Menu

సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం.  దూరదర్శన్ వారి పుణ్యమా అని, ఈ ‘టెలీ ఫిల్మ్” ప్రస్తుతం సామాన్య మానవులకు అందనిదైపొయింది. నాకు కూడా కాలేజి రోజుల్లో (1994) film club పుణ్యమా అని, చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు, ఆ సినిమా ఆఖర్లో బ్రాహ్మణుడు (మోహన్ అఘాసే) అంటరాని కులానికి చెందినవా డి (ఓంపురి) శవాన్ని తాడు కట్టి లాక్కెళ్ళి ఊరిబయట పడవేసి వచ్చి, అతడు చచ్చిపడి ఉన్న చోట ఆవుపంచకం చల్లి “శుద్ది” పరిచే సీన్ మాత్రం గుర్తుంది. మిగతా విషయాలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడంలేదు. అంతర్జాలంలో ‘పరిశోధన’ గావించి, పాండిత్యాన్ని పంచుకుందాం ! అన్న ఆలోచన మొదట్లో వచ్చింది. కానీ ఆతర్వాత, నాకు అనిపించింది రాశేద్దాం ! లోపాలు సవరించడానికి, తప్పులుంటే సరిదిద్దడానికీ మహామహులు అండగా ఉన్నారనిపించి రాస్తున్నా.

అసలు ఈ సినిమాని సత్యజిత్ రే ఎందుకు చేయవలసి వచ్చింది అనడానికి, బహుశా సృష్టమైన సమాధానం లేదనుకుంటా. అందుకే ఈ “అవసరాన్ని” అర్థంచేసుకొనె దిశగా నా ఆలోచనని పదునుపెడతాను. సత్యజిత్ రే తీసిన సినిమాలన్నీదాదాపు బెంగాలీ భాషలోనే,ఒక్క రెండుతప్ప. అవి, “షత్రంజ్ కే ఖిలాడీ” మరియు మనం ఇప్పుడు చర్చిస్తున్న “సద్గతి”. ఇవి హిందీ భాషా చిత్రాలు,అంతే కాక ప్రముఖ హిందీ రచయిత ‘మున్షీ పేమ్ చంద్’ రాసిన కథలు వీటికి మూలాలు. హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ ని ఒక దిగ్గజంగానే కాక, టాల్ స్టాయ్ అంతటి మానవతావాది,సృజనకర్తగా కూడా భావిస్తారు. సాహితీ అభిలాష కలిగిన ‘రే’ ఈ మహానుభావుడి సాహిత్యం  పట్ల మక్కువతో ఈ సినిమాలు చేసాడు అనటం ఒక సాధారణ విషయం. మరికాస్త లోతుగా చూస్తే, ఈ రెండు చిత్రాల విషయవస్తువు బెంగాలీ సంస్కృతికి చాలా దూరం. అంతేకాక కథాకాలం,స్థలం బెంగాలీ కానేరవు (ఒకటి 1875 కాలపు లక్నో ఐతే మరోటి బహుశా బీహార్, ఉత్తరప్రదేశ్ లో జరగగలిగే కథ) అందుకని హిందీ భాష లో ఈ సినిమాలను చెయ్యడం జరిగిఉండవచ్చు.

“షత్రంజ్ కే ఖిలాడి” విషయం ఏమోగానీ, సద్గతి లో ‘రే’ చూపిన “ఇంటెంసిటీ” చూసిన ఎవరికైనా, ఇది మనసు పొరల్లోంచీ కులవ్యవస్థ అనే సామాజిక రుగ్మతను ఖండించేదిశగా ఒక మానవతావాది విప్పిన గొతుక అనిపిస్తుంది. అందుకే, ‘సద్గతి’ రే సినిమాలలొనే కాక భారతీయ సినిమా లో కూడా ప్రత్యేకత కల్గినది అని నా నమ్మకం. బ్రిటిష్ వారి పాలనాకాలం నుండీ, బెంగాల్ ‘జమిందారీ వ్యవస్థ’ని కలిగిఉన్న ప్రాంతం. ఈ కారణంగా ఇక్కడి సమాజం వర్గవిభజన కలిగి ఉందేతప్ప కులవిభజన (కనీసం స్వాతంత్ర్యం వచ్చేవరకూ) కాదు. బహుశా అందుకే, వామపక్ష ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని చాలా ఏళ్ళుగా రాజ్యమేలుతున్నాయి. ఇటువంటి సామాజిక నేపథ్యం నుండి వచ్చిన ‘రే’ కి పక్కనే ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్త తోపాటూ సమస్త భారతం లో పెచ్చరిల్లుతున్న కులవ్యవస్థ కలతను కలిగించి ఉండవచ్చు. ఒక సినిమా దర్శకుడిగా ఈ మానవతావాది ఇంతకంటే ఏమిచేయగలడు ! ఒక హృద్యమైన టెలిఫిల్మ్ తీసాడు. చలనచిత్రం గా తీయటానికి ఈ కథ యొక్కనిడివి (దాదాపు 50 ని”) అనుకులించకుండా కూడా ఉండవచ్చు. 

ఏదిఏమైనా కులవ్యవస్థను, దానిలోని అమానవీయతను ఈ సినిమా ద్వారా తెరకెక్కించడం లో ‘రే’ సఫలుడయ్యడనేది అందరూ అంగీకరించే విషయం. నాకు మాత్రం, ఇది ఒక మంచిమనిషి కులవ్యవస్థను అర్థంచేసుకుని, దానికి వ్యతిరేకంగా గోంతు విప్పడానికి చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. ఒక కళాకారుడిగా సమాజంపట్ల తన నిబద్ధతని ఈ విధంగా ఈ విధంగా తెలియజెప్పాడేమో అనిపిస్తుంది.

ఈ సినిమాని ఈమధ్యకాలం లో చూసే అవకాశం కలిగిన అదృష్టవంతులు ఎవరైనా ఉంటే, దయచేసి మరిన్ని వివరాలు పంఛుకో వలసినదిగా మనవి. అదృష్టవశాత్తు, నాకు గుర్తున్న క్లైమాక్స్ సీన్ ఈ లంకె ద్వారా “యు ట్యూబ్” లో చూడవచ్చు www.youtube.com/watch?v=xrEL0w4DasY         

5 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 6, 2008 /
  2. K.మహేష్ కుమార్ May 6, 2008 /
  3. Uttara May 6, 2008 /
  4. శిద్దారెడ్డి వెంకట్ May 6, 2008 /