Menu

పరుగు సమీక్ష

పరుగు

ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరుగు సినిమా వారిని థియటర్ వైపు పరుగులు తీయించకపోయినా, థియేటర్లో కూర్చోబెట్టగలుగుతుంది. బొమ్మరిల్లు తరవాత భాస్కర్ దర్శకత్వంలో దరిదాపు రెండేళ్ల తరువాత వచ్చిన సినిమా అవ్వడం చేత ప్రేక్షకులు ఈ సినిమా నుండి చాలా ఆశించారు, కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే అనాలి. కానీ దిల్ రాజు మునుపటి చిత్రం మున్నాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. అలాగే అల్లు అర్జున్ మునుపటి సినిమా దేశముదురు స్థాయికి ఈ సినిమా తక్కువగానే ఉంది.

కథ
ఒక తండ్రి కూతురు మధ్య ఎలాంటి దూరం ఉండకూడదో (లేక ఎలాంటిది ఉండాలో) చెప్పే చిత్రమే పరుగు. బొమ్మరిల్లు అంత ఆసక్తికరమైన అంశం కాకపోయినా సినిమా మొత్తం ఇదే అంశం చుట్టూ తిరగడం గమనార్హం.
కథలోకి వస్తే, పూనమ్ బాజ్వా ప్రకాశ్ రాజ్ పెద్ద కూతురు. సినిమా మొదట్లో తను ప్రేమించిన అబ్బాయితో లేచిపోతుంది. ఈ సంఘటనలో ప్రకాశ్ రాజ్ ఇంట్లో అందరూ ప్రేమించడం ఒక పాపంగా పరిగణిస్తారు. ప్రకాశ్ రాజ్ సహచరులు లేపుకుపోయిన అబ్బాయి మిత్రుడైన అల్లు అర్జున్ని తీసుకొని వచ్చి ప్రశ్నించడం మొదలుపెడతారు. అదే సమయంలో అల్లు అర్జున్, కథానాయిక శీలాని చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. అర్జున్ సునీల్ మరియు శీలా మధ్య కొంత హాస్య సన్నివేశాలతో మొదటి సగం ముగుస్తుంది. రెండవ భాగంలో అల్లు అర్జున్ శీలాని ప్రకాశ్ రాజ్ కూతురుగా గుర్తిస్తాడు. తరువాత అల్లు అర్జున్ ప్రకాశ్ రాజ్‌ని ఒప్పించగలుగుతాడా లేదా అన్నదే మిగిలిన సినిమా. తదుపరి సినిమా ప్రేక్షకుడు ఇంచుమించుగా ఊహించినట్లుగానే సాగిపోతుంది.

కథనం
సినిమా మొదటి సగం యొక్క సింహభాగం ప్రకాశ్ రాజ్ ఇంటి గిడ్డంగిలో జరుగుతుంది. ఇలా చేయడం నిజంగా దర్శకుడికి ఒక పెద్ద సవాలే. కానీ భాస్కర్ మొదటి సగం వినోదభరితంగా చిత్రించడంలో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. కాని సినిమా రెండవ సగంలో కథ లేకపోవడం పాటలు అకస్మాత్తుగా రావడం జరుగుతుంది. సగటు ప్రేక్షకుడు ఊహించిన విధంగానే కథనం సాగిపోతుంది. అర్జున్ మరియు శీలా మధ్య ప్రేమ సన్నివేశాలు ఇంకొంచెం బాగా తీయవలసి ఉండాల్సింది. అంతేగాక జీవ నటించిన కొన్ని సన్నివేశాలు తొలగించి రెండవ సగం తగ్గించి ఉండాల్సింది.

