Menu

చిన్న సినిమా…కొక్కొరోకో!

మంచి సినిమాలు రావాలి.తెలుగు సినిమా బతకాలి.చిన్న సినిమాల్ని ఆదరించాలి, కొక్కొరోకో!!! అంటూ పరిశ్రమ కోడై కూసింది. మరి సినిమాలు తియ్యండ్రా బాబూ! అంటే, కూయడంతో మా పనైపోయింది తీయడం ఎవరివంతో మీరేచెప్పాలని, ప్రేక్షకుడివైపు వేలెత్తి చూపింది. ఇక మా కూయడమైందని అటకెక్కి, పెద్దసినిమా గుడ్డెట్టడం లో బిజీ అయిపోయింది.

పెద్ద సినిమా అంటే, ఒక పేరున్న హీరో డేట్లివ్వాలి,పదిమంది విలన్లు రావాలి,కనీసం పాతిక సుమోలు పేలాలి,బొంబాయి భామలు దిగాలి, ఇరగదీసే సెట్టో లేక ఏడుసముద్రాలు దాటో పాటలు పాడాలి అంతే, చాలా వీజీ ! అదే చిన్న సినిమా అయితే, అవసరంగా మంచి కథ కావాలి, ఉన్నబడ్జట్టులో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి, పాటల్లో… మాటల్లో… పదును కాకపోయినా అదునైనాఉండాలి. ఎంత కష్టం. ఎంత కష్టం. అంటే, చిన్న సినిమా అంత వీజీ కాదన్నమాట !!. మంచిసినిమా అసలు వీజీ కాదన్నమాట!!!

పెద్ద హీరో డేట్స్ చాలు సినిమా చుట్టెయ్యడానికి, వ్యాపారం పట్టెయ్యడానికి. పనిలేని టీవీ చానళ్ళూ,పనికివచ్చే విజయ యాత్రలూ ఎలాగూ ఉండనే ఉన్నాయ్, సినిమాను ముఫైరోజులు ఓ వెయ్యి ధియేటర్లలో నడపడానికి. ఇంత మాత్రానికే సబ్జెక్ట్ ఎందుకు బడ్జెట్ తప్ప? ముఫైరోజుల తరువాత, 50 రోజుల దిశగా!  100 రోజుల దిశగా!! అని ఊదరగొట్టెయ్యొచ్చు, అందరినీ పాతరపెట్టెయ్యొచ్చు.

బిజినెస్సంటారా ! సినిమా తీసేముందే అమ్మేసిన నిర్మాత ‘హ్యాపీ’. కొన్న బయ్యరు, ఎగ్జిబిటరుకిచ్చేసి ‘ఖుషీ’. ఎగ్జిబిటరు, 50 రోజులకు సరిపడా ఖర్చుల్ని రెండు వారాల్లో “బ్లాక్”చేసేసి ‘జల్సా’ . మరి నష్టం ఎవరికీ? తేలుకుట్టిన దొంగల్లే ప్రేక్షకుడికి (నీకూ,నాకూ అన్నమాట). కొత్తసినిమా, పెద్దసినిమా అని ఉత్సాహపడేది వీడే, ఎదురు చూసేది వీడే, ఊరేగేదీ వీడే…ఉట్టికెక్కేది వీడే. అంతా అయింతర్వాత మింగలేక కక్కలేక అనుభవించేది కూడా వీడే.

ఇక చిన్న సినిమా అంటారా? అదెప్పుడొస్తుందో తెలీదు. వచ్చినా, ఏ ఊరిచివరి ‘ఉమామహల్లో’నో లేక సంత పక్క సాగర్ టాకీస్ లోనో వచ్చి, మనం వెళ్ళడానికి ఇబ్బందిని తెచ్చిపెడుతుందే తప్ప, వెళ్ళాలనే కోరిక కలుగనీదు. ఒకవేళ చూసిన వాళ్ళు “బాగుందట, చూడరాదూ!” అంటే, అ… రేపో ఎల్లుండో కేబుల్లోనో,టీవీ లోనో మరీ ఐతే సీడీ లోనో దొరక్కపోదా, చూడకపోమా అని తేల్చేస్తాం. నిర్మాత బతుకు బస్టాండ్ చేసేస్తాం.

అసలీ నిర్మాతగాడు, సినిమా తియ్యాలనుకోవడమే పతనానికి పునాది.బడ్జెట్ లేదు కాబట్టి సబ్జెక్ట్ బలపడాలని కోరుకోవడమే వీడికి సమాధి. అనుకున్న సమయానికి రిలీజుకాక, కావాల్సిన ధియేటర్ దొరక్క, “మాఘమాసం” టైపు టైటిలు పెట్టి గాలివానల నడుమ ఉన్న ఇతగాడిని, నడిసముద్రంలో పడేస్తాం. వాడు ఈ కసితో, మాఘమాసం బదులు ఈ సారి, ముమైత్ ఖాన్ తో ‘మధురరాత్రులు’ తీసి మనమీదికి వదుల్తాడు.

అందుకే బ్రదరూ(సిస్టర్లు కూడానండోయ్)! మంచి సినిమా చిన్నదైనా, అది సంత పక్కన ‘సాగర్’ లో ఉన్నా టిక్కెట్టుకొని ప్రోత్సహిద్దాం. పెద్ద సినిమా ‘పరుగు’ఎత్తి పాలుతాగిస్తా మన్నా నిలకడగా నిలబడదాం.  

15 Comments
 1. Uttara May 6, 2008 / Reply
 2. సగటు జీవి May 6, 2008 / Reply
 3. సగటు జీవి May 6, 2008 / Reply
 4. శంకర్ May 6, 2008 / Reply
 5. bhanu May 7, 2008 / Reply
 6. సగటు జీవి May 7, 2008 / Reply
 7. sathish May 7, 2008 / Reply
 8. శంకర్ May 8, 2008 / Reply
 9. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 10, 2008 / Reply
 10. sathish May 10, 2008 / Reply
 11. sathish May 10, 2008 / Reply
 12. bhanu prakash May 12, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *