Menu

‘పరుగు’ – ఒక సామాజిక విశ్లేషణ

ఇప్పటివరకూ ‘పరుగు’ సినిమా సమీక్షలు చాలానే చదవటం జరిగింది. కానీ ఇప్పుడే నేను సినిమా చూశా! నేను చదివిన సమీక్షలలో, “బొమ్మరిల్లు అంత బాగాలేదు” అనే తులనాత్మక జడ్జిమెంటో, లేక “పరుగు సినిమా స్పీడ్ తగ్గింది” అని సినిమా నడిపిన వేగం గురించో, మహా ఐతే “ఇది చిరంజీవి కూతిరి కథలా ఉంది” అనో సింపుల్గా తేల్చెయ్యడం జరిగింది. కానీ చూసిన వెంఠనే నా కనిపించిన మొదటి భావం “హమ్మయ్య మనుషులగురించి ఒక కమర్షియల్ హీరో సినిమా వచ్చింది” అని. ఇక ఈ సినిమా లో చర్చించిన ‘విషయం’ గురించి సమీక్షకులు ఇంతవరకూ పెద్దగా చర్చించగా నేను చదవలేదు. బహుశా సినిమా ఎలాఉంది అనిచెప్పడం వీరి ఉద్దేశ్యం అయ్యిఉండవచ్చు లేక సంపాదకులు విషయ చర్చకూ, విశ్లేషణకూ తగ్గ స్థలం కేటాయించి ఉండక పోవచ్చు. “సినిమాకి ఒక సామాజిక ప్రయోజనం ఉంది” అని నమ్మే నవతరంగం సభ్యునిగా ఈ సినిమా లేవనెత్తిన ‘సమస్యని’ చర్చించడం అవసరం అని నా భావన. అందుకే ముందుముందు చర్చకు వీలైయ్యే విధంగా కొంత విశ్లేషణని ఇక్కడ ఉటంకిస్తున్నాను.

సాధారణంగా మనకందరికీ తెలిసిన, ఈ మధ్య కాలం లో చాలా కుటుంబాలకు తెలిసివచ్చిన ‘ప్రేమికులు మిత్రుల సహాయంతో లేచిపోవడం’ అనే ఒక సామాజిక సమస్యని ‘పరుగు’ సినిమా చర్చించింది. ఈ టాపిక్ తో చాలా సినిమాలు వచ్చినా, ఇక్కడ విశేషమల్లా కేవలం ప్రేమికుల కోణం నుంచీ కాకుండా, వారి తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రికోణాన్ని ఆవిష్కరించి ఒక బ్యాలెన్స్ ని తీసుకురావడం. ఇంకో గమ్మత్తైన విషయం, లేచిపోయిన ప్రేమికులు ఈ చిత్ర కథానాయికా నాయకులు కాకుండా పారిపొవడానికి సహాయపడే స్నేహితుడూ, పారిపోయిన అమ్మాయి చెల్లెలూ హీరో,హీరోయిన్ అవ్వడం తో కథ ను(సమస్యను) ఒక కొత్త ధృక్కోణం లోంచీ చూసే అవకాశం ఇక్కడ కలిగింది.

ఆడపిల్ల(లు) పుట్టగానే తన ఆ అమ్మాయి(ల) భవిష్యత్తుకోసం అంతవరకూ “మొరటుగా బ్రతికినా”, తరువాత తన సామాజిక జీవితాన్ని మార్చుకుని ఎదిగిన ఒక తండ్రి. అసలు అక్క అలా ఎందుకు చేసిందో (లేచిపోయిందో), ఈ ఘటన తర్వాత అందరూ తనను ఎందుకు దెప్పిపొడుస్తునారో, అసలీ ప్రేమలేమిటో తెలియని ఒక పల్లెటూరి అమ్మాయి. కష్టాలకూ, కన్నీళ్ళకూ దూరంగా స్కేటింగ్ షూ వేసుకొని పరుగులెట్టి, స్నేహితుల ప్రేమలకీ పెళ్ళీళ్ళకీ సహాయపడే ఒక సిటీ అబ్బాయికీ మధ్య జరిగే ఒక కథ ఇది. ఈ పాత్రలు ఎలా కలుస్తాయి, లేచిపోయిన మొదటి కూతురి అన్వేషణలో ఉన్న తండ్రి చాటు రెండో కూతురికీ, లేవదీసుకివెళ్ళడానికి సహాయపడ్డ ఈ సిటీ అబ్బాయికీ మధ్య ప్రేమ ఎలా చిగురించింది? పెద్దకూతురు ఈ తండ్రికి దక్కిందా? దక్కినా ఆ సమయానికి రెండో కూతురు ’జంపైపోవడానికి’ సిద్ధంగా ఉంటే, ఆ తండ్రి పరిస్థితి ఏమిటి? ఆఖరున ఆ సిటీ అబ్బాయీ, ఈ పల్లెటూరి అమ్మాయీ తీసుకున్న నిర్ణయం ఏమిటీ? అనేది ఈ సినిమా సమస్య.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమా లో చర్చించిన విషయం ‘లేచిపోవడం’. ఈ మధ్యకాలంలో ఎవరైనా హైదరాబాదు ‘ఆర్య సమాజ్’ (మహేశ్వరీ,పరమేశ్వరీ ధియేటర్ల పక్కనే) కు వెడితే దాదాపు ప్రతి రోజూ ఒక పెళ్ళి(అప్పుడప్పుడూ రెండు మూడు కూడా) జరుగుతూ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రత తెలిసిపోతుంది కాబట్టి, దీని గురించి పెద్దగా చెపాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇక మన చర్చల్లా ఈ సినిమా లో ఈ సమస్య పట్ల తండ్రి,(రెండో)కూతురు మరియూ సిటీ కుర్రాడి యొక్క దృక్పథం, వారు ఈ చిత్రం తమ దృక్కోణాన్ని ఆవిష్కరించిన విధానం.

పై విషయం గురించి నాకు తోచింది నేను రాసేముందు, ఒక చర్చ అవసరం అని నా కనిపించింది. వీలైతే ఇక్కడ మీ భావాలూ, అభిప్రాయాలు తెలిపితే వాటినికూడా క్రోడీకరించి ఒక ‘సామాజిక విశ్లేషణ’ చెయ్యాలని నా కోరిక. మన వెంకట్ ఓకే అంటే ఇక్కడ లేక తను ఈ చర్చను “రచ్చబండ”కు తరలిస్తే అక్కడా మనం రెచ్చిపోతే, వాటి సారాన్ని జూన్ మొదటివారానికి అందించగలను.          

14 Comments
 1. Uttara May 26, 2008 /
 2. oka prEmikuDu May 27, 2008 /
 3. venkat siddareddy May 28, 2008 /
 4. శిద్దారెడ్డి వెంకట్ May 28, 2008 /
 5. ravi May 29, 2008 /
 6. శ్రీ May 30, 2008 /
 7. Bosu Babu June 4, 2008 /
 8. bollojubaba June 14, 2008 /
 9. Rao June 14, 2008 /
 10. gks raja June 17, 2008 /
 11. gks raja June 17, 2008 /
 12. sunita chowdhary June 20, 2008 /
 13. vinay April 15, 2009 /