లో అతి దీర్ఘమైన సంభాషణలు ప్రేక్షకులకు విసుగు కల్పించిన మాట వాస్తవం. దానికి తోడు దాసరి సినిమాలు, ప్రేక్షకులకి ప్రత్యక్షంగా ఏదో బోధిస్తున్నట్టుగా ఉండేవి. హాస్య బ్రహ్మ జంధ్యాల కూడా కొన్ని విచిత్రమైన ప్రాసలు, సంభాషణలు, తిట్లు మొదలైన వాటితో తమ “అతి ధోరణని” ప్రవేశపెట్టారు. కళా తపస్వి విశ్వనాథ్ సినిమాలు ఒక ఒరవడి సృష్టించిన మాట వాస్తవం. అయితే, ఈయన సినిమాలు కూడా చాలా సార్లు మోతాదుకు మించిన మెలోడ్రామాతో నిండిపోయేవి. ఇక్కడ నేను ఉదాహరించిన వారిని వేలెత్తి చూపటం నా ఉద్దేశ్యం కాదు. మన అగ్రశ్రేణి దర్శకులే ఇలాంటి మార్గాలని యువ దర్శకులకి అందిస్తుంటే, వచ్చే తరం దర్శకులు ఎలా ఉండబోతారో అన్న భయం సహజం కదా!

నటీనటులు

రాసిలో పాత తరం కన్నా నటీనటుల సంఖ్య ఇప్పటి తరంలో పెరిగినా, వాసిలో ఇప్పటి తరం వారి నటనా కౌసల్యం తక్కువే అని చెప్పక తప్పదు. అప్పటి కాలంలో హీరో, హీరోయిన్, విలన్ పాత్రధారులే కాక, హాస్య పాత్రలు కూడా ఎంతో ప్రతిభావంతంగా నటించే వారు. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సుర్యకాంతం వంటి నటీనటుల హాస్యాన్ని, ఇప్పుటి వారితో పోలిస్తే, హాస్యం ఎంత దిగజారిపోయిందో తెలుస్తుంది. ఇప్పటి నటీ నటులకి తెలుగులో ఉఛ్చారణా దోషం లేకుండా సంభాషణలు సరిగ్గా చెప్పగలరా? అందుకే, సంభాషణలకి కూడా డబ్బింగే! ఇక నటన సరే సరి. నటించటంలోనే నటన. వీటికి తోడుగా భరించలేని పోరాటాలు. ఇవి పెద్దలకే ఇంత జుగుప్సాకరంగా ఉంటే, ఈ సినిమాలు చూసే చిన్న పిల్లలలో ఎటువంటి భావోద్రేకాలు కలిగిస్తాయో తలచుకుంటేనే బాధగా ఉంటుంది. మనుష్యులు, వర్గాలు, కులాల మధ్య భయంకరమైన కసిని కావాలనే ప్రోత్సహించే సినిమాలను ప్రజలు ఎందుకు బహిష్కరించరు?

గత పాతికేళ్ళలో వచ్చిన ఒక విచిత్రమైన మార్పు “అభిమాన సంఘాలు”. ప్రతి వ్యక్తి తనకి ఇష్టమైన నటీనటులను అభిమానించడం సహజం. అది వారి వ్యక్తిగత ఇష్టం. అందులో అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే, ఇప్పుడు చాలామందికి తమ అభిమాన నటీనటులపై ఇష్టం కన్నా, పక్కవారి అభిమాన నటీనటులపై “అయిష్టం” చూపటానికే ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది ఎంతో విచార పడవలసిన విషయం. ఇప్పుడొస్తున్న సినిమాలు ఎక్కువగా చూడక పోయినా, అప్పుడప్పుడు కొన్ని మంచి సన్నివేశాలున్న సినిమాలు వస్తున్నట్టనిపిస్తోంది. సాంకేతికంగా కూడా తెలుగు సినిమా చాలా ఎదిగింది. జీవ పరిణామ దశలను డార్విన్ సిద్ధాంతం ఎంత సరిగ్గా విప్పిచెప్పగలిగిందో, అలాగే ఉన్న మన తెలుగు సినిమా పరిణామ దశ సిద్ధాంతం ఏమిటో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగితే బాగుంటుంది.

ముగింపు

“తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎప్పుడు వస్తుంది? అన్న ప్రశ్న నన్ను చాలా కాలంగా బాధిస్తోంది. తెలుగులో కమర్షియల్ సినిమాలను పక్కన పెడితే, చెప్పుకోతగ్గ ఆర్ట్ సినిమాలు లేవా? ఇక ముందు అలాంటి సినిమాలు తియ్యాలంటే, సరైన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక వర్గం ఎక్కడనుంచి వస్తారు. తెలుగులో మంచి ఆర్ట్ సినిమా తియ్యాలంటే, అది తెలుగు వాడే తియ్యగలడు కాని, మరొకడు వచ్చి తియ్య లేడు కదా! అందరి తెలుగు సినిమా అభిమానుల్లాగే, నేనూ అటువంటి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

–లక్ష్మన్న విష్ణుభొట్ల

9 Comments
  1. Sowmya May 6, 2008 /
  2. bhanu May 6, 2008 /
  3. bhanu May 6, 2008 /
  4. శిద్దారెడ్డి వెంకట్ May 6, 2008 /
  5. శిద్దారెడ్డి వెంకట్ May 6, 2008 /
  6. bhanu May 6, 2008 /
  7. సగటు జీవి May 6, 2008 /
  8. శంకర్ May 6, 2008 /