నటీనటులు
అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ఈ చిత్రంలో బన్ని పాత్ర దేశముదురుకి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రకాశ్ రాజ్ నటన ఎప్పటిలానే వుంది, డిప్పకొట్టుడుతో కొంత వైవిధ్యం తీసుకురావడానికి ప్రయత్నించినా అది అనవసర ప్రాయాసగానే మిగిలింది. సినిమా చివరికి వచ్చే సరికి ప్రకాశ్ అర్జున్ ని కొన్ని సీన్లలో డామినేట్ చేయవలసివచ్చింది, అందుకు అల్లు అర్జున్ సమ్మతించినందుకు మెచ్చుకోవాలి. సునీలుకి ఈ సినిమాలో పెద్ద పాత్రేవుంది. దానికి సునీల్ బాగానే న్యాయం చేశాడు. జయసుధ, పూనం బాజ్వాలకు పెద్ద పాత్రలు లేకపోయాయి. జయప్రకాశ రెడ్డి హాస్య పాత్రని బానే పోషించాడు.

సాంకేతిక అంశాలు
మణిశర్మ సంగీతం పర్వాలేదు. కాని ఇంక కొంచెం బాగా చేసి వుండవచ్చు. అల్లు అర్జున్ నృత్యాలు ఎప్పటిలానే బాగున్నాయి. నృత్యంపై యమదొంగ నృత్యదర్శకుడు ప్రేమరక్షిత్ ముద్ర కూడా బాగా కనిపిస్తుంది. భాస్కర్ దర్శకత్వం బానే వుంది. మెచ్చుకోదగ్గ విషయమేమిటంటే, అంత పేరు లేని హిరోయిన్‌కి అసభ్యతరహితమైన ముఖ్యపాత్ర ఇచ్చి సినిమా తీయడం.

ముఖ్యమైన సన్నివేశాలు
1) తను ప్రేమించే అమ్మాయి కోసం అర్జున్ జయప్రకాశ రెడ్డి సహాయంతో ఊరిలో అమ్మాయిలను వాకబు చేసే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.
2) ఆర్య సమాజంలో అల్లు అర్జున్ మరియు ఆలి చేసే వ్యాఖ్యలు శ్రీజ-శిరీష్ వివాహాన్ని గుర్తుకు తెచ్చాయి.
3) అల్లు అర్జున్ పూనం బాజ్వాని బస్సు ఎక్కించే సన్నివేశం బాగా చిత్రీకరించబడింది.

మొత్తం మీద
మొదటి సగం కామెడి వలన పర్వాలేదు. రెండవ సగం అనవసరంగా సాగదీసినట్లు వుంది. ఈ సనిమాకి అల్లు అర్జున్ నటన మరియు హాస్యసన్నివేశాలు బలాన్ని చేకూర్చాయి. రెండవ సగంలో కథనం బలంగా లేకపోవడం సినిమాని దెబ్బతీసింది. ప్రస్తుతం శలవల సమయం కావడం ఈ సినిమా నిర్మాతలకు కాస్త మంచి చేయవచ్చు. ఈ సినిమా వెంట విడుదలయ్యే సినిమాల సత్త మీద ఈ సినిమా భవితవ్యం ఆధారపడివుంది. మొత్తానికి ఈ సినిమాని బొమ్మరిల్లుతో పోల్చకుండా, ధైర్యం చేసి చూడగలిగితే చూడవచ్చు.

నవతరంగం రేటింగు :ఫర్వాలేదు, చూడొచ్చు.

సమీక్షకుడు: తులాబందు రంజిత్ కుమార్

12 Comments
 1. కె.మహేష్ కుమార్ May 4, 2008 /
 2. swechasagar May 4, 2008 /
 3. Uttara May 5, 2008 /
 4. Uttara May 5, 2008 /
 5. K.మహేష్ కుమార్ May 5, 2008 /
 6. Uttara May 5, 2008 /
 7. శిద్దారెడ్డి వెంకట్ May 5, 2008 /
 8. Uttara May 5, 2008 /
 9. K.మహేష్ కుమార్ May 5, 2008 /
 10. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 5, 2008 /
 11. sujatha May 7, 2008 /
 12. రాజేంద్ర May 7, 2008 